5, ఆగస్టు 2014, మంగళవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 45

రామాయణము-
సీ.     మించి చంద్రుం డాక్ర(మించె ధరణిపాళి;
        నంచితరాజసూ)నాస్త్ర మంద
    పవనులు గొనిరి దంపతులచే నపజ(య
        ము; మఱి కువలయహితముగ ధర్మ)
    మూర్తులగు సురలు ముదమున సుధఁ గ్రోలఁ
        గాఁ బండువెన్నెలల్ గాచె; సంత
    సపు ధ్వనులు చకోర(సంతతి ధృతి సల్పె;
        సద్రుచి హరి శిశు)జనతతిముఖ
గీ.     సకలనరచిత్తతా(పాలు జదిపెఁ; జక్ర
    పాటవము న)డఁచెన్; వంతపాలయి వన
    జాళి గన్నుల మూసెఁ; దేంట్లందు చిక్కె;
    సంద్ర ముప్పొంగెఁ; గఱఁగెను జంద్రశిలలు. (౬౦)

భారతము-
ఆ.     మించె ధరణిపాళి, నంచిత రాజసూ
    యము మఱి కువలయహితముగ ధర్మ
    సంతతి ధృతిసల్పె; సద్రుచి హరి శిశు
    పాలుఁ జదిపెఁ జక్రపాటవమున. (౬౦)

టీక- (రా) ధరణి = భూమి; పాళి = ప్రదేశము; (భా) ధరణిప = రాజుల; ఆళి = గుంపు; సూనాస్త్ర = మన్మథుఁడు; కువలయ = (రా) కలువలకు, (భా) ప్రపంచమునకు; ధర్మ = (భా) యముని; సంతతి = (రా) గుంపు, (భా) సంతానము; హరి = (రా) చంద్రుఁడు, (భా) కృష్ణుఁడు; చక్ర = (రా) చక్రవాకముల, (భా) సుదర్శనచక్రముయొక్క; పవన = వాయువు; కన్నులమూసె = ముడిచెను; తేంట్లు = తుమ్మెదలు.
రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి