16, ఆగస్టు 2014, శనివారం

సమస్యా పూరణం – 1502 (కలహమె సుఖశాంతులకును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కలహమె సుఖశాంతులకును గారణము గదా!

28 కామెంట్‌లు:

 1. వలపుల చిలక యలగఁగ
  బులుపులు తీరక మరిమరి ముద్దులొలుకఁ గా
  బలు కసిగా నడుపు ప్రణయ
  కలహమె సుఖశాంతులకును గారణము గదా!

  రిప్లయితొలగించండి
 2. మన తెలుగువారూ, మొదటి పాదంలో ఒక లఘువు తక్కువపడింది కాబట్టి "వలపుల చిలక యలగఁగ" అన్నది మార్చి "వలపుల చిలుకయె యలుగఁగ" అందామా? లాగే చిలుక, అలుగు అన్న పదాలలోను ఉత్వాలు గమనించగలరు. మీరు ప్రయోగించినరూపాలూ వ్యవహరంలో ఉన్నవే కాని గ్రంథభాషలో తక్కువ.

  రిప్లయితొలగించండి
 3. చంద్రశేఖర్ గారూ ! బాగుంది..నేనూ ప్రణయ కలహమునే పట్టుకుంటాను.


  కలహంబంతయొ నింతయొ
  కలభాషిణి చూపవలయు కాంతుని చెంతన్
  మెలిబెట్టని చిన్ని ప్రణయ
  కలహమె సుఖశాంతులకును గారణము గదా!

  రిప్లయితొలగించండి
 4. శ్యామలీయంగారికి ధన్యవాదాలు. మొదటి పాదాంతంలో అక్షరం "గా" అని వేద్దామనుకొన్న టైపాటు. కావున, సవరణలతో...
  వలపుల చిలుక యలుగఁగా
  బులుపులు తీరక మరిమరి ముద్దులొలుకఁ గా
  బలు కసిగా నడుపు(నడచు)ప్రణయ
  కలహమె సుఖశాంతులకును గారణము గదా!

  రిప్లయితొలగించండి
 5. శాస్త్రిగారు, మంచి తాంబూల సేవన జేసి కలభాషిణిని తలచుకొంటూ ఏమి మెలిబెట్టాలనుకొన్నారో తెలియటం లేదు :-)

  రిప్లయితొలగించండి
 6. కలవేన్నో మనకు కధలు
  పలురకముల కలహములవి ప్రణయము గొలిపె
  న్నలిగిన తదుపరి సుధలిడు
  కలహమె సుఖశాంతులకును గారణము గదా!

  రిప్లయితొలగించండి
 7. చంద్రశేఖర్ గారూ ! మన చెవి మెలిబెట్టని ప్రణయ కలహం అనుకుందాం...అంతవరకు తెచ్చుకోకుండానే త్రుంచివేయాలి..

  నాపూరణను ఇలా సవరిస్తే....

  కలహంబంతయొ నింతయొ
  కలభాషిణి చూపవలయు కాంతుని చెవినే
  మెలిబెట్టని చిన్ని ప్రణయ
  కలహమె సుఖశాంతులకును గారణము గదా!

  రిప్లయితొలగించండి
 8. చిలిపిగ నాలూమగలున్
  సలలితమగు పలుకుతోడ సంసారమునన్
  నలవోకగనాడు ప్రణయ
  కలహమె సుఖశాంతులకును గారణము గాదా

  రిప్లయితొలగించండి
 9. మల్లెల వారి పూరణలు

  కలహము భార్యా భర్తల
  చెలగుట సాజం, బదియును సేమంబౌగా
  నల,నది ప్రణయాన కలుగ
  కలహమె సుఖశాంతులకును గారణము గదా

  విలయము తెచ్చును తీవ్రపు
  కలహము- దానికి పరిహార కారణములనే
  తలచియు తీర్పగ, నపుడే
  కలహమె సుఖశాంతులకును గారణము గదా

  కలహము వ్యక్తుల మధ్యన
  చెలగును, వారల మనముల చెలగెడి భేదం
  బల,నది పరిహార మయిన
  కలహమె సుఖశాంతులకును గారణము గదా

  కలహము కారము వంటిది
  కలహము లేకున్న తీపి కలుగును- వెగటౌ
  నల తీపి యెక్కువైనను
  కలహమె సుఖశాంతులకును గారణము గదా

  రిప్లయితొలగించండి
 10. కలిగిన చిత్తవృత్తుల
  వలలను వారించి మదిని భావనలొకటై
  నిలచిన గల్గుఁ ప్రసన్నో
  త్కల ’హమె’ సుఖశాంతులకును గారణము గదా

  హము: సంతోషము

  రిప్లయితొలగించండి
 11. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  వలపును రేపగ తొలి సుతి
  కలహమె. సుఖ శాంతులకును కారణము గదా
  కలియగ స్నేహము ప్రణయము
  విలువగు వైవాహికముకు పిలుపగును గదా

  రిప్లయితొలగించండి
 12. లలనా !చెలిమికి బన్నము
  కలహమె, సుఖ శాంతులకును గారణము గదా
  యిల వెంకన్నను గొలుచుట
  కలియుగపుం దైవ మతడె కంటివె బాలా !

  రిప్లయితొలగించండి
 13. పలువిధములుగా నంతః
  కలహమె సుఖశాంతులకును గారణము గదా
  కలుగ విఘాతము, విజ్ఞత
  కలిగిన దేశప్రజలెల్ల కయ్యముమానున్

  రిప్లయితొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 15. అలిగిన పడతుల నడిమిన
  శిలవలె సిరిపతి నిలిచెను చింతలు దీర్పన్
  కలిజన హితమైన సతుల
  కలహమె సుఖశాంతులకును గారణము గదా!

  రిప్లయితొలగించండి
 16. కలహించి మడిసె కురుపతి
  కలహముతో యాదవాళి కలిసిరి బువిలో
  ఫలమెది నీతియదేమన
  కలహమె సుఖశాంతులకును గారణము గదా!

  (క్షేమేంద్ర కవి భావాధారితం)

  రిప్లయితొలగించండి

 17. మొన్న చనిపోయిన మా పిన్ని మూడవరోజు కార్యక్రమానికి ఉదయం వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరుకున్నాను. కనుక మీ పూరణలపై వెంట వెంటనే వ్యాఖ్యానించలేకపోయాను. మన్నించండి.
  *
  చంద్రశేఖర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  శ్యామలీయం గారు చెప్పకుంటే నేను కూడా ‘చిలుకయె’ అన్న సవరణను సూచించేవాణ్ణి. మీ సవరణ ‘చిలుక యలుగగా’ బాగుంది.
  *
  శ్యామలరావు గారూ,
  ధన్యవాదాలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ఆలూమగలు’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘చిలిపిగ నాలును మగడును’ అనండి.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. ‘కలహము దాని పరిహార...’ అంటే సరి.
  *
  యం.ఆర్.చంద్రమౌళి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘కలిగినను చిత్తవృత్తుల’ అనండి. ‘వలలను’ ...?
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘తొలి సుతి’...?
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  నాలుగవ పాదంలో గణదోషం. ‘కలిగిన మన దేశజనుల కయ్యము మానున్’ అనండి.

  రిప్లయితొలగించండి
 19. ధన్య వాదములు మాష్టారు మీ సవరణకు . ఇంత బిజీ లో కూడా సమీక్షించడం మీ వల్లే సాధ్యం

  రిప్లయితొలగించండి
 20. పలువిధములుగా నంతః
  కలహమె సుఖశాంతులకును గారణము గదా
  కలుగ విఘాతము, విజ్ఞత
  కలిగిన మన దేశజనుల కయ్యము మానున్

  రిప్లయితొలగించండి
 21. శ్రీ శంకరయ్యగారు,
  ధన్యవాదాలు. ఔను. " కలిగిన చిత్తవ్ వృత్తుల " అని చతుశ్రగతితాళబద్ధంగా అనుకొంటూ వ్రాసాను. "చిత్ త్తవ్ వృత్ త్తి" వాచికంగా పలుకితే లిఖితంలో అది "చిత్త; వృత్తి" యే సరి. నా ప్రాయోగం దోషమే. మన చిత్తవృత్తులు పలువిధమైన " వలలను" విసురునుగదా !

  రిప్లయితొలగించండి
 22. యం.ఆర్.చంద్రమౌళి గారూ,
  ‘వల’ యొక్క ద్వితీయావిభక్తి బహువచన రూపాన్ని గుర్తించని నా అజ్ఞానాన్ని మన్నించండి.
  వివరణకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి

 23. ఎంతటి మాటలు బుధవర?
  అంతగ మీరనిన క్రుంగు స్వాంతము, నమనం.

  రిప్లయితొలగించండి
 24. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  వలపును రేపగ తొలి సుతిఅనగా వలపు
  సంగీతానికి శ్రుతి కలహము అని నాభావన

  రిప్లయితొలగించండి
 25. తెలుగుల నేతలు చంద్రులు
  పలుమారులు తిట్టుకొనుచు పట్టుచు పిలకల్
  తలుపుల చాటున ముద్దిడు
  కలహమె సుఖశాంతులకును గారణము గదా!

  రిప్లయితొలగించండి
 26. పలుకులు రాగనె చట్నిన్
  కలతలు పెంపొంది త్వరగ కలపగ జుత్తుల్
  అలివేణికి గుండప్పకు
  కలహమె సుఖశాంతులకును గారణము గదా!

  రిప్లయితొలగించండి