15, ఆగస్టు 2014, శుక్రవారం

సమస్యా పూరణం – 1501 (భరతభూమి స్వాతంత్ర్యము)

కవిమిత్రులారా,
స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య...
భరతభూమి స్వాతంత్ర్యముఁ బడయలేదు.

19 కామెంట్‌లు:


  1. వేల బలిదానములు ఘోషపెట్టు దాక
    ప్రథితజాతి తపోదీక్ష పండు దాక
    యూనియనుజాకు ప్రభ నేల కొరగు దాక
    భరతభూమి స్వాతంత్ర్యముఁ బడయలేదు

    రిప్లయితొలగించండి
  2. పగలె రక్షణ కఱవయ్యె పడతి కిపుడు
    బడికి పోయిన బాలకు భయమె బ్రతుకు
    ప్రగతి కోరిన బడుగుకు బ్రతుకు లేదు
    భరతభూమి స్వాతంత్ర్యముఁ బడయలేదు.

    తే14/08/2014దీ నాటి నా పద్యం పై శ్రీ శ్యామలీయ౦ గారి వ్యాఖ్యకు నా వివరణ :-
    1) చెల్లి చూపులు ఏమిటో అర్ధం కాలేదన్నారు. చెల్లి అన్ననుంచి ఏమి కోరుతుంది? రక్షణ కదా?అవి,రక్షా బంధన దివసం నాడు చెల్లెలి చూపులు
    2) ''నుంచి''కి బదులుగా ''నుండి ''అనివ్రామన్నారు.అలా వ్రాస్తే వాక్యం ఎలా వస్తుందో చూడండి :-
    ''రక్షనుండి తనకు సేమముకలిగించగోరినట్లయింది.అదిఅత్ధవంతమా? రక్షణలేకుండాచూడమనినట్లుకాదా?''రక్ష''(రాఖీ)ని''ఉంచి''(రక్షనుంచి)అన్నాను .
    పద్య భావం యిపుడవగత మైందను కుంటాను .

    రిప్లయితొలగించండి
  3. దేశభక్తుల స్వాతంత్ర్య ధీక్ష, విడచి
    నారు భారత మాతను నాడు తెల్ల
    వారు, స్వార్థపరుల పాల బడియె నేటి
    భరత భూమి, స్వాతంత్ర్యము బడయ లేదు
    బడుగు బలహీన వర్గాల ప్రజలు కనుడు

    రిప్లయితొలగించండి
  4. భరతభూమి స్వాతంత్ర్యము బడయ; లేదు
    బానిసత్వంబు, లేదిక పరుల పీడ,
    వాడవాడల విరిసె మువ్వన్నె సిరులు
    దేశమందెను స్వాతంత్ర్య దివ్య దీప్తి!

    రిప్లయితొలగించండి
  5. నింగి నంటెడి ధర లవినీతి సెగల,
    అబలల పయి ప్రభలుచున్న హత్యల కడు
    దుర్భర నిరుపేదల గన దోచు నింక
    భరతభూమి స్వాతంత్ర్యముఁ బడయలేదు.

    రిప్లయితొలగించండి
  6. మల్లెల వారి పూరణలు

    జనులు స్వేచ్ఛను వీడగ చాలనాంగ్ల
    ప్రభుత, నేటి ప్రభుతలు వారి మించి
    స్వార్ధ మొక్కటె లక్ష్యమై సాగుచుండ
    భరతభూమి స్వాతంత్ర్యముఁ బడయలేదు

    నేతలప్పుడు కష్టాల నిండు నంది
    వీడ పరతంత్ర్య, మావిధి వెలిగినారు
    నేడు స్వార్ధాన సలుపంగ నెల్ల కీళ్లు
    భరతభూమి స్వాతంత్ర్యముఁ బడయలేదు

    మతము కులము ప్రాంతాల మనుజు లెల్ల
    భేద భావాల నొకవంక, పెరుగునుగ్ర
    వాద మదియును, పెరిగిన స్వార్థ పరత,
    భరతభూమి స్వాతంత్ర్యముఁ బడయలేదు

    నదులు, గనులును, ప్రాంతాలు నావెయనుచు,
    నితర ప్రాంతాల వారికి నీయకుండ
    స్వార్ధ మందంగ దేశము భ్రష్ట మయ్యె
    భరతభూమి స్వాతంత్ర్యముఁ బడయలేదు

    రిప్లయితొలగించండి
  7. గురువులు శంకరయ్య గారు,
    కవి వర్యులకు నమస్సులు.
    .
    స్వార్థ బుద్ధిని వదలక సాగుచున్న
    పాలకుల చేతలన్నిటి ఫలితమేమి ?
    దేశ సౌభాగ్య రేఖల దిశను మార్చె.!
    భరతభూమి స్వాతంత్ర్యముఁబడయలేదు.

    రిప్లయితొలగించండి
  8. తెల్లవారి పాలనలోన దేశ ప్రజలు
    విసిగి వేసారి పోయిరి వెతల తోడ
    పట్టుదల గల గాంధిజి వచ్చు వరుకు
    భరతభూమి స్వాతంత్ర్యముఁ బడయలేదు

    రిప్లయితొలగించండి
  9. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    పర మతమ్మును దూషించి పార ద్రోల
    స్వమత మందున మారగ బహుమతిడగ
    సొంత లాభమ్ము కై ద్రోహ చింత జేయ
    భరతభూమి, స్వాతంత్ర్యము బడయలేదు

    రిప్లయితొలగించండి
  10. బడుగు బలహీన వర్గాలు బక్క చిక్క
    పడతి కవమానములు హెచ్చి వగచు చుండ
    మనల మనమేలు కొనుచున్న ఘనత లేక
    భరత భూమి స్వాతంత్ర్యము బడయ లేదు!

    రిప్లయితొలగించండి
  11. భరత భూమి స్వాతంత్ర్యము బడయ లేదు
    అనుట సరిగాదు బడ సెను నార్య !నేడు
    అందువలనన జెండాకు వందనంబు
    జేతు మీరోజు తప్పక చేతు లెత్తి

    రిప్లయితొలగించండి
  12. శ్యామల రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలులు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. ‘నేటి’ అన్నచోట ‘యీనాటి’ అంటే సరి.
    రెండవ పూరణలో ‘పరతంత్ర్య’ అన్నారు. ‘పారతంత్ర్య’ సరియైన పదం కదా.. అక్కడ ‘పరతంత్ర’ అనండి.
    *
    శ్రీ యెర్రాజి జయసారథి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘బహుమతి + ఇడ’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘బహుమతి యిడ’ అనండి.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘లేదు + అనుట’ విసంధిగా వ్రాశారు. అలాగే ‘పడసెను + ఆర్య’ అన్నప్పుడు ‘పడసె నార్య’ అవుతుంది. అక్కడ ‘బడయ లేద/ టం చనుట సరియె? పడసె నార్య నేడు’ అనండి.

    రిప్లయితొలగించండి
  13. వెరవక నడి రేయి పడతులు వీధి నడుగు
    వేయ భయపడు చీకటి వేళ లరుగు
    దెంచె నేడు నిన్నటి కన్న దిగులు పెరిగె
    భరత భూమి స్వాతంత్ర్యము బడయలేదు

    రిప్లయితొలగించండి
  14. మధ్యరాత్రమందలి కాన్పు; మ్రాను పుట్టె
    కొమ్మ కొక్కక్క తిమ్మన్న కోఁగి లాగి
    నేలఁ నిధియుండ యాచించె నీతిఁ మాని
    వేయివంటలు ముందున్నభిక్ష్కకేగి
    భీమ రాములే భీతిలి హరాములైరి
    మరచిఁ స్వస్వరూపము దాస్యమబ్బమతికి
    స్వేచ్ఛ- స్వాతంత్ర్య భేదముఁ జీవిమరచి
    భరత భూమి స్వాతంత్ర్యము బడయ లేదు!

    రిప్లయితొలగించండి
  15. ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటిపాదంలో గణదోషం. ‘పడతులు’ అన్నదాన్ని ‘పడతుల్’ అంటే సరి!
    *
    యం.ఆర్.చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  16. గాంధి సత్యాగ్రహమ్మున కదలు వరకు
    చేరి యహింసను శక్తిగా చేయు వరకు
    భరతజాతియు నొక్కటై తరలు వరకు
    భరతభూమి స్వాతంత్ర్యముఁ బడయలేదు.

    రిప్లయితొలగించండి
  17. భారతమ్మున హింసకు మేర యేది
    దేశమందున నీతికి దిక్కదేది
    పుడమి పై మన పడతికి ప్రగతి యేది
    భరతభూమి స్వాతంత్ర్యముఁ బడయలేదు.

    రిప్లయితొలగించండి
  18. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్ర బృందమునకును స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు.

    స్వార్థపరులయ్యుఁ బాలకుల్ వఱలు వఱకు,
    ధనికులే ధనప్రాప్తినిఁ దనరు వఱకు,
    పేద ప్రజల దారిద్ర్యమ్ముఁ బెరుఁగు వఱకు
    భరతభూమి స్వాతంత్ర్యముఁ బడయలేదు!

    (ఇట్టి యనర్థములున్నవి కనుక మనము స్వతంత్రముం బొందియున్నను నిజముగఁ జూడ నస్వతంత్రులమే యని నా భావన)

    రిప్లయితొలగించండి
  19. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి