11, డిసెంబర్ 2011, ఆదివారం

సమస్యాపూరణం - 557 (తునికి సాయపడుము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
తునికి సాయపడుము కనుము సుఖము
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

19 కామెంట్‌లు:

  1. ఒరుల కింత నిడిన నొన గూడు సిరు లెన్నొ
    ఉన్న దాని లోన నుచిత రీతి
    తలచి మదిని సుంత దారిద్ర్య ఋణ పీడి
    తునికి సాయపడుము కనుము సుఖము

    రిప్లయితొలగించండి
  2. ధనము బలము కలుగు మనుజాధముల జేర
    ఛీత్కృతులు లభించు సిరులు రావు
    ధర్మనిరతుడయ్యు ధనహీనుడైన యా
    ర్తునికి సాయపడుము కనుము సుఖము

    రిప్లయితొలగించండి
  3. కస్టసుఖములందు కార్యసాధనమందు,
    భీతియందు ఘనవిభూతియందు,
    తోడునిలచునట్టి ధుర్యుండునౌస్నేహి
    తునికి సాయపడుము కనుము సుఖము.

    రిప్లయితొలగించండి
  4. బలము ధనము విద్య పరమాత్మ కృప యంచు
    పరుల హితము గోరి బ్రతుక వలదె
    అంగ బలము లేక వంగిన ముది బాధి
    తునికి సాయ పడుము కనుము సుఖము

    రిప్లయితొలగించండి
  5. వెంకట రాజారావు . లక్కాకులఆదివారం, డిసెంబర్ 11, 2011 1:46:00 PM

    పేద గొప్ప యన్న భేద మెరుగదు నీ
    చివరి దాక నిలిచి శ్రీలు గురియు
    చెలిమి గొప్ప దనము తెలుసు కోరా స్నేహి
    తునికి సాయ పడుము కనుము సుఖము

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఉపకారికి నుపకారము
    విపరీతము గాదు సేయ - వివరింపంగా
    నపకారికి నుపకారము
    నెపమెన్నక జేయువాడె - నేర్పరి సుమతీ!(స్ఫూర్తితో)

    01)
    _____________________________________

    మేలు చేయు వార్కి - మేలుచేసిన గని
    మెత్తురందరు నిను - మేలె, గాని
    మేలు గోరనట్టి - కూళయగు పగ
    తునికి సాయపడుము - కనుము సుఖము !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  7. మదము ధనము లుండు మనుజుని సేవింప
    భయము జెందు రకట బటులు గూడ
    ధర్మ బద్ధు డగుచు ధన హీను డైన నా
    ర్తునికి సాయ పడుము కనుము సుఖము .

    రిప్లయితొలగించండి
  8. భక్తి గలిగి యుండి పరమపావనుడైన
    వాని, గుణము గలిగి పాపచింత
    మనమునందు లేని మాయని దైవభ
    క్తునికి సాయపడుము కనుము సుఖము.

    పామరజనులీ రీతిని
    నేమము తప్పుచు పలికిన నిక్కము కాదే!
    క్షేమము గోరిన నెవరిక
    తామస గుణ పూర్ణు డంద్రు దత్తాత్రేయున్ ?

    రిప్లయితొలగించండి
  9. నేటి సమస్య 'తునికి సాయపడుము కనుము సుఖము' ను పూరించుటలో యింతవరకు వాడబడిన మాటలు:
    గోలివారు: పీడితునికి
    నేమానివారు, సుబ్బారావుగారు: అర్తునికి
    సంపత్కమారులవారు, రాజారావుగారు: స్నేహితునికి
    గన్నవరపువారు: బాధితునికి
    వసంతకిశోరులు: పగతునికి
    మందాకినిగారు: భక్తునికి
    అయితే, యీ మాటలన్నటినీ నొక విశేషమేమనగా, 'నకు' బదులు 'నికి' యని వాడుట. ఇది యెంతవరకు లాక్షణిమన్నది నా యనుమానము.
    నాకు తెలిసి, పీడితునకు, ఆర్తునకు, స్నేహితునకు, బాధితునకు, పగతునకు, భక్తునకు అనునవి లాక్షణికములు.
    రెండు విధముల రూపములు (ఉదా:ఆర్తునకు, ఆర్తునికి) సాధువులేనా యనునది విచార్యము.

    రిప్లయితొలగించండి
  10. మానవునకు సేవ మాధవ సేవయే
    ననుచు నమ్మినట్టి హరిభక్తునకు సాయ
    పడిన ముక్తి దొరకు ఫలముగను; భగవం
    తునికి సాయ పడుము కనుము సుఖము .


    శ్యామలీయం గారు, మీరు చెప్పిన తరువాత నాకూ తెలిసింది. అందుకే ఈ పూరణ.

    మానవసేవ చేసి అదే మాధవ సేవ యని నమ్మే నిజమైన భక్తునికి సాయపడితే ముక్తి దొరకుతుంది. అట్టి మహనీయుని భగవంతునిగానే తలచి సాయపడమని భావన.

    రిప్లయితొలగించండి
  11. శామలరావు గారూ ! మీరు చెప్పేవరకు అటు వైపు ఆలోచన మళ్ళలేదు.మీరు అభిప్రాయం సమంజస మేమో ననిపిస్తున్నది. కానీ వాడుక భాషలో తునికి,తునకు రెండూ ప్రయోగిస్తాము.ప్రయోగము సరియైనదా కాదా విజ్ఞులు తెలపాలి.

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు వందనాలు.
    ఈరోజు ఉదయం సమస్య ఇచ్చి వేములవాడకు వెళ్ళి శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనం చేసికొని ఇప్పుడే వచ్చాను.
    ‘నికి’ ప్రయోగానికి సంబంధించిన అభ్యంతరాన్ని (సందేహాన్ని) చూసాను. ఇప్పుడు నాకూ సందేహం కలిగింది. ఇంట్లో ఉన్న బాలప్రౌఢవ్యాకరణాలను మా బంధువు పరీక్షలకని తీసుకువెళ్ళాడు.
    ముందుగా ‘గూగులమ్మ’ను అడిగితే కేవలం వ్యావహారిక ప్రయోగాలలో మాత్రమే ‘రామునికి, దేవునికి, మిత్రునికి...’ మొదలైనవి కనిపించాయి. గ్రాంధికభాషలో మాత్రం ‘రామునకు, దేవునకు, మిత్రునకు ..’ మొదలైన రూపాలు కనిపించాయి.
    సందేహం తీరక సూర్యరాయాంధ్ర నిఘంటువులో కి - కు ల అర్థాలను చూస్తే క్రింది వివరణ ఉంది.
    కి - కు (ప్రత్యయము, ద్రుతాంతము)
    షష్ఠీవిభక్తియందు ‘ఇ, ఈ, ఐ లకు తరువాత ప్రాయికముగా ‘కి’యును, మిగిలిన యచ్చుల తరువాత ‘కు’ను వచ్చును. ఉదా. హరికి, స్త్రీకి, పైకి (ప్రాయిక మనుటచే ‘నీకు, ఈకు, మీకు’ ఇత్యాదులయందు రాదు)
    నావద్ద ఉన్న కొన్ని కావ్యాలలోని షష్ఠ్యంతాలను గమనించాను. అన్నింటిలోను పై నియమమే పాటింపబడింది. అంతెందుకు పండిత నేమాని వారి అధ్యాత్మ రామాయణములోని షష్ఠ్యంతాలు కూడా ఈ నియమాన్నే అనుసరించాయి.
    వీలైతే ఆ వ్యాకరణ గ్ర్రంథాలను రేపు తెచ్చుకొని వివరంగా తెలియజేస్తాను.

    రిప్లయితొలగించండి
  13. మిత్రులారా!
    ఒక చిన్న సంశయము రావడము, దానిని శ్రీ శంకరయ్య గారు కూడా తీర్చలేక పోవుట - ఆశ్చర్యకరమే. నేను బాల వ్యాకరణమును పరిశీలించేను. డుమంతములకు నిగాగమంబు సర్వత్ర యగునని యున్నది. అందుచేత ఆర్తునికి, హితునికి, మొదలైన ప్రయోగములన్నియును సాధువులే - ఎట్టి సందేహమును అక్కరలేదు. అనవసరముగా ఇట్టి సంశయము ఎందరినో ఇబ్బందిలో పడవేసినది. ఇకపై ఇట్టి ఇబ్బందులు రాకుండా యుండునని ఆశించుదాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. శ్రీగురుభ్యోనమ:

    పరవశంబుగూర్చు పండితార్యులపల్కు
    శంకలెన్నొ దీర్చు శంకరయ్య
    శ్యామలీయకవియు సహకరించుచు పండి
    తునికి సాయపడుము కనుము సుఖము

    రిప్లయితొలగించండి
  15. 3 వ పాదమును
    "శ్యామలీయ కవియు నాదరమున పండి
    తునికి"
    గా చదువుకొనవలసినదిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  16. శంకరార్యా ! ఈ రోజు శ్యామలీయం గారి సందేహానికి
    మొత్తం శంకరాభరణమే ఉలిక్కిపడింది !
    మొత్తంమీద సందేహాలూ , సమాధానాలూ విఙ్ఞానవంతముగా నున్నవి !

    నాదొక చిన్న సందేహం ! సమస్యగా యివ్వబడిన పాదం అర్థవంతముగా ఉండనక్కర లేదా ?
    తునికి సాయపడుము - అంటే బీడీ చెట్టుకు సాయపడమనేనా ?
    నాకు వేరే అర్థం లభించలేదు

    ఇంతవరకూ శంకరాభరణం లో ఒక క్రమ పద్ధతిలో ఏ సమస్య
    క్రింద దాని పూరణలే ఉంటూ వస్తున్నవి !

    మనమెప్పుడైనా వెనక్కి వెళ్ళి చదువు కున్నా ,
    నూతన సందర్శకులు యినుమడించిన ఉత్సాహంతో
    పాత పూరణలు పరిశీలించాలనుకున్నా ఎంతో సౌలభ్యంగా ఉంటూ వస్తోంది !

    ఈ మధ్య కొందరు తెలిసో తెలియకో పాతవీ కొత్తవీ కలిపి
    శంకరాభరణాన్ని " కలగూర గంప" చేస్తున్నారు !
    అవి నిజంగా పానకంలో పుడకలే !

    అద్దానిని మీరు సమర్థించడమే అస్సలు బావులేదు !
    రేపేప్పుడైనా సంకలనం చెయ్యాలన్నా యిబ్బందే గదా !

    పూరణను మీ దృష్టికి తేవాలనుకోవడం వరకూ బాగానే ఉంది గాని
    దానికి ఈ కలగాపులగం పద్ధతి కాకుండా వేరే పద్ధతుల
    నాశ్రయిస్తే( ఎస్ ఎమ్ ఎస్) బావుంటుందని నా ఉద్దేశ్యం ! కొంచెం ఆలోచించండి !
    యిబ్బందేమీ లేదనుకుంటే సరే !

    రిప్లయితొలగించండి
  17. కిశోర మహోదయుల
    సమస్యగా యివ్వబడిన పాదం అర్థవంతముగా ఉండనక్కర లేదా ?
    అన్న సందేహం నన్నూ పీడిస్తోంది.

    రిప్లయితొలగించండి
  18. నేమాని వారు మన్నించాలి. అనవసరమో, అవసరమో కలిగిన సందేహమును విజ్ఞుల దృష్టికి తీసుకొని రావటం జరగిందే గాని యేదో రంధ్రాన్వేషణోద్దేశ్యం చేతగాదని మనవి.

    రిప్లయితొలగించండి
  19. అయ్యా ! శ్యామలీయంగారూ !
    మీ సందేహానికి అందరూ భుజాలు తడుముకున్నారు గదా !
    మీది రంధ్రాన్వేషణ యెంతమాత్రం కాదు !

    సందేహాన్ని వెలిబుచ్చడమేగదా ఙ్ఞాన సముపార్జనకు మొదటి మెట్టు !

    ఆ మెట్టుకు మేమెంతదూరంలో ఉన్నామో కూడా తెలియని పరిస్థితి మాది !
    మీ సందేహం వలననే మీతో పాటూ మాకు కూడా ఙ్ఞాన భిక్ష లభిస్తోంది !

    రిప్లయితొలగించండి