13, డిసెంబర్ 2011, మంగళవారం

సమస్యాపూరణం - 559 (సురహితమ్ముఁ గోరు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
సురహితమ్ముఁ గోరు శుక్రుఁ డెపుడు.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

45 కామెంట్‌లు:

  1. గురువనన్న వాడు కోరకనే శిష్య
    హితము గోర వలయు నింతె గాన
    యసుర గురువు గాన యనవరతంబు న
    సురహితమ్ముఁ గోరు శుక్రుఁ డెపుడు.

    రిప్లయితొలగించండి
  2. చిన్న సవరణ తో....

    గురువనన్న వాడు కోరకనే శిష్య
    హితము గోర వలయు నిదియె ధర్మ
    మసుర గురువు గాన ననవరతంబు న
    సురహితమ్ముఁ గోరు శుక్రుఁ డెపుడు.

    రిప్లయితొలగించండి
  3. శ్రీగురుభ్యోనమ:

    శివుని పూజ జేసి సిద్ధిపొందినవాడు
    దైత్య వర్గమెల్ల దరిని జేరి
    గురువటంచు భక్తి గొలచుచు నుండ న
    సురహితమ్ముఁ గోరు శుక్రుఁ డెపుడు

    రిప్లయితొలగించండి
  4. మిత్రులారా!
    సమస్యలను కూర్చుట గురించి కొన్ని సందేహాలను మిత్రులు వెలిబుచ్చేరు. సమస్య సమస్యే. అర్థవంతముగా లేని పదముల కూర్పును పృఛ్ఛకుడు ఇస్తే, అవధాని తన ప్రతిభతో ఆ పదములను తగిన పద్యములో 4 పాదములను పూర్తిచేసి అర్థవంతముగా చేయాలి. సమస్య అర్థవంతముగా ఉందా అని గాని లేక ఇతర దోషాలతో ఉందా అని గాని ప్రసక్తి ఉండదు.
    భోజరాజు సభలో ఇచ్చిన కొన్ని సమస్యలు చూడండి. (నాకు జ్ఞాపకము ఉన్నట్లు వ్రాస్తున్నాను.)
    (1) టంటం టటంటం టటటం టటంటం
    (2) గుళు గుగ్గుళ్ళు గుగ్గుళ్ళు
    వీటిని కాళిదాసు పూరించేడు.
    నేటి సమాజ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏ వర్గము వారిని కించపరచని రీతిలో నొప్పించని రీతిలో సమస్యలిస్తే అదే మేలు. అందుచేత మన శ్రీ శంకరయ్య గారు సమస్యను బాగుగనే ఆలోచించే ఇస్తున్నారు - మనము ఎట్టి ఆక్షేపణ చేయకుండా అందుకొని పూరించడానికి ప్రయత్నము చేద్దాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. అసుర గురుడు శుక్రు డ సమాన తేజుడు
    ఎల్ల వేళ లందు నుల్ల మలర
    గురువు ధర్మ నిరతి గౌరవ ముండ న
    సుర హితమ్ము గోరు శుక్రు డె పు డు .

    రిప్లయితొలగించండి
  6. మునుల కష్టపెట్టి ముచ్చట చూచు న
    సురహితమ్ముఁ గోరు శుక్రుఁ డెపుడు
    ఒక్క కన్ను మిగిలె నొక్కని వలనను
    సత్యమెఱుగలేరు చపల మతులు.

    రిప్లయితొలగించండి
  7. అసుర గురుడు శుక్రు డాత్మ విద్యానిధి
    హితులు నహితులనుట నెరుగ డతడు
    పరులు వాని గూర్చి భావించుచుందుర
    సుర హితమ్ము గోరు శుక్రు డెపుడు

    రిప్లయితొలగించండి
  8. ఓం స్వామియే శరణమయ్యప్ప
    గురువు గారికి ధన్యవాదములు
    కాకులను గొట్టి రాబంధులకు పెట్టు రీతిన మన మన్మోహన్ సింగ్, అక్రమార్కులకు కొమ్ముకాయుచుండెను. పటిష్ఠ బిల్లులు తేవటంలేదు. అది
    --------------------
    అక్రమార్కులకును నభయ హస్తమునిచ్చి,
    యరటి చెట్లు నరకి నడ్డు కట్టు
    జగతి మెచ్చునట్టి జననేత, నిత్యమ
    సుర హితమ్ము గోరు శుక్రుడెపుడు|
    (శుక్రుడు = మన్మోహన్ సింగ్, అసురులు=అక్రమార్కులు )

    రిప్లయితొలగించండి
  9. బలి చక్రవర్తి పై అపారమైన ప్రేమతో బొంక వచ్చు నని హితము బోధించెను గదా !

    కన్న బిడ్డ గన్న కనుసన్న మెదలాఁడు
    చట్టు పైన గురువు పెట్టుఁ బ్రేమ
    జంకు లేకఁ బలుకు బొంకని చెప్పె న
    సుర హితమ్ము గోరు శుక్రుఁ డెపుడు

    చట్టు = శిష్యుఁడు

    రిప్లయితొలగించండి
  10. కొద్దిపాటి సవరణతో
    ---------
    అక్రమార్కులకును నభయ హస్తమునిచ్చి,
    యరటి చెట్లు నరకి నడ్డు కట్టు
    జగతి మెచ్చునట్టి జననేత, దనజాత
    సుర హితమ్ము గోరు శుక్రుడెపుడు

    రిప్లయితొలగించండి
  11. నా పూరణలు ....
    (1)
    అమరుల గురువయి బృహస్పతి వజ్ర్యాది
    సురహితమ్ముఁగోరు; శుక్రుఁ డెపుడు
    దనుజుల గురువయి సదా వారి క్షేమమ్ముఁ
    గోరి స్వర్గజనుల వైరి యయ్యె.
    (2)
    అసురవైరియై నిరంతరదైత్యసం
    హారి యైన విష్ణు నడ్డుకొనఁగ
    తగు నుపాయము లిడి దానవలోక భా
    సురహితమ్ముఁ గోరు శుక్రుఁ డెపుడు.

    రిప్లయితొలగించండి
  12. చెడుగు తలచు టసురచిత్తవికారంబు
    మంచి చెప్పుచుండు మాన్యగురుడు
    వినక చెడుట వారి విపరీతబుధ్ధి య
    సురహితమ్ముఁ గోరు శుక్రుఁ డెపుడు.

    రిప్లయితొలగించండి
  13. శంకరయ్యగారు వజ్ర్యాది అని ఒక మంచి మాట వాడారు. దాని గురించి రెండు మాటలు.
    వజ్రి + ఆది --> వజ్ర్యాది (యణాదేశసంధి).
    వజ్రము కలవాడు వజ్రి. (బహువ్రీహ సమాసం) అంటే వజ్రాయుధం కలవాడు . అనగా ఇంద్రుడు.
    వజ్ర్యాది అంటే ఇంద్రుడు మొదలయిన (దేవతలు) అని అర్ధం.
    వజ్ర్యాది అన్నమాట పలకటం నేటి వారికి కష్టమే కాని మన కవి మిత్రసందోహానికి కాదు లెండి.
    ఇంద్రాది యంటే మరింత సులభంగా ఉండేదేమో.

    రిప్లయితొలగించండి
  14. శుభకర' మృత సంజీవని '
    ని భవు డొసంగి ,నిజ శుక్ర నిర్గతు జేయన్
    నభమెక్కి ,మనకు శుభ మి
    చ్చు ,భాసుర హితమ్ము గోరు శుక్రు డెపుడు తాన్

    రిప్లయితొలగించండి
  15. దేవగురుసుతుండు దివ్యవిద్యను నేర్వ
    సవినయముగ గురుని శరణుజొచ్చె,
    సంతసంబున మృతసంజీవినిన్ నేర్పె
    సురహితమ్ము గోరు శుక్రుడెపుడు.

    మృతసంజీవిని విద్యను నేర్పి శుక్రుడు సురలకు సహాయపడినాడని వ్యంగ్యార్థములో.........

    రిప్లయితొలగించండి
  16. ఈ రోజు పద్యాలు బాగున్నాయి. కేవలం కొన్ని సందేహాలు. కోరకనే' అన్నది సాధువా? కోరకయే సాదువా? అలాగే కాని 'వేళ లందు' / 'వేళల యందు'

    వరప్రసాదుగారి 'తనజాత' పదం అర్ధంకాలేదు. 'తనజాతసుర' అనీ తనజాతి + అసుర అనీ విడతీయాలా? అయితే సంధి సరిగాదు.
    రాజారావుగారి కందపూర్వక పూరణ బాగుంది. శభకర కన్నశుభకరి యనటం సబబేమో. అలగే ఇక్కడ చిహ్నాలు అంతగా అవసరం కాదు.
    మందాకినిగారు, "మునుల కష్టపెట్టి ముచ్చట చూచు నసురహితమ్ముఁ గోరు శుక్రుఁ డెపుడు" అన్నారు. కాని శుక్రుడు సాటి మునులను కష్టపెట్టినట్లు పురాణాలలో ఉందనుకోను. నరసిహమూర్తిగారు, "జంకు లేకఁ బలుకు బొంకని చెప్పె నసుర హితమ్ము గోరు శుక్రుఁ డెపుడు " అన్నారు. కాని శుక్రుడు, కేవలం ఆపధ్ధర్మం విషయమై ప్రస్తావించారు గాని జంకులేక బొంకండహో అని చెప్పలేదే.

    రిప్లయితొలగించండి
  17. శ్యామలీయం గారు,
    నేనన్నది
    మునుల కష్టపెట్టి ముచ్చట చూచు అసుర హితము శుక్రుడు కోరతాడని.
    అసురులకు ముచ్చట . శుక్రునికి అని నే చెప్పలేదు.

    రిప్లయితొలగించండి
  18. మీరు ముళ్ళపూడివారి 'బుడుగు' చదివే ఉంటారు. అందులో, 'గుండున్న లావుపాటి పిన్నిగారి ముగుడు' అనే పదబంధం ఒకటి వస్తుంది. ఆ వెంటనే గుండు ముగుడుది లెండి అనే వివరణ కూడా వస్తుంది. "కష్టపెట్టి ముచ్చట చూచు నసురహితమ్ముఁ గోరు శుక్రుఁడు" అన్నపుడు ఇక్కడ కష్టపెట్టి ముచ్చట చూసేది అసురులన్నమాట. అర్ధమయింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘గురువు + అని + అన్నవాడు’ అన్నచోట ‘గురువని యన్నవాడు’ అని యడాగమం వస్తుంది. అక్కడ ‘గురువు నన్నవాడు’ అంటే బాగుంటుందేమో?
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    మీరు పేరొన్న భోజరాజు సమస్యలు గతంలో శంకరాభరణంలో ప్రస్తావనకు వచ్చాయి.
    10-6-2010 నాడు ‘సమస్యాపూరణం -7’ లో ‘టంట టంట టంట టంట టంట’ అనే సమస్యనిచ్చి దానికి స్ఫూరి నిచ్చిన కథ అంటూ ‘టంటంట టంటం టటటంట టంటం’ అన్న భోజరాజు సమస్యను ది. 15-6-2010 నాడు `చమత్కార పద్యాలు - 4' శీర్షికలో ప్రకటించాను.
    10-8-2011 నాడు ‘చమత్కార పద్యాలు - 123' శీర్షికలో ‘గుళు గుగ్గుళు గుగ్గుళు’ కథను ప్రస్తావించాను.
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘శ్యామలీయం’ గారి వ్యాఖ్యను గమనించారు కదా!
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    శ్యామల రావు గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    నా పూరణలో ఇంద్రుడికి రెండక్షరాల పర్యాయపదం ఏముందని ఆలోచించానే కాని ‘ఇంద్ర’ పదాన్నే వాడవచ్చని ఏమాత్రం తోచలేదు. ఇప్పుడు తలచుకుంటే నవ్వు వస్తున్నది. ‘బృహస్పతి యింద్రాది’ అంటే సరిపోయేది. మీ పరిశీలనకు, సలహాకు ధన్యవాదాలు. *
    *
    రాజారావు గారూ,
    సమస్య పాదాన్ని కందంలో అమర్చిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    రెండు నాలుగు పాదాల ప్రారంభం నేనెప్పుడో వ్రాసిన ఈ పద్యాన్ని గుర్తుకు తెచ్చింది.
    కవి పండిత జన సందో
    హ వచన మహిమన్ శుభమ్ము లందుట చేతన్
    భవదీయ జీవనోద్యా
    న వనము కుసుమించు నింక నవశోభలతో.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    డొంక తిరుగుడు లేకుండా సూటిగా ‘పాజిటివ్’గా సమస్యను పూరించారు. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. భలే !
    సరే ఇలా మార్చి వ్రాస్తాను.
    మునుల కష్టపెట్టి ముచ్చట పడెడి య
    సురహితమ్ముఁ గోరు శుక్రుఁ డెపుడు
    ఒక్క కన్ను మిగిలె నొక్కని వలనను
    సత్యమెఱుగలేరు చపల మతులు.

    సరే , మరొక పూరణ చేస్తాను.
    వచ్చి యున్న వాడు వాసుదేవుండని
    యెఱిగినట్టి గురువు యెఱుక పఱచి,
    బలినిఁ బిలిచి చెప్పె వలదంచు నపుడు, వా
    సు_రహితమ్ముఁ గోరు శుక్రుఁ డెపుడు.

    రిప్లయితొలగించండి
  21. మిత్రులెవరికైనా అనుమానం రావచ్చు. మందాకినిగారు వామనావతార ఘట్టం పైన పద్యం రచిస్తూ, విష్ణువును వాసుదేవు డన్నా రేమిటా అని. వాసుదేవుడన్నమాటకు వసుదేవుని కుమారుడని కదా అర్ధం. వామనావతార ఘట్టంలో కృష్ణావతార సంబంధ నామాన్ని విష్ణువుకు యెలా వాడవచ్చా అని అనుమానం రావటం సహజమే. కాని ఇది సమర్ధనీయమే!

    విష్ణు సహస్రనామాలలో సహజంగానే యీ వాసుదేవ నామం కనిపిస్తుంది. ఈ నామానికి అనేకానేక వివరణలున్నాయి. ఉదాహరణకు:
    ఛాదయామి జగత్సర్వం భూత్వా సూర్య ఇవాంశుభిః | సర్వభూతాధి వాసశ్చ వాసుదేవః తతః స్మృతః (మహా. శాంతి పర్వం.) దీని భావం. సూర్యుడు సర్వ జగత్తును తన తేజస్సుచే కప్పి వేయుచున్నట్లు, నేను సర్వభూతములకు ఆశ్రయస్థాన మగుట చేత నన్ను తత్వజ్ఞులు వాసుదేవునిగా పిలుచుచున్నారు అని భగవద్వాక్యము.

    అయితే, మందాకినిగారు 'వాసు రహితమ్ముఁ గోరు శుక్రుఁడు' అని విరుపును ప్రదర్శించారు. అలా అయితే వారు వాసు రాహిత్యమ్ము గోరు అని వాడ వలసి యుంటుంది పద్యంలో. 'వాసు రహితమ్ము' సరైన ప్రయోగంలా నాకు తోచటంలేదు. మన్నించాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాసనాద్-వాసుదేవస్య వాసితం తే జయత్రయమ్ |
      సర్వభూత నివాసో‌உసి శ్రీవాసుదేవ నమో‌உస్తుతే ||

      తొలగించండి
  22. మీరు చెప్పిన విషయం నాకూ అంగీకారమేనండి. వాసురహితమ్ము సరికాదు.

    రిప్లయితొలగించండి
  23. దైవ మున్న దె సుతునకు తల్లి కంటె
    -----------
    తల్లి దండ్రుల యందున తల్లి మిన్న
    సుతుని బాగోగు లన్నియు చూచు చుండి
    కంటికిని రెప్ప యట్లయి కాచు చుండు
    దైవ మున్న దె ? సుతునకు తల్లి కంటె ?

    రిప్లయితొలగించండి
  24. గురువుగారూ ధన్యవాదములు. వారాంతపు సమస్యలను సైతము గురువుగారు పరిశీలించి మా అనుమానాలను నివృత్తి చేయవలసిందిగా కోరుచున్నాను.

    రిప్లయితొలగించండి
  25. మరొక పూరణ

    వరములెన్నొ పొంది బలవంతులైనట్టి
    దైత్య దౌష్ట్యమేమొ దాను సత్య
    మెఱిగి యున్నను, కనుమింక సతతము న
    సురహితమ్ముఁ గోరు శుక్రుఁ డెపుడు.

    రిప్లయితొలగించండి
  26. నీతిశాస్త్రవిదుడు నిష్ఠా గరిష్టుడు
    సకల వేద సార సంగ్రహుండు ,
    విశ్వహితము గోరు విబుధు లైనట్టి భూ
    సుర హితమ్ము గోరు శుక్రుడెపుడు.
    ---------------

    రిప్లయితొలగించండి
  27. శంకరార్యులకు,శ్యామలరావు గారికి ధన్యవాదములు. మీ సూచనతోసవరించిన నాపూరణ...

    గొప్ప గురువు తాను కోరకయే శిష్య
    హితము గోర వలయు నిదియె ధర్మ
    మసుర గురువు గాన ననవరతంబు న
    సురహితమ్ముఁ గోరు శుక్రుఁ డెపుడు.

    రిప్లయితొలగించండి
  28. బలిని హితము గోరి వలదని వారించె
    వడుగు కాదు వాడు వామ నుండు
    పరమ పూజ్యు డైన గురువు గానయ
    సుర హితమ్ము గోరు శుక్రు డెపుడు

    వామనుండు = విష్ణుమూర్తి

    రిప్లయితొలగించండి
  29. బలిని పెద్ద జేసి పదవిని నిలబెట్టె
    యసుర గణపు గర్వ మతిశయిల్ల
    వామనోద్భవ ప్రభావంపు మూలమై
    సురహితమ్ముఁ గోరు శుక్రుఁ డెపుడు.

    రిప్లయితొలగించండి
  30. ధన్యవాదములు గురువుగారూ.

    మీరు ఉదహరించిన సమస్యలే కాక క్రితంసారి మన బ్లాగునందు " టపట పటప టప్ప టపట పటప " అనే సమస్యను కూడా చర్చించుకొన్నాము. ఇందులో కూడా ఏవిధమైన సహేతుకమైన అర్థము లేదు. కానీ, మన కవిమిత్రులందరూ ఈ సమస్యను కూడా ఎంతో చాతుర్యముతో పూరించారుకదా.

    రిప్లయితొలగించండి
  31. కన్న బిడ్డ గన్న కనుసన్న మెదలాఁడు
    చట్టు పైన గురువు పెట్టుఁ బ్రేమ
    జంకు లేకఁ ' బలుకు బొంకని 'చెప్పె న
    సుర హితమ్ము గోరు శుక్రుఁ డెపుడు
    శ్యామలీయము గారికి గురువుగారికి కృతజ్ఞతలు. శ్రీమహావిష్ణువును దగ్గఱ పెట్టుకొని బొంక మని యెట్టి జంకు లేక శుక్రాచార్యులు వారు బలి చక్రవర్తికి చెప్పారు. ఆతని ధైర్యానికి శిష్యవాత్సల్యానికి మెచ్చుకోవాలి. కచుడి విషయములో కూడా ఆయన అదే వాత్సల్యాన్ని చూపించారు. అది సద్గురువుల లక్షణము. ఈ సమస్య పూర్వకముగా మా గురువర్యులను మరోసారి జ్ఞప్తికి తెచ్చుకొన్నాను.

    రిప్లయితొలగించండి
  32. నమ్ముమయ్య నన్ను, నైసర్గికశుభుడ
    గుటను, పాపిఁ గూడ కున్న మరియు
    పాపగృహమునకధిపతికాకయున్న, భూ
    సుర! హితమ్ము గోరు శుక్రుఁ డెపుడు.

    రిప్లయితొలగించండి
  33. శంకరయ్య గారికి నమస్కారములు . మీకు సమస్యలు
    పంపడము ఎలా ? తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  34. నేమాని పండితార్యా ! ముందుగా నేను శ్రీ శంకరయ్య గార్ని ఆలోచించకుండా సమస్యను ఇస్తున్నారని అనడం గానీ, లేక ఏ విధమైన ఆక్షేపణ చేయడం గానీ చేయలేదనీ, వారిపట్ల నాకు మంచి గౌరవ భావం ఉందనీ సవినయంగా మనవి చేస్తున్నాను.

    ఇక తునికి సాయపడటం ...సమస్య గురించి. , సమస్య పాదాన్ని మాత్రమే చదివితే దానిలో ఏ అర్థమూ లేక యున్న ఇటువంటి సమస్య శంకరాభరణంలో రావడం ఇదే ప్రథమం అనుకొన్టున్నాను.
    డలిని రమ్మనె ప్రేమతో కలికి యపుడు
    తురును నడపెను తండ్రియే త్రోవ నపుడు
    ష్ణాయని మొరలిడగ నాడు సాయ పడెను
    బుకము నెత్తి పట్టి ముద్దు పెట్టె
    ఇలా ఎన్ని సమస్యలనైనా సునాయాసంగా పూరించగల వాటినీ, సమస్య పాదాన్ని మాత్రమే చదివితే ఏ అర్థమూ లేని వాటినీ ఎన్నిటినైనా ఈయవచ్చును. అది ఎంతవరకూ సరి యని మాత్రమే నా సందేహం.

    తర్వాత ధ్వన్యనుకరణ పదాలను సమస్యపాదంలో ఇచ్చినపుడు ఆ పదాలకు అర్థంలేకున్నా ఆ సమస్యను ఎలా పూరించవచ్చునో భావం వెంటనే స్ఫురిస్తుంది కాబట్టి అక్కడ ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు.

    మరి నాభావాన్ని స్పష్టంగానే చెప్పాననుకొంటున్నాను.

    భవదీయుడు.

    రిప్లయితొలగించండి
  35. మిస్సన్న గారూ ! మీ అభిప్రాయము సరియైనదే. నిజమే.. కాని తునికి...అనే సమస్యలో తుని అనే ఊరు ఉన్నది. ఆ తునికి అని అర్థము తీసుకొన వచ్చును. సమస్య ఇచ్చిన వారెవరో ఆ అర్థము లోనే ఇచ్చారని అనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  36. హనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు. తుని అనే ఊరు మేమున్న చోటుకు దగ్గరే. అలా పూరించ వచ్చని నాకూ అనిపించింది. కానీ అది సరి కాదని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  37. మందాకిని గారూ,
    మీ రెండవ మూడవ పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    *
    శ్యామల రావు గారూ,
    ‘వాసుదేవ’ శబ్దాన్ని విశ్లేషించి సందేహనివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    పాత సమస్యకు మీ క్రొత్త పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    క్రొత్త సమస్యలు పంపాలన్న మీ ఆలోచనకు ధన్యవాదాలు. మీరు పంపదలచుకున్న సమస్యలను వ్యాఖ్యలుగా పంపవచ్చు. లేదా నా మెయిల్ shankarkandi@gmail.com కు పంపవచ్చు. మిత్రులు ఎక్కువగా రెండవ పద్ధతినే అనుసరిస్తున్నారు.
    *
    ‘కమనీయం’ గారూ,
    శుక్రుణ్ణి బ్రాహ్మణపక్షపాతిని చేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    ‘నిలబెట్టెన్ + అసుర’ అన్నప్పుడు ‘నిలబెట్టె నసుర’ అవుతుంది కదా!
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    బాగుంది. సంతోషం.
    *
    ఊకదంపుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  38. మిస్సన్నగారూ., తి+ఉనికి తో పురించవచ్చా అండీ?

    రిప్లయితొలగించండి
  39. ఊదం గారూ తి+ఉనికి త్యునికి అవుతుందండీ.

    రిప్లయితొలగించండి