25, ఆగస్టు 2014, సోమవారం

దత్తపది - 40 (దెస-నస-పస-వెస)

కవిమిత్రులారా!
దెస - నస - పస - వెస
పై పదాలను స్వార్థంలో కాకుండా ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
రామాయణార్థంలో పద్యం వ్రాయండి.

30 కామెంట్‌లు:

 1. తేట గీతి:
  వినదె సఖి కైక కోపము విడువమనిన
  వరమున సమస్తమును మార్చి వగలు కూర్చె
  కానలకు పంప సరికాదు ప్రాణ సుతుని
  మాతృమూర్తివె? సర్పమా! మాటలాడు!!

  రిప్లయితొలగించండి
 2. నా పూరణ.....

  (రావణునకు విభీషణుని హితబోధ)
  ఇ‘దె స’త్యముఁ జెప్పితి నీ
  వెదలో‘న స’మస్తకార్యహితమును గని దు
  ర్మదవృత్తిఁ బా‘ప స’రియగు
  నదనునఁ దలఁప‘వె స’యోధ్య నా రామునితోన్.

  రిప్లయితొలగించండి
 3. జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. మాస్టరు గారూ మీ పూరణ చాలా బాగుంది. జిగురు వారూ బలే...


  దెసలేక తిరుగె కపులును
  నస వెట్టిరి కొందరపుడు నామారుతియే
  పస జూపి లంక కరిగెను
  వెస సీతను జూచివచ్చి విభునికి దెలిపెన్.

  రిప్లయితొలగించండి
 5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  పూరణ బాగుంది కాని మీరు ఆ పదాలను అన్యార్థంలో ఉపయోగించాలన్న నియమాన్ని గమనించినట్టు లేదు.

  రిప్లయితొలగించండి
 6. స్వ అర్థం లో అనే విషయం సరిగా గమనించలేదు...క్షమించండి..మరొక పూరణను ప్రయత్నిస్తాను.

  రిప్లయితొలగించండి
 7. ఇదె సత్యంబిదె జీవన
  మిదె పావన సర్వశుభద మిదెతారకమై
  నది, జప సమాధి రాముని
  పదమే నా వెసనమనుచు పావనిబలికెన్

  రిప్లయితొలగించండి
 8. నీదె సరి లేని యందము, నిన్ను జూతు.
  మానసమునందు నీవుండు మర్మమేమొ
  తెలుప సమయమ్ము కై వేచితి, చిర కాల
  మిటులె కనుట వెసనమయ్యె నేమి చేతు?

  రిప్లయితొలగించండి

 9. నీవె సరివాడ వో రామ ! నిగ్రహింప
  తరలి రాగదె సరిజూడు తాటకదియె
  శరమును గని వదలుమన సమ్మతించి
  సాచి వదలెను లభియింప సద్గతులును.

  రిప్లయితొలగించండి
 10. వినుమిదె సఖి నావిన్నపమును
  కరుణ మాలిన సతినీకు ఘనతగాదె
  మానస మెంత బండయ్యె మగువ నీకు
  సుతు నడవికంప సరిగాదు చుప్ప నాతి!

  రిప్లయితొలగించండి
 11. మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
  మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
  నేమాని వారుంటే ఈ పద్యాన్ని చదివి ఎంత ఆనందించేవారో!
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ తాజా పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. ‘విను మిదె సఖి నేఁ జేసెడు విన్నపమును’ అనండి.

  రిప్లయితొలగించండి
 12. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  నా పూరణ నచ్చినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 13. శ్రీరామ వనవాస వార్త విని కైక :
  వనవాసము పొందె సవతి
  తనయుడికను తన సమీహిత వరము వలనన్
  తను పాలింప సలక్షణ
  మున భరతుడు జూడవె సతముగ కైక కనుల్

  రిప్లయితొలగించండి
 14. అన్ని దెసలను నరయగ నాంజనేయు
  డమ్మజాడనువెసదెల్పనర్హులైన
  బసలుగలుగు వానర ప్రముఖులనగ
  వారు, నసలేని వారలపంపెనార్య!

  రిప్లయితొలగించండి
 15. నెమానివారి నెనరు స
  మానమ్ముగ కలిగె నాకు మదిలొనార్యా !
  ఏమో శివనవలీలలు!
  మీమోదమె ధన్యత; గొనుమీ కైమోడ్పుల్

  రిప్లయితొలగించండి
 16. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది, కాని ఆ పదాలను అన్యార్థంలో పయోగించాలని నియమం.
  *
  యం.ఆర్. చంద్రమౌళి గారూ,
  మీ పద్యం నాకు ఆనందాన్ని కలిగించింది.

  రిప్లయితొలగించండి
 17. మల్లెల వారి పూరణలు

  విశ్వామిత్రుడు రామునితో ఈ విధంగా పలికెను
  "కనదె సభలోని వారికి కాంతి తోడ
  దీప సమకీర్తి వెల్గుల తేజరిల్లు
  రావె! సరగున నెత్తంగ రామ! నీవు
  చాన సద్విధి వరియించు చాప మెత్త"

  కాదె సమయంబయోధ్యను కాంతి వెలుగ
  దీప సమకీర్తి రాముండు తేజరిల్లు
  నీవె సవతికి కైకమ్మ! కావె దాసి
  మానసమునందు నెంచ, నె మంధరమ్మ

  రిప్లయితొలగించండి
 18. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  కాన సమీపమందు నది గట్టునతాపస రక్షకై తగన్
  జానకిరామలక్ష్మణులుసౌఖ్యము నీయగవింతగా జన
  స్థానపు టి౦ద్ర జాలమిదెసన్నిధి జేరెను గంతులేయుచున్
  రాణగ మాయలేడి.వెసలమ్మున వ౦డెద సీత తెమ్మనెన్

  రిప్లయితొలగించండి
 19. గురువు గారూ మీ పూరణ చాలా బాగుంది.
  శ్రీ జిగురు సత్యనారాయణ గారూ బలే...
  శ్రీ మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ బలే.. బలే, శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారూ చక్కని పూరణ,
  శ్రీ శైలజ గారూ చక్కని పూరణ,
  శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణ గారూ చక్కని పూరణ, శ్రీ సుబ్బారావు గారూ చక్కని పూరణ,
  శ్రీ యం.ఆర్. చంద్రమౌళి గారూ చక్కని పూరణ,
  శ్రీ తిమ్మాజి రావు గారూ చక్కని పూరణ .

  మీరందరు నన్ను పద్యములు వ్రాయునట్లు ధీవించ ప్రార్థన !

  రిప్లయితొలగించండి
 20. వినుమిదె సత్యము రావణ
  యినకులమణి కతన సర్వ మీ సృష్టి యగున్
  నిను కరుణింప సమర్థుడు
  నని నుడివె సయోధ్య కొరకు ననిలుజు డంతన్.

  రిప్లయితొలగించండి
 21. అయోధ్యా ప్రజల మనోగతము

  కనదె సతికైక తన భర్త కాంక్ష మదిన
  తనసహోదరు రాజ్యమున్ గొని తనుపరి
  పాలన సలుప సమ్మతిన్ భరతు డిడునె?
  తగవె సతితోడ రాఘవున్ తరుమ వనికి

  రిప్లయితొలగించండి
 22. రావణుడు వెసగొని పోయె రామ నన్ను
  నాకు దెస నీవె కాపాడ నలిన నయన
  నిధన సమయము వానికి నిశ్చయముగ
  దాపురించెను జంప సత్వరము రమ్ము .

  రిప్లయితొలగించండి
 23. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కందుల వరప్రసాద్ గారూ,
  ధన్యవాదాలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  పూరణ బాగుంది. కాని వెస, దెస శబ్దాలను స్వార్థంలో ప్రయోగించారు.

  రిప్లయితొలగించండి
 24. జీవనమిదె సర్వాత్మక!
  పావన సద్గుణ విరాజ పాదము గడుగన్
  భావింప సమ్మతించుము
  దీవెనలవె సదనమయ్య తీరము జేర్చన్!

  రిప్లయితొలగించండి
 25. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమస్కారములు

  ౧. శ్రీరాముఁడు శివధనువుం ద్రుంచిన తఱి నిద్దఱు స్త్రీలు సంభాషించుకొను సందర్భము...

  ప్రజకు సంతోష మిదె సత్వరముగఁ గూర్చె;
  శంకరుని విల్లుఁ ద్రుంచిన సత్వఘనుఁడు
  జానకిన్ వెఱఁగుపఱుప సరభసముగఁ
  గరము గ్రహియించె నటఁజూవె సరసిజాక్షి!

  ౨. రావణుని దురాగతము...

  కాదె సకలమహితము? లంకాధిపుండు
  భూజ నసమంజసమ్ముగా మ్రుచ్చిలించి
  తన యశోకవనమ్మున సదనుజయుత
  బంధితనుఁ జేసెఁ జూవె సద్బ్రహ్మకులుఁడు!

  రిప్లయితొలగించండి
 27. శ్రీగురుభ్యోనమ:

  కరుణ జూపిరి తాపస గణములెల్ల
  నిదె సముద్రము కావల నదియ లంక
  నీవె సరెయోధుడవు దాట నిజము హనుమ
  ధ్యాన మొనరించి రాముని మానసమున

  లంకజేరుము జానకి రక్ష నీకు
  సీత జాడను దెల్పుము శీఘ్రముగను
  వానరుల ఖ్యాతి నిల్పుము వాయుపుత్ర
  యనుచు జాంబవంతుడు బల్కె నాదరముగ

  రిప్లయితొలగించండి
 28. చిన్న సవరణ తో...

  నీవె సరివాడ వో రామ ! నిగ్రహింప
  తరలి రాగదె సరిజూడు తాటకదియె
  శరమును గని వదలుమన సమ్మతించి
  చంపె దానిని లభియింప సద్గతులును.

  రిప్లయితొలగించండి
 29. నా పద్యం శ్రీపతి శాస్త్రి గారి పద్యం లో పదాలు అటూ ఇటూ మార్చి నట్టు ఉందండీ:

  దె సముద్రము, గని సదమదము గాక
  మానసమునందు భయమును మాని దాట
  వలయు, భూపసతినిగాంచ వలయు హనుమ!
  వినుము నీవె సమర్ధుడవునిజమెఱుగ.

  బడికి ప్రతిదినమూ రావాలని ఉన్నా 'అమావాస్య'కూ, పౌర్ణమికి వస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 30. గుండు మధుసూదన్ గారూ,
  మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ (కొసరు పద్యంతో సహా) బాగున్నది. అభినందనలు.
  *
  ఊకదంపుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మీరు పక్షానికోసారి వ్రాసినా అది పక్షమంతా గుర్తుంచుకొనే ప్రత్యేకత గల పద్యం అవుతుంది.

  రిప్లయితొలగించండి