11, డిసెంబర్ 2011, ఆదివారం

సమస్యాపూరణం - 556 (ధర్మము వీడు వారలకు)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది
ధర్మము వీడు వారలకు తప్పక కల్గును శాంతిసౌఖ్యముల్.
(ఆకాశవాణి- విజయవాడ వారి సౌజన్యంతో)

14 కామెంట్‌లు:

  1. 'ధర్మము నిల్పు వారలకు ధారుణి కష్టము ' లంద్రు ధర్మమా?

    ధర్మము రక్ష జేయు గద ధర్మమునే తగు రక్ష జేయగా
    "కర్మము" నేడు భారతపు గాధలు భాగవతమ్ము జెప్పినన్
    'ధర్మము నిల్పు వారలకు ధారుణి కష్టము లంద్రు' చూడ నా
    ధర్మము వీడు వారలకు తప్పక కల్గును శాంతిసౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  2. నాలుగవ పాదం లో 'ధర్మము' అంటే 'స్వభావము' గా అర్థము తీసుకొన మనవి.

    రిప్లయితొలగించండి
  3. పేర్మి సమాజమందునలభింపదశాంతి చెలంగునిద్ధరన్
    ధర్మము వీడువారలకు, తప్పక కల్గును శాంతిసౌఖ్యముల్
    మర్మమెఱింగి యీశ్వరుని మంత్రజపమ్ముల పూజచేసి దు
    ష్కర్మముబాసి శ్రేష్ఠము సుకర్మచయంబులనాచరించినన్.

    రిప్లయితొలగించండి
  4. వెంకట రాజారావు . లక్కాకులఆదివారం, డిసెంబర్ 11, 2011 4:39:00 PM

    ధర్మము తల్లి దండ్రి గురు దైవము లన్ మది గొల్వ భక్తి తో
    ధర్మము భార్య బిడ్డల ముదమ్ముగ జూచుట ,దేశ సేవయున్
    ధర్మము పేద సాదల కుదారముగా దగ నివ్వ సంతతా
    ధర్మము వీడు వారలకు తప్పక కల్గును శాంతి సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  5. కర్మము నాచరింపుమని కాలుని కోరల చిక్కువేళ నీ
    ధర్మము నిన్నుగాచునని దైవము పల్కెను వేదమందు నీ
    మర్మము దెల్పువారియెడ మన్నన జూపక గేలి చేయు దు
    ర్ధర్మము వీడు వారలకు తప్పక కల్గును శాంతి సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  6. పేర్మినిచూచుచుట్టములె పేరున బిల్వక నాదరింపరే?
    కూర్మిమెలంగువారిపుడు క్రూరవిరోధముబూనిరే?కలిన్
    ధర్మము గానెరింగి,మది తత్ పరులందు చెలంగు అక్షమా
    ధర్మము వీడు వారలకు తప్పక కల్గును శాంతి సౌఖ్యముల్.

    రిప్లయితొలగించండి
  7. శ్రీగురుభ్యోనమ:

    నిర్మల జిత్తమున్ కలిగి నీతిని వీడక నాచరించుచున్
    ధార్మిక దృష్టినిన్ జగతి దైన్యము దీర్చగ దీక్షపూనుచో
    ధర్మము వీడు వారలకు తప్పక కల్గును శాంతి సౌఖ్యముల్
    ధర్మము మారుచుండుకద ధాత్రిన జూడగ జాతి జాతికిన్

    ధర్మమన్నది జాతి జాతికి, ప్రాణిప్రాణికీ మారుతూంటింది. ఎవరి ధర్మం వారికి గొప్పయేకద. రాక్షసులకు మానవులను తినుట ధర్మము. పులికి గోవును తినుట ధర్మము. ఇటువంటి ధర్మాలు ఆచరింపబడనపుడు
    అనుభవిచేవారికి, అనుభవింపబడేవారికి కూడా శాంతి కల్గుతుందనే భావంలో వ్రాశాను.
    నా భావంలోగానీ పద్యంలోగానీ లోపములున్నచో సవరింప ప్రార్థన.
    అకాశవాణిలో వినిపించిన పూరణలను ఒకటి రెండు [లభించినచో] ప్రకటింప ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ధర్మం కాలానుగుణ్యం !
    పూర్వం యివన్నీ ధర్మమే యైనా నేడు ఆచరణీయం కావు !
    గావున వర్జించుటయే యెల్లరకూ మేలు !

    01)
    ______________________________________________

    ధర్మమె నేటికాలమున - ధారుణి యంతయు నాక్రమించుటల్
    (యుద్ధోన్మాదం)
    ధర్మమె నేటికాలమున - తక్కువ యెక్కువ లంచు నిక్కుటల్ ?
    (అస్పృశ్యత)
    ధర్మమె నేటికాలమున - తప్పని రాజ్యపు వారసత్వముల్ ?
    (రాచరికం)
    ధర్మము వీడు వారలకు - తప్పక కల్గును శాంతిసౌఖ్యముల్ !
    ______________________________________________

    రిప్లయితొలగించండి
  9. మిత్రుల పూరణలు అద్భుతంగా నున్నాయి.

    నిర్మల మానసుండు గడు నేర్పున సల్పును జీవ యాత్రనున్
    ధర్మముఁ జింత నిల్పుచును దక్కునె గాకను పుణ్యసంపదల్
    ధర్మము వీడు వారలకు, తప్పక కల్గును శాంతిసౌఖ్యముల్
    ధర్మము లాచరించుచు నుదారత హింసను వీడు వారికిన్

    రిప్లయితొలగించండి
  10. ధర్మము ధర్మమంచు పర దారను దెచ్చితి నంచు మూడు నా
    కర్మ మటంచు రాముడన కాదు నరుండని యంచు కోతి! నీ
    మర్మములన్ వచించుటలు మానుము రాక్షసులందు తథ్యమౌ
    ధర్మము వీడు వారలకు - తప్పక కల్గును శాంతిసౌఖ్యముల్ !

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్న మహాశయా ! మీ పద్యానికి కొంచెం
    భావ సందర్భము లవసరమనుకొంటాను !
    ఇవ్వగలరా ?

    రిప్లయితొలగించండి
  12. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మందాకిని గారూ,
    ఊకదంపుడు గారూ,
    శ్రీపతి శాస్త్రి గారూ,
    వసంత కిశోర్ గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మిస్సన్న గారూ,
    అందరి పూరణలు దేనికదే బాగున్నవి. అభినందనలు.
    ఎవరి పూరణలోను సవరించదగ్గ దోషాలు కన్పించలేదు. సంతోషం!

    రిప్లయితొలగించండి
  13. మర్మములన్నియున్ గఱచి మారణహోమపు యుద్ధకాండనున్
    చర్మములన్ని యొల్చుచును చారెడి కళ్ళను కప్పిపుచ్చుచున్
    నిర్మల రాజకీయమున నేర్పరు లౌచును శుక్రనీతితో
    ధర్మము వీడు వారలకు తప్పక కల్గును శాంతిసౌఖ్యముల్

    రిప్లయితొలగించండి