13, ఆగస్టు 2014, బుధవారం

పద్యరచన - 647

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

 1. శంకరు నాభరణ మునే
  నంకం బుగ జేసికొనిన శంకరు సామీ!
  బింకంబ గు మీ బంధము
  వంకల కిల తావు లేదు వందన మయ్యా !

  రిప్లయితొలగించండి
 2. విన్నపము జేయుచుంటిని
  సన్నుత ! మఱి యాపవలదు శక్తింగొలది
  నన్నువ నిచ్చుచు నుండుము
  బన్నము గాకుండు నటుల బ్రతిదివ సంబున్

  రిప్లయితొలగించండి
 3. పరిచయ మైనది బ్లాగని
  నిరతము పద్యము లిఖించి, నేర్చెద మంచున్
  మురిసితి మయ్యా శంకర!
  చరిత్ర పుటలకు పనుపెడు సాహస మేలా?

  రిప్లయితొలగించండి
 4. హృద్యంబగువేదికిదియె
  పద్యరచన నేర్చుకొనగ వసుమతి లోనన్
  విద్యల తల్లికి నెలవిది
  సద్యోజాతుండు మెచ్చు శంకర మాన్యున్!

  రిప్లయితొలగించండి
 5. పద్యరచన నేర్పు పాఠశాలగనొప్పు
  శంకరా భరణమ్ము సభ్యులకును
  తెలుగునందు కవుల తీర్చిదిద్దుచునుండు
  తెలుగు వైభవమును తిరగతోడు
  రోజుకొక్క సమస్య రూపకల్పనచేసి
  చక్కగ ప్రతిభకు సానబెట్టు
  చిత్రపటములిచ్చి చిత్తగించుమనచు
  వర్ణనా శక్తికి పదును బెట్టు

  బ్లాగు లోకమందు ప్రాచుర్యమునుబొందె
  కందిశంకరార్యు గారణమున
  శత వత్సరములు చల్లగ వర్ధిల్లు
  శంకరభగవాను చలువవలన

  రిప్లయితొలగించండి
 6. శంకరాభరణము శంభు మెడను జూడ
  వంకలెన్నొ యుండు భయము గల్గు
  శంకరాభరణము సరి ' బ్లాగు ' జూడగా
  వంకలేక దొలగు శంకలెన్నొ.

  రిప్లయితొలగించండి
 7. కలము బట్టిన వారలన్ కవులఁ జేయ
  స్థాపన మొనరించెను కంది శంకరార్య
  శంకరాభరణము బ్లాగు సంతసముగ
  క్రొత్త కవులకు నీబ్లాగు కూర్చు ముదము
  చేరినట్టి వారలకు చేకూరు కవిత

  రిప్లయితొలగించండి
 8. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు. తమరి నిర్ణయమును జదివిన తఱి నే నాశ్చర్యమునకు గుఱియయినాను. ఈ శంకరాభరణం బ్లాగు...పద్యము నిరాఘాటముగఁ గొనసాఁగుటకయి మీరేర్పఱచుకొన్న యుద్యమము. పద్యమును స్థిరతరముగ వెలుఁగొందునట్లు చేయుటయేకదా మీ యాశయము? ఈ బ్లాగు మూలమున నెందఱో యువకవులు పద్యకవులుగ వెలుఁగొందుచున్నారు. ఇది మీరు సాధించిన విజయము! దీనిని మీరు నిరంతరాయముగ నడుపవలెనని మా యందఱి కోరిక. దీనిని నడుపుట మీకు క్లేశకరమైనను నడుపక తప్పదని నా యభిమతము. అగుచో, దీనిని నడుపుటకై యొక సులభమార్గము కలదు. మీరు ప్రతిదినము మూఁడు టపాలు పెట్టకుండ, దినమున కొకటి చొప్పున..అనఁగా...నొకదినము సమస్యాపూరణము...ఇంకొక దినమున వర్ణనాంశము...మఱియొక దినమున దత్తపది...మఱింకొక దినమున సంకల్పిత గ్రంథభాగ ప్రచురణము...వీలయినచో...నిషిద్ధాక్షరి (గతమున నిచ్చినట్లు) నిర్వహింపఁగలరు. ప్రతిదినము సమస్యలకై వెదుకవలసిన యవసరముండదు కావున మీకుఁ గొంత తెఱపి యుండఁగలదు. ఇఁక పద్య విశ్లేషణము...దినమునకుఁ బలుమాఱులు కాకుండ, దినమునకు నొకటి రెండు పర్యాయములు విశ్లేషించిన సరిపోవును. మీ యాశయమును నెఱవేరును. మాకందఱకును సంతసముఁ గలుగును. కావున తా మీ విషయములను దృష్టియందుంచుకొని, మన్నించి బ్లాగును కొనసాఁగించఁగలరని మనవి.

  మన్నింతురను నమ్మికతో...


  తెలుఁగుఁ బద్యమ్ములు స్థిరముగా వెలుఁగొంది
  ......భావితరమ్ముల వఱలుఁగాక;
  తెలుఁగుఁ బద్యమ్మె ప్రథిత యశమ్మునుఁగూర్చి
  ......తెలుఁగు విశిష్టత నిలుపుఁగాక;
  తెలుఁగుఁ బద్యపు టందియలు ఘల్లుఘల్లునఁ
  ......దెలుఁగు నేలను నర్తనలు సలుపుత;
  తెలుఁగుఁ బద్యపు మాధురులు తెనుంగు కవుల
  ......కలములఁ బ్రవహించి ఘనతనిడుత;

  అనుచు భావించి శ్రీ శంకరయ్యగారు
  "శంకరాభరణ"మ్మను సాహితీ వి
  కాస పద్యరచన బ్లాగుఁ గల్పనమ్ము
  చేసి, ఘనతనుఁ గాంచిరి స్థిరముగాను!

  సుందరమొందెడి యీ"బ్లాగ్"
  నందుండిరి పద్యకవులు నభ్యుదయమ్మున్
  బొందెడి జాతికి జాగృతి
  నందఁగఁ జేసెడి సుకవులు నవ్యకవీశుల్!

  వీరలందఱి పద్యాలు భేషనంగఁ
  దప్పులొప్పులు సరిఁజూచి, దయను దిద్ది,
  గురులు నేమానివారలు స్థిరతరమగు
  కీర్తిఁగని, కీర్తిశేషులై, క్లేశమిడిరి!

  నవ్యకవిమార్గదర్శన మవ్యవహిత
  ముగనుఁ జేసి, బ్లాగును మునుముందుకుఁ జనఁ
  బెద్ద దిక్కయి వెలుఁగొందు వీరి పోక,
  శంకరయ్యగారికయె వజ్రప్రహరము!

  ఈశంకరనామహితులు
  క్లేశమ్మొనఁగూడఁగాను కించిదసహజ,
  స్వాశయభంగమునకు నిట
  వైశయిక నివర్తనమ్ము వలచిరి కట్టా!

  వెఱచినచోఁ బెద్దదగును,
  వెఱవకయున్నను మఱింక వెదకియుఁ గనఁగన్
  జిఱుతుకయునుఁ గనఁబడదయ;
  వెఱవఁ దగనిదానిఁ గూర్చి వెఱవఁగనేలా?

  కావున నో శంకరయ్యగారూ!

  "మనసు దిటవు చేసి మఱలంగ నీ బ్లాగు
  మున్నుఁ జన్న రీతి ముందుకుఁ జని,
  సాహితీ వికాస సంపత్కరమ్ముగా
  వెలుఁగు లీనునట్లు నిలుపుమయ్య!"

  "ప్రతిదినము నీవు మూఁడు టపాలు కాక,
  యొక్కటైననుఁ బ్రకటించి నిక్కమైన
  పద్దెమునకిట స్థానమ్ముఁ బదిలపఱచి,
  సాఁగిపోవంగఁ జేయు మో శంకరార్య!"

  -:స్వస్తి:-

  రిప్లయితొలగించండి
 9. ఈనాటి శీర్షికకు మంచి పద్యాలను అందించిన కవిమిత్రులు....
  సుబ్బారావు గారికి,
  గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారికి,
  శైలజ గారికి,
  చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  అన్నపరెడ్ది సత్యనారాయణ రెడ్డి గారికి,
  గుండు మధుసూదన్ గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి