6, డిసెంబర్ 2011, మంగళవారం

నా కవిత్వం - 2

                               నవ వధువు

కం.
నునుసిగ్గు దొంతరలు మో
మున దాగుడుమూత లాడ, ముత్తైదువ లె
త్తిన తలను వంచు నెపమున
మనమున నున్నట్టి భావమాలిక దాచెన్.


కం.
ఎక్కడను లేని భావము
లొక్కుమ్మడి నాక్రమించెనో? యామె ముఖం
బొక్కొక్క రంగు మారుచు
చక్కఁగ నెఱుపెక్కె; సిగ్గె జయమును పొందెన్.


చం.
చెలులు ముదంబునన్ పరిహసింపగఁ గోపముఁ జూపు; వారితో
పలుకక మోముఁ ద్రిప్పుకొను; బంధువు లెందరొ వచ్చి చూడ, చూ
పుల నొకమారు వారియెడఁ బోవగనిచ్చి మరల్చు; పెండ్లిపీ
టల తలపోసినంతనె తటాలున నామె మనమ్ము భీతిలున్. 


సీ.
పెళ్ళిపందిరిలోన కళ్ళింతలుగఁ జేసి
          కొని బంధువుల్ దనన్ గనుగొనంగ
బ్రాహ్మణుండు చదువు పావనమంత్రమ్ము
          లలనల్ల శ్రుతిపేయమై చెలంగ
ఆహ్వానితులు సేయునట్టి ప్రశంసల
          నందుకొనంగ సిగ్గడ్డురాగ
అప్పుడప్పుడు వరుం డప్పగించెడి దొంగ
          చూపులం జూడగా నోపలేక
తే.గీ.
భయము నయమును బిడియముల్ పల్లవించి
పూచి సుఖదుఃఖభావముల్ పొందఁజేయ
నెటులొ యన్నింటి దిగమ్రింగి యింతొ యంతొ
యందఱకు మోదమును గూర్చె సుందరాంగి.
 

కం.
తలిదండ్రుల నెడబాసెడి
కలకంఠికి కంటినుండి కన్నీ రొలికెన్
చెలులను విడనొల్లకఁ దా
విలపించెను నవవధువు సభీతిన్ ప్రీతిన్.

                                                                                   (18 - 12 -1970)
నేను కళాశాలలో చదువుకొంటున్న సమయంలో వ్రాసింది. పాతకాగితాలు వెదుకుతుంటే దొరికింది. ఇందులో చివరి పద్యం నేను వ్రాసిన మొదటి సలక్షణమైన కందపద్యం. అది వ్రాసిన తర్వాతే మిగతాపద్యాలు వ్రాసి దీనిని ఖండకావ్యాన్ని చేసాను.

10 కామెంట్‌లు:

  1. గురువు గారు,
    చాలా బాగుంది. కూతురిని పెళ్ళి కూతురుగా చూసేటపుడు (తండ్రి మనసులోకలిగిన భావాలనిపించాయి.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది . చదువుతున్నంత సేపు నవ వధువు హావ భావాలతో కళ్ళ ముందు కనబడు తోంది

    రిప్లయితొలగించండి
  3. గురు తుల్యులకు నమస్కారములు.మీ నవ వధువు
    కవిత్వమునకు నా స్పందన .తప్పులు క్షమించ గలరు.
    -------------------------
    నవ వధువు చూడ మధురము
    నవ నవ లాడంగ నుండి నవ్వుల మోమున్
    నవ్వులను గలుగ జేయుచు
    సద్వనితగ పేరు పొందె సహ వనితల లోన్

    రిప్లయితొలగించండి
  4. -------------------------
    నవ వధువు చూడ మధురము
    నవ నవ లాడంగ నుండి నవ్వుల మోమున్
    నవ్వులను గలుగ జేయుచు
    సద్వనితగ పేరు పొందు సహ వనితల లోన్ .
    ----------------
    చిన్న సవరణ

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా ! మీ నవ వధువును చూస్తుంటే...

    నవలా నాయిక జూడగ
    నవ వదువుగ నైన వేళ నాలుగు రేఖల్
    నవ రసముల చూపెడి మన
    నవ బాపూ బొమ్మ వోలె నవ్యత దోచెన్.

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యా ! చక్కగా నున్నది మీ నవవధువు !
    కానీ యీ కాలంలో కాదేమో !

    అక్కడ తేదీ చూస్తుంటే
    "చిరుత కూకటినాడె " - అన్న శ్రీనాథుని పద్యం గుర్తుకొస్తోంది !

    రిప్లయితొలగించండి
  7. మందాకిని గారూ,
    రాజేశ్వరి అక్కయ్యా,
    హనుమచ్ఛాస్త్రి గారూ,
    వసంత కిశోర్ గారూ,
    ............. ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    ధన్యవాదాలు. మీ పద్యంలో ప్రాస తప్పింది.

    రిప్లయితొలగించండి
  8. "...సభీతిన్ ప్రీతిన్" బాగుంది, మాస్టారూ. మీరీ పద్యం వ్రాసి ఇప్పటికి 41 ఏళ్ళయింది. పద్యరచన సజీవంగా సాగిపోతూనే వుంటుంది సార్. తరాలు మారినా విత్తనం లోని జీవం తిరిగి వాటినే పుట్టిస్తుందన్నట్లు పద్యంలోని జీవం తిరిగి పద్యాన్ని పుట్టిస్తూనే ఉంటుంది. జీవేమ శరదశ్శతం...

    రిప్లయితొలగించండి
  9. గురువులకు నమస్కారములు.ప్రాసను సవరించి వ్రాసాను.

    నవ వధువు చూడ మధురము
    నవ నవ లాడంగ నుండి నవ్వుల మోమున్
    అవయవ పుష్టియు కలిగియు
    వనితల లోకెల్ల మంచి వనితగ నుండున్

    రిప్లయితొలగించండి
  10. కం.
    హెచ్చిన నవ లావణ్యము
    విచ్చిన పూవంటి సొగసు, బిడియము తోడై
    ముచ్చట దీర్చగ నత్తిలు
    జొచ్చెను నవ వధువు వంశశోభల బెంచన్ !!

    రిప్లయితొలగించండి