19, ఆగస్టు 2014, మంగళవారం

సమస్యా పూరణం – 1504 (నారాయణ యనిన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నారాయణ యనినఁ జాలు నరకమె గతియౌ.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

 1. చేరునుదివికొకపరి తా
  నారాయణ యనిన జాలు, నరకమె గతియౌ
  పారాయణలను చేయక
  దూరుచు దేవుని బ్రతికెడు దుర్మార్గునకున్

  రిప్లయితొలగించండి
 2. నోరార తలపగూడదు
  క్షీరాబ్ది శయనుని పూజ చేయగ రాదే
  ఆ రాక్షస రాజెదుటను
  నారాయణ యనినఁ జాలు నరకమె గతియౌ

  రిప్లయితొలగించండి

 3. క్రూర ప్రవర్తన నిరతము,
  సారెకు బ్రతుకంత పాపచర్యలె, నిండెన్
  ఘోరపు భాండము, తుదకేం?
  నారాయణ యనినఁ జాలు? నరకమె గతియౌ !!

  రిప్లయితొలగించండి
 4. చేరగ స్వర్గమ్ము నరుడు
  నారాయణ యనినఁ జాలు ; నరకమె గతియౌ
  నోరారగ బలుక కెపుడు
  దూరుచు నితరులను పరమ దుర్మార్గుండై

  రిప్లయితొలగించండి
 5. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  తుదకేం అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
  *
  భాగవతుల కౄష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  ”నారాయణాయ’మంత్రపు
  సారము”రా”యక్షరమ్ము సన్నుతి సేయన్
  యీ “రా”వదలిన మంత్రము
  "నారాయణ" యనిన చాలు నరకము గతియౌ

  రిప్లయితొలగించండి
 7. పారము దాటగ వచ్చును
  నారాయణ యనిన జాలు, నరకమె గతియౌ
  నా రాయణు దూ షించిన
  నారని సంపదల నిచ్చు నా ప్రభువేను

  రిప్లయితొలగించండి
 8. చేరువగు ముక్తికి నరుడు
  నారాయణ యనినఁ జాలు, నరకమె గతియౌ
  నేరక శ్రీహరి మహిమను
  దూరెడి దుర్జనులకు కడు దుఃఖము మరియా

  రిప్లయితొలగించండి
 9. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. క్రూర ప్రవర్తన నిరతము,
  సారెకు బ్రతుకంత పాపచర్యల రణమై
  స్మారములెక మరణదశఁ
  నారాయణ యనినఁ జాలు? నరకమె గతియౌ

  రిప్లయితొలగించండి
 11. తీరును దురితము లన్నియు
  నారాయణ యనిన జాలు, నరకమె గతియౌ
  శౌరిని దలచచక నెపుడున్
  దూరుచు నేరములు జేయు దుష్టుల కిలలో !

  రిప్లయితొలగించండి
 12. గురువుగారికి వందనములు.
  క్రమాలంకార పద్ధతిలో........

  పారముఁ జేరగఁ వచ్చును
  శ్రీరఘురాముని పదముల చేకొని మదిలో,
  క్రూర ప్రవర్తనమునకు
  నారాయణ యనిన చాలు, నరకమె గతియౌ.

  రిప్లయితొలగించండి
 13. మల్లెల వారి పూరణలు

  దూరము నౌటకు పాపము
  నారాయణ యనిన- జాలు నరకమె గతియౌ
  తారానామము నొకపరి
  నోరార పలుకక యున్న, నొప్పుగ నిలపై

  పారము లేనటు భక్తిని,
  వారెందరొ వానినమ్మ, బాగుగ భజనన్,
  కోరియు పరీక్ష చేయడె
  నారాయణ యనినఁ జాలు నరకమె గతియౌ

  నారయణ యని పలుకగ,
  చేరుదు రాజన్న చివర, శ్రీపదమునకున్,
  పూరితి కష్టములందియు
  నారాయణ యనినఁ జాలు నరకమె గతియౌ

  ఆరాముని గుడి కట్టిన
  ఆరామునిదాసు పడడె అమితపు కష్టాల్,
  తేరిచె చివరకు- భువి పై
  నారాయణ యనినఁ జాలు నరకమె గతియౌ

  కోరిక మనమున వానిని
  ఊరక మెచ్చగ పరులిల నొప్పుగ నోటన్,
  నారము కల్గక పాపులు,
  నారాయణ యనినఁ జాలు నరకమె గతియౌ

  రిప్లయితొలగించండి
 14. నేరక పలికిన పలుకౌ
  "నారాయణ యనిన జాలు నరకమె గతియౌ "
  క్రూరుండైనన్ దలఁపుల
  నారాయణ యనిన జాలు నాకమె నెలవౌ!

  రిప్లయితొలగించండి
 15. యం.ఆర్.చంద్రమౌళి గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘శౌరిని దలచచక’.... టైపాటువల్ల ఒక చకారం ఎక్కువయింది.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ ఐదుపూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. నారాయణుడే సర్వము
  నారాయణు డెన్న లోకనాథుడు తండ్రీ!
  దూరకుమోయీ 'యెవడా
  నారాయణ' యనినఁ జాలు నరకమె గతియౌ.

  రిప్లయితొలగించండి
 17. చేరువ మరణము రాగా
  నారాయణ యంచు పలుక నాకము దొరుకన్
  నౌరా! యెచ్చట? నేగతి?
  నారాయణ యనిన జాలు నరకమె గతియౌ?

  రిప్లయితొలగించండి
 18. నీఱౌ కిల్బిష మంతయు
  నారాయణ యనిన జాలు; నరకమె గతియౌ
  క్రూరపు కర్మల నిల సం
  సారపు సంద్రమున మునిగి చక్రిని మరువన్
  రిప్లయితొలగించండి
 19. చేరగ స్వర్గము నేరుగ
  నారాయణ యనినఁ జాలు, నరకమె గతియౌ
  నేరీతిగ? హరినామమె
  తారక మంత్రంబయి దురితంబులుబాపున్

  రిప్లయితొలగించండి
 20. మిస్సన్న గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరిస్తున్నది. అభినందనలు.
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. క్రూర జిహాదుల నెలవున
  నేరమ్ములవగ పరమత నియతల వెల్లన్
  పారాయణమ్ము తలపడి
  నారాయణ యనినఁ జాలు నరకమె గతియౌ

  రిప్లయితొలగించండి
 22. కోరిక మీరగ రోముడు
  తీరికగా గుడుల జనుచు తిట్టుల తోడన్
  పోరుచు వోటుల కొరకై
  నారాయణ యనినఁ జాలు నరకమె గతియౌ

  రిప్లయితొలగించండి