29, ఆగస్టు 2014, శుక్రవారం

పద్యరచన - 661

కవిమిత్రులారా,
వినాయక చవితి శుభాకాంక్షలు.

ఈనాటి పద్యరచనకు అంశం...
వినాయక చవితి - చంద్రదర్శనము.

18 కామెంట్‌లు:

  1. చవితి నాడు చేయ చంద్ర దర్శనమును
    నిందలెన్నొ కలుగు నిశ్చయముగ
    విఘ్న రాజుఁ గొలువ విఘ్నముల్ కలుగవు
    భక్తితోడ తలతు భార్గవిసుతు

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    శ్రీకృష్ణుడు - చంద్రదర్శనం
    శమంతకమణి - అపనిందలు :

    01)
    __________________________________

    చంద్రదర్శనము గలుగ - చవితి నాడు
    శ్యామసుందరునకు వలె - సడులు గలుగు !
    సుముఖు మనసార పూజించి - శుభము లిడగ
    చల్లు కొనినంత నక్షతల్ - జయము గలుగు !
    __________________________________
    సడి = నింద

    రిప్లయితొలగించండి
  3. మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  4. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘భార్గవీసుతు’ అనవలసి ఉంటుంది. అక్కడ ‘భర్గు సుతుని’ అనండి.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. పూజ్య గురువుగారికి, కవిమిత్రులందరికీ వినాయక చతుర్ధి శుభాకాంక్షలు..

    చంద్రదర్శనము వలన చవితి నాడు
    కలుగు నీలాప నిందలు ఖచ్చితముగ
    పర్శు పాణిని బూజించ భక్తి తోడ
    విధిగ కధవిని నక్షతల్ వేసుకొనగ
    జయము లిచ్చును గణపతి సంతసించి

    రిప్లయితొలగించండి
  6. వినాయక చవితి శుభాకాంక్షలతో...


    ఏకవింశతి నామపూజ ప్రకారము ఇరువదియొక్క పత్రి పేర్లతో వ్రాసిన పద్యమిది

    సీసము:
    సిద్ధి దాయక నిన్ను శ్రద్ధగా బూజింతు
    నిరువదొకటి పత్రి నిటులదెచ్చి
    దానిమ్మ, మరువక, తలచి విష్ణుక్రాంత,
    ఉమ్మెత్త, మద్దియు, నుత్తరేణి,
    గరికయు, మారేడు, గన్నేరు, జిల్లేడు,
    దేవదారుయు, రేగు, రావి, జాజి
    మామిడి, గండకీ, మాచి, వావిలి, జమ్మి
    తులసి, నేలమునగ, తుష్టి తోడ

    తేటగీతి:
    ధూపదీపమ్ము హారతి తోడుగాను
    కుడుములుండ్రాళ్ళు భక్తితో నిడుచు నేడు
    భాద్రపద శుధ్ధ చవితిని పట్ట పగలు
    విఘ్నబాధలు దొలగుచు విజయమంద.

    గోలి హనుమచ్ఛాస్త్రి

    రిప్లయితొలగించండి

  7. కలుగు నీలాపనిందలు కష్టములును
    చంద్రు జూడ వినాయక చవితి నాడు
    పగలు పూజించ హేరంబు భక్తి తోడ
    దోషమంతయు పోవును తొలగునింద.

    రిప్లయితొలగించండి

  8. కలుగు నీలాపనిందలు కష్టములును
    చంద్రు జూడ వినాయక చవితి నాడు
    పగలు పూజించ హేరంబు భక్తి తోడ
    దోషమంతయు పోవును తొలగునింద.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ గోలి హనుమఛ్చాస్ధ్రి గారికి ...పత్రి పేర్లతో మీసీసపద్యం మనోజ్ఞంగా వుంది...

    రిప్లయితొలగించండి
  10. చవితి నాడు భక్తి సలిపిరి పూజల
    మోదకమ్ము లిచ్చి మ్రొక్కినారు
    బాల గణపతయ్య బోలెడు తిని లేచె
    నుదిత మాయె నతని యుదర మంత.

    కైలాసమ్మున కేగెను
    శూలికి వందనము జేయ సుష్టుగ తినుటన్
    వీలవ దాయెను గర్భము
    నేలకు కాళ్ళాన వాయె నెల గని నవ్వెన్.

    రాజు దృష్టి సోక రాళ్లైన పగులును
    వారిజారి నవ్వ పగిలి పొట్ట
    విగత జీవుడాయె వేదండ వదనుడు
    శర్వురాణి శశికి శాప మిడెను.

    చందురు జూచిన వారికి
    నిందలు పెక్కాయి వారు నెవ్వలు పడగా,
    నందకు దయయై చవితిని
    చందురు గనకున్న చాలు సంతస మనియెన్.

    గోపాలుడు క్షీరములో
    పాపము చందురుని జూచి బాముల బడగా
    శాపావకాశ మిచ్చిన
    దా పార్వతి కరుణతోడ నందరు మురియన్.

    చవితిని గణపతి పూజల
    నెవరైనను జేసి యినుమడించిన భక్తిన్
    సవివరముగ కథ విన్నను
    తవులుకొనవు నింద లిందు దర్శన మైనన్.




    రిప్లయితొలగించండి
  11. కంటన్ మింటను చంద్రుని
    తంటాలే వచ్చునంట తప్పక ప్రజకున్
    వింటన్ వినాయకునికధ
    నింటన్ గొలిచిన గణేశుఁ , నిందలుతప్పున్

    రిప్లయితొలగించండి
  12. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ ఏకవింశతిపత్రి పూజను తెలిపిన సీసపద్యం బాగుంది. చంద్రదర్శనంపై వ్రాసిన పద్యం కూడా బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీరు ఏకంగా ఖండికనే అందించారు. చాలా బాగుంది. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. చవితి నాడు జూడ చంద్ర బింబమ్మును
    నిందలఁబడుదురట నెవ్వ రైన
    కుదుప లేదెనదియె గోపాల కృష్ణుని
    కరివదనుని పూజ కట్టు నింద!

    రిప్లయితొలగించండి
  14. కవి పండిత మిత్రులకు
    వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!

    ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

    స్వాగత వృత్తము:
    శ్రీ గణేశ! ఘన చిత్సుఖ దాతా!
    శ్రీ గిరీశ సుత! శ్రేష్ఠ! వరిష్ఠా!
    యోగి రాడ్వరద! యోగ విశేషా!
    స్వాగత ప్రమథ వర్గ! నమో ఽహమ్! (1)

    ప్రమాణి వృత్తము:
    గజాననా! ఘనాకృతీ!
    ప్రజావళి ప్రమోద! స
    ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
    ర్భుజా! నమో ఽస్తు తే ఽనిశమ్! ( 2)

    ప్రణవ వృత్తము:
    హేరంబా! మిత హిత సంతోషా!
    గౌరీ నందన! కరి మూర్ధన్యా!
    సూరి ప్రాకట శుభ సంశ్లోకా!
    భూరి క్షత్ర! విముఖ! వందే ఽహమ్! (3)

    శాలినీ వృత్తము:
    సారాచారా! నీత సత్పుణ్య దాతా!
    పారాశర్యామోద బాష్పోత్సుకా! క్రౌం
    చారి భ్రాతా! భూరి సమ్మోద పాత్రా!
    ధీర స్తుత్యా! హే ద్విదేహ ప్రభాసా! (4)

    వంశస్థము:
    నమో నమో విఘ్న వినాశకాయ తే!
    నమో విచిత్రాయ! వినాయకాయ తే!
    నమః పవిత్రాంచిత నామకాయ తే!
    నమో సదాదాన! ఘనాయ తే నమః! (5)

    వన మయూరము:
    హేరుక! భవాత్మజ! మహేంద్ర నుత గాత్రా!
    ధీర! సుముఖ! ప్రముఖ! దివ్య దరహాసా!
    ఘోర తర సంసృతి వికూప తరణాప్తా!
    చారు రుచి దంత కులిశ ప్రహరణాఢ్యా! (6)

    స్రగ్విణీ వృత్తము:
    పార్వతీ నందనా! భారతోల్లేఖనా!
    సర్వ గర్వాపహా! ఛాత్ర విద్యోదయా!
    ఖర్వ విఘ్నోన్నతా! కార్య సిద్ధిప్రదా!
    శర్వ పుత్రాగ్రజా! శాంత మూర్తీ! నమః! (7)

    ఇంద్ర వంశము:
    జీవేశ! సర్వోత్తమ! చేతన ప్రదా!
    దేవ స్తుతా! శాంకరి! ధీ విశేష! ది
    వ్యా! విశ్వ సంపూజిత! వక్రతుండ! ఢుం
    ఠీ! వేద వేద్యా! ఘన తేజ! తే నమః! (8)

    భుజంగ ప్రయాతము:
    ద్విపాస్య! త్రి ధామ! త్రిధాతు! ప్రసిద్ధా!
    సుపర్వ ప్రమోదా! శుభాంగా! వృషాంకా!
    కపి త్థాత్త సంపృక్త భుక్త ప్రహృష్టా!
    కృపాంభోధి! కుబ్జాకృ తీశా! నమస్తే! (9)

    (శుభం భూయాత్)

    *** *** *** ***

    నేఁటి చిత్రమునకు నా పూరణము:

    చవితి దినమున నవ్వంగఁ జందమామ,
    కొడుకు గణనాథు నుదరమ్ము క్రుమ్మరించె
    లోని కుడుముల, నుండ్రాళ్ళ; వానిఁ జూచి,
    క్రోధమున శపించెను గౌరి బాధతోడ!

    "చవితి దినమున నేవారు చంద్రుని ముఖ
    దర్శనము సేతురో వారు తత్క్షణమ్మె
    తగని నీలాపనిందల నెగడుదురయ!"
    యనఁగ, దేవతల్ ప్రార్థింప వినిచె నిట్లు;

    "నాదు తనయునిఁ బూజించి, నాఁడు నక్ష
    తలఁ దలపయిఁ జల్లుకొన నిందలు తొలఁగి, శు
    భమ్ము లొనఁగూడు" ననుచు శాపావధి నిడ,
    నంద ఱానందమందిరి, వందనమిడి!

    అంత, వినాయక చవితి సాయంత్రమందుఁ
    గృష్ణుఁ డొంటిగఁ దోఁట కేగియు నచటనె
    కూర్చొనఁగ రుక్మిణీసతి కూర్మిమీఱ
    దుగ్ధపాత్ర నొసఁగఁగ నందునను నతఁడు
    చంద్రుఁ బొడఁగాంచినంత సాక్షాత్కరించె
    నింద; సత్రాజితుని దమ్మునిం దునిమి, య
    తని శమంతకమణిఁ గొనె ననుచు వేగ!

    దానఁ గృష్ణుండు వనికేగి, తఱచి వెదుక,
    నొక్కచో జాంబవంతునియొక్క తనయ
    జాంబవతి కంఠమందున సౌరభమిడు
    నా శమంతకమణిఁ జూచి, యతనితోడ
    యుద్ధముం జేసి, యోడించి, యుక్తముగను
    జాంబవతితోడి మణిఁగొని, సరగునఁ జని,
    యచట సాత్రాజితిం బొంది, యందగించె
    విఘ్నపతి చల్లఁగాఁ జూడ వెన్నుఁడంత!

    -: ఓం శ్రీ మహా గణాధిపతయే నమః :-

    రిప్లయితొలగించండి
  15. గుండు మధుసూదన్ కవి మిత్రుల పద్యపత్రాలతో గణేశుడు మరింత శోభలీనుతున్నాడు.

    రిప్లయితొలగించండి
  16. ధన్యవాదములు మిత్రమా మిస్సన్నకవివర్యా! మీ కవితాఖండిక చాల చక్కఁగ నున్నది...ఫలశ్రుతియుతముగ! శుభాభినందనలు!

    రిప్లయితొలగించండి
  17. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ విశేషవృత్తాలూ, శమంతకమణికథ మనోహరంగా ఉండి మీ బహుముఖప్రజ్ఞను చాటుతున్నవి. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి