30, ఆగస్టు 2014, శనివారం

పద్యరచన - 662

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
“సినిమా పాటలు, నాడు-నేడు’

18 కామెంట్‌లు:

  1. వినసొంపుగ కర్ణ ములకు
    కన నింపుగ లోచనములకలనాడుండన్
    వినమ్రోత కఠోరంబై
    కన రోతగ నేటిపాట కలుషితమయ్యెన్

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింపనున్నవి !

    నాటి పాటలు శాశ్వత జనహృదయరంజకములు !
    నేటి పాటలగురించి చెప్ప నా నోట మాట లేదు(నాపరిఙ్ఞానము సరిపోదు)

    01)
    __________________________________

    సినిమా పాటలు-నాడు :
    చక్కనైన సాహిత్యము - జానువడెడి
    శ్రావ్యమైన స్వరములతో - చవులుపుట్ట
    జనుల హృదయంబు నిలచును - శాశ్వతముగ
    నాటి పాటల కిల సరి - సాటి లేదు !

    సినిమా పాటలు-నేడు :
    నేటి పాటలు తద్భిన్న - ఘోటకములు !
    నీటి మూటలు ! సాహిత్య - కాటకములు !
    ఓటిమాటల హృదయంపు - కూటకములు !
    నేటి పాటల కిక నోట - మాట లేదు !

    __________________________________
    జానువడు = స్పష్టమగు
    చవులుపుట్టు = రుచిపుట్టు(నోటికి కాదు హృదయమునకు)
    ఘోటకము = గుఱ్ఱము
    కాటకము = కరవు, దుర్భిక్షము.
    ఓటి = తూట్లుపడిన, శూన్యమైన, వట్టి.
    కూటకము = నాగలి

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మీరు సూచించిన సవరణ ‘నా డుండంగన్’ వల్ల గణదోషం ఏర్పడుతుంది.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. చక్కనైన సాహితి తోడ చలన చిత్ర
    విజయమునకుఁగారణమయ్యె వెనుకటివగు
    పాటలిప్పుడు వాయింపు పాళ్ళు పెరిగి
    సాహితిని కోలు పోయెను సత్వరముగ

    రిప్లయితొలగించండి
  5. అలతి యలతి మృదు పదముల
    పులకల రేపెడు మధురిమ మునుపటి పాటల్!
    అలగా జనంపు కేకల
    వెలితిఁ గొలుపు భావ రొదలు పిదపటి పాటల్!

    రిప్లయితొలగించండి
  6. సాహిత్యంపు సుగంధముల్ విరియగా; సంగీతమాధుర్యమా,
    యాహా ! యంచను రీతిగా కురియగా; నాటాడు వారెల్లరున్
    మోహమ్మించుక పెంచ నాట్యములలో- ముగ్ధుల్ జనుల్ నాడహో!
    బాహాటమ్ముగ పాడు పాటలనికన్ వ్రాయంగ నేడెవ్వరో?

    రిప్లయితొలగించండి
  7. సినిమా పాటలు నాటివి
    తనువును బులకించుచుండి తన్మయు జేయున్
    వినగను బాటలు నేటివి
    మనమును మఱి దొలిచి వేయు మాన్యుని నైనన్

    రిప్లయితొలగించండి
  8. "అందాల రాక్షసి" యనుచు చెప్పిరి నేఁడు
    ........"యందాలరాణివీవ"నిరి నాఁడు
    "ఖర్మ కాలినది నా గతిచూడ"నిరి నేఁడు
    ........ "విజయమ్ము మనదని" వింటిమపుడు
    పాశ్చాత్యపదజాల బంధురమ్ముగ నేఁడు
    ........ తేనెలొలుకు తెల్గు గానమపుడు
    ఢమఢమధ్వనుల పాటవము హెచ్చును నేఁడు
    ........కమనీయభావసంఘములు నాఁడు


    తరచి చూడ నిటుల తారతమ్యములుండు
    నక్క పోలికగునె నాకమునకు
    భవ్యపదగణముల పాటలఁ జేకూర్చి
    తెలుగు వెలుగఁ జేయ వలయు జగతిఁ.

    రిప్లయితొలగించండి
  9. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘భావరొదలు’ అనడం దుష్టసమాసమే. ‘భావపు రొద’ అనండి.
    *
    లక్ష్మీదేవి గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    సీసంలో ప్రశస్తంగా వివరించిన విధానం బాగున్నది. అభినందనలు.
    ‘చెప్పిరి యిప్పు/ డందాల...’, ‘గతి చూడు మన నేడు’ అనండి.

    రిప్లయితొలగించండి
  10. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    అలతి యలతి మృదు పదముల
    పులకల రేపెడు మధురిమ మునుపటి పాటల్!
    అలగాజనంపు కేకల
    వెలితిఁ గొలుపు భావపురొద పిదపటి పాటల్!

    రిప్లయితొలగించండి
  11. గురువుగారు, ధన్యవాదాలు.
    ఎదురుచూస్తూఉన్నా ఏం తప్పులున్నాయోనని.

    రిప్లయితొలగించండి
  12. చెరపక సాహిత్యమ్మును
    సరిజోడుగ నడచె నాటి సంగీతమ్మే
    అరుపులు విరుపులు మూల్గులు
    మరిదడదడలేగ నేటి సినిమా పాటల్

    రిప్లయితొలగించండి
  13. సీ . జయభేరి మోగించి” జయభేరి” రాగాలు
    జేజేలు పలికించె చిత్తమందు,
    శంకరాభరణంబు శంకరు నుతియించి
    అంకురార్పణ జేసె నాత్మ యందు ,
    బాటనీ పాటాలు మ్యాటనీ ఆటలూ
    ఉర్రూత లూగించె యువత నంత ,
    ఏనాటి కానాడు ఎన్నెన్నొ మార్పులూ
    సంగీత సాహిత్య సమత జూప,
    తే. గి . పాత పాటలు పలికించె భావములను
    కొత్త పాటలు కురిపించే కుంభ వృష్టి
    పాత కొత్తల కలయిక పాటి గాగ
    పాట సినిమాను నిలిపింది పసిమి తోడ
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    కొరప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీగురుభ్యోనమ:

    మనసు లూగునట్లు మందహాసములట్లు
    పరవశింప జేయు పాతపాట
    తనువు తూలునట్లు తైతక్కలాడించి
    చిత్తు జేయుచుండె క్రొత్తపాట

    రిప్లయితొలగించండి
  17. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి