14, డిసెంబర్ 2011, బుధవారం

శ్రీసాయినాధుని ‘ఏకాదశ సూత్రాలు’

శ్రీసాయినాధుని ‘ఏకాదశ సూత్రాలు’

ఆ.వె.
శిరిడి జేరు టెల్ల సిరులకు మార్గమ్ము
సర్వదు:ఖహరము సర్వశుభము
నీదు దర్శనమ్ము నిత్యకళ్యాణమ్ము
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !

ఆ.వె. 
తనర నెవరి కైన ద్వారకామాయిని
జేరి నంత శాంతి చేరు వగును
అరయ నార్తు డైన నిరుపేద యైనను
శ్రీని వాస సాయి !శిరిడ రాజ !

ఆ.వె.
పరమపురుష ! నీవు భౌతికదేహమ్ము
వీడి వరసమాధి కూడి యున్న
నాడు సైత మవని నప్రమత్తుండవే
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !

ఆ.వె.
నీదు భక్తజనుల నిత్యరక్షణభార
మొనసి వరసమాధి ముఖమునుండె
మోయు చుంటి వెంత మోదమ్ము రా నీకు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

ఆ.వె.
శ్రీ సమాధి జేరి చేయెత్తి పిలిచిన
పలికి మాటలాడు ప్రభుడ వీవు
శ్రీ సమాధినుండి చేయెత్తి దీవించు
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !

కం.
నిన్నాశ్ర యించు వారిని
పన్నుగ నిను శరణు జొచ్చు భక్తజనుల నా
పన్నులను రక్షసేయుట
యెన్నగ నీ బాధ్యత యని యెంతువు సాయీ !

కం.
నీయందు దృష్టి నిలుపుచు
పాయక నిను కొలుచు నట్టి భక్త జనుల పై
శ్రీయుత నీదు కటాక్ష మ
మేయము గా బరపుచుందు మేలుగ సాయీ !

ఆ.వె.
సత్య మెరుగ లేక సంసార బంధాల
జిక్కి బాధలొందు జీవజనుల
బరువు మోయ నీవు ప్రత్యక్ష మౌదువు
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !

ఆ.వె.
ఎవరు గాని నిన్ను యెద నిండ భావించి
నీసహాయము కొర కాస పడిన
తత్క్షణాన నీవు తగ నాదు కొందువు
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !

కం.
శ్రీ భాగ్య నిధులు గూడుచు
నీ భక్తుల గృహములెల్ల నిండారును నీ
యే భక్తుని గృహ మైనను
శోభనమే – లేమి చొరదు శుభకర సాయీ !

ఆ.వె.
సర్వ కార్య ధర్మ నిర్వహణము లన్ని
శ్రీసమాధినుండె జేతు ననుచు
మాట యిచ్చి మమ్ము మన్నించినావురా
శ్రీ నివాస సాయి ! శిరిడి రాజ !

రచన
శ్రీ లక్కాకుల వెంకట రాజారావు గారు

2 కామెంట్‌లు:

  1. నీదు సూత్రముల సమాదృతి వర్ణించె
    నేర్పు మీర సుకవి నెమ్మనమున
    నతని రాజరావు నభినుతింతును వేడ్క
    శ్రీనివాస సాయి! షిరిడి రాజ!

    రిప్లయితొలగించండి
  2. భక్తి రస పూరిత మైన శ్రీ సాయి పద్యములు బాగున్నాయి రాజా రావుగారు . ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి