15, ఆగస్టు 2014, శుక్రవారం

పద్యరచన - 648

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. "జై జవాన్ ! జై కిసాన్ ! జై జై ఓ హిందూస్తాన్" !( Dr.Ponnada)
    'జై జవాన్'
    'జై కిసాన్'
    స్లోగనుగా
    మిగిలిందా ??.....
    'స్వారాజ్యపు'
    'జన్మ' హక్కు
    బ్రతక లేక
    పోతోందా??

    విప్లవాల
    వీర బాట
    'విశ్రుంఖల'
    మయ్యిందా ??

    త్యాగ ధనుల
    'కర్మ' ఫలం
    త్రుళ్ళి క్రుళ్ళి
    పోతోందా ??

    'స్వారాజ్యపు'
    వెలుతురంత
    'అంధకార'
    మవుతోందా ??

    'పంచ శీల'
    'ఫలితమంత'
    'నింగి 'కెగిరి
    పోయిందా ??

    ఏమ యింది
    'పౌరుషం' ?
    ఎందులో
    'నిమజ్జనం' ??

    నిస్తేజపు
    'దృక్కు ' లతో
    నీరసించిరా
    'జనం' ??

    నిదుర వదలి
    దులుపు 'మత్తు' !
    నీతో నే
    'ప్రభంజనం' !!

    'భరత' జాతి
    చరితంతా
    'మేధావులే'
    తరం తరం !!

    'నేతాజీ'
    గాంధీజీ
    నెహ్రుజీ
    శాస్త్రీజీ ,

    'భగస్సింగు'
    అల్లూరీ ,
    ప్రాకాశం
    టంగుటూరి ,

    సర్వేపల్లి ,
    ఇందిరమ్మ ,
    పీవీజీ
    వాజ్ పాయి ,

    'భరత ' జాతి
    చరితంతా
    మేధావులే
    తరం తరం !!

    స్వాతంత్ర్యపు
    వీర శౌరి,
    నీ తోడే
    'నిరంతరం' !!

    నిస్ప్రుహోద్దు
    నిరాశొద్దు
    నింగి నైన
    లేదు 'హద్దు' !!

    ఉత్సాహం
    ఉల్లాసం
    'వూపి'రింక !
    మరువొద్దు !!

    'భరత' మాత
    బిడ్డలకీ
    ప్రుధ్వంతా
    'విరి' పొద్దు !!

    భరత జాతి
    పౌరులకీ
    ఏ దిశనా
    లేదు హద్దు !!

    జై జవాన్ !
    జై కిసాన్ !
    జై జై ఓ హిందూస్తాన్ !!
    జై జై ఓ హిందూస్తాన్ !! జై జవాన్ జై కిసాన్ !!...................డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ.

    రిప్లయితొలగించండి
  2. రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి పద్యం....

    సాధించిన దేమున్నది?
    బాధించుట తప్ప వేరు ఫలితము గలదే?
    వేధింపుల స్వాతంత్ర్యము
    స్వాధీనము రాజకీయ చండాలురకున్!!

    రిప్లయితొలగించండి

  3. భావి భారత పౌరుడు పట్టె చేత
    మూడు రంగుల జండాను ముదము తోడ
    వచ్చె స్వాతత్ర్య మనిజెప్ప పంతులయ్య
    దక్కునా ఫలములు వారి తరముకైన

    రిప్లయితొలగించండి
  4. పొన్నాడ వారి గేయం సందేశాత్మకంగా చక్కగా సాగింది.

    రిప్లయితొలగించండి
  5. మన దేశపు స్వాతంత్ర్యము
    గొని తెచ్చిన యీ పతాక గుణ గానంబున్
    మననము జేయుటకై ర
    మ్మని జనుల పిలుచుచుండె నా బాలకుడున్.

    రిప్లయితొలగించండి
  6. మూడు రంగుల జెండాను ముచ్చటగను
    జేత బూనుచు బాలుడు చిత్రమందు
    కాన బడియెను జూడుము కమల !నీవు
    ఉట్టి పడుచుండె నతనిలో గట్టి భక్తి

    రిప్లయితొలగించండి
  7. జెండా! వందన మంచును
    పండుగ జేసుకొని మురిసి పాడిన యేమౌ?
    యండా దండల నిడి ముం
    దుండి ప్రగతి బాట నడుప తోడై పదరా!

    రిప్లయితొలగించండి
  8. డా. పొన్నాడ కృష్ణ సుబ్బారావు గారూ,
    మీ గేయకవిత చాలా బాగుంది. అభినందనలు.
    గేయం కనుక వ్యావహారిక పదాల ప్రయోగం దోషం కాదు, కాని అక్కడక్కడ కొన్ని శబ్దదోషాలున్నాయి. విశ్రుంఖల - విశృంఖల, నిస్ప్రుహ - నిస్పృహ.
    అలాగే మరొక విషయాన్ని దృష్టిలో పెట్టుకొనండి. ఇది కేవలం పద్యాల బ్లాగు. (మాత్రా)ఛందోబద్ధమైనా గేయాలకు అవకాశం లేదు. అందువల్ల మీరు పద్యాలను పంపే ప్రయత్నం చేయండి.
    *
    రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘తరముకైన’ అన్నారు. తరమునకైన సరియైన ప్రయోగం. అక్కడ ‘తరమునకును’ అనండి.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘నీవు + ఉట్టిపడు’ అని విసంధిగా వ్రాశారు. అక్కడ ‘చూడుము కనులఁ కమల/ యుట్టిపడు..’ అనండి.

    రిప్లయితొలగించండి
  9. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారు,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘యేమౌ/ నండయు దండయు నిడి....’ అనండి.

    రిప్లయితొలగించండి
  10. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    జెండా! వందన మంచును
    పండుగ జేసుకొని మురిసి పాడిన యేమౌ?
    నండయు దండయు నిడి ముం
    దుండి ప్రగతి బాటనడుప తోడై పదరా!

    రిప్లయితొలగించండి
  11. మువ్వన్నెల జెండా యై
    రివ్వున భరతాంబ కొంగు రెపరెప లాడన్
    రువ్వగ నవ్వుల రవ్వల
    పువ్వుల దవ్వుల పరిమళము గుబాళించెన్

    రిప్లయితొలగించండి
  12. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. చూపున చోద్యము గలిగిన
    రేపటి పౌరుని కరమున రెపరెపమనుచున్
    రేపును చూపు పతాకమ
    మాపును తాకంగ నీక మసలెడు విధమున్.


    రిప్లయితొలగించండి
  14. స్వేచ్ఛను పొందె భారతము స్వేచ్ఛను పొందిరి భారతీయులున్
    స్వేచ్ఛను పొందె గాలి యిట స్వేచ్ఛను పొందె సమస్త జీవులున్
    స్వేచ్ఛను పొందె నందు రహ చెప్పవె యేమది యో పతాకమా
    స్వేచ్ఛ లభించ దేమి మరి వీపున భారము నుండి నాకహో.

    రిప్లయితొలగించండి
  15. స్వాతంత్ర్యదినోత్సవమున
    నేతలకై జూచియలసి నీరస పడుచున్
    కేతనము బట్టి బాలుడు
    యాతన పడుచుండె గనుడు నాకలి తోడన్

    రిప్లయితొలగించండి
  16. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. మాస్టారూ! గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ నాలుగవ పాదం గణ లేదా యతి దోషం ఉన్నట్లున్నది

    రిప్లయితొలగించండి
  18. శైలజ గారూ తల్లి మనసు బిడ్డ ఆకలినే చూస్తుంది అంటారు అది నిజమే నేమో

    రిప్లయితొలగించండి
  19. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    నిజమే... నేను గమనించలేదు. ధన్యవాదాలు. ఆ పాదంలో గణదోషం ఉంది. ‘జనుల’ అన్నచోట ‘జనులను’ అంటే సరి.
    ‘ర/మ్మని జనులను పిలుచుచుండె నా బాలకుడున్.’ అంటే సరి!

    రిప్లయితొలగించండి