21, ఆగస్టు 2014, గురువారం

సమస్యా పూరణం – 1505 (శేషశయను పూజ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శేషశయను పూజ సేయరాదు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

35 కామెంట్‌లు:

 1. యోగులకును పరమ యోగము నిచ్చెడి
  శేష శయను పూజ, సేయ రాదు
  యనుట పాడి గాదు! యవని జనులకది
  పరమ పుణ్య ప్రదము పండితార్య

  రిప్లయితొలగించండి
 2. ముక్తి గలుగును కడు భక్తితో నొనరించ
  శేషశయను పూజ, సేయ రాదు
  ముఱికి బుద్ధి తోడ బూటకమౌ పూజ
  పరమ పదము చేరు వరము గొనగ

  రిప్లయితొలగించండి
 3. పాము పడక వాడు పన్నగ ధరుడును
  ఒకరి మదిని యొకరు నొదిగియుండు
  శివుని నింద జేసి శ్రీహరి చాలంఛు
  శేషశయను పూజ సేయ రాదు.

  రిప్లయితొలగించండి
 4. చేయ దగును నరులు సిరికి హరికి పాన్పు
  శేషశయను పూజ; సేయరాదు
  ధనము గుంజు యతుల దైవము లని యెంచి
  పాద సేవ లెపుడు భ్రాంతి జెంది

  రిప్లయితొలగించండి

 5. శేషుడన్నయహవి జేతుడు రంగడు
  శేషశయను పూచ సేయ శుభము
  అహమె పడకయైనహంకారియగు దుష్ట
  శేషశయను పూజ సేయ రాదు.

  రిప్లయితొలగించండి
 6. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  తిమ్మాజీ రావు పూరణ
  స్నానమాచరించి సంధ్య నుపాసించి
  ఘంట రవమొనర్చి కలశపూజ
  పిదప విఘ్న రాజు విధిగ నర్చించక
  శేష శయను పూజసేయరాదు
  కె.ఈశ్వరప్పగారిపూరణ
  విఘ్న రాజు పూజ విజయమ్ము చేకూర్చు
  సంధ్య వందనమ్ము సాగు పిదప
  సత్య దేవు వ్రతము సఫలత. ముందుగా
  శేష శయను పూజసేయరాదు

  రిప్లయితొలగించండి
 7. మల్లెల వారి పూరణలు

  నిద్ర నుండు నతడు, నిపుడు వినడుగా
  మనదు మొఱను, నిద్ర మత్తు నుండ
  కాన, మనము నతని కార్తీక మౌదాక,
  శేష శయను పూజ సేయ రాదు

  కనక కస్యపుండు కన్న బిడ్డకు తెల్పె
  "శేష శయను పూజ సేయ రాదు"
  ననుచు, నయిన వాడు నతనినే కొల్చుచున్
  శేష శయను పూజ సేయ విడడు

  శరణు వేడి నంత చక్కగా రక్షించు
  నెచటి కైన వచ్చి, యింపు గాను
  శేష శయను పూజ సేయ, రాదుగ కీడు
  ఆర్తి వినిన విష్ణు, డతని నమ్మ

  ఇభము బట్ట మకరి, యెంతయో పోరినన్
  విడువ కతని లావు వీడ జేసె
  శేష శయను పూజ సేయ, రాదు కటము
  శరణు వేడి నంత చనియు గాచె

  విఘ్న నాయకునికి, విష్ణు పూజకు మున్నె
  పూజ సేయ వలయు పొలుపు గాను,
  విఘ్న వారణముకు విడిచి వాని కిడక
  శేష శయను పూజ సేయ రాదు

  తెల్ల పూల మనము తేటైన మనసుతో
  విష్ణు పూజ సేయ పెరుగు కీర్తి
  నలుపు పూల పూజ నందిడు తమసమే
  శేష శయను పూజ సేయ రాదు

  రిప్లయితొలగించండి
 8. గురువులు శంకరయ్య గారు, కవి వర్యులకు వందనాలు.
  .
  హరియు హరుడు వేరటంచు దలచువారు,
  భవుడె సర్వమనెడి భక్తవరులు,
  శివుని గూర్చి పూజ చేయువారెపుడైన
  శేష శయను పూజ చేయ రాదు.

  రిప్లయితొలగించండి
 9. చిత్త శుధ్ధి తోడ శ్రీపతిని గొలిచి
  విరుల నొసగి గొలువ సిరుల నిడును
  నీమ నిష్ఠ లేక నిలువ పూలను దెచ్చి
  శేష శయను బూజ సేయ రాదు

  రిప్లయితొలగించండి
 10. శేషశయను పూజ సేయరాదని చెప్పు
  వారలెవరు లేరు వాస్తవముగ
  నాస్తి కులును దప్ప, నారాయణుని సేవ
  భక్తి తోడ జేయు వారు లెస్స.

  రిప్లయితొలగించండి
 11. చంద్రమౌళి సూర్యనారాయణ గారు మీరు 27.07.14 వ్రాసిన పద్యములలో గూడా "పకి" "మకి" యతి వేసారు. నాప్రశ్నకు గురువు గారిచ్చిన సమాధానం కూడా పంపుచున్నాను.
  1.భార్య విలువ తెలిసి మసలు కొమ్ము
  2.భర్తమనసు తెలిసి మసలుకొను సుపరి
  పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. ప, ఫ, బ, భ, వ లకు యతిమైత్రి చెల్లుతుంది గదా. "మ" తో యతి మైత్రి ఉంటుందా.దయ చేసి తెలియ జేయండి.
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ప,ఫ,బ,భ లతో మకారంతో యతి చెల్లదు. కాని అనుస్వారపూర్వకమైనప్పుడు అంటే ంప,ంఫ, ంబ, ంభ లతో మకారానికి యతి చెల్లుతుంది.

  రిప్లయితొలగించండి
 12. ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘రాదు + అనుట, కాదు + అవని’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సేయరా ద/టంచు పలుక నగునె యవని...’ అనండి.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు. కాని మొదటి రెండు పాదాలను ఇలా సవరిస్తే బాగుంటుందని నా సలహా... ‘పాము పడక వాడు పన్నగభూషణు/డొకరి మదిని యొక్క రొదిగియుంద్రు’
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటిపాదం అర్థం కాలేదు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కె. ఈశ్వరప్ప గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ ఆరు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణలో ‘రాద/ టంచు’ అనండి.
  ఐదవ పూరణలో ‘వారణముకు’ అన్నారు. వ్యాకరణరీత్యా ‘వారణనమునకు’ అనాలి కదా.
  *
  జయసారథి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి వారూ,
  సూర్యనారాయణ గారి వని మీరు చెప్పిన పాదాలలో యతిదోషం ఉంది. సందేహం లేదు.

  రిప్లయితొలగించండి
 13. కోటి క్రూర కర్మ కోరి చేసిన గాని
  శేష శయను పూజ సేయ; రాదు
  పాప వితతి ప్రజకు, పరదైవ మగుటచే
  యోగి జనుల హృదిని సాగు గాన(యోగి హృద్ధ్యాన గమ్యం)

  పరమ పాపు లైన నరక కంసులకును
  శేష శయను పూజ సేయ రాదు
  భక్తి నిండి నట్టి ప్రహ్లాద బాలుడే
  విష్ణు లీల లెరిగి వెలిగె భువిని

  రిప్లయితొలగించండి
 14. నిన్నటి దత్తపది:
  గద్యము కైలాస శివుడు!
  పద్యము సురగంగ వలెను పారగ శిగలో!
  హృద్యమ్మౌ శివ రూపము
  మద్యము కాదది తెనుగున మాధుర్య సుదౌ!

  నేటి పూరణ:
  భక్త ప్రహ్లాదుని పరంగా...
  మేలు మేలనుచును మేను మరచి నీవు
  శేష శయను పూజ సేయ రాదు
  మనకు శత్రువతడు మరువు మనుచు
  దానవేంద్రు డనియె తనయుఁ జూచి!

  రిప్లయితొలగించండి
 15. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘కోటి’ అన్నప్పుడు ‘కర్మలు’ అని బహువచనరూపం వ్రాయవలసి ఉంది. కనుక అక్కడ ‘క్రూరకర్మకోటి...’ అనండి.
  *
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవ పూరణలో ‘మరువు మనుచు’ అన్నచోట గణదోషం... ‘మరచిపొ మ్మనుచును’ అనండి.

  రిప్లయితొలగించండి
 16. Annapareddy satyanarayana reddy గారూ ధన్యవాదములు. మీ పరిశీలన వలన నా భ్రమ తొలగింది. ఈ రోజు మళ్ళీ యతి నియమములు చదివాను. ఇంతకుముందు చాలా చోట్ల ఆ యతిమైత్రి చేశాను. అవి యన్నీ దోషములే . ఇలాంటి పరిశీలనలో వచ్చిన విషయములు మిత్రులు నిస్సందేహముగా తెలియ చేస్తే బాగుంటుంది. మీకు గురువుగారికి మరొక సారి ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 17. ఆ వె అక్రమాల తోడ ఆర్జించి మెండుగా
  శేష పాన్పు నొకటి సేసినాడు
  భయము భక్తి లేక శయనించి యున్నట్టి
  శేష శయను పూజ సేయ రాదు
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 18. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  శంకరాభరణం మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ పూరణ సలక్షణంగా, దోషరహితంగా బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. >ప,ఫ,బ,భ లతో మకారంతో యతి చెల్లదు. కాని అనుస్వారపూర్వకమైనప్పుడు అంటే ంప,ంఫ, ంబ, ంభ లతో మకారానికి యతి చెల్లుతుంది.

  పదాద్యక్షరం మకారం ఐనప్పుడు, యతిస్థానంలో గంప లోని రెండవ అక్షరంఅని వచ్చిందనుకోండి, పై నియమంసుళువు ప్రకారం యతిచెల్లించవచ్చును. ఎందుకంటే గంప అన్నది గమ్ప అని కూడా వ్రాయవచ్చును కదా! అందుచేత

  మేదినీ వలయంబు గంపించె నపుడు

  అని ఉందనుకోండి ఇక్కడ యతి బాగానే ఉన్నట్లే. ఎందుకంటే దీనినే

  మేదినీ వలయంబు గమ్పించె నపుడు

  అని చూస్తే ఇబ్బంది లేదు కదా.

  రిప్లయితొలగించండి
 20. శ్రీ శంకరయ్యగారు,
  కొద్దిగా వివరణ ఇవ్వకపోవడమూ, ఛందోసంధిగ్దంలో అర్థపాటవాన్ని సమర్థంగా సాధించకపోవడం, నా పొరబాటు. క్షంతవ్యుడను.
  వివరణ: "సర్పము, అహంకార-రాగ-ద్వేషాలకు ప్రతిరూపము. "శేషుడు అన్న అహవిజేతుడు", అహముని లొంగదీసిదానిపై శయనించినవాడు. రంగని పూజ శుభము. అహము అనె పడకలోనె శయనిస్తూ తన అహంకారపుపరుపులో పడియున్న"శేషశయను" (లౌకిగ అహంపూరిత నాయకుల) పూజ వలదు. "

  రిప్లయితొలగించండి
 21. యం.ఆర్. చంద్రమౌళి గారూ,
  మీ వివరణతో నా సందేహం తొలగిపోయింది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 22. మల్లెల వారి మొదటిపూరణంలో

  ప్రథమపంక్తి "నిపుడు వినడుగా" నిప్పుడు వినడుగా / నెప్పడు వినడుగా అంటె గణాక్షరలోపము తొలగునా?

  రిప్లయితొలగించండి
 23. మైల వచ్చు జనన మరణ సంభవమున
  బయటి జనుల తాకపాడి గాదు
  సంధ్య వార్చ రాద శౌచ శుద్ధి వరకు
  శేషశయను పూజ సేయరాదు

  రిప్లయితొలగించండి
 24. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రులందఱకును నమస్కారములు.

  (హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదునకు మనసా, వాచా, కర్మణా హరినామస్మరణము సేయరాదని యుపదేశించు సందర్భము)

  రాక్షసేంద్రుఁ డిట్లు ప్రహ్లాదునకుఁ జెప్పె
  "హరి యటంచుఁ బలుక కయ్య యెపుడు;
  తలఁపవలదు నీవు దనుజాంతకున్ మదిన్;
  శేషశయను పూజ సేయరాదు!"

  రిప్లయితొలగించండి
 25. గురువుగారికి ధన్యవాదములు. సవరించిన పద్యం:
  భక్త ప్రహ్లాదుని పరంగా...
  మేలు మేలనుచును మేను మరచి నీవు
  శేష శయను పూజ సేయ రాదు
  మనకు శత్రువతడు మరచిపొ మ్మనుచును
  దానవేంద్రు డనియె తనయుఁ జూచి!

  రిప్లయితొలగించండి
 26. నా పూరణమందలి రెండవపాదము నిట్లు మార్చి చదువుకొనగలరు:

  రాక్షసేంద్రుఁ డిట్లు ప్రహ్లాదునకుఁ జెప్పె,
  "పద్మగర్భుఁ డంచుఁ బలుకకుమయ;
  తలఁపవలదు నీవు దనుజాంతకున్ మదిన్;
  శేషశయను పూజ సేయరాదు!"

  రిప్లయితొలగించండి
 27. శ్రీగురుభ్యోనమ:

  హేమకశ్యపుండు హీనుడై తాపల్కె
  శేష శయను పూజ సేయ రాదు,
  హరిని దలుపరాదు యనుచు శాసనముల
  జేసె మిగుల కఠిన జిత్తుడగుచు

  రిప్లయితొలగించండి
 28. మల్లెలవారి పూరణాల్లోనూ, శ్రీపతిశాస్త్రిగారిపూరణలోనూ ఒక పొరపాటు హిరణ్యకశ్యపుడు అన్నమాట సరైనది అనుకోవటం. నిజానికి హిరణ్యకశిపుడు అనాలి. కశిపశబ్దానికి అన్నవస్త్రశయ్యాదులుగా అర్థం.

  రిప్లయితొలగించండి
 29. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు
  ==============*================
  హరియనుచు బిలచిన కరిని రక్షించిన
  శేషశయను పూజ సేయ రాద
  నుచును బలుకు వాని,నూతి యందున గప్ప
  యనుచు బలుక వలెను ఘనము గాను !

  రిప్లయితొలగించండి

 30. 2.శేషశయను పూజ సేయ రాదనుచును
  బలుక వలదు తండ్రి బలుక వలదు
  శేషశయను పూజ సేయ భయము లెల్ల
  దొలగి పోవు తండ్రి దూరము గను !

  రిప్లయితొలగించండి
 31. యం.ఆర్. చంద్రమౌళి గారూ,
  నిజమే.. మల్లెలవారి పూరణలో గణదోషం.. మీ సవరణ బాగున్నది. ధన్యవాదాలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శ్యామలరావు గారూ,
  మొన్నమొన్నటి వరకూ ఆ పొరపాటు నేనూ చేశాను. మిత్రులు తమ పూరణలో హిరణ్యకశిపుడు అని వ్రాస్తే నేను హిరణ్యకశ్యపుడు అని రాయాలని సూచించాను. గురుదేవులు నేమాని వారు చెప్పేదాకా నా తప్పు తెలుసుకోలేదు. ధన్యవాదాలు.
  *
  కందుల వరప్రసాద్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 32. శ్రీగురుభ్యోనమ:

  శ్రీ శ్యామలీయంగారికి, గురువుగారికి నమస్సులు.
  1వ పాదమును "హేమకశిపుడంత హీనుడ దా జెప్పె" అని సవరిస్తున్నాను.
  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 33. మరిచిపోకు నెపుడు హరినామ తలంపు
  శేషశయను పూజ సేయరా, దు
  రితములడగు విష్ణుని తలంచి నంతటన్
  మనము నందు భక్తి మసలి యుండు.

  రిప్లయితొలగించండి
 34. namaskaramulu
  కం అమ్మాయిలు అబ్బాయిలు
  నెమ్మది నేర్వంగ లేరు నేటి దినంబున్,
  నమ్మిక అమ్మా యొక్కతి
  “ అమ్మా”యని పిలువ గానె యాగ్రహ మందెన్
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 35. namaskaramulu
  కం అమ్మాయిలు అబ్బాయిలు
  నెమ్మది నేర్వంగ లేరు నేటి దినంబున్,
  నమ్మిక అమ్మా యొక్కతి
  “ అమ్మా”యని పిలువ గానె యాగ్రహ మందెన్
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి