11, ఆగస్టు 2014, సోమవారం

పద్యరచన - 645

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. ఆది విష్ణువు జనియించె నవనినందు
    దేవకీ గర్భమందున తేజ మలర
    కంసు భారినుండి సుతునిఁ గావనెంచి
    పయన మయ్యెను తండ్రి వ్రేపల్లె జేర
    యమున దాటుచు నున్నట్టి సమయ మందు
    దారి యిచ్చెనా నదితాను తీరుగాను

    రిప్లయితొలగించండి
  2. దాటు చుండగ గృష్ణుడు దారి యిచ్చె
    దల్లి గోదారి జూడుమా లల్లి !యచట
    జగము నాడించు నాతడు చంటి బిడ్డ
    వోలె కూర్చుండె భుజముపై బుద్ధి తోడ

    రిప్లయితొలగించండి
  3. అలలై ప్రభు పాదంబులఁ
    గొలువగ నానంద వృష్టి కురిసెడు వేళన్
    జెలగఁగ యమునా జలముల్
    తలపై శేషుడు గొడుగుగ దనరుచు మురిసెన్!

    రిప్లయితొలగించండి
  4. దేవకి పుత్రుని గొని వసు
    దేవుడు తా వెడలుచుండ తెప్పల యమునే
    త్రోవను జూపెను శేషుం
    డావానయె పడక బట్టె పడగను హరికిన్.

    రిప్లయితొలగించండి
  5. సుబ్బారావు గారూ.. తల్లి గోదారి బదులు తల్లి యమునయె ...అనండి

    రిప్లయితొలగించండి
  6. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    గోలి వారి సూచనను గమనించారు కదా!
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది.అభినందనలు.
    సుబ్బారావు గారి పద్యానికి సవరణ సూచించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. మాస్టరుగారూ ! ధన్యవాదములు.
    నా పూరణలో నాల్గవ పాదం లో యతి దోషాన్ని సవరిస్తూ..


    దేవకి పుత్రుని గొని వసు
    దేవుడు తా వెడలుచుండ తెప్పల యమునే
    త్రోవను జూపెను శేషుం
    డావానయె పడక బట్టె నప్పుడు పడగన్

    రిప్లయితొలగించండి
  8. లీలలఁ జూపగనెంచిన
    నీలపు వర్ణుడు జనించు నెలవును వీడెన్,
    నీలాల యమున దాటిన
    మేలిమి చిత్రము గనుమిట మిత్రములారా!

    రిప్లయితొలగించండి
  9. అష్టమ గర్భమందు తన యాలికి బుట్టిన చిన్నవానితో
    యష్టమి రాత్రి వర్షమున యండగ బిడ్డకు యాది శేషుడే
    కష్టము గల్గనీ క పడగన్ గొడుగున్ వలె విప్పి కప్పగా
    దుష్టుడు కంసుఁనించి తను దూరముగా వసుదేవుడేగ తా
    నిష్టము మీరగాయమున యిచ్చెనుదారిని గోకులంబుకున్

    రిప్లయితొలగించండి
  10. నందుని యిల్లు జేర్చుటకు నందను జేకొని పోవుచుండ ఆ
    నందము తోడ దారినిడె నా యమునా నది ప్రేమమీరగన్
    సుందర రూప కృష్ణునకు, సూనృత డావసు దేవు ప్రోడకున్
    పొందుగ నాది శేషుడును పూనికతో పణి బట్టె ఛత్రమై

    రిప్లయితొలగించండి
  11. మల్లెల వారి పూరణలు

    చెఱనటు పుట్టిన కృష్ణుని
    వరదను దాటించె యమున వసుదేవుడదే
    భరమౌ శేషుడు కాపిడ,
    తరమా తెల్పగను మాయ, ధరలోమనకున్

    రిప్లయితొలగించండి
  12. నందుని యిల్లు జేర్చుటకు నందను జేకొని పోవుచుండ ఆ
    నందము తోడ దారినిడె నా యమునా నది ప్రేమమీరగన్
    సుందర రూప కృష్ణునకు, సూనృత డావసు దేవు ప్రోడకున్
    పొందుగ నాది శేషుడును పూనికతో ఫణ బట్టె ఛత్రమై

    రిప్లయితొలగించండి
  13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఆ యతిదోషం నా దృష్టికి రాలేదు. సవరించినందుకు సంతోషం.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘వానితో నష్టమి..., వర్షమున నండగ...’ అనండి.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    సూనృతు- సూనృత. ఫణి- ఫణ టైపాట్లు అనుకుంటాను.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. వసుదేవుండిదె యాదిశక్తి వచనాప్రాగల్బ్యమాలించి సం
    తసమున్ బొంది సమస్త ధైర్యయుతుఁడై నందున్ సమీపింపగా
    వెసఁ గంగాభిముఖుండుగా వెడలగా వింతల్ కడున్ జూపుచున్
    విససర్పంబదె చత్రమయ్యె నదియే ప్రేమార మార్గంబిడెన్.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ కంది శంకరయ్య గురువరులలుకు నమస్కారము
    సూనృత టైపాటు పొరపాటును గుర్తించిన మీకు ధన్యవాదములు
    ఫణి అర్థము పాము అని ఫణ అర్థము పాము పడగ అనే భావముతో
    ఫణ అని వ్రాయడం జరిగింది. సందేహ నివృత్తిచేయ ప్రార్థన

    రిప్లయితొలగించండి
  16. గండూరి వారూ,
    ఫణ అని ప్రత్యయం లేకుండా వ్రాయరాదు కదా అనుకున్నాను... ఇప్పుడే పర్యాయపద నిఘంటువులో పడగకు ఫణ, ఫణము రెండు పదాలు ఉన్నాయి. మీ ప్రయోగం సరియైనదే. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి