11, ఆగస్టు 2014, సోమవారం

సమస్యా పూరణం – 1498 (వానలు లేకుండ మెట్ట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్.
సేకరించి పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:


  1. యతి గణములు లేకుండ జిలేబి లిఖించెన్
    పట్టింపు లేకుండ కంది వారు అభినందించెన్
    విత్తనములు జల్లక పంట చేతి కొచ్చెన్
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్ !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. వానలకై చూచుచు తా
    మేనును వాల్చెను కునుకున మేలగు రైతే
    తానే కలగనె నందున
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్.

    రిప్లయితొలగించండి
  3. బోనము నోటికి రాదుగ
    వానలు లేకుండ ,మెట్ట వరి ఫలియించెన్
    వానలు బాగుగ బడుటన
    వానలు మఱి లేనిచోట బ్రదుకే భారమ్

    రిప్లయితొలగించండి
  4. వానలకైజూచి నలసి
    వానలు లేకున్నవేళ వరిపండించన్
    పూనికగొనిబిందు కృషిని
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్

    రిప్లయితొలగించండి
  5. అమ్మా జిలేబీ,
    మిమ్మల్ని అభినందించకుంటే ‘వరూధిని’ని నాపై ఉసిగొల్పి, రాంపండుతో నాకే చదువు చెప్పిస్తారు కదా!
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ స్వప్నవృత్తాంతపు పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘భారమ్’ అని హలంతపదాన్ని ప్రయోగించారు. అక్కడ ‘బ్రతుకె బరు వగున్’ అనండి.
    *
    శైలజ గారూ,
    మీ బిందుసేద్యపు పూరణ బాగుంది. అభినందనలు.
    ‘వానలకై చూచి యలసి’ అనండి. (కై ప్రత్యయం తరువాతి పరుషం సరళం కాదు. చూచి + అలసి అన్నప్పుడు నుగాగమం రాదు)

    రిప్లయితొలగించండి
  6. కానలు లేకనె పోయెను
    వానలు లేకుండ; మెట్ట వరి ఫలియించెన్
    మానిసి కలలో నేడిదె
    కానగ వచ్చును వగచిన కలవా ఫలముల్?

    రిప్లయితొలగించండి
  7. చేలెండి పోవుచుండెను
    వానలపై యాసశ వీడి వైచిన యా ధీ
    మానవుని బోరు దకముచే
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్

    రిప్లయితొలగించండి
  8. ఏనాటి పుణ్య ఫలమో!
    యీనాటికి నెత్తి పోత లీడేర్చ వెతల్
    మా నోటికి ముద్ద దొరక
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్!

    రిప్లయితొలగించండి
  9. ధీనిధి యగు కర్షకుఁడిటు
    వానలు లేకున్న గలుఁగు బాధల గని సం
    ధానించె "బోరు" మార్గము
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్.

    రిప్లయితొలగించండి

  10. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    కానలకోనల కురిసిన
    వాన జలము తోడ విత్త వరిచేల్ మెరసెన్
    తానూర్పిడి గావించెను
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియి౦చెన్

    రిప్లయితొలగించండి
  11. జ్ఞాన మభివృద్ధిఁ జెందగ
    నానా విధవింతలఁ గననగు భువిలోనన్
    నానోటెక్నాలజితో
    వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్

    రిప్లయితొలగించండి
  12. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

    చేనుల, బావుల మోటల
    బానల తోడను తడుపగ వరిచేలను తా
    కానరె కర్షకులత్తరి;
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్

    మానిత ధర్మజు డెట తా
    నూనును కాలును నచటనె నొప్పును వానల్
    తానేగ విరటు రాజ్యము
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్

    వేనదుల కానకట్టలు
    నానందమగును మెరకగు నా భూములలో
    ఫేనము తో నీరుపొరలి
    వానలు లేకుండ మెట్ట, వరి ఫలియించెన్

    కానగ చిత్రము లక్ష్మిని
    మానిత శ్రావణ మాసాన మంచిగ కొలువన్
    కోనల వాగుల నీరున
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్

    రిప్లయితొలగించండి
  13. పూనిక ఫలమా? కురిసెను
    వానలు, లేకుండ మెట్ట, వరి ఫలియించెన్
    సానందపు తెనలాడగ
    తానై కృషికులము పొంగి తలలూపినదా?

    రిప్లయితొలగించండి
  14. లక్ష్మీదేవి గారూ,
    కలలో వరి పండించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బోరునీళ్ళతో పండించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ ఎత్తిపోతల పథకపు పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    బోరును సంధానించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    పోడువ్యవసాయం గురించా మీరు చెప్పింది. బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    నానో టెక్నాలజీతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు వైవిధ్యంగా బాగున్నవి. అభినందనలు.
    నాల్గవ పూరణలో ‘మాసాన’ అన్నచోట గణభంగం. ‘మానిత శ్రావణమునందు...’ అనండి.
    *
    యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.


    రిప్లయితొలగించండి
  15. 1) మానవ కృషి వర్ధిల్లగ
    జ్ఞానులు విజ్ఞాన గరిమ గంగను భువికి
    న్నా నాగులధారిగ నిడ
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్.

    2) ఈ నవ యుగ విజ్ఞానులు
    పూనిక తో భూజలంబు భువి కుబుకించన్
    మానవులు విత్తు నాటగ
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్.

    రిప్లయితొలగించండి
  16. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. గురువుగారికి నమస్కారములు.

    నేను సూచించిన సమస్యకు ధీటైన పూరణలను పంపిన కవిమిత్రులందరికి మన:పూర్వకాభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమోవాకములు.

    చేనికి నవసరమయ్యెడి
    వానలు చక్కంగఁ గుఱిసి, "ప్రళయకరమ్మౌ,
    చేనికి హానికరమ్మౌ
    వానలు లేకుండ" మెట్ట వరి ఫలియించెన్!!

    రిప్లయితొలగించండి
  19. జ్ఞానము కలిగిన రైతులు
    చేనుల యాధునిక బిందు సేద్యము చేసెన్
    కానని మొయిళ్ళును తగిన
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్

    రిప్లయితొలగించండి
  20. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రైతులు.. చేసెన్ అన్నారు. అక్కడ చేయన్ అంటే అన్యయం కుదురుతుందేమో?

    రిప్లయితొలగించండి
  21. బోనలు గూర్చగ కవితయె
    తానే యాగములు జేయ తనివిందీరన్
    కోనేర్లు నదులు నిండగ
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్

    రిప్లయితొలగించండి


  22. బానగిలె రైతు సావుకు
    వానలు లేకుండ; మెట్ట వరి ఫలియించె
    న్నేనాడైన జిలేబీ ?
    చాన దినములాయెనమ్మ జల్లుల జూడన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. నానా గ్రంథము లొల్లక
    నేనీ పద్యములు వ్రాసి నెట్టున నిడితిన్...
    కానగ నిదియెట్లన్నన్
    వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్

    రిప్లయితొలగించండి