9, ఆగస్టు 2014, శనివారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 48

రామాయణము-
సీ.    ప్రజ వినె భరతుండు నిజజననీ (కృష్ణ
        మృగనేత్రకతన సిరినెలసె మఱి)
    రాముండు రిపు(ధర్మరాజు గోల్పడె వసుం
        ధరను; నెత్తఁ)గ గోడు దశరథుండుఁ
    బొగిలెనని; యనె నప్డు ముని వేష(మునను
        వనిని నేఁడులు పదియు నల రెండు)
    నీ రహర్పతివంశనీరధిరాకేందు
        నుండ దైవము సేసె నొక్కొ! యొకది
ఆ.    వసమును నగు (నొక్క వర్ష మజ్ఞాతులై
    యుండ నియతి)తోడ నుర్విపుత్రి
    రామలక్ష్మణులని ప్రభునిఁ గైకను భక్త
    వరదుఁ దూఱుపాఱఁబట్టె నంత. (౬౩)

భారతము-
గీ.     కృష్ణమృగనేత్రకతన సిరినెలసె; మఱి
    ధర్మరాజు గోల్పడె వసుంధరను నెత్త
    మునను; వనిని నేఁడులు పదియు నల రెండు
    నొక్కవర్ష మజ్ఞాతులై యుండ నియతి. (౬౩)

టీక- (రా) కృష్ణమృగనేత్ర = కృష్ణమృగమువంటి కన్నులు గలది, (భా) కృష్ణ = ద్రౌపది, మృగనేత్ర = లేడివంటి కన్నులు గలది; ధర్మరాజు = (రా) యముఁడు; ఎత్తఁగ = (రా) చెలరేగఁగా, (భా) నెత్తమునను = జూదమందు; ఎలసె = పొందె; పదియు, రెండు, ఈరు = రెండు అనగా పదునాలుగు; అహర్పతి = సూర్యుఁడు; ప్రభుని = దశరథుని; వర్షము = సంవత్సరము
                                                                                                                               రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి