2, ఆగస్టు 2014, శనివారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 42

రామాయణము-
సీ.      కోవిదస్తోమంబు గుంపులయి (కనెను
నెనరునను సుభద్రజననుతు నభి)
మాని రాఘవు; నెందుఁ గానము మన(మన్యు,
మహితసుగుణవంతు, మాన్యు, ఖాండ)
జమునైన గుఱినేయ జాలునీ భ(వవన
మును గాల్పఁగా వహ్ని పనివడి కృతి)
ప్రభుఁ డౌ పని వడి గావలయు నంచుఁ (దలఁచె
దద్ధితమునుఁ జేసె దా విజయుఁడు
గీ.       దశరథేశ్వరుఁ డుచితయత్నముల సల్పి;
యుర్విజం గూడి యుపవాస ముండు మనియె
నతఁడు కాకుత్థ్సకులకలశాబ్ధిచంద్రు;
రాము నందునఁ బ్రీతిఁ బురజను లిడిరి. (౫౭)

భారతము-
గీ.       కనెను నెనరునను సుభద్ర జననుతు, నభి
మన్యు, మహితసుగుణవంతు, మాన్యు; ఖాండ
వ వనమునుఁ గాల్పఁగా వహ్ని పనివడి కృతి
దలఁచెఁ; దద్దితమునుఁ జేసె దా విజయుఁడు. (౫౭)

టీక- (రా) సుభద్ర = మంగళకరములగు, ఖ = ఆకసమునందుండు; అండజము = పక్షిని, ఏయజాలు = కొట్టగలిగిన అనఁగా నంత గుఱిగలవానిని; భవవనమునుఁ గాల్పఁగా వహ్ని = సంసారాటవినిఁ గాల్ప నగ్నిఁ బోలినవాఁడు; కనెను = (రా) చూచెను, (భా) ప్రసవించెను; (రా) అన్యున్ = ఇతరుని; కోవిదస్తోమము = పండితుల సమూహము.

రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి