22, ఆగస్టు 2014, శుక్రవారం

రేఫ రహిత శివధనుర్భంగము - 2

రేఫ రహిత శివధనుర్భంగము
తాడిగడప శ్యామల రావు

ద్వితీయ భాగము.

అన మెచ్చుకొని మహాముని గాధిసుతుడు
జననాథ యెనలేని ఘనచాప మిపుడు
గనకుండ మనసాగ దనుమాట నిజము
జలజాక్షు నకు దాని సత్వంబు జూడ
సభజూడ తన దైన సత్వంబు జూప
దానిని తెప్పింప దగునయ్య నీకు
నా విని జనకుడా నందంబు చెలగ
దైవదత్తంబైన నావింటి నంత
సభకు తెండని బంపె సమధిక బలుల
ఎనిమిది చుట్టుల పెనుబండి మీద
నిటలాక్షు చాపంబు నెలకొని యున్న
మణిగణాలంకృతమంజూష నపుడు
వేసట నా యైదు వేలమందియును
కొనితెచ్చి నిలుపగా జనకుని యెదుట
కనుగొని యొడయడు మునిమండనునకు
అద్దాని జూపించి అఖిల లోకేశు
పెద్ద చాపం బిదె యిద్దాని నెత్త
మానవనాథుల మాట యెందులకు
యక్షదనుజనాగు లక్షీణబలులు
దేవముఖ్యులకైన దీనిని బూని
వంచి గుణంబును బంధించ నలవె
యుత్కృష్టమగు వింటి నో మహాభాగ
గాధేయ మౌనిపుంగవ యింక దీని
తమ శిష్యులకు జూప దగునయ్య యనగ
కలువకన్నులవాడ ఘననీలవపుష
జలజాప్తఘనకులతిలక బాలేందు
మౌళి దాల్చిన యట్టి మహితచాపంబు
కన్నులపండువుగా కనవయ్య
యని ముని వేడుక నాన తీయగను
వినయాతిశయమున మునినాథునకును
జననాథునకును వందనములు చేసి
గజగమనంబున ఘనమైన విల్లు
శోభించుచుండు మంజూషను గదిసి
నడచిసవ్యంబుగా గడు భక్తి జూపి
ఓ శివచాపమా యుధ్ధతు డగుచు
వచ్చెను వీడని భావింపవలదు
శివుడన్న నాకుండు చిత్తంబు నందు
నిశ్చలంబై యుండు నిజమైన భక్తి
భవునదై యొప్పెడు బాణాసనంబు
పావనములయందు పావనమనుచు
భావించి వచ్చితి భవదీయమైన
తేజంబు నీక్షించ దీనికి నీవు
కోపించకుండగ గొంకెంచకుండ
నా యందు దయచూపి నన్ను నీ చెలిమి
గొననిమ్ము నా చేత గొననిమ్ము నిన్ను
నని చాల వినుతించి వినయంబు వెలయ
గడియలు విడిపించి ఘనమైన పెట్టె
తలుపు నల్లన దీసి తా గాంచెనపుడు
దివ్యశోభల నీను దేవుని విల్లు
ఠీవి నెగడు దేవదేవుని విల్లు
కని దాని ఘనశోభ కమలాక్షు డపుడు
మునిపతి జనపతు లను గని పలికె
కైలాసపతివింటి గంటి మీ వలన
దయతోడ దీనిని తాకు భాగ్యంబు
అనుమతించుడు ధన్యమగు నాదు జన్మ
మా పైన మీ దైన యానతి యున్న
వాంఛింతు గుణము నవశ్యంబు దొడుగ
బాణంబు సంధించు భావంబు గలుగు
పెద్దలు మీ జెప్పు విధము చేసెదను
మీ‌ పాదముల సాక్షి మునిగణనాథ
మీ పాదముల సాక్షి మిధిలాధినాథ
యనవిని మునిపతి జనపతు లపుడు
మిక్కిలి ముదమంది చక్కని పలుకు
పలికితి వయ్య నీ తలచిన యట్లు
శివుని చాపంబును చేబూన వయ్య
చక్కగా గుణమును సంధించ వయ్య
జయమస్తు శుభమస్తు జలజాక్ష యనగ
ధనువును వెస డాసి దాని మధ్యమున
జనపతియగు దశస్యందను పెద్ద
కొడుకు చేయిడి పైకి గొబ్బున లేపె
వేల మందికి కదుప వీలు కానట్టి
నీలగళుని విల్లు లీలగా నెత్తె
నెత్తుటయే యేమి ఈశాను దివ్య
చాపంబు గుణమున సంధించె వేగ
శింజిని నాపైన చెవిదాక లాగి
దినపతికులమౌళి కనువిందు చేయ
నంతలో వింతగా నంతకాంతకుని
పెనువిల్లు నడిమికి ఫెళ్ళున తునిసె
భూకంపమనునట్లు పుట్టిన ధ్వనికి
విలయమేఘధ్వానవిధమైన ధ్వనికి
మునిపుంగవుండన జనపతి యనగ
దినమణికులమణిదీపకు లనగ
చక్కగ నిలువంగ సభనున్న జనులు
వివశులై తక్షణం బవనిపై బడగ
తెలివిడి జనులకు గలిగెడి దాక
తాళి నృపాలుండు తాపసిం డాసి
ముకుళిత హస్తుడై మోదం బెసంగ
పలుకాడ దొడగెను పదిమంది వినగ
భగవానుడా నాదు భాగ్యంబు పండె
ఈ నాటి కొక జోదు నీశాను వింటి
నెత్తగా జాలిన యెక్కటి మగని
కన్నులపండువుగా చూడ గంటి
ఇనవంశమున నెంత ఘనుడుదయించె
ముక్కంటి పెనువిల్లు  తుక్కాయె నిపుడు
శివుని విల్లెత్త నా శివునకే తగును
శివుడు గా కున్న కేశవునకే తగును
కలనైన నూహింప గా దన్యు డొకడు
లీలగా కొని తన కేల నద్దాని
బేలపోవగ జేసె బెండు విధాన
నన్నట్టి దద్భుత మాయె మహాత్మ
ఇనకులపావను నెలమి సీతమ్మ
తనపతిగా గొని ధన్యయై వెలుగు
జనకుల కులయశంబును చాల నెగయు
ఘనబలశాలికై జనకుని బిడ్డ
వధువని పలికితి పంతంబు నెగ్గె
తమ యాన యగు నేని తద్దయు వేడ్క
నా యయోధ్యాపతి కతివేగముగను
సంగతి తెలుపగా సచివుల నిపుడు
పంపువాడను వివాహంపు వైభవము
నకు బిల్వ నంపెద నా పట్టణమున
అనవిని గాధేయు డమిత సంతుష్టు
డై మిధిలాధీశు నటు చేయ బంచె.

--oOo--

11 కామెంట్‌లు:

  1. > నెత్తుటయే కాదు ఈశాను దివ్య
    ఇక్కడ ఉత్వసంథి నిత్యం కాబట్టి, మార్పు అవశ్యం చేయాలి. అందుచేత

    నెత్తుటయే యేమి ఈశాను దివ్య

    అని మార్చవచ్చును. మిత్రులు మరింత మంచి మార్పును సూచిస్తారేమో చూడాలి.

    రిప్లయితొలగించండి
  2. మరొక స్ఖాలిత్యం కనబడింది.

    జనకుల కులయశంబును చాల పెఱుగు

    ఇక్కడ సకటరేఫం వచ్చింది కాబట్టి మార్చకతప్పదు. అందుచేత

    జనకుల కులయశంబును చాల నెగయు

    అందామా? మిత్రులు మరింత మంచి సూచన చేస్తారేమో చూడాలి.

    రిప్లయితొలగించండి
  3. చిన్న సూచన. ప్రథమభాగము అని లోగడ వ్రాసాము కాబట్టి ఈ‌సారి ద్వితీయభాగము అంటే మరింత సబబుగా ఉంటుందనుకుంటాను.

    రిప్లయితొలగించండి

  4. చిరజీవి శ్యామలరావుకిఆశీస్సులు
    విఫలత్వమ౦దిరి వేలభూపతులు యన్న పాదములో
    రేఫముంది సవరించగలరు

    రిప్లయితొలగించండి
  5. మూడు రేఫలు కలిపించాయండీ ఈ భాగంలో

    1. జనకుల కులయశంబును చాల పెఱుగు
    2. విఫలత్వమందిరి వేలభూపతులు
    3. శింజిని నటు గూర్చి చెవిదాక లాగి

    వీటిని ఈ క్రిందివిధంగా మార్చుతున్నాను.

    1. జనకుల కులయశంబును చాల నెగయు
    2. మానవనాథుల మాట యెందులకు
    3. శింజిని నా పైన చెవిదాక లాగి

    రిప్లయితొలగించండి
  6. చక్కనిసవరణలుగావించి ప్రశంశనీయంగా కృత కృత్యు లైనారు జగమంతా "రా"మమయము రామం నిశాచర
    వినాశ కరం నమామి

    రిప్లయితొలగించండి
  7. మనోహరంగా సాగిందండీ శ్యామలీయం గారూ మీ రేఫరహిత ద్విపద కవిత్వం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. మిత్రులు శ్యామలరావుగారికి,

    మీ మెయిలు చూచితిని. సంతోషము. నిన్న కొన్ని రేఫసహిత పదములు నా దృష్టికి వచ్చినవి. నేఁడవి సవరింపఁబడినవి. అయితే మఱికొన్ని యంశములు తమ దృష్టికి తెచ్చుటకై యీ వ్యాఖ్య వ్రాయుచున్నాను. ఇవి యల్పజ్ఞుఁడనగు నాకుఁ గలిగిన సందేహములు మాత్రమే గాని, మిమ్ము కించపఱచుటకుఁ గావని తలంచునది.

    ౧. "....బాలేందు
    మౌళి దాల్చిన..." యనుచోట "మౌళి తాల్చిన"యనిన బాగుండెడిది. "మౌళిన్+తాల్చిన"యని పొరపడునవకాశమున్నది.

    ౨. "మీ పాదముల సాక్షి మునిగణనాథ"యను పాదమందు యతిభంగమైనది.

    ౩. "వంచి గుణంబును బంధించ నలవె"యనుచోట "అలవి+ఎ"యనియా, "అలవు+ఎ"యనియా, యేది మీ భావన?

    ౪. ఏ పాదమున కాపాదము విఱుగవలెనని మీరు నన్నాక్షేపించితిరి, మీరు మాత్ర మిట్లు ప్రయోగించితిరి...
    "......వైభవము
    నకు బిల్వ......"

    "......సంతుష్టు
    డై............"

    ౫. ఇందు మీ రెండవవ్యాఖ్యలో..."శకటరేఫ" యనుటకు బదులు "సకటరేఫ"యని వ్రాసితిరి. గమనించఁగలరు.

    ఇట్లు
    భవదీయుఁడు
    గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
  9. శ్రీగుండువారికి నేను మెయిల్‌లో పంపిన సమాధానం:
    మిత్రులు మధుసూదనులవారికి,

    కొన్ని రేఫలు అసంకల్పితంగా పడిన మాట వాస్తవం. వాటిని నేనే పరిహరించి పంపవలసిందన్నదీ అంత కన్నా నిజం. ఐతే, ఈ మధ్య కాలంలో ఉద్యోగబాధ్యతలలో రాత్రులు కూదా ప్రొద్దుపోయిన పిదప సమావేశాలు జరుగుతూ తీరిక దొరకటం‌ కష్టమైపోవటంతో ఇబ్బందిగా ఉండటమూ, అప్పటికే బాగా ఆలస్యం కావటమూ కారణంగా సరిజూడటంలో పొరబడ్డం జరిగింది. అయినా పొరపాటు నాదే. క్షంతవ్యుడను. అదీకాక మన వ్రాతలో మనకే తిన్నగా తప్పులు దొఱకటం దుర్లభంగా ఉండటం మీకు తెలిసిందే అనుకుంటాను.

    మీరు ఉటంకించిన దోషాలు వెంటనే సరిచేస్తాను. ఎత్తి చూపినందుకు మిక్కిలి కృతజ్ఞుడను.

    డేశిపద్యాల్లో పాదోల్లంఘనం అంతకళగా ఉండదన్న మాట మిమ్మల్ని అక్షేపించటానికి చెప్పినది కాదు. పెద్దకవులూ దాన్ని యధేఛ్ఛగా ఉల్లంఘించారని చెప్పటమూ వారిని ఆక్షేపించటానికి కాదు. ఇలాంటి విషయాలు మననం చేసుకుంటూ ఉండటమూ పరస్పరం గుర్తుచేసుకుంటూ ఉండటమూ అన్నవి ఔత్సాహిక కవులకు వారి వారి కవిత్వపువాసిని పెంచుకుందుకు దోహదం చెస్తుందన్న ఊహతోనే ఈ విషయం ప్రస్తావించటం జరిగింది కాని తదన్యం కాదు. ఈ పాదోల్లంఘనం అన్నది అరుదుగా రావటం అన్నది అంతగా ఇబ్బంది కాదు కాని దానికి తరచుదనం పెఱుగకుండా మనం చూసుకుంటూ ఉండటం మంచిదన్నది నా ఉద్దేశం. మీరు నాతో ఏకీభవించాలని లేదు.

    నేను వాడుతున్నది లినక్స్. ఇక్కడ తెలుగువ్రాయటానికి వాడుతున్న ఉపకరణం phonoticగా వ్రాయటానికి సహయపడేది. బహుశః హెచ్చు భాగం అలాంటి ఉపకరణాలే కావచ్చును. ' స ' ' శ ' ల మధ్య బేధం shift key. ఇది పొరపాటుగా నొక్కినా మానినా అక్షరం మారిపోతుంది. ఉదయాస్తమానం తెలుగులో వ్రాస్తున్నా కొన్నిసార్లు ఇలాంతి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. నా దగ్గర విండోస్ కూడా ఉంది కాని అక్కడా ఇలాంటి ఇబ్బందులే. Typoలు పడిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు.

    మీకు వీలై నప్పుడు నా యీ అభ్యాసకవిత్వాల్లోని తప్పొప్పులను పరామర్శిస్తూ సహాయపడగలరని ఆశిస్తున్నాను. నా శైలి కొంచెం లలితంగా ఉంటుందనీ‌ కావాలన్నా దీర్ఘక్లిష్టసమాసభూయిష్ఠంగా (తనవలె) వ్రాయలేననీ మా మామయ్యగారు హాస్యంగా అంటూ ఉంటారు. కావచ్చును. అలాంటి సమాసాలతో వ్రాసే శక్తీ ఆసక్తీ కూడా నాకు లేవనే నేను అనుకుంటున్నాను. సాధ్యమైనంత వరకూ జనబాహుళ్యంలో వాడుకలో ఉన్న పదాలతోనే వ్రాయాలన్నది నా ఉద్దేశం. ఎంతవరకూ లక్షణంగా వ్రాయగలుగుతున్నాననేది పెద్దలూ మీవంటి లక్షణవేత్తలైన కవులూ చెప్పవలసిందే మరి.

    ----
    దీని వెంబడి పంపిన మరొక లేఖ:
    మీరు వీలు చూచుకొని రేఫరహిత శివధనుర్భంగ వృత్తాంతము (ప్రథమభాగము) కూడ పరిశీలించి మీ సూచనలు పంపవలసినదిగా విన్నపం.

    రిప్లయితొలగించండి
  10. 1. .............బాలేందు
    మౌళి దాల్చిన యట్టి మహితచాపంబు

    one letter in the above changes to

    ..............బాలేందు
    మౌళి తాల్చిన యట్టి మహితచాపంబు

    2. మీ‌ పాదముల సాక్షి మునిగణనాథ

    Changes to

    మీ‌ పాదముల సాక్షి తాపసనాథ

    శ్రీగుండువారు సూచించిన రెండు పాదోల్లంఘనాలూ ప్రస్తుతానికి మార్చటం లేదు. నూటికి పైబడి యున్న ఈ‌ మంజరీపాదాల్లో‌ కేవలం రెండుచోట్ల మాత్రం ఇలా జరగటం అక్షేపణీయం కాదనే భావిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  11. ఈ రోజున ఈ కృతిని నా శ్యామలీయం బ్లాగులో కొంత వివరణతో రేఫరహిత శివధనుర్భంగము అనే పేరున ఒక టపాగా ప్రకటించటం‌ జరిగింది. మిత్రులు పరిశీలించగలరు.

    రిప్లయితొలగించండి