29, ఆగస్టు 2014, శుక్రవారం

నిర్వచన భారత గర్భ రామాయణము – 68


రావిపాటి లక్ష్మీనారాయణ

రామాయణము-
సీ.      ఘోరుఁ డాతం డిట్లు (తోరపుధృతి నేగి
దుర్యోధనసుజిష్ణు) ధూర్తరిపు మ
రుత్సుతు డాసె; దీరుల నేయుటకు దైత్యు
(లు వెస గైకొనిరి; హరి విజయుఁడు సు)
కృతి కలగుండు వారిఁ బఱచెఁ; బఱచె సే
నలు; మరల్చెను మేఘనాదుఁ డుగ్ర
యోధనుండు మొనల; నొప్పుచుఁ దా బద్మ
జాస్త్రమ్ము వైచెను హనుమమీఁద
గీ.      బావని యజమంత్రప్రభావమున నిలిచె;
నతని బంధించె డనుజాధిపాగ్రనంద
నుండు రోషారుణిత(నయనుఁడు; సనియెను
గన గురువిభునిఁ) బంక్తికంఠుని హనుమఁడు. (౮౩)

భారతము-
ఆ.      తోరపు ధృతి నేగి దుర్యోధన సుజిష్ణు
లు వెసఁ గైకొనిరి హరి విజయుఁడు సు
యోధనుండు మొనలఁ; నొప్పుచుఁ దాఁ బద్మ
నయనుఁడు సనియెను గనఁ గురువిభుని. (౮౩)

టీక- దుర్యోధనసుజిష్ణు = (రా) యోధుల కలవికాని వారిని జయించువానిని, (భా) దుర్యోధనార్జునులు; హరి = (రా) కోతి. (భా) కృష్ణుని; విజయుఁడు = (రా) జయశీలుఁడు, (భా) అర్జునుఁడు; పద్మనయనుఁడు = (భా) కృష్ణుఁడు; గురువిభుని = (రా) గొప్పప్రభుని, కురువిభుని = (భా) ధృతరాష్ట్రుని; ధృతి = (రా) ధైర్యము, (భా) ప్రీతి; తోరపు = అందమగు; తీరుల = బాణములను; పఱచె = పరువెత్తెను; అజ = బ్రహ్మ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి