15, డిసెంబర్ 2011, గురువారం

చమత్కార పద్యాలు - 147 (ప్రహేళిక)

ప్రహేళిక
గంగాయాం స్నాతు ముద్యుక్తా
ఏకోనా వింశతి స్త్రియః |
తత్త్రైకా మకరగ్రస్తా
పునర్వింశతి రాగతా
||
గంగలో స్నానం చేయడానికి 
పందొమ్మిదిమంది (ఏకోనా వింశతి) స్త్రీలు సిద్ధపడ్డారు. 
అందులో ఒకరిని మొసలి తినగా 
ఇరవైమంది తిరిగి వచ్చారు.
ఎలా సాధ్యమో తెలియజేయండి.
(సమాధానం ..... రేపు)
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

28 కామెంట్‌లు:

  1. ఆర్యా ! నాకు సంస్కృత భాష పెద్దగా తెలియదు.అయినా నేను ఉహించే దేమంటే 'ఏకోన వింశతి' లో ' ఏక' (మకర గ్రస్తా ) నా చేతిలో పట్టుకుని ఉంటే మిగిలేది ' వింశతి ' ( ఇరవై ) కదా !

    రిప్లయితొలగించండి
  2. అయ్యా ! నమస్కారము.ఏకోన వింశతి అను పదములో ఏక అను దానిని
    ముసలి పట్టు కుంటే ఇంక ఆ ఏక అనేది లేక విం శతి మాత్రమే మిగిలినది.
    ఆ విం శతి అం టే 20 అనే సం ఖ్య . అనగా 20 మంది ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  3. హనుమచ్ఛాస్త్రి గారూ,
    క్షమించాలి. మీ రనుకుంటున్నది సమాధానం కాదు.
    నిజమే! ఈ ప్రహేళిక సమాధానం చెప్పాలంటే సంస్కృతభాషలో విశేష పాండిత్యం ఉండాలి. సాధారణ పరిచయం సరిపోదు.
    నేనూ మీ కోవలోని వాడినే. ఏదో మా గురువు గారు శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు వివరణలు వ్రాసి ఉన్నారు కనుక నా పని సులభమౌతున్నది.
    చూద్దాం ... సంస్కృత పండితు లెవరైనా చెప్తారేమో?

    రిప్లయితొలగించండి
  4. సుబ్బారావు గారూ,
    మీ ఆలోచన ప్రశంసనీయం. కాని అది సమాధానం కాదు.
    మీ రన్నట్లు ‘ఏకోనావింశతి’లో ‘ఏక - వింశతి’ ఈ రెండు పదాల మధ్య ‘ఊన’ తక్కువైపోతున్నది కదా!

    రిప్లయితొలగించండి
  5. అయ్యా! నమస్కారము. ఏకోనా అనగా ఏకః నా అనగా ఒకటి లేదు.
    వింశతి మాత్రమే ఉన్నది.వింశతి అంటే 20. అని నా అభిప్రాయము.
    తప్పు అయితే క్ష మించా లి.

    రిప్లయితొలగించండి
  6. సుబ్బారావు గారూ,
    మన్నించాలి. మీరు ‘నా’ శబ్దాన్ని ప్రస్తావించినది గమనించలేదు. చక్కని ఆలోచన.
    అయినా మీ సమాధానం తప్పే!

    రిప్లయితొలగించండి
  7. అది మకర గ్రస్తా.కాకుండా కామ కర గ్రస్తా అనుకుంటా.... అయితే కామునితో గలిపి ఇరవై ..అంతేనాండీ.

    రిప్లయితొలగించండి
  8. ఏకోనా- ఒక మగ వాడు,
    వింశతి స్త్రియాః ఇరవై ఆడవాళ్ళు
    వెళ్లారు
    అందులో ఒక్క మగవాడు మకరగ్రస్తుడై నాడు.

    రిప్లయితొలగించండి
  9. తాడిగడప శ్యామలరావుగురువారం, డిసెంబర్ 15, 2011 11:14:00 AM

    శంకరయ్యగారు "ఏకోనా వింశతి" అని వ్రాసారు. శ్లోకంలోనూ వివరణలోనూ కూడా. నిజానికి "ఏకోనవింశతి" అనాలికదా? ఇక్కడ యేదైనా తిరకాసు ఉందా అని నా అనుమానం. అయినా ప్రయత్నస్తాను. (అన్నట్లు నాకు సంస్కృత భాషాపాండిత్యం పూజ్యం.)

    ఏకోనవింశతి అంటే 19మంది. అందరూ స్త్రీలే. కొందరు గర్భిణులు అనుకుందాం. 20 మందిలో ఒకరిని మొసలి చంపింది. అదిచూసి కొందరికి నీటిలోనే ప్రసవం అయంది. అలాగనుకుందాం. అసంభావ్యం యేమీ కాదు గదా.

    చనిపోయిన స్త్రీ కాక మిగిలిన వాళ్ళు 18మంది కదా.
    నీటిలోనే ప్రసవించినది ఇద్దరు.
    ఇప్పుడు ఇద్దరు శిశువులతో కలిపి మొత్తం 20 మంది.
    లెక్క సరిపోయింది కదా?
    ఏమంటారు?

    రిప్లయితొలగించండి
  10. తాడిగడప శ్యామలరావుగురువారం, డిసెంబర్ 15, 2011 11:18:00 AM

    సుబ్బారావుగారు ‘నా’ శబ్దాన్ని ప్రస్తావించినది గమనించలేదన్నారు శంకరయ్యగారు. అయతే 'నా' అనే చోట యేదో పట్టు ఉంది. ఆలోచించాలి. అయ్యో. సంస్కృతం రాదే!

    రిప్లయితొలగించండి
  11. "ఏకోనా వింశతి స్త్రియః" - దీనిని "వింశతి స్త్రియః ఏకోనా" అని చదువుకుంటే - ఇరవైమంది స్త్రీలు, ఒకరు స్త్రీ కానివారు (అంటే పురుషుడు) అని అర్థం వస్తుందనుకుంటాను. అప్పుడు ఉన్నది ఇరవై స్త్రీలు ఒక పురుషుడు మొత్తం 21. ఆ ఒక్క పురుషుడిని మొసలి మింగేస్తే మిగిలిన ఇరవై స్త్రీలు బయటకి వచ్చారు.

    రిప్లయితొలగించండి
  12. తాడిగడప శ్యామలరావుగురువారం, డిసెంబర్ 15, 2011 12:59:00 PM

    కామేశ్వర రావు, జిలేబిగారు కూడా ఇదే చెప్పారు. నాక్కూడా ఇదేనేమో సమాధానమని సందేహం. చూద్దాం శంకరయ్యగారు యేం చెబుతారో.

    రిప్లయితొలగించండి
  13. ఈ శ్లోకాన్ని ఇలా చదువుదాము:

    గంగాయాం స్నాతుం ఉద్యుక్తా
    ఏక ఊనా వింశతి స్త్రియః
    తత్త ఏకాం అకర గ్రస్తా
    పునః వింశతిః ఆగతాః

    19మంది స్త్రీలు చేతులు పట్టుకొని ఉన్నారు. వేరొకతె అకరగ్రస్తా (వాళ్ళ చేయి పట్టుకొననిది) ఉన్నది. మొత్తము 20 మంది. మొసలి లేనే లేదు.

    రిప్లయితొలగించండి
  14. ఏకోనావింశతి స్త్రియ - అంటే 20 కాదు . 21 మంది స్త్రీలు అని అర్ధం .

    రిప్లయితొలగించండి
  15. అయ్యా! ఏక + ఊనా = ఒకటి తక్కువ అని అర్థము.

    రిప్లయితొలగించండి
  16. తాడిగడప శ్యామలరావుగురువారం, డిసెంబర్ 15, 2011 3:38:00 PM

    చూసారా నేమాని వారూ, మాకు సంస్కృతం రాక పోవటం యెం ఘట్టి చిక్కుగా ఉందో.

    యేదో కథ ఉండాలి. 'రాజన్ మామోదకై స్తాడయ' అంటే రాణి గారు, రాజుగారు మోదకాలు (లడ్డూలు) తెప్పించాడట. తీరా ఆ వాక్యంలో మోదకం యేమీ లేనే లేదు. పాపం భాషరాగ రాజుకు నగుబాటు అయింది.

    మా సంగతీ అంతే! లేని మొసలిని తెచ్చి నీళ్ళలో పడేసి ఒకరిని దానికి ఆహారంగా కూడా వేసాము. కాని, అసలు మొసలిని తెచ్చినది శంకరయ్యగారే!

    చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  17. గురువుగారూ అద్భుతమైన ప్రహేళిక.
    నేమానివారూ మీ పాండిత్యం అమోఘం.

    రిప్లయితొలగించండి
  18. ఇరవై మంది స్త్రీలు ఒకటిగా చేతులు పట్టుకుని నదిలోకి దిగి మరల ఒకేసారి బయటికి వచ్చారని అర్థ మనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  19. హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘కామకరగ్రస్త’ ఆలోచన బాగుంది. కాని ‘తత్ర + ఏకా మకర’లో ‘ఏ’ ఏమయింది?
    *
    జిలేబి గారూ,
    మీ సమాధానం సరియైనది. అభినందనలు.
    అందులో ఒకరిని అంటే పురుషుడినే కానక్కర లేదు. ఎవరైనా కావచ్చు. ఎవరిని పట్టినా తిరిగి వచ్చేది 20 మందే కదా!
    అన్నట్టు ... మనలో మాట ... ఈ శ్లోకాన్ని ఇంతకు ముందే విన్నారా?
    *
    శ్యామల రావు గారూ,
    ఆసక్తికరమైన చక్కని కథను చెప్పారు. ధన్యవాదాలు.
    నా సంస్కృత జ్ఞానం అంతంతమాత్రమే అని చెప్పాను కదా!
    *
    కామేశ్వర రావు గారూ,
    అభినందనలు. మీరూ సరియైన సమాధానం చెప్పారు.
    ‘ఏకః + నా = ఒక పురుషుడు’ అని అర్థం. స్రీకాని వ్యక్తి అని కాదు.
    *
    పండిత నేమాని వారూ,
    చమత్కారమైన సమాధానం చెప్పారు. ఒకరకంగా చూస్తే ఇదే సరియైన సమాధానమా అనిపించేటంత యుక్తియుకంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. శంకరయ్యగారు,

    "నా" అంటే పురుషుడనే అర్థం వస్తుందా? ఇంటర్నెట్ నిఘంటువులో కనిపించలేదు.

    రిప్లయితొలగించండి
  21. కామేశ్వర రావు గారూ,
    నాకూ సరిగ్గా తెలియదు. మా గురువు గారి పుస్తకంలో అలాగే ఉంది. వారేమో సంస్కృతంలో ఉద్ధండపండితులు. పండిత గోష్ఠిలో సంస్కృతంలోనే ధారాళంగా సంభాషించే వారు. ఎన్నో సంస్కృతగ్రంథాలను రచించినవారు. వారు చెప్పారు కనుక సరియైనదే అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  22. నమస్కారములు . క్షమించాలి
    " నా [ అంటే ] = ప్రాతిపదికము " అనే అర్ధం ఉంది . నిఘంటువులో

    రిప్లయితొలగించండి
  23. శంకరార్యా,

    ఏకోనా ఎందుకు పురుషుడే కావాలని నాకెప్పుడు అర్థమయ్యేది కాదు. భైరవ భట్ల గారి పద విరుపు నాకు సరియైనది గా అనిపిస్తుంది. వింశతి స్త్రియాః, ఏకోనా, ఈ పద విరుపుతో అది కొంత అవగాహన కి వస్తుంది.

    ఈ ప్రహేళిక ఇంతకు మునుపే (చాలా కాలమునుపు మా సంస్కృత ప్రచార సభ లో సంస్కృతం చదివే రోజులలో మా సంస్కృతం మాష్టారు చెప్పగా విన్నాను - సంస్కృతం లో ఉత్సుకతని కలిగించడానికి ఇట్లాటివి చెప్పే వారు - చాలా కాలం తరువాత ఈ మధ్య మళ్ళీ ఒక సంవత్సరం మునుపు ఈ పద్యాన్ని ఒక ఆంగ్ల బ్లాగులో ఒక ఫారినెర్ ఓపికగా విశ్లేషించడం చదివాను. ఆ తరువాయి ఇప్పుడు మీ సదస్సులో !

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  24. శంకరయ్య గారి నిర్దేశం మేరకు ఒక చిన్న వివరణ . విస్తృతమైన చర్చ జరిగింది . అయితే "నా" అనే ఏకాక్షరానికి పురుషుడు అనే అర్థం వస్తుంది . ఇంకా ఖచ్చితం గా చెప్పాలంటే , "నరుడు" అనే అర్థం !!!

    "నా" శబ్దం , ఋకారాంతః పుంలింగం , ధాతృ శబ్దవత్ , పితృ శబ్దవత్ !

    ధాతృ శబ్దం ఇలా ఉంటుంది ; ఋకారాంతః పుంలింగో ధాతృ శబ్దః ; ధాతా - ధాతారౌ - ధాతారః

    అక్కడెలాగైతే , ధాతా అని ప్రథమా ఏకవచనమో ఇక్కడ , "నా" అని ప్రథమా ఏకవచనం, కాని అది శబ్దం మాత్రం "నృ"

    నృపతి , నృసింహం లో ఉన్న నృ అన్న మాట. కాబట్టి "నా" శబ్దానికి అర్థం ఇదమిత్థం గా చెప్పవలసి వస్తే "నరుడు" అని చెప్పాలి , మరి సమాస ఘటనం లో మాత్రం "నృ" అనే చేయాలి , ఎలాగైతే మనం ధాతృ విధి , శ్రోతృ మహాశయులు , పితృ కార్యం అంటామో ఇక్కడా అదే పద్దతి .

    ----------------- ------------------- ------------------------- ---------------------

    మరొక్క విషయం , మూడవ పాదం లో ఉన్నది - తత్రైకా మకరగ్రస్తా అని ఉంది . ఆకారాంతాలు ఎప్పటికీ స్త్రీ లింగాలనే సూచిస్తాయి , ఏవో కొన్ని క్వాచిత్కమైన మినహాయింపులు తప్ప.
    కాబట్టి , ఇక్కడ మొసలి నోట బడ్డది , ఆ ఇరవై మంది స్త్రీలలో ఒక్కతే తప్ప ఆ ఒక్క నరుడు కాదు . " తత్రైకః మకరగ్రస్తః " అనుంటే ప్రథమా ఏకవచన పుంలింగమయ్యుండేది - మగవాడిని మొసలి నోట్లో వేసేవాళ్లం !!!

    -------------------- --------------------------- ------------------------ --------------
    ఏతావాతా చెప్పొచ్చేదేమంటే , గంగా నది లో మొసలి ఉంది , ఆ మొసలి కి ఒక స్త్రీ ఆహారమైన మాటా వాస్తవమే , 21 మంది స్నానానికి వెళ్లి 20 మంది తిరిగిరావడమూ నిజమే ! అదీ సంగతి !!!

    రిప్లయితొలగించండి
  25. డా. విష్ణునందన్ గారూ,
    చిక్కుముడిని విప్పి చక్కగా వివరించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. ఇంకో చిన్న ఉపకథ . తాడిగడప శ్యామలరావు గారొక కథ ప్రస్తావించారు . అది హాలుడి కథ అని వ్యవహారం .హాలుడికి సంస్కృతంలో పిసరంత పాండిత్యం లేకపోయినా ఉందని చెప్పి , విదుషీమణి అయిన మహిళామణి తో పెళ్లి చేశారట .
    సరే , నూతన వధూవరులు జలక్రీడ కు బయలుదేరారు . సరస్సులో రాజుగారు , సరసంగా - రాణిగారిపై దోసిళ్లతో ,నీళ్లు చల్లడం ప్రారంభించారు. కాసేపు భరించాక ఆవిడ , మోదకైస్తాడయ ప్రభో ( మా + ఉదకైః , తాడయ = ఉదకైః నీళ్లతో , మా తాడయ కొట్టవద్దు ) అంది !

    దానిని మోదకైః = మోదకములతో , తాడయ = కొట్టు అని అర్థం చేసుకున్నాడు రాజు . అప్పటికప్పుడు పాకశాల నుండి కుడుములు తెప్పించి రాణీ గారి మీదికి విసరడం ప్రారంభించాడు , ఇంకేముంది ? సరసం కాస్తా విరసమైంది . రాజుగారి సంస్కృత పాండిత్యం బయటపదిపోయింది , అదే హాలుడు తరువాత , సంస్కృతం నేర్చుకుని , పండితుడు కావడం వేరే విషయం !

    నిజానికి " మోదకైస్తాడయ " లో కుడుములతో కొట్టు అనే అర్థం తీసుకోడం లో ఏ మాత్రం తప్పూ లేకపోయినా , సమయమూ సందర్భాన్ని బట్టి అన్వయం చేయలేకపోవడమే తప్పు !

    అంతే !

    రిప్లయితొలగించండి
  27. " నా " అనే అక్షరము తో అది పురుషుడు అని చెప్పలేము , కానీ ' ఏకః ' + నా = ఏకోనా అవుతుంది . పురుషుడినే ఏకః అంటాము . స్త్రీ ఐతే ' ఏకా ' అనాలి . కాబట్టి పురుషుడే ...ఇక పోతే నాకు తోఇన సమాధానము వేరే ఉంది ..( నేను పండితుడిని అస్సలు కాదు )

    గంగా నదికి ఒకడు కాదు , ఇరవై మంది స్త్రీలు స్నానానికి ఉద్యుక్తులయ్యారు , వారిలో ఒకామె మాత్రం సంక్రమణ వేళలో స్నానం చేసింది ( మకర గ్రస్తా అంటే మకర సంక్రమణము వేళలో దిగింది అని ) . కాబట్టి ' పునర్వింశతిరాగతాః ' అంటే మరలా ఆ ఇరవై మందీ వచ్చారు అని . ఎంతమంది వెళ్ళారో , అందరూ వచ్చారు , ఒకామె మాత్రం సంక్రమణ పుణ్యకాలం లో స్నానం చేసింది ' అని


    ఇక , పైన డా. విష్ణు నందన్ గారు చెప్పిన ' మోదకైస్తాడయ ' అనే కథ , భోజరాజు విషయం లో జరిగిందని చదివిన గుర్తు

    రిప్లయితొలగించండి
  28. ఇవ్వేళ ఇక్కడ.... హృద్యంగా సాగిన సంస్క్రత భాషా చర్చ (దాదాపు ఒక దశాబ్దం తదుపరి ఈ రోజున ఈ సం'భాష'ణ నా కంటబడటం నా అదృష్టంగా సంభావిస్తూ...) ఆసాంతం చదివి ఎంతగానో ఆనందించడం నా వంతయింది! ఈ చర్చను సుసంపన్నం చేసిన పండితులందరికీ (ప్రధానంగా కంది శంకరయ్య గారికి) ఇవే నా హృదయపూర్వక ధన్యవాదములు. - ఇట్లు: శివకుమార్ ఇవటూరి (సాహితీ శశి అంతరంగం)

    రిప్లయితొలగించండి