23, ఆగస్టు 2014, శనివారం

న్యస్తాక్షరి - 1

కవిమిత్రులారా,
‘న్యస్తాక్షరి’ అనే క్రొత్త శీర్షికను ప్రారంభిస్తున్నాను. ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క చోట ఫలానా అక్షరాలను ప్రయోగిస్తూ ఇచ్చిన అంశంపై అడిగిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయడం (అవధానంలో చెప్పడం) న్యస్తాక్షరి.
మిత్రులకు అవగాహన కోసం మేడసారి మోహన్ గారు అమెరికాలోని అట్లాంటాలో చేసిన అష్టావధానంలో నిర్వహించిన న్యస్తాక్షరిని ఇస్తున్నాను.
 

అడిగిన అంశం : సత్యభామ అలుక మత్తకోకిలలో..
మొదటి పాదం రెండవ అక్షరం ‘ఖ్య’, రెండవ పాదం పదునాల్గవ అక్షరం ‘చి’, మూడవ పాదం పదమూడవ అక్షరం ‘పా’, నాల్గవ పాదం మూడవ అక్షరం ‘త’.


 అవధాని గారు చెప్పిన పద్యం :
స‘ఖ్య’తన్‌ విడి సత్యభామ ప్రసన్నభావవిదూరయై
ప్రాఖ్యమూర్తిని కృష్ణదేవుని పాయ జూ‘చి’న వైనమున్‌
ముఖ్యమంచు దలంప వచ్చునె భూరి ‘పా’వనుడైన చిత్‌
సౌఖ్యతత్పరు పంకజాక్షుని సన్ను‘తిం’చుట యొప్పగున్‌.


ఇక మన మొదటి న్యస్తాక్షరి ఇది....
అంశం- సరస్వతీ స్తుతి.
ఛందస్సు- తేటగీతి.
మొదటిపాదం మొదటి అక్షరం ‘స’, రెండవ పాదం మూడవ అక్షరం ‘ర’, మూడవ పాదం తొమ్మిదవ అక్షరం ‘స్వ’, నాలుగవ పాదం పన్నెండవ అక్షరం ‘తి’.

28 కామెంట్‌లు:

  1. కల విద్యల తల్లికి శారదాఖ్య
    భాసు వర వీణాధారి బ్రహ్మ సతికి
    ధీరచిత్త వాణి సరస్వతికి సతతము
    కరములను చాచి వేడెద ఖ్యాతినొంద!!

    రిప్లయితొలగించండి
  2. సరసిజ భవ వల్లభ నిను సన్నుతింతు
    కోరి రయమున పద్యము గూర్చు తెలివి
    గలుగ శుకముల నిస్వన గాన మహిమ
    గలుగ సభలను రాణించు గతియు గలుగ

    రిప్లయితొలగించండి
  3. సరసిజ భవుని సతి సదా సన్నుతింతు
    వాణి! రవళించు నాయొక్క వాక్కు నందు
    శౌరి సుతు పత్ని! సరస్వతి! సంతతమ్ము
    కరము భక్తితో నిను గొల్తు, గతివి నీవె

    రిప్లయితొలగించండి
  4. శ్రీగురుభ్యోనమ:

    సకలవిద్యల పెన్నిధి చదువులమ్మ
    మధురమైనట్టి పలుకులు మనకొసంగు
    పాపముల బాపు ప్రణవస్వరూపధారి
    పదయుగమ్ముల కర్పింతు ప్రణతికోటి

    రిప్లయితొలగించండి
  5. సర్వ సాహిత్య సంగీత సార శక్తి
    బ్రహ్మ రసనాగ్రముననిల్చు భావయుక్తి
    దాంత స్వాంతమగు సారస్వతమును బ్రోవ
    విధిని తెల్లనితల్లికి వినతి ప్రణతి


    రిప్లయితొలగించండి
  6. సరస సంగీత సాహిత్య సంపదలను
    వీణ రవళిని దివిజుల వీనులకిడి
    సకల జనసుత సుస్వర సరిగమలను
    రంజిలగవరము నిడ భారతి నుతింతు

    రిప్లయితొలగించండి
  7. సన్నుతింతును నిన్ను నే శారదాంబ
    నవరసమ్ముల నొలికించ స్తవము జేతు
    పద్య రచనను జేయు స్వభావమిమ్ము
    భక్తి తోడను రచియించి ప్రణతి నిడుదు.

    రిప్లయితొలగించండి
  8. సకల సద్గుణ రాశివి శార దాంబ !
    యమర గణములు సేవింత్రు నంబ !నిన్ను
    సరగు గాపాడు మో స ర స్వతి గరుణను
    నిన్ను నిత్యము గొలుతును నిరతి నమ్మ !


    ఒకటవ పాదములోమొదటి యక్షరము "స " రెండులో
    మూడవది "ర " మూడులో పదవ ది "స్వ " నాలుగులో
    పన్నెండవది "తి " యుండాలి .

    రిప్లయితొలగించండి
  9. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    సరస సంగీత కళల మందిరము నీవె మొదటి పాదము మొదటి అక్షరము “స”
    చతుర వాగ్భూష లలర కచ్ఛపి ని మీటి రెండవపాదము మూడవ అక్షరము “ర”
    సామగానము పాడ సుస్వరము లీను మూడవపాదముతొమ్మిదవఅక్షరము “స్వ”
    శ్రుతుల సవరించు శారద నుతినిజేతు నాల్గవ పాదము 12 వ అక్షరము “తి”

    రిప్లయితొలగించండి
  10. సర్వ కళలకు తల్లివి శారదాంబ
    అమర సంగీత విద్యల కమ్మవీవె
    నమ్మి కొలుతును నేను స్వప్నంబునందు
    కరుణ తోనిమ్ము సాహిత్య కాంతి నాకు .

    రిప్లయితొలగించండి
  11. సర్వ కళలకు తల్లివి శారదాంబ
    అమర సంగీత విద్యల కమ్మవీవె
    నమ్మి కొలుతును నేను స్వప్నంబునందు
    కరుణ దలచియు సాహిత్య కాంతి నాకు .

    రిప్లయితొలగించండి
  12. సర్వ కళలకు తల్లివి శారదాంబ
    అమర సంగీత విద్యల కమ్మవీవె
    నమ్మి కొలుతును నేను స్వప్నంబునందు
    కరుణ దలచియు సాహిత్య కాంతి నిమ్ము

    రిప్లయితొలగించండి
  13. మల్లెల వారి పూరణలు

    రస సంగీత సాహిత్య సారమెల్ల
    దివ్య సనాన నున్నట్టి దేవివమ్మ
    వరుస స,రి,గ,మ లాస్వర భావమీవె
    వరము మాకిడు విద్దెల భారతి వెస

    రస మైనట్టి వాణిని, శాస్త్రములను
    మాదు సనాల చేరంగ మహిత రీతి
    వరము నిడుమ సరస్వతీ! భవ్యమిడుదు
    నుతుల, మేమంద జూడుమా! నున్నతిలను

    రిప్లయితొలగించండి
  14. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమోవాకములు.

    సకల విద్యాప్రదాత్రి! విశాలనేత్రి!
    భ్రమరనీలవేణి స్వచ్ఛవర్ణధాత్రి!
    బ్రహ్మమానస సత్పుత్రి! స్వర సుగాత్రి!
    బ్రాహ్మి! భగవతి! విశద! భారతి నమో sస్తు!

    రిప్లయితొలగించండి
  15. నిన్నటి పూరణ:
    ఇమ్మహిషుని జంపగ రా
    వమ్మాయని పిలువగానె యాగ్రహమందె
    న్నమ్మిన వారిని గావగ
    యిమ్మహి రక్కసుని జంపు యీశ్వరి తానై !
    నేటి న్యస్తాక్షరి:
    సర్వ విద్యల నిలయమౌ చదువులమ్మ
    సాదరముగ నన్నేలగా సన్ను తింతు
    వాక్కులందున తీయని స్వరము లన్నొ
    వరములుగ నొసగు భువిని తిరముగాను !

    రిప్లయితొలగించండి
  16. క్రొత్తగా ప్రారంభించిన ‘న్యస్తాక్షరి’ అంశానికి ఇంత చక్కని స్పందన వస్తుందని ఊహించలేదు. మిత్రులు ఉత్సాహంగా పాల్గొనడం నాకు ఆనందాన్ని, ప్రోత్సాహాన్నీ కలిగించింది. అందరికీ ధన్యవాదాలు.
    ఇకనుండి ఒక క్రమపద్ధతిని పాటించాలనుకుంటున్నాను.
    రెండు రోజులు సమస్యాపూరణ, ఒకరోజు దత్తపది, మళ్ళీ రెండు రోజులు సమస్యాపూరణ, ఒకరోజు నిషిద్ధాక్షరి, తరువాత రెండు రోజులు సమస్యాపూరణ, ఒక న్యస్తాక్షరి. అంటే సమస్య, సమస్య, దత్తపది, సమస్య, సమస్య, నిషిద్ధాక్షరి, సమస్య, సమస్య, న్యస్తాక్షరి.... ఈక్రమంలో ఉంటాయి. గమనించవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి


  17. నా పూరణ.....

    సత్కవిత్వప్రదాయిని! శారదాంబ!
    బ్రహ్మరసనాగ్రవాసిని! పలుకుబోటి!
    వర్ణమాతృక! వాణి! భాస్వద్విశేష
    విద్యలను మా కొసంగు దేవి! నుతియింతు.

    (ముందు ఈ పద్యాన్ని వ్రాసిన తరువాతే ఏ స్థానంలో ఏ అక్షరం అన్న నిర్ణయాన్ని తీసుకున్నాను)

    రిప్లయితొలగించండి
  18. జిగురు సత్యనారాయణ గారూ,
    ఈ ప్రక్రియలో మొదటి పద్యం మీదే. సంతోషం!
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘దాంత స్వాంత’ అన్నప్పుడు ‘త’ గురువై గణదోషం.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ రెండు పూరణలు (నిన్నటిది, నేటిది) బాగున్నవి. అభినందనలు.
    నిన్నటి పూరణలో చివరిపాదాన్ని ‘నిమ్మహి రక్కసుని జంపు నీశ్వరి తానై’ అనండి.

    రిప్లయితొలగించండి
  19. సన్ను తించెద సతతము శారదాంబ
    మధుర భాషిణి వాగ్దేవి మదిని నిన్ను
    పలుకు కలికి సరస్వతీ! వందనమ్ము
    ప్రస్తు తించెద భగవతి! ప్రణతిలిడుచు

    రిప్లయితొలగించండి
  20. సరసిజాసనాలంకృత చారు మూర్తి
    'బాసర'మందిర వాసిని బ్రహ్మ పత్ని
    బ్రోవుమ సకల విద్యాస్వరూపిణి మము
    జక్కని ధిషణమును సరస్వతి యొసగుమ

    రిప్లయితొలగించండి
  21. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ప్రణతి యిడుదు’ లేదా ‘ప్రణతి నీకు’ అనండి.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘బాసర మందిర’ అన్నప్పుడు గణదోషం. ‘బాసర నగర వాసిని’ అనండి.

    రిప్లయితొలగించండి
  22. గురుదేవులకు ధన్యవాదాలు . నిన్నటి సవరించిన పద్యం :
    ఇమ్మహిషుని జంపగ రా
    వమ్మాయని పిలువగానె యాగ్రహమందె
    న్నమ్మిన వారినిగావగ
    నిమ్మహి రక్కసుని జంప నీశ్వరి తానై!

    రిప్లయితొలగించండి
  23. _/\_

    సర్వ సాహిత్య సంగీత సార శక్తి
    బ్రహ్మ రసనాగ్రముననిల్చు భావయుక్తి
    దాంతఁ స్వాంతమగు సారస్వతమును బ్రోవ
    విధిని తెల్లనితల్లికి వినతి ప్రణతి

    రిప్లయితొలగించండి
  24. గురువుగారు,
    అలుపెరగని మీ కృషి వలన సరస్వతీ రూపమై శంకరాభరణం బ్లాగు శోభిల్లుతున్నది.
    అన్నీ ఒక్కసారే వ్రాసినందుకు మన్నించండి.
    మీకు ఓపిక ఉన్నంతమటుకే చూడండి. తప్పులు ఉన్నచోట కవిమిత్రులెవరైనా కూడా చెప్పగలరని ఎదురుచూస్తుంటాను.
    ఇకమీదట నేను కూడ ఎప్పటిదప్పుడే వ్రాయడానికి ప్రయత్నిస్తాను.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. సరసిజభవుని సకియను సన్నుతింప
    నవిరతము నామె రసనపై నాట్యమాడు
    నలువురును మెచ్చు సుస్వర నైజమమరు
    పరుల మదిదోచు నుడులగు తిరముగాను.

    రిప్లయితొలగించండి
  26. యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    ‘దాంత’ తరువాత అరసున్నా చేర్చారు. ‘దాంతఁ స్వాంత’ ... అర్థం కాలేదు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    విద్యార్థీ, హోంవర్కూ అని హాస్యానికి అన్నాను. ఏమీ అనుకోకండి. మీకు ఒక్కసారిగా వ్రాసినా నాకు సంతోషమే. కాకుంటే వెంటనే నా స్పందనను తెలియజేయక పోవచ్చు. అంతే! మీరు ‘బకాయిపడ్డ’ పద్యాలను వ్రాయడం మానకండి.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. సకల మంగళములు నీకు జనని వాణి!
    శబ్ద రసరమ్య సామ్రాజ్ఞి జయము జయము!
    దివ్య వస్త్రధరి! సరస్వతీ! శుభమ్ము
    కలుగ జేయవె, జగతి సద్గతిని పొందు.

    గురువుగారు,
    మీరు అన్నా అనకపోయినా మీరు గురువులు,మేము విద్యార్థులమే. మీరేమన్నా అనుకోవడం కాదు, ఆశీర్వాదం గా భావిస్తాము.

    రిప్లయితొలగించండి
  28. గురువుగారూ నమస్సులు. మీరు వ్రాసిన పద్యము చాలా బాగున్నది.

    రిప్లయితొలగించండి