25, డిసెంబర్ 2011, ఆదివారం

రాజమౌళి యొక్క ఆభరణములు

శ్రీమదాది శంకర విరచితమయిన 
శివానందలహరి 
                         అనే స్తోత్రములోని ఈ శ్లోకమును చూడండి:

జడతా, పశుతా, కళంకితా,
కుటిలచరత్వంచ నాస్తి మయి దేవ!
అస్తియది రాజమౌళే!
భవదాభరణస్య నాస్మి కిం పాత్రం?

భావము:  
ఓ రాజ మౌళీ! (చంద్రకళను ధరించిన పరమ శివా! లేక రాజులలో
శ్రేష్ఠమైన వాడా!) నాలో గంగ వలె జడత్వము గాని, నంది వలె పశుత్వము గాని,
చంద్రుని వలె కళంకితత్వము గాని , నాగరాజు వలె వక్రగమనము గాని లేవు.
ఒకవేళ అట్టిదేమైనా ఉంటే నీకు ఆభరణముగా అర్హుడిని అయి ఉండేవాడిని కదా!  ఈ
శ్లోకము ద్వారా వ్యంగ్యంగా అప్పటి రాజ ఆస్థానములలో ఉద్యోగము కొరకు ఎట్టి
లక్షణములు ఉండేవో వివరించారు శ్రీ మదాది శంకరాచార్యులు.


                                          శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

3 కామెంట్‌లు:

  1. సోదరులు శ్రీ పండిత నేమాని వారికి శిరసాభి వందనములు.
    శ్రీ ఆది శంకరాచార్యుల వారి భక్తి తో కూడిన వ్యంగం బాగుంది. మరి ఒక చిన్న మనవి
    " రమణ మహర్షి " స్నానం చేసాక తుడుచుకునే తువ్వాలుకి బోలెడు కన్నాలు అదే చిరుగులు ఉండేవట . అప్పుడు , ఒక భక్తుడు చూసి
    " స్వామీ ! ఇంత చినిగిన తువ్వాలు వాడుకోవడం ఎందుకు మేము ఇంత మంది ఉండగా మీకు ఒక కొత్త తువ్వాలు కొని ఇవ్వలేమా ? అని " . అంటే అప్పుడు రమణుల వారు " ఇవి చిరుగులా కావు కావు ! ఇంద్రునికి వేయి కళ్ళు ఉన్నాయి, ఇది ఇంద్రుని వంటిది. నేను ఇంద్రు డినే తువ్వాలు గా చేసు కున్నాను " అన్నారుట . మరి ఇది భక్తా ? భక్తితో కూడిన వ్యంగ్యమా ? ఇంద్రు డంతటి వాడిని తువ్వాలుగా చేసు కోగలిగానన్న ఆనందమా ? మన్నించాలి నాకు , తెలియక అడుగు తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. అమ్మా! శ్రీ రమణ మహర్షుల సమాధానమును గురించి మీరు సందేహమును వెలిబుచ్చేరు. మహాత్ముల ఆంతర్యమును గ్రహించుట చాల కష్టము. వారు వినోదముగా గాని వ్యంగ్యంగా గాని మాటాడి ఉండరు. వారి నోటినుండి వచ్చిన మాటలు వ్యర్థములు కావు. మీరే జాగ్రత్తగా ఆలోచించండి. నా ప్రయత్నము నేనూ చేస్తాను. కొద్ది రోజులలో సమాధానము చెప్తాను. మీకు ఒక సలహా చెప్తాను. పరమ శివుని యొక్క ఒక రూపము శ్రీ దక్షిణా మూర్తి. వారిని భక్తితో తలచుకుంటే ఎటువంటి సందేహమైన తీరుతుంది అంటారు. అలాగ కూడా ప్రయత్నించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. ధన్య వాదములు. తమరి సలహాను తప్పక అనుక రిస్తాను. సెలవు

    రిప్లయితొలగించండి