15, డిసెంబర్ 2011, గురువారం

సమస్యాపూరణం - 560 (కాఱుకూఁతలు కూయ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
         కాఱుకూఁతలు  కూయ సంస్కర్త యగును.
ఈ సమస్యను సూచించిన
పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.

18 కామెంట్‌లు:

  1. కారునల్లని ధనమును కోరు వారి
    కుర్ర కారును చెడగొట్టు వెర్రి వారి
    కర్రు వాతలె వలెనట్లు వారి కోరి
    కాఱుకూఁతలు కూయ సంస్కర్త యగును

    ( కోరిక=ఆఱు )

    రిప్లయితొలగించండి
  2. మూడవ పాదం లో యతి సవరణ తో...

    కారునల్లని ధనమును కోరు వారి
    కుర్ర కారును చెడగొట్టు వెర్రి వారి
    పరువు నెరుగుచు మనుమని వారి కోరి
    కాఱుకూఁతలు కూయ సంస్కర్త యగును

    రిప్లయితొలగించండి
  3. అయ్యా! శంకరయ్యా గారూ!
    నిన్నటి మీ ప్రశంసలలో "బహు బాగున్నాయి" అని వాడేరు కదా. కాస్త సరిజేసుకోవలెనేమో - ఇక మీదటి మీ వ్యాఖ్యలలో ఇట్టి పొరపాటులు దొరలవు లెండి.

    రిప్లయితొలగించండి
  4. ప్రజలమాయకుల్ గొర్రెల వంటి వారు
    నాయకులు మాయ తోడేళ్ళు చేయుచుండి
    ప్రజల నూరించు బాసలన్ బళిర సభల
    కారు కూతల గూయ సంస్కర్త యగును

    రిప్లయితొలగించండి
  5. సంఘ సం స్క ర్త లుగ నుండి సం ఘ మందు
    పరువు మర్యాద లన్నియు పార ద్రోలి
    కా ఱు కూతలు కూ య ,సం స్కర్త యగును
    ననుట విం త గాదె? జగములు హర్ష మొందొ?

    రిప్లయితొలగించండి
  6. విధవ రాండ్రకు బ్రతుకున వెలుగు నింపె
    కందుకూరి ధృఢాత్ముడై ముందు నుండి
    లెక్క సేయని ధీరుడే లేకి జనులు
    కాఱుకూఁతలు కూయ సంస్కర్త యగును

    రిప్లయితొలగించండి
  7. ---------------------------------------
    కారు కూతలు కూయ సంస్కర్త యగును
    ననెడి మాటలు నిజమైన ,నవని యందు
    సంఘ విద్రోహ చర్యలు సమసి పోక
    ఉండు బాధలు కలికాల ముండు వరకు .

    రిప్లయితొలగించండి
  8. రమ్ము చేయగలదు ప్రాణ రక్ష
    -------------------

    అక్ష రంబు లన్ని యక్ష యంబులు గాగ

    మంత్ర శక్తి గూడి మహిమ తోడ

    పదము పదము కలిసి పంచాక్ష రయి యక్ష

    రమ్ము చేయ గలదు ప్రాణ రక్ష

    రిప్లయితొలగించండి
  9. లోకులిట పలు గాకులై లోకువగను
    కాఱుకూతలు గూయ; సంస్కర్త యగు_ ను
    తులను పొందుచు నుత్తమ త్రోవ విడక
    జనుల హితవుకై తనదను సర్వమొసగ_

    రిప్లయితొలగించండి
  10. 1'నేత కవినీతి భ్రాత ,సన్నిహిత హితులు
    కారుకూతలు '- కూయ సంస్కర్త యగున
    టంచు భావించు ,వేది కేదైన గాని
    చట్ట సభ నేని దిట్టంగ జంక డరయ

    2.ఘనులు నేతలు పేదల కడుపు గొట్టి
    దేశ సంపద దోచి వీధెక్కి తీరి
    కారు కూతలు కూయ , సంస్కర్త యగును
    'ఓటు 'వజ్రాయుధమ్మయి వ్రేటు వేసి

    రిప్లయితొలగించండి
  11. వెంకట రాజారావు . లక్కాకులగురువారం, డిసెంబర్ 15, 2011 1:15:00 PM

    కూత నేర్చెడి నాబోటి కోకిల - తొలి
    కారు - కూతలు కూయ - సంస్కర్త యగును
    శంకరయ్య - నేమానియున్ , శ్యామలీయ
    బుధులు తోడురా దెల్గు తీపులను నేర్పి

    రిప్లయితొలగించండి
  12. తాడిగడప శ్యామలరావుగురువారం, డిసెంబర్ 15, 2011 3:22:00 PM

    జాతి కభ్యుదయం బెట్లు జరుగు నట్టి
    మంచి మాటలు చేతలు మనకు నేర్పు
    మేలు కాలమ్ము నెలకొల్ప జాలు క్రొత్త
    కాఱుకూఁతలు కూయ సంస్కర్త యగును.

    రిప్లయితొలగించండి
  13. రాజారావు గారూ మీ మూడవ పూరణ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  14. హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    నేను సరదాకే అన్నాను ‘బహు బాగున్నది’ అని. ఆ మాట టైపు చేస్తున్నప్పుడే దాని గురించి అభ్యంతరం వస్తుందని ఊహించాను. ధన్యవాదాలు.
    వాస్తవాన్ని ప్రతిబింబించే మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    సమస్యపాదాన్ని ప్రశ్నార్థకంగా మార్చటం పూరణాపద్ధతులలో ఒకటి. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘అగును + అనుట = అగు ననుట’ అవుతుంది. ‘హర్షమొందొ’ ప్రయోగం కూడా చింత్యమే. ఆక్కడ ‘అగున/ టంచనుట వింత; కలుగును హర్ష మెట్లు?’ అంటే ఎలా ఉంటుందంటారు?
    మీ రెండవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    ‘రమ్ము చేయగలదు...’ సమస్యపై మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘పంచాక్షరి + అయి’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. కనుక అక్కడ ‘పంచాక్షరిగ’ అందాం.
    *
    మిస్సన్న గారూ,
    సంఘసంస్కర్త కందుకూరి వారిపై మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మీ పూరణలో పలుగాకులు అనడం చూసిన తర్వాత చెప్పాలని పించింది. నిజానికి సుబ్బారావు గారు పంపిన సమస్య ‘కాఱుకూతలు కూసెను కాకి జంట’
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ మూడు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    శ్యామల రావు గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీగురుభ్యోనమ:

    పేరు ప్రఖ్యాతులన్ కల్గు పెద్దవారు
    లోకువగుచుందు రేరీతి లోకమందు?
    మంచి మార్పులు జేయ నేమౌను? యనిన
    కాఱుకూఁతలు కూయ, సంస్కర్త యగును

    రిప్లయితొలగించండి
  16. శం కరయ్య గారికి నమస్కారములు.తప్పులను సవరించి నందులకు
    కృ తజ్ఞు డను.సరి చేసికొందును.గణములను "ఫ్రేం "లో సరి పెట్టుట

    లో కొన్ని తప్పులు దొర్లు చున్నవి. క్షంతవ్యుడను

    రిప్లయితొలగించండి
  17. మాయజేసి లేకున్నచో మందువేసి
    నయమునైన భయమునైన నరుడొకండు
    మహిని నేతల చేతను మానుపింప
    కాఱుకూఁతలు కూయ, సంస్కర్త యగును!

    రిప్లయితొలగించండి
  18. కారు చీకట్ల పయనించు కాన కుండ
    తాడు పామని భ్రమ పడి దడుసు కొనుచు
    మేరు వంతటి వాడైన భీరు డగుచు
    కాఱు కూఁతలు కూయ సంస్కర్త యగును

    రిప్లయితొలగించండి