30, ఆగస్టు 2014, శనివారం

సమస్యా పూరణం – 1510 (ధనమొక్కటె మోక్షమిచ్చు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్.
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు.

34 కామెంట్‌లు:

 1. ఘనమగు తీర్థములను పా
  వన చరితులను గురువులను ప్రణమిల్లినచో
  యొనగూడబోదు, చిత్శో
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్!!

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింపనున్నవి !

  ధన,ధాన్యాదుల వలన గాని,
  కాంతాకనకముల గూడి సుఖించుట వలన గాని రానిది
  అనుదినము భగవంతుని సేవించుట వలననే మోక్షము గలుగును గదా :

  01)
  __________________________________

  ధన ధాన్యాదుల, రాదులె
  దనియగ కాంతా కుసుంభ - తను సౌఖ్యంబుల్ !
  దినదిన భగవత్సేవా
  ధనమొక్కటె మోక్షమిచ్చు - దారిగఁ దలఁతున్ !
  __________________________________
  భక్తి = సేవ
  దనియు = కూడు
  కుసుంభము = కనకము

  రిప్లయితొలగించండి
 3. దినమును రేయియు సంపా
  దన గూర్చి తలచుచు మదినఁ దల్లడ పడకన్
  ఘనమగు హరినామపు సా
  ధన మొక్కటె మోక్షమిచ్చు దారిగఁ తలఁతున్

  రిప్లయితొలగించండి
 4. తన శక్తిని జీవితమును
  మనకొరకై కరగ జేసి మాన్యతఁ బొందెన్
  మనుజుల సేవించిన గో
  ధన మొక్కటె మోక్షమిచ్చు దారిగఁదలఁతున్

  రిప్లయితొలగించండి
 5. జిగురు సత్యనారాయణ గారూ,
  శోధనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘చిత్ + శోధనము = చిచ్ఛోదనము (ఛత్వసంధి)’
  ‘విద్యుత్ + శక్తి = విద్యుచ్ఛక్తి’ వలె.
  *
  వసంత కిశోర్ గారూ,
  సేవాధనంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  సాధన, గోధనాలతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘మదిని తల్లడపడగన్’ అనండి.

  రిప్లయితొలగించండి
 6. ఘనమగు సేవల నిడుచును
  ధనధాన్యములిడి సతతము ధరణిన వెలిగెన్
  మననము సలుప గతము గో
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁదలఁతున్

  రిప్లయితొలగించండి

 7. వినుట మననము నిధిధ్యా
  సనమును సాధనచతుష్క సంపదముల సా
  ధన జనితాద్వైతోద్భో
  ధన మొక్కటె మోక్షమిచ్చు దారిగఁదలఁతున్

  (సాధన-జనిత-అద్వైత-ఉద్భోధన)

  రిప్లయితొలగించండి
 8. మునిపుంగవులు గతమ్మున
  మనుటకు విద్యలఁ గఱపిరి మక్కువ తోడన్
  మనుజులకు మాన్య గురుబో
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్

  రిప్లయితొలగించండి
 9. వనముల తిరిగిన దొరకని
  ఘనమగు ఫలితమ్ము నొసగు గాదే జదువున్
  మనముల దిద్దెడు విద్యా
  ధన మొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్

  రిప్లయితొలగించండి
 10. మనుగడ కొరకై నిత్యము
  పనిఁ జేసిన నిష్టతోడ ఫలితము కలుగున్
  మనుజులకు దైవ పరిశో
  ధన మొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్

  రిప్లయితొలగించండి
 11. గురుదేవులకు నమస్కారములు.

  ఈ నాటి సమస్యకు పూరణలు పంపిన మరియు పంపబోతున్న కవిమిత్రబృందానికి శుభాభినందనలు.

  మనమున పరమేశ్వరు చిం
  తనమును వైరాగ్యభావనా గరిమంబున్
  గొనకొని జేయు తపస్సా
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్.

  రిప్లయితొలగించండి

 12. అనుసంధానించిన బో
  ధన, రాగద్వేషచిత్త తమములద్రోలన్
  అనాహతోత్తరణ సుబం
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్

  (అనాహత(శబ్దయోగము)+ఉత్తరణ+ సుబంద)

  రిప్లయితొలగించండి
 13. మనసు లయించగ, యిదియది
  గను ’విషయ-వ్యక్తి-వస్తు" వను బేధము లే
  కను, నిర్బీజస్థితి వ-
  ర్ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్

  రిప్లయితొలగించండి

 14. సునిశిత మతితో జగమున్
  గని నిత్యానిత్య సత్య గహనత్వము లో-
  గొను యాత్మానంద సువ-
  ర్ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్


  రిప్లయితొలగించండి
 15. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు కనుగొనిరి త్యాగారాజులు
  తను హృద్భాషలను వేడ తన్మయుడై రా
  ముని కీర్తన జేసెడి సా
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్!

  రిప్లయితొలగించండి
 16. మనదను, తనదను స్వార్థము
  మనుగడకవసరమె గాని మానవులారా!
  మనుజుల కిల వర్జిత బం
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్.

  రిప్లయితొలగించండి
 17. జనహితు త్రిలోక పూజితు
  యెనలేని దయా గుణమ్మునెనయుచు మదిలో
  తనియుచు రాముని సంబో
  ధన మొక్కటె మోక్ష మిచ్చు దారిగఁ దలఁతున్

  రిప్లయితొలగించండి
 18. కని "వపు-మన-ధీ"మితులను
  గని యహమహమను హృదయాంకమునన్ సాక్షిన్
  గని, చేతనతత్త్వపు గం-
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్

  రిప్లయితొలగించండి
 19. మల్లెల వారి పూరణలు

  జనములు విద్యను నేర్చిన
  ధనమును పదయంగ గలరు; దానను దానం
  బనువుగ యశమా, విద్యా
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్!!

  ధనమది కావలె బ్రతుకగ
  ధనమే కలిలో సకలము తానిడు, కనుకన్
  ధనమది ధర్మార్జనమై
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్!!

  కనగా ధర్మార్ధములవి
  వినుతిగ నన్యోన్యగతినని పెరుగుచు నున్నన్,
  కనమే సుగతిని, కలిలో
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్!!

  ధనమది లేకయు నున్నను
  మనమెటు దానమును చేయు మార్గము లేదే!
  వినుతౌ దాతయె ఘనుడగు
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్!!

  వినుతగు వారై భక్తులు
  ననయము దైవము కొలుచుచు నందరె ముక్తిన్.
  కనగను నిలలో భక్తను
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్!!

  రిప్లయితొలగించండి
 20. ధనకనకాదుల పై ప్రే
  మనువిడచి యనుదినము పరమాత్ముని పూజిం
  పనుచితమాదైవారా
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్

  రిప్లయితొలగించండి
 21. ధనమును నొక మార్గమెగద
  ధనమున మఱి జేతుమనము దానము లెన్నో
  తనరుత దానము ధనమున
  ధన మొక్కటి మోక్ష మిచ్చు దారిగ దలతున్

  రిప్లయితొలగించండి
 22. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ తాజా మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘ధరణిని వెలిగెన్’ అనండి.
  *
  మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
  మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘సంపదముల’ అన్నారు. అక్కడ ‘సంపత్తుల’ అంటే?
  రెండవ పూరణలో ‘అనాహ’ అని జగణం వేశారు. అక్కడ జగణం రాకూడదు కదా!
  ఐదవ పూరణలో ‘హృదయాం’ అని సగణం వేశారు. అక్కడ నలం కాని జగణం కాని రావాలి.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘త్యాగరాజు’ టైపాటు వల్ల ‘త్యాగారాజు’ అయ్యాడు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘పూజితు / నెనలేని...’ అనండి.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటి పూరణలో ‘పడయంగ’ టైపాటు వల్ల ‘పదయంగ’ అయింది. ‘దానం బనువుగ యశమా’...?
  మూడవ పూరణలో ‘గతిని’ టైపాటు వల్ల ‘గతినని’ అయింది.
  నాల్గవ పూరణలో ‘వినుతి + ఔ’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ ‘వినుతింప దాత ఘనుడగు’ అందామా?
  ఐదవ పూరణలో ‘వినుత(తి) + ఔ’, ‘భక్తి + అను’ అన్నప్పుడు సంధిలేదు. ‘వినతులగువారు భక్తులు’, ‘కనగను నిల భక్తి యనెడి’ అందామా?
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణ రెండవ గణం జగణ మయింది. ‘ధనవాహనములు మఱియును’ అనండి.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ధనమున జేసెదము మనము...’ అనండి.

  రిప్లయితొలగించండి
 23. శ్రీ శంకరయ్య గారు
  మన్నించాలి. విషయప్రధాన్యతచింతనలోపడి, చూచుకొలేదు. ఆ ప్రధానవిషయానికి ఛందస్సు ఎన్నడు అడ్డురాదుగా !
  మీ సూచనలననుసరించి మూడు పద్యములనూ సవరించాను.

  వినుట మననము నిధిధ్యా
  సనమును సాధనచతుష్క సంపత్తుల సా
  ధన జనితాద్వైతోద్భో
  ధన మొక్కటె మోక్షమిచ్చు దారిగఁదలఁతున్

  అనుసంధానించిన బో
  ధన, రాగద్వేషచిత్త తమములద్రోలన్
  వినిపించని శబ్దసుబం
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్

  (వినిపించని శబ్ద = అనాహతశబ్దయోగము)

  కని "వపు-మన-ధీ"మితులను
  గని యహమహమను హృదయపు గవిలోసాక్షిన్
  గని, చేతనతత్త్వపు గం-
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్

  రిప్లయితొలగించండి

 24. కె.ఈస్వరప్పగారి పూరణ
  ధనమే దైవంబన వే
  దనయే యిక పూడ్చి పెట్టు తరుగనిదౌ సా
  ధనమున తపసుల చే బో
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్

  రిప్లయితొలగించండి
 25. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
  జనహితు త్రిలోక పూజితు
  నెనలేనిదయాగుణమ్మునెనయుచు మదిలో
  తనియుచు రాముని సంబో
  ధన మొక్కటెమోక్ష మిచ్చు దారిగఁ దలఁతున్

  రిప్లయితొలగించండి
 26. కం . తను హృద్భాషల సఖ్యము
  మన జన్మకు సార్ధకంబు మహిలో యనగన్,
  జను లందరికిశి వారా
  ధన మొక్కటె మోక్ష మిచ్చు, దారిగ దలతున్
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 27. ప్రాయశ్చిత్తానికై మరో పంచకం

  మనసుకు మనసెవ్వడు?వా
  క్కునకుం వాక్కెవడు చెవులకుం జెవితానై
  కనులకు కనులెవడను బో
  ధన మొక్కటె మోక్షమిచ్చు దారిగఁదలఁతున్


  మనమింద్రియములతోడై
  గనురూపమె తానెయగుచు గనబడ వెనుకన్
  మినుకదియేమను పరిశో-
  ధన మొక్కటె మోక్షమిచ్చు దారిగఁదలఁతున్

  మనసుకు తన చేతనమెది?
  స్వనియంత్రిమైననేల జను బాధలలో?
  కనుగొన సాగెడు పరిశో-
  ధన మొక్కటె మోక్షమిచ్చు దారిగఁదలఁతున్

  ధనుసంధానపు బాణము
  సునిశితమై వేనుకకీడ్వ జేయనిసాగున్
  మనసటు లోనబడిన సా-
  ధన మొక్కటె మోక్షమిచ్చు దారిగఁదలఁతున్

  "జనియించె నెవనిజే? యె-
  వ్వనిలోపలనుండు జగము వానిని దలతున్"
  అనెనా పోతన, ఆ సా
  ధన మొక్కటె మోక్షమిచ్చు దారిగఁదలఁతున్

  రిప్లయితొలగించండి
 28. శ్రీగురుభ్యోనమ:

  తనువున నణువున నున్నది
  మనసా శివుడనుచు నమ్మి మౌనము తోడన్
  కనుగొను వైరాగ్యంబను
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్

  రిప్లయితొలగించండి
 29. ధనమీయదు వైరాగ్యము
  ధనమీయదు దైవకృపను ధనుడైనను ని-
  ర్ధనుడైన భక్తి యను నిం-
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్!!

  రిప్లయితొలగించండి
 30. వినయముతో గురు సేవలు
  ననయము తలిదండ్రి సేవ లతిథుల సేవల్
  చనధర్మ పథము తగు సా
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్.

  రిప్లయితొలగించండి
 31. మరోపంచకంలోని మూడవ పద్యంయొక్క రెండవపాదాన్ని
  "స్వనియంత్రితమైననేల జను బాధలలో" అని చదవ ప్రార్థన. టైపాటువలన ’త’ విడిపోయుండెను.

  రిప్లయితొలగించండి
 32. మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
  సవరించిన మీ పూరణలు, క్రొత్తగా వ్రాసిన ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మహిలో ననగన్’ అనండి.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 33. కనకపు సింహాసనమున
  ఘనముగ కూర్చుండ బెట్ట కాంతము పలికెన్:
  "వినరా మూర్ఖుడ! నల్లని
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్"

  రిప్లయితొలగించండి
 34. దినమును రేయిని గనకే
  తినతినగా పెరుగుచుండి తికమకలిడుచున్
  ఘనముగ నరకము జేర్చెడి
  ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్

  రిప్లయితొలగించండి