3, డిసెంబర్ 2011, శనివారం

సమస్యా పూరణం - 547 (భానుకాంతితో తారలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
భానుకాంతితో తారలు ప్రభలఁ జెలఁగె.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

43 కామెంట్‌లు:

  1. నా పూరణ ....

    ఆకసమ్మున మిన్కుమి న్కనుచు వెల్గు
    చుక్కలు స్వయంప్రకాశ సంశోభితములు
    గా వనుచు శాస్త్రములు చెప్పెఁ గనుఁడు నిజము
    భానుకాంతితో తారలు ప్రభలఁ జెలఁగె.

    రిప్లయితొలగించండి
  2. వంద రోజుల వేడుక బరగ నచట
    వేల ప్రేక్షక జనమును వెలుగులీను
    వేదికందున ' హిట్ జంట ' వేషగాండ్లు
    భాను,కాంతి తో తారలు ప్రభలఁ జెలఁగె.

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నాయికానాయకుల పేర్లతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
    ‘వేదిక + అందున’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘వేదికను జేర’ అందాం. ‘వేషగాండ్లు’ అంటే పురుషులకే వర్తిస్తుంది కదా. హిట జంటలో నటి కూడా ఉంది కదా!

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    __________________________________

    అంధకారంబు వ్యాపించు - నఖిల జగము
    భానుడే లేని భూమిపై - ప్రభలు లేక !
    భానుడే లేని భూమిపై - బ్రతుకు లేదు !
    భానుకాంతితో తారలు - ప్రభలఁ జెలఁగె !
    __________________________________
    తార = కనుగ్రుడ్డు

    రిప్లయితొలగించండి
  5. మాస్టారు గారూ ! ధన్యవాదములు.
    నా పూరణ సవరణతో ...

    వంద రోజుల వేడుక బరగ నచట
    వేల ప్రేక్షక జనమును వెలుగులీను
    నటుల వేదిక యుండగ ' నటుల జంట'
    భాను,కాంతి తో తారలు ప్రభలఁ జెలఁగె.

    రిప్లయితొలగించండి
  6. మింట నుండెడి తారలు మెఱయు నిశిని
    పుడమి పై నున్న ప్రాణుల పుణ్య మేమొ
    పగటి పూటను నడయాడు పడతు లనగ
    భాను కాంతితో తారలు ప్రభల జెలగె !

    రిప్లయితొలగించండి
  7. భానుడును నొక తారయే , ప్రభలు జిమ్ము
    దార లెల్లను స్వయముగా ,దనర గొన్ని
    సామ్యమున ఘన తరము లుజ్జ్వల సమధిక
    భాను కాంతితో తారలు ప్రబల జెలగె

    సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  8. సరస శంకరాభరణ విశాల వాఙ్మ
    యాంబరమ్మున తారలై యలరు కవులు
    శారాదా సత్కృపామృత సార దివ్య
    భాను కాంతితో తారలు ప్రభల జెలగె

    రిప్లయితొలగించండి
  9. తారల బట్టే పూరణలు కదా. ఈనాటి పూరణలు ఆదినుండి అలరిస్తున్నాయి.
    శ్రీ శంకరయ్య గారు, శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు. శ్రీ వసంత్ కిశోర్ గారు, శ్రీ రాజా రావు గారు, శ్రీమతి రాజేశ్వరి గారు .. చక్కగా పోటీ పడుచున్నట్లు పంపేరు. అందరకు అభినందనలు. ఇంక ఎవరినైన వదిలేస్తే వారికి కూడా పేరు పేరునా అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. నేమానివారికి ధన్యవాదములు !

    ఎందుకో తారలు చుక్కలూ అనగానే పదేపదే దేవులపల్లి వారే గుర్తొస్తున్నారు!
    మిత్రులతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను !

    ******చుక్కలు********

    మింట నెచటనొ మెరయు చుక్కల
    కంట చూచితి కాంక్ష లూరగ
    కాంక్షలూరిన కొలది చుక్కలె
    కాంచి బ్రదుకే గడపితిన్

    పక్షి వలె నాకాశ నిర్మల
    పథవిహార స్వేచ్ఛగోరితి
    పక్షములు లేవంచెరుంగక
    ప్రాకులాడుచు పొగిలితిన్

    తళుకు బంగరు తారలేలా?
    తలకు మీరిన తలపు లేలా ?
    వలచి పొందగ గగన సుమములు
    కలయె జీవితము !

    (దేవులపల్లి వారి " కృష్ణపక్షం " నుండి)

    రిప్లయితొలగించండి
  11. ------------------------------------------------
    భాను కాంతుల వలన నె ప్రజలు నిలను
    భాను కాంతుల వలన నె పక్షి గణము
    లోటు లేకుండ జీవంబు గడుపు నటుల
    భాను కాంతితో తారలు ప్రభల జెలగె .

    రిప్లయితొలగించండి
  12. అయ్యా వసంత్ కిశోర్ గారూ!
    శ్రీ దేవులపల్లి వారు వాడినది "ముత్యాల సరాలు" అనే ఛందస్సు. గణాలు: మాత్రా ఛందస్సు: 3 +4 + 3 + 4 మాత్రల గణాలతో మూడు పాదాలలోను, ఆఖరి పాదములో 3 + 4 మాత్రల గణములు + 1 గురువుతోను ఉంటాయి. యతి ప్రాస నియమములు లేవు. ప్రాస గాని లేక సమానమైన ఆద్యక్షరమును వాడితే విన సొంపుగా ఉంటుంది. దీనిని మొట్ట మొదటిగా గురజాడ వారు వాడేరు అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  13. కవి ప్రభాకర నేమాని కలిసి నడువ
    సరస సాహిత్య శంకరాభరణమందు
    కవిత నేర్చిన కవులెల్ల ఘనత గాంచె.
    భానుకాంతితో తారలు ప్రభలఁ జెలఁగె.

    రిప్లయితొలగించండి
  14. 02)
    __________________________________

    బ్లాగు శంకరా భరణపు - బైలు నందు
    వరలు శంకరుండను నొక - భాస్వరుండు !
    సభ్యులందరు మెరిసెడి - సత్తులైన
    భానుకాంతితో తారలు - ప్రభలఁ జెలఁగె !
    __________________________________
    బైలు = ఆకాశము
    భాస్వరుడు = సూర్యుడు
    సత్తు = తార

    రిప్లయితొలగించండి
  15. శ్రీగోలి శాస్త్రి గారికి , నమస్సులు. అయ్యా , మీరు నిన్న శర్మ గారు అని సంబోధించిన విషయం చూసితిని. అది నాకేనేమో అని ఒక మాట చెప్పవలెనని వచ్చితిని. నిజం చెప్పవలెనంటే నాకు పద్యం వ్రాయడం రాదు .మా అన్నగారు కీ.శే.శ్రీ కృష్ణశర్మ గారు విద్వాన్ , ఉభయభాషా ప్రవీణ ఒక ఐడెడ్ స్కూల్ లో తెలుగు పండితులుగా ఉద్యోగించినారు .వారి వల్ల నేర్చుకున్న నాలుగు ముక్కలివి. మీ అందరితో పోలిస్తే నా స్థాయి తక్కువే . అదే స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్ గా మాత్రమే పని చేస్తున్నాను. ఈ బ్లాగు ను గత 3 -4 నెలల నుండి చూస్తున్నను. మీ అందరిని చూస్తే కొంచెం అసూయ కూడా అనిపిస్తుంది నాకు పద్యాలు వ్రాయడం రాకపోవడం వలన.
    తప్పులు చెప్పడం పాపం అని నేనేదో జనరల్ గా అన్నాను . దానికి నన్ను పాపి అన్నారు అని అనడం వలన నేను కొంచెం తీవ్రంగా స్పందించిన మాట వాస్తవమే . కాని అలా చేయడం పాపం అనడానికి , నువ్వు పాపి వి అనడానికి తేడా యుంటుంది కదా . నాకు ఎవరిని నిందించాలని లేదు . ఇంకా విచిత్రం శంకరయ్య గారు " ఆ అజ్ఞాత మీ చర్చల సారాంశం చూసి ఉండరు. అందుకే అలా వ్యాఖ్యానించారని ఖచ్చితంగా చెప్పవచ్చు " అని అన్నారు .దానికి శంకరయ్య గారు "నన్ను చూపు లేనోడన్నారు " అని కూడా అనవచ్చు కదా . అది అన్యాయమే కదా .
    ఆ పరిస్థితిని మాత్రమే నేనలా అన్నాను .
    నేను కొత్త విషయాలేమి చెప్పలేదు .విద్యార్థి కల్పతరువు అనే గ్రంధముంది
    అందులో గుణదోష పరిచ్చేదం అనే అధ్యాయంలో సూత్రం చెప్పినాను - "కేవలం సంస్కృత శ్బ్దములను తెలుగు లేక తత్సమ శబ్దములతో సమసింపజేయుట "
    ఒప్పు- పంచ వర్ణములు , అనేక పర్యాయములు , చెడ్డ అలవాటు
    తప్పు - పంచ రంగులు , అనేక సారులు , దురలవాటు

    సంస్కృతం మీద తెలుగు వేయడం ముమ్మాటికి తప్పు . తెలుగు పదం పూర్తి ఐన తరువాత , సంస్కృతమో , తత్సమమో వేయడం ముమ్మాటికి ఒప్పు . అయితే దీని మీద యింకా యెవరైనా తెలుగు పండితుల అభిప్రాయం తీసుకొనే నాతో మాట్లాడవచ్చు . నేను చెప్పింది కరెక్టో కాదో తెలుస్తుంది . నెట్ లో అక్కడా ఇక్కడా వెదికితే లాభముండదు .

    - రాం మోహన్ శర్మ.

    అందుకే చవితి దినము అనేది కరెక్టు . విషయపరంగానే తప్ప ఎవరిని ఎమి అనాలని నాకు లేదు . నమస్కారాలు .

    రిప్లయితొలగించండి
  16. ఒరుల సొత్తుల నెరువొంద నొప్పు పెరుగు
    సరసుడని పేరు గాంచిన చందమామ
    వెన్నెలలు చింది విను వీధి వెలయు చుండ
    భాను కాంతితో తారలు ప్రభల జెలగె

    రిప్లయితొలగించండి
  17. రాం మోహన శర్మ గారూ , తెలుగు పదాలపై సంస్కృత పదాలతో సమాసములు చేయ వచ్చునని శ్రీ పండిత నేమాని వారు కూడా సెలవిచ్చారు. చవితి దినము ఒప్పే అవాలి. ఈ దినము వినువీధి అనే ప్రయోగము చేసాను. తప్పని భావించను. బంగారు పుష్పములు, గొప్ప పతివ్రత , తెల్ల తామర వలె. ఇక్కడ తెలుగు భాషా ప్రావీణ్యము ఎక్కువ లేని నా బోటి వారలు కూడా పద్యాలు వ్రాస్తారు. మొదలు పెట్టండి సామీ, ఎవరి తాహతు వారిది. పెద్దలు చెబితే విందాము, పోయిందేముంది ?

    రిప్లయితొలగించండి
  18. శర్మ గారూ ఆరోగ్య కరమైన చర్చల వలన అందఱికీ లాభమే . శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు చెప్పినట్లు యీ చర్చలలో వేడి అక్కఱ లేదు. ఎవ్వరినీ అగౌరవ పరచ వలసిన అవసరము కూడా లేదు. ఇక్కడ ఉన్నవారంతా తెలుగు భాషాభిమానులే !

    రిప్లయితొలగించండి
  19. అయ్యా నేను చెప్పేదీ అదే . ఎవరిని ఎవరూ నిందించాల్సిన పని లేదు. అసలు నేనేమి అనలేదు అనే కదా నేనంటున్నది . వ్యక్తిని వుద్దేశించి నేనేమి అనలేదు . అనను కూడా. అయితే పాఠం తప్పుగా చెప్పడం పాపం అనేదానికి నేనిప్పటికీ కట్టుబడే యున్నాను . అంత మాత్రానికే అది వ్యక్తిగతంగా యెలా అవుతుంది నాకు అర్థం కావడం లేదు . నాకు బాగా తెలిసిన పాయింటు కాబట్టే యింత గట్టిగా చెప్పగలుగుతున్నాను . అలా కానప్పుడు , అలా అయితే కరెక్టేమో , యిలా యుండవచ్చునేమో అని అంటే బెటర్ కదా .

    -రాం మోహన్ శర్మ .

    రిప్లయితొలగించండి
  20. కురుచ దుస్తుల నిముడని పరువముల్ ,వి
    శేష భంగిమల్ ,గంతులు - చెలువములను
    జూపు నేకైక కాంక్షాను రూప చిత్ర
    భాను కాంతి తో తారలు ప్రభల జెలగె

    సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  21. అయ్యా! సుబ్బా రావుగారూ
    మీ పూరణ 3వ పాదము చూడండి. లోటు లేకుండ జీవంబు గడపు నటుల.
    ఇందులో యతి లేదు. ప్రాస యతి కూడా పడలేదు. ప్రాస యతి నియమములను ఒక మారు గుర్తు తెచ్చుకొనండి.
    అంతేకాదు - జీవితము నకు బదులు జీవము అని వాడేరు. 2 పదముల అర్థములు వేరు.
    అందుచేత ఈ విధముగా మారిస్తే బాగుంటుంది అని నా ఊహ:
    "వెలితి లేనట్టి రీతి జీవించునటుల"

    రిప్లయితొలగించండి
  22. వసంత కిశోర్ గారూ,
    కనుల వెలుగును ప్రస్తావించిన మీ మొదటి పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పూరణలో నన్ను ఆకాశానికి ఎత్తేసారు. ధన్యవాదాలు. నన్ను నేలమీదనే ఉండనివ్వండి సార్! అంతెత్తుకు వెళ్తే ఎప్పుడు దభీమని నేలమీద పడతానో అని భయం వేస్తున్నది. :-)
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నా సూచన పాటించి పద్యాన్ని సవరించినందుకు సంతోషం!
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    రాజారావు గారూ,
    నిజమే! కనిపించే తారల్లో ఎన్నో స్వయంప్రకాశకా లున్నాయి. నా పూరణలో అన్నీ సూర్యునివలన ప్రకాశించేవే అన్నాను. వాస్తవాన్ని మీ పూరణలో ప్రతిబింబించారు. ప్రశస్తమైన పూరణ. అభినందనలు, ధన్యవాదాలు.
    మీ రెండవ పూరణ కూడా చక్కగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    అద్భుతమైన పూరణతో బ్లాగులో కవితాకాంతులను నింపారు. ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    జీవజాలానికి సూర్యరశ్మి ప్రాధాన్యాన్ని వివరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    పండిత నేమాని వారి వ్యాఖ్యను చూసారు కదా!
    మొదటి పాదంలో ‘ప్రజలు నిలను’ కంటే ‘ప్రజలు భువిని’ అంటే బాగుంటుందని నా సలహా. అలాగే మూడవపాదాన్ని నేమాని వారు సూచించినట్లైనా, లేదా ‘జీవనము లోటు లేకుండ చేయునటుల’ అని కాని సవరించవచ్చు.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    మీ పూరణను ఆశీస్సుగా స్వీకరిస్తున్నాను. ధన్యవాదాలు.
    *
    రామ మోహన శర్మ గారూ,
    నా వ్యాఖ్య మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షంతవ్యుణ్ణి. ఈ సమాసాల గుణదోషాల గురించి వీలైనంత తొందరగా ఒక పాఠం బ్లాగులో పెడతాను. ధన్యవాదాలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మనోహరమైన వర్ణనతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
    బ్లాగులో ఆరోగ్యకరమైన చర్చలను ఆహ్వానించి పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. రాం మోహన్ శర్మగారు మన్నించాలి. వ్యాకరణం పట్ల మీ ఆసక్తి, ఆబిరుచి ,అభినివేశాల గురించి తెలుసుకుని మిక్కిలి ఆనందిస్తున్నాను. చక్కని వ్యాకరణజ్ఞానం మీ స్వంతం. నిజానికి నాకు పెద్దగా వ్యాకరణజ్ఞానం లేదు. మీరు జనాంతికంగా అన్నా, 'తప్పులు చెప్పడం పాపం' అన్నది నన్ను ఆలోచింపజేస్తున్నది. అకవినీ అపండితుడనూ అయిన నేను యీ బ్లాగులో చేస్తున్న గుణదోషవిచారణలు ముమ్మాటికీ నా అర్హతను మించినవే. ఏదో నా తెలివిడి మేరకు మిత్రులకి సహాయపడుతున్నాననే గాని యేదన్నా పొరపాటు జరిగితే పాపకృత్యమౌతుందన్న స్పృహ నాకు ఇంతవరకు లేదు. అయితే యికముందు యీ విషయంలో ఆలోచించి నిర్ణయించుకోవలసి ఉంది. ఎందుకంటే, "కానని వాని నూతగొని కానని వాడు..." అన్న పద్యంలో లాగా నా వలన యితరులకు తప్పుడు సలహాలు అందటం నా అభిమతం కాదు.

    మీ అన్నగారు ఆంధ్రపండితులుగా పనిచేసినారని వ్రాసారు. చాలా సంతోషం. మా మేనమామగారొకరు (డా. పాలకోడేటి జగన్నాథరావుగారు) విశ్రాంత ఆంధ్రపండితులు. కాళహస్తిలో ఉండేవారు, ఈ మధ్యనే హైదరాబాదు మకాం మార్చారు. ముఖే ముఖే సరస్వతీ. మీ విద్వత్తుకు మీ లౌకికవృత్తికీ యేమీ సంబంధం లేదు. మీరొక స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాననీ, స్థాయి తక్కువే ననీ అన్నారు. అలా అనుకోవద్దు. మా తమ్మడొకాయన తన ఉద్యోగప్రస్థానం రికార్డ్ అసిస్టెంట్ గానే మొదలు పెట్టాడు.మా అమ్మమ్మగారి తమ్ముడొకాయన ఒక చిన్న పాఠశాలలో కెమిస్ట్రీ లాబ్ లో అసిస్టెంటుగా చేసేవారు - ఆయన సంస్కృతాంధ్రాలలో మహావిద్వాంసులు. ఉద్దండ జ్యోతిష, సాముద్రిక పండితుడు. కాని ఆయన విద్వత్తును తెలిపేందుకు ఆయన యేమీ పరీక్షలు యిచ్చిన వాడు కాదు. వారి తండ్రిగారు కేసిరాజు సీతారామయ్యగారు శృంగారశాకుంతలం అనే శుధ్దాంద్ర కావ్యాన్ని విరచించారు. మరొకాయన నాకు మేనమామ వరుస శ్రీ ప్రసాదు గారు సాంకేతికరంగంలో పరిశ్రమించి విశ్రామ జీవితంలో యిప్పటికే మూడు నాలుగు కావ్యాలు వెలయించారు. ఇదంతా సోది యెందుకు చెబుతున్నానంటే, మీ విద్వత్తును తక్కువ పరచుకోనవుసరంలేదనీ, లౌకిక స్థాయీ రంగాలతో నిమిత్తంలేకుండా సాహిత్య కృషి చేయటానికి మీ యత్నం మీరు తప్పకుండా చేయగలరనీ విన్నవించటానికే.

    రిప్లయితొలగించండి
  24. తోచి పూర్ణమై గ్రహణంబు ద్యుమణి దివ్య
    బింబ మంతర్హితం బైన వింత గొలుప
    మిగుల చీకటిగా నస్తమించి నట్టి
    భానుకాంతితో తారలు ప్రభలఁ జెలఁగె.

    రిప్లయితొలగించండి
  25. నాకు తెలిసి గురజాడవారే ముత్యాలసరాలకు ఆద్యులు. వారి లవణ రాజు కల యీ మాత్రా ఛందంలోనే వ్రాసారు. చూడండి:
    http://te.wikisource.org/wiki/లవణరాజు_కల

    రిప్లయితొలగించండి
  26. పూజ్యులు నేమాని వారి సూచనలు ,శంకరయ్య గారి సూచనలు

    శిరో ధార్యములు.

    రిప్లయితొలగించండి
  27. శ్రీ చింతా రామకృష్ణారావు గారూ! శుభాశీస్సులు.
    కవిప్రభాకరాభిధేయ గౌరవమ్ము గూర్చితో
    వివేకశాలి! రామకృష్ణ! వేడ్కతోడ చిత్తమే
    ద్రవింపజేసితో హితైషి తావకాభిమాన వై
    భవమ్ము శ్లాఘనీయమంచు పల్కు చుంటి దీవెనల్

    రిప్లయితొలగించండి
  28. నే మాని వారికి నమస్కారములు .మీ సూచనలు చదివిన పిమ్మట ఈ పద్యము వ్రాసాను .

    తప్పులు ఉన్నచో సవరించ ప్రార్ధన .

    -----------

    నేమాని వారి భావము

    లా మూలము జదువ దోచె నారని వెలుగుల్

    తోమాలల సమ తుల్యము

    లీ మాటలు సెప్పు చుంటి నిష్టము తోడన్

    రిప్లయితొలగించండి
  29. శంకరార్యా ! ధన్యవాదములు.
    సుహృద్భావ చర్చలు జరిపిన రామ్ మోహన్ శర్మ గారికి, శ్యామలరావు గారికి అభినందనలు. శర్మ గారూ! తెలిసిన విషయం చెప్పడానికి ఉద్యోగ స్థాయితో పని లేదు.మీ అభిప్రాయాలు పంచుకోడానికి మిత్రుల మెప్పుడూ సిద్ధం గా ఉంటాము.

    రిప్లయితొలగించండి
  30. అయ్యా సుబ్బారావు గారూ!
    శుభాశీస్సులు. మీ పద్యము చదివేను. బాగున్నది. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  31. హమ్మయ్య! ఇప్పుడు వాతావరణం యెంతో తేలిక పడింది.

    రిప్లయితొలగించండి
  32. కవి మిత్రులకు విజ్ఞప్తి

    నే నే మెఱుఁగుదు నెఱుఁగుదు
    నా నుడివిన యట్లు తోచు నట్టి పలుకులం
    మానక దోసము లుండును
    నా నెఱుగుఁదు నీ యెఱుక వినా యొండెఱుఁగన్

    తెలిసిన వారు మిత్రులకు తీయని పల్కుల మంచిచెడ్డలం
    దెలుపుచు నుండ నేనొకనడ తేటగ నాంధ్రకవిత్వతత్వముం
    తెలిసిన వాని వోలె పలు తీరుల నూరక తప్పులొప్పులం
    గలయగ జూచి పల్కుటది కార్యము గామి యెరుంగ నక్కటా

    కాబట్టి యికపై పరిమితంబుగానే ప్రవర్తించగలవాడను.

    రిప్లయితొలగించండి
  33. పశ్చిమాద్రిని తలచెను భాను డయ్యొ
    నేను గ్రుంకిన నిల కాంతు లీను నెవరు
    చుక్కలన్నవి వగపేల చూడవె మము
    భాను! కాంతితో తారలు ప్రభలఁ జెలఁగె.

    రిప్లయితొలగించండి
  34. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మశనివారం, డిసెంబర్ 03, 2011 11:33:00 PM

    కవిమిత్రులూ
    పని వత్తిడి వల్ల గత కొద్దిరోజులుగా శంకరాభరణం చూడలేకపోయాను. చాలా ఆసక్తి కరమైన చర్చలు జరిగినట్లున్నాయి. విదేశాలలో ఉన్న కారణాన మరో నెల్లాళ్ళవరకూ శంకరాభరణం చూడలేనని చెప్పడానికి చింతిస్తూ

    మిత్రుడు

    రిప్లయితొలగించండి
  35. ఆత్మసౌందర్యమునుమించి ఆంగికరుచి
    నెంచువారలుగనికరమిచ్చగింప
    రేయి మింటను, భువినందు రేబవళ్ళు
    భానుకాంతితో తారలు ప్రభలఁ జెలఁగె!


    డా.నరసింహమూర్తి గారూ.,

    సమస్య చూసినప్పుడు
    తండ్రిధనముతోడకులుకు తనయునివలె అని మొదలుపెట్టి పద్యం చెబుదామనుకున్నాను.
    మిగతా రెండు పదాలు కూర్చుకొనే లోపు .. మీ పద్యం విందు చేసింది.

    రిప్లయితొలగించండి
  36. శ్యామలీయము గారూ , నమస్సులు. మీరు నాకు, మన మిత్రులకు సద్భావముతో మేలే చేసారు గాని కీడు చేయ లేదు. పద్యాలు వ్రాసే టప్పుడు దొర్లే పొరబాట్లు చెప్పి సూచన లిస్తున్న మీరు,గురువుగారు,శ్రీ పండిత నేమాని వారు పూజ్యులు, అభినందనీయులు. మీతో అంగీకరించని వారు తమ తమ అభిప్రాయములు వెలిబుచ్చ వచ్చును. భార మంతా గురువు గారు శంకరయ్య గారి పైనే వేయవలసిన అవసరము లేదు.మీరు యధావిధిగ మీ విశ్లేషణలు కొన సాగించమని మనవి. ప్రపంచములో గర్హనీయమైన కార్యాలు బోలెడు జరుగుతున్నాయి, గాని ఇక్కడ అందఱూ పుణ్యాత్ములే .పొరబాట్లు మానవ సహజము. ఇక్కద ఒండొకరులపై పూజ్యభావము,గౌరవ భావము, మిత్రభావము,సోదర భావము, వాత్సల్య భావము తప్ప మన మధ్య స్పర్థలకు నిందలకు అవకాశము లేదు. అందఱికీ నమస్సులు.

    రిప్లయితొలగించండి
  37. ఊకదంపుడు గారూ నేను కూడా ముందు తండ్రి సొమ్ములు అనే మొదలు బెట్టి,ఒరుల సొత్తులు గా మార్చేను.అయ్యా మీరు పద్యాలు దంచేస్తున్నారు. ఏదైనా రామా,కృష్ణా అనుకొంటే మాకు పుణ్యము చేకూరుతుంది. మీ అసలు పేరుతో మాకు ప్రత్యక్షముకండి సామీ !

    రిప్లయితొలగించండి
  38. తప్పులు సేయుట సహజము
    తప్పుకి తావీయకుండ యొప్పులు సేయన్


    తప్పక మది యత్నింతును

    నొప్పులె రక్షించు నయ్య !నెప్పటి కైనన్.

    రిప్లయితొలగించండి
  39. నా పూరణ- శంకరాభరణం సమస్య -547కి=

    1. బహుళ దూరాన నుండుట పగలు తోచ
    వాకసమ్మున తీక్ష్ణ మౌ నరుణ రశ్మి
    గ్రహణ కాలమ్ము నందున కరము తగ్గు
    భాను కాంతిలో తారలు ప్రభలు చెలగె.

    2. చల్లబడె నెండ సాయంత్ర సమయ మందు
    ఒక్కటొక్కటి గా మింట నుదయ మంది
    అప్పుడప్పుదే పడమట నస్తమించు
    భానుకాంతిలో తారలు ప్రభలు చెలగె.

    రిప్లయితొలగించండి