6, ఆగస్టు 2014, బుధవారం

సమస్యా పూరణం – 1496 (చక్రమ్ములు లేని బండి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
చక్రమ్ములు లేని బండి చకచక సాగెన్.
ఈ సమస్యను పంపిన రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి ధన్యవాదాలు.

33 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  చక్రములు విరిగిన బండికి తాడు గట్టి లాగితే :

  01)
  ____________________________

  విక్రముడు తాడు గట్టిన
  చక్రములే లేని బండి - జర్రున లాగెన్ !
  వక్రముగా , నెగిరి పడుచు
  చక్రమ్ములు లేని బండి - చకచక సాగెన్ !
  ____________________________

  రిప్లయితొలగించండి
 2. కాలికి బల్లలు కట్టుకొని సముద్ర కెరటాల వాలులో జారే క్రీడ లో :
  (sea surfing)

  02)
  ____________________________

  శుక్రుండను వాని సుతుడు
  వక్రముగా వార్ధి పైన - వాటము తోడన్
  విక్రమమును జూపి నిలువ
  చక్రమ్ములు లేని బండి - చకచక సాగెన్ !
  ____________________________

  రిప్లయితొలగించండి
 3. స్వర్ణపక్షుడు, వజ్రతుండుడు, సర్పారాతి,సుధాహరుడు
  నైన వినతానందనుడు చక్రములు లేని బండే గద :

  03)
  ____________________________

  విక్రముడు గరుడి నెక్కిన
  సక్రమముగ జేర్చు పతిని - సంబ్రము తోడన్ !
  నక్రముతో సర్పము దిను
  చక్రమ్ములు లేని బండి - చకచక సాగెన్ !
  ____________________________
  విక్రముడు = విష్ణువు
  గరుడి = గరుడుడు
  పతి = ఏలిక
  సంబ్రము = వేగము
  నక్రము = ముక్కు

  రిప్లయితొలగించండి
 4. ఏనుగైతేనేం ? ఇందుణ్ణెక్కడికి జేర్చాలన్నా
  క్షణంలో జేరుస్తుంది చక్రాలవీ లేకుండానే :

  04)
  ____________________________

  శక్రునికే వాహన మది
  వక్రముగా కరము కదుపు - వల్లభ మదియే !
  శక్రమది యైన నేమిటి
  చక్రమ్ములు లేని బండి - చకచక సాగెన్ !
  ____________________________
  శక్రుడు = ఇంద్రుడు
  వల్లభము = ఐరావతము
  శక్ర = ఏనుగు

  రిప్లయితొలగించండి
 5. వరుణుని వాహనమైన మొసలి చక్రములు లేనిదే :

  05)
  ____________________________

  నక్రముపై నెక్కి తిరుగు
  విక్రమముగ వరుణు డంత - వేగిరముగనే !
  సక్రియ మది , వనమందున
  చక్రమ్ములు లేని బండి - చకచక సాగెన్ !
  ____________________________
  నక్రము = మొసలి
  సక్రియము = పనిచేయ సమర్థమగునది
  వనము = నీళ్లు

  రిప్లయితొలగించండి
 6. బక్రాక్కూడా చక్రాలుండవు మరి :

  06)
  ____________________________

  బక్రాపై నహరహమును
  విక్రాంతునిగా మెలగును - పీథము తానే !
  విక్రియలే లేకుండగ
  చక్రమ్ములు లేని బండి - చకచక సాగెన్ !
  ____________________________
  బక్రా = మేకపోతు
  అహరహము = ప్రతిదినము
  విక్రాంతుడు = శూరుడు
  విక్రియ = వికారము
  మెలగు = సంచరించు
  పీథము = అగ్ని

  రిప్లయితొలగించండి
 7. శనైశ్చరుని వాహనమైన వాయసమునకూ చక్రాలుండవు :

  07)
  ____________________________

  వక్రుండగు సప్తాంశుడు
  వక్రముగా దిరుగు నెపుడు - బలిపుష్టము పై
  నాక్రమణము సేయు నపుడు
  చక్రమ్ములు లేని బండి - చకచక సాగెన్ !
  ____________________________
  వక్రుడు = వక్ర గమనము గలవాడు
  సప్తాంశుడు = శని
  బలిపుష్టము = కాకి
  ఆక్రమణము = క్రమ్ముట

  రిప్లయితొలగించండి
 8. ఫక్రుద్దీన్‌ మంచుమీద జారేటప్పుడు చక్రాలుంటాయా !
  (skewing)

  08)
  ____________________________

  సుక్రతుడు మింట నుండగ
  సక్రమముగ మంచు మీద - జారెడు వేళన్
  ఫక్రుద్దీనుని జూచిన
  చక్రమ్ములు లేని బండి - చకచక సాగెన్ !
  ____________________________

  సుక్రతుడు = సూర్యుడు
  సక్రమముగ = క్రమము తప్పకుండా(నిర్దేశించిన దారిలో)
  జారు = కిందికి దిగు

  రిప్లయితొలగించండి
 9. వేడిగాలి బుడగపై ప్రయాణానికి చక్రాలెందుకు :
  (hotair baloon)

  09)
  ____________________________

  ఉక్రెయిను నందు కొందరు
  విక్రమముగ వెడలి రంత - వేడి బుడగతో
  విక్రియ గలిగిన నేమొకొ
  చక్రమ్ములు లేని బండి - చకచక సాగెన్ !
  ____________________________
  ఉక్రెయిను = ఉక్రెయిను దేశము
  విక్రమము = సాహసము
  విక్రియ = వికారము

  రిప్లయితొలగించండి
 10. వక్ర వచోనక్రసమ ప-
  రాక్రమి కోతలను కోసి రాకెట్లను భూ
  చక్రముపైనే నడపగ
  చక్రమ్ములు లేని బండి చకచక సాగెన్.

  రిప్లయితొలగించండి
 11. అక్రమ సంపాదన గొన
  సక్రమ మార్గముల విడచి, సలుపగ పనుల
  న్నక్రమ మార్గమున నడచు
  చక్రమ్ములులేని బండి చకచక సాగెన్

  రిప్లయితొలగించండి
 12. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  వక్రగతి లేని తారల
  చక్రమ్ములు లేని బండి చకచకసాగెన్
  చక్రమ్మొకటేయైనను
  అక్రమ మార్గాన బోవడాదిత్యు౦డున్

  రిప్లయితొలగించండి
 13. అక్రమ రీతి నవనిజఁ బ
  రాక్రమ దానవుఁడు లంక రావణుఁడు ధరా
  చక్రముఁ బెకిలించి కొనగ
  చక్రమ్ములు లేని బండి చకచక సాగెన్!

  రిప్లయితొలగించండి
 14. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

  సక్రమమగు జీవనమది
  నక్రము వలె లాగుచున్న, నయసంసారం
  బె, క్రమపు శకట మగుగా
  చక్రమ్ములు లేని బండి చకచక సాగెన్

  విక్రమ ము జూపి సూర్యుడు
  సక్రమముగ నాకసమున సాగు సమయమున్
  చక్రము తిప్పుచు,ననిశము
  చక్రమ్ములు లేని బండి చకచక సాగెన్

  నక్రము వలె లాగునిలను
  సక్రమముగ సాగనీక, సంసారమునే
  అక్రమముల పాలుపడమి
  చక్రమ్ములు లేని బండి చకచక సాగెన్

  చక్రమువలె కిందు, మీద
  తాక్రమమామంచి చెడ్డ,తలపగ కలుగున్
  నా,క్రమము కుంది,పొంగమి
  చక్రమ్ములు లేని బండి చకచక సాగున్

  రిప్లయితొలగించండి
 15. చక్రిని శరణని వేడగ
  చక్రమ్ములు లేని బండి చకచక సాగెన్
  చక్రియె జేరంగ కొలను
  నక్రము గజరాజుకతన నాకము జేరెన్

  రిప్లయితొలగించండి
 16. సుకృతుడు ధాటిగ నడుపగ
  సక్రమమగు పందెమునను జనములు మెచ్చన్
  విక్రమముఁ జూప వృషముల్
  చక్రమ్ములు లేని బండి చకచక సాగెన్


  రిప్లయితొలగించండి
 17. చక్రియె జూసెను సిమ్లా
  విిక్రయ కేంద్రములయందు వింతగు గాడీ!
  సక్రమముగ తుహినముపై
  చక్రములే లేనిబండి చకచక సాగెన్

  రిప్లయితొలగించండి
 18. వక్రముగను బోజాలదు
  చక్రములు లేని బండి చక చక సాగెన్
  చక్రముల తోడ గూడిన
  చక్రుని యారధము మిగుల సావేగముగాన్

  రిప్లయితొలగించండి
 19. వసంత కిశోర్ గారూ,
  మీది ఐతే అతివృష్టి, లేకుండా అనావృష్టి!
  మీ నవరత్నాలవంటి పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  యం.ఆర్.చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణలో ప్రాసాక్షరం ‘క్ర’. కాని మీరు మొదటి పాదంలో ‘కృ’ వేయడం వల్ల ప్రాస తప్పింది.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘సంసారం/బె క్రమపు’ అన్నప్పుడు ‘బె’ గురువు కాదు. దాని వల్ల గణభంగం. ‘సంసారం/ బక్రమపు శకట మగునా’ అందామా?
  నాల్గవ పూరణ మొదటి పాదంలో మూడవ గణంగా జగణం ఉండకూడదు కదా.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘చక్రుడు’ అన్న రూపం లేదు. ‘చక్రి’ సరైనది.

  రిప్లయితొలగించండి
 20. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్ర బృందమునకును వందనశతము...

  వక్రగుణి రావణునిఁ దా
  విక్రముఁడై త్రుంచిన రఘువీరుఁ డయోధ్యన్
  సక్రియఁ బుష్పకమునఁ జనఁ
  జక్రమ్ములు లేని బండి చకచక సాఁగెన్!


  రిప్లయితొలగించండి
 21. సక్రమ దిశారహితమగు
  నక్రమ సంపాద నేచ్చ కవధులు లేకన్
  వక్ర పథమున విలువలను
  చక్రమ్ములు లేని బండి చకచక సాగెన్

  రిప్లయితొలగించండి
 22. గురువర్యులకు నమస్కారములు . కొందరు మిత్రుల పూరణలలో పాదము మొదటి అక్షరములు దీర్ఘములు వచ్చినవి. అది సరియైనదేనా ?

  రిప్లయితొలగించండి
 23. మిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణగారికి, మీ పూరణ బాగున్నది...కాని, ద్వితీయపాదాంతమున "లేకన్" ద్రుతాంతముకాదు. వ్యతిరేకార్థకములగు "లేక" "చేయక"వంటివి(’అక’ప్రత్యయాంతములు) ద్రుతాంతములుగ రాయరాదుకదా! కావున సవరింపఁగలరు. అన్యథాభావింపవలదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 24. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  సంయుక్తాక్షరం వల్ల ముందున్న అక్షరం ఎలాగూ గురువే అవుతుంది. దీర్ఘాక్షరం ఉండడంలో తప్పు లేదు.
  చక్రము....ప
  రాక్రమము.... ఇలాగ.

  రిప్లయితొలగించండి
 25. గుండు మధుసూదన్ గారూ,
  ధన్యవాదాలు.
  మీ దృష్టికి వచ్చిన దోషాలను నిస్సందేహంగా చూపించవచ్చు. అందువల్ల మిత్రులు తమ పద్యరచనా నైపుణ్యాన్ని మెరుగు పరుచుకుంటారు. ఆ దోషాలకు సవరణ సూచిస్తే మరీ సంతోషం!

  రిప్లయితొలగించండి
 26. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  గుండు మధుసూదన్ గారి వ్యాఖ్యను గమనించారు కదా!
  మీ పూరణలో రెండవ పాదానికి నా సవరణ...
  ‘అక్రమ సంపాదనేచ్ఛ కవధి కలుగునా’

  రిప్లయితొలగించండి
 27. శుక్రగ్రహ యాత్రకునై
  సక్రమముగ పంప పైకి శటిలైట్ నదియే
  వక్రముగా పైకెగసెను
  చక్రమ్ములు లేని బండి చకచక సాగెన్

  రిప్లయితొలగించండి
 28. శుక్రగ్రహ యాత్రకునై
  సక్రమముగ పంప పైకి శాట్లైట్ నదియే
  వక్రముగా పైకెగసెను
  చక్రమ్ములు లేని బండి చకచక సాగెన్

  రిప్లయితొలగించండి
 29. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘నదియే’?... ‘శాట్లై టదియే’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 30. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు. తమరి సూచనకు కృతజ్ఞతలు. రెండవ పద్యము మొదటి పాదము యిలామార్చాను.
  "చక్రధరుడు వెసనడుపగ"

  రిప్లయితొలగించండి
 31. ఆర్యా ! ధన్యవాదములు...నిజమే అలానే అనవలసినది..మీరు సూచించిన మార్పుతో..


  శుక్రగ్రహ యాత్రకునై
  సక్రమముగ పంప పైకి శాట్లైటదియే
  వక్రముగా పైకెగసెను
  చక్రమ్ములు లేని బండి చకచక సాగెన్

  రిప్లయితొలగించండి
 32. విక్రమముగ హిమపథమున
  సక్రమముగ స్లెడ్జి పైన సాంటా నడప
  న్నీ క్రిస్మస్ దినములలో
  చక్రమ్ములు లేని బండి చకచక సాగెన్

  రిప్లయితొలగించండి
 33. చక్రమ్ముల పని లేకయె
  విక్రమముగ పరుగులిడుచు వెగటగు రీతిన్
  సక్రమముగ జెర్రి గనుము!
  చక్రమ్ములు లేని బండి చకచక సాగెన్

  రిప్లయితొలగించండి