16, డిసెంబర్ 2011, శుక్రవారం

సమస్యాపూరణం - 561 (శ్రీకృష్ణున కిచ్చె సిరి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
          శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుఁడు నెమ్మిన్.   

41 కామెంట్‌లు:

  1. చేకొనె నటుకుల మూటది
    శ్రేకరమగు తనదు యింటి సిరి మూటదియే
    నీకన్న చెలుడు లేడని
    శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుఁడు నెమ్మిన్

    రిప్లయితొలగించండి
  2. తాఁ కూరిమితో నటుకులఁ
    శ్రీకృష్ణున కిచ్చె, సిరి కుచేలుఁడు నెమ్మిన్
    చేకూరు తనకునిక నో
    హో!కైవల్యము లభించు నొప్పుగ నంచున్.

    అన్వయం లో స్పష్టత లేదు. మరొక పూరణ చేసేందుకు ప్రయత్నిస్తాను. సిస్టమ్ తో కొన్ని రోజులుగా సమస్య.
    వీలైనపుడు చూస్తాను.

    రిప్లయితొలగించండి
  3. చెలుడు అనకూడదేమోనని చిన్న సవరణ తో..

    చేకొనె నటుకుల మూటది
    శ్రేకరమగు తనదు యింటి సిరి మూటదియే
    నీకన్న చెలువు డేడని
    శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుఁడు నెమ్మిన్

    రిప్లయితొలగించండి
  4. తనయింట నున్న సిరి మూట అటుకులు తప్ప ఇంకేమీ లేవు.ఉన్నది మొత్తం కృష్ణునకు సమర్పించాడు అని నాభావం.'తనదు యింటి' బదులు 'తనదు యింట' అంటే ఇంకా బాగుంటుందేమో...

    రిప్లయితొలగించండి
  5. అయ్యా! శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ!
    తనదు + ఇంట = తనదునింట అగును. యడాగమము కాదు.

    రిప్లయితొలగించండి
  6. నే కౌతుకమున వచ్చితినిటు
    నా కౌమారపు మిత్రు డనుచు నటుకుల నీయన్ !
    చే కొనుము పిడికెడు ప్రేమను
    శ్రీ కృష్ణు నకిచ్చె సిరి కుచేలుఁడు నెమ్మిన్ !

    రిప్లయితొలగించండి
  7. శ్రీ కృష్ణా ! యదునందన !
    నీ కంటెను చెలులు లేరు నా కిపు డ య్యా!
    చేకొను మటుకుల మూటని
    శ్రీ కృష్ణున కిచ్చె సిరి కుచేలుడు నెమ్మిన్ .

    రిప్లయితొలగించండి
  8. ఎలుకం గని పిల్లి చచ్చె నేనుగు పారెన్ .
    --------------------------------------
    కలి యుగ మహత్మ్య మా యిది
    యెలుకలు నిట జంపె బిల్లి ,నేనుగు జంటన్
    అల నాడొక యుదయంబున
    నెలుకం గని పిల్లి చచ్చె నేనుగు పారెన్

    రిప్లయితొలగించండి
  9. వెంకట రాజారావు . లక్కాకులశుక్రవారం, డిసెంబర్ 16, 2011 9:10:00 AM

    నూకలు చాలని సలహా
    శ్రీ కృష్ణుని కిచ్చె సిరి , కుచేలుడు నెమ్మిన్
    ఏ కోరిక కోరక నే
    సాకార మనోరధుడయి జనియెన్ పురికిన్

    రిప్లయితొలగించండి
  10. ఓ కళ్యాణ గుణోజ్వల!
    నీకొక చిరు కానుకిదియె, నేస్తమ! ప్రేమన్
    గైకొను మీ సిరి ననుచున్
    శ్రీకృష్ణునికిచ్చె సిరి కుచేలుడు నెమ్మిన్

    రిప్లయితొలగించండి
  11. చేకూరె సిరులు, సూచన
    శ్రీకృష్ణున కిచ్చె సిరి, కుచేలుఁడు నెమ్మిన్,
    వ్యాకులతల వీడి కదిలె
    దాఁ కాంతాపుత్రుల గన, దండములిడుచున్.

    రిప్లయితొలగించండి
  12. ఏకాలంబుననైనన్,
    శ్రీకాంతునిమీదు భక్తి సిరియందురుగా,
    ఆ కాసిన్నటుకులతో
    శ్రీకృష్ణునికిచ్చె సిరి కుచేలుడునెమ్మిన్.

    కాసిన్ని = కొంత

    రిప్లయితొలగించండి
  13. సాకల్య మైన ప్రేమను
    నూకలతో ముడియ గట్టి నొచ్చుచు నొసగెన్
    రూకలను మించి మెఱయగ
    శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుఁడు నెమ్మిన్!

    కుచేలుడు ప్రేమతో యిచ్చినవి అటుకులే అయినా భక్ష్య పదార్ధముగా నూకలని వాడితిని. మిత్రులు మన్నించ గలరు.

    రిప్లయితొలగించండి
  14. లోకమునందున మిత్రుని
    రాకయె సిరియగును, హితుని రమ్యపు మాటల్
    సోకుటె చెవులకు సిరియగు,
    శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుఁడు నెమ్మిన్!!

    రిప్లయితొలగించండి
  15. లోకములోసిరులెనిమిది
    కాకయశంబుయునుకలదుకాన,"కనె సఖుం
    డాకొన"ననుయశమిడుటను,
    శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుఁడు నెమ్మిన్!!

    రిప్లయితొలగించండి
  16. వెంకట రాజారావు . లక్కాకులశుక్రవారం, డిసెంబర్ 16, 2011 4:41:00 PM

    రాకేందు వదన వీవన
    శ్రీకృష్ణున కిచ్చె - సిరి ,కుచేలుడు నెమ్మిన్
    వీక గనంగ బరాత్పరు
    డేకముగా వీచె - చెలిమి యెంత మధురమో !

    రిప్లయితొలగించండి
  17. కవిమిత్రులారా,
    ఈనాటి చమత్కార పద్యం చూసారు కదా! నేటి సమస్యకు స్ఫూరి అదే. సమస్యను ఇచ్చిన తర్వాత చమత్కారపద్యాన్ని పోస్ట్ చేయబోతుండగా కరెంటు పోయింది. అందువల్ల చమత్కార పద్యాన్ని ప్రకటించడం ఆలస్యమయింది.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    అయితే అవసరం లేనిచోట్ల అరసున్నాలు పెడుతున్నారు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
    అయితే చాలా రోజుల తర్వాత అన్ని పాదాలూ గణదోషంతో వ్రాసి నాకు సవరించే అవకాశం ఇచ్చారు. సంతోషం! నా సవరణతో మీ పద్యం ....
    నే కౌతుకమున వచ్చితి
    నా కౌమారపు సఖునకు నటుకుల నీయన్ !
    చే కొను పిడికెడు ప్రేమను
    శ్రీ కృష్ణు నకిచ్చె సిరి కుచేలుఁడు నెమ్మిన్ !
    *
    సుబ్బారావు గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది. ‘చెలులు లేరు’ అనడం కూడా యుక్తియుక్తంగా లేనట్లు భావిస్తున్నాను. ఆ పాదాన్ని ‘నీకంటెను సఖు డెవడని నేనందు నయా’ అని నా సవరణ.
    ‘ఎలుకం గని ...’ సమస్యకు మీ పూరణలో సందిగ్ధత ఉన్నది.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ప్రశస్తంగా ఉన్నాయి మీ రెండు పూరణలు. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కాసిన్ని’ శబ్దం గ్రాంధికం కాదనుకుంటా.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ శ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.
    *
    ఊకదంపుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘యశంబుయును’ అనడమే పానకంలో పుడకలా అనిపిస్తున్నది. అక్కడ ‘కాక యశోధనము కలదు కాన ..’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  18. ఏకృప మార్చెను కుబ్జను
    నాకృపయేసోకి మార నటుకులు సిరిగా
    తా కరువారగ నరయుచు
    శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుడు నెమ్మిన్!!!

    రిప్లయితొలగించండి
  19. మంద పీతాంబర్ గారూ,
    బహుకాల దర్శనం. సంతోషం!
    చక్కని పూరణ పంపారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. ధన్యవాదములు గురువుగారూ,

    వ్రాసేటప్పుడే అనుకున్నాను అది గ్రాంధిక శబ్దము కాదని. కానీ ప్రాసకోసము వేయవలసివచ్చింది. ఇకమీదట ఇటువంటి పదాలు రాకుండా చూస్తానండీ. ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి
  21. శంకరయ్య గారికి నమస్కారములు. మీ సవరణలు,
    సూచనలకు నా కృతజ్ఞతలు.సవరించు కొందును .

    రిప్లయితొలగించండి
  22. ధన్య వాదములు తమ్ముడూ ! వ్రాసి నప్పట్నుంఛీ ఏదో దోషం ఉందని పించింది . కానీ ఎందుకో సరి చేయ లేక పోయాను . మరొక సారి కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  23. ఆకలి దీర్చెడు దేవుని,
    శోకమ్ములరుపుమాపు శోభిత మూర్తిన్
    తా కనులారగ జూచుచు
    శ్రీ కృష్ణున కిచ్చెసిరి కుచేలుడు నెమ్మిన్ !!!


    లోకపవిత్రుడు మిత్రుడు
    చీకాకులముద్ర లేని చిత్ర విచిత్రుం
    డే కటువటుకులనడుగగ
    శ్రీ కృష్ణున కిచ్చెసిరి కుచేలుడు నెమ్మిన్ !!!

    రిప్లయితొలగించండి
  24. గురువు గారు, ధన్యవాదాలు.
    అరసున్నాల మీద మోహం నాకు సున్నా మార్కులు తెప్పిస్తున్నా విడిచిపెట్టలేకుండా ఉంది.
    సరే, ఇకమీదట పెట్టను. దేనికి అనవసరంగా పెట్టానో తెలిస్తే కొంచెం బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  25. సులభసూత్రం:
    ఎక్కడ పూర్ణానుస్వారం పెట్టినా పెట్టకపోయినా రెండురూపాల్లోనూ పదానికి ఒకటే అర్ధం వస్తుందో, అలాంటి సందర్భాల్లో అరసున్న లేదా సున్న వాడవచ్చును.

    ఉదా:
    రాముడు. రాముండు, రాముఁడు అనికూడా వ్రాసినా ఒకటే అర్ధం.
    (నిజానికి ప్రధమావిభక్తి ప్రత్యయం 'డు' కాదు 'ఁడు'
    కలడు అనేది కలండు, కలఁడు అని కూడా వ్రాయవచ్చు.

    ఇంకా కొన్ని ప్రత్యేక అరసున్నా సందర్భాలుండవచ్చును.

    రిప్లయితొలగించండి
  26. శ్రీగురుభ్యోనమ:

    ఆకొను వేళల నటుకులు
    చేకొనుమా కన్న చిన్న జేయక నన్నున్
    నాకు గల కలిమి యిదియని
    శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుఁడు నెమ్మిన్

    రిప్లయితొలగించండి
  27. మందాకిని గారూ ,
    ద్రుతప్రకృతికముల పైన పరుషములకు సరళము లగునన్నది సరళాదేశ సంధి. ఆదేశ సరళములకు ముందున్న దృతమునకు బిందు సంశ్లేషలు విభాష నగును అన్నది రెండవ సూత్రము. మీరు సరళా దేశ సంధి చేస్తేనే అరసున్నలు పెట్టాలి. అరసున్నలు పెట్టి నపుడు సరళాదేశ సంధి చేసాము, యిక్కడ గ,జ,డ,ద,బ,లను క,చ,ట,త,ప లుగా చదువుకోమని సూచిస్తున్నారు. సరళా దేశ సంధి చేయక పోతే అర సున్నలు పెట్ట కండి. మీ పద్యాలు సవరిస్తే,


    తాఁ గూరిమితో నటుకుల
    శ్రీకృష్ణున కిచ్చె, సిరి కుచేలుఁడు నెమ్మిన్
    చేకూరు తనకునిక నో
    హో!కైవల్యము లభించు నొప్పుగ నంచున్.



    చేకూరె సిరులు, సూచన
    శ్రీకృష్ణున కిచ్చె సిరి, కుచేలుఁడు నెమ్మిన్,
    వ్యాకులతల వీడి కదిలె
    దాఁ గాంతాపుత్రుల గన, దండములిడుచున్.

    రిప్లయితొలగించండి
  28. నాకున్నారద! చెప్పవె
    ఏ కతమున స్వామి సిరుల నిచ్చె సఖునకున్ ?
    నీకా చెప్పుట లటుకుల
    శ్రీకృష్ణున కిచ్చె సిరి! కుచేలుఁడు నెమ్మిన్.

    రిప్లయితొలగించండి
  29. శ్యామలీయం గారు, ధన్యవాదాలండి.
    అంత మాత్రమే కాదు.
    ఆడువారు, ఆఁడువారు __ ఈ రెండింటిలో అరసున్నా వలన అర్థమే మారిపోతుంది.
    ఇలా ఇంకా ఉన్నాయి.
    మూర్తిగారు, ధన్యవాదాలండి.
    మీరు చెప్పింది బాగుంది. కానీ గురువు గారు పెట్టకూడని చోట పెట్టానన్నారు.

    రిప్లయితొలగించండి
  30. మంద పీతాంబర్ గారూ,
    మీ మిగిలిన రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    ‘రూపుమాపు’ టైపాటులో ‘రుపుమాపు’ అయింది.
    *
    మందాకిని గారూ,
    ఉదాహరణకు మీ మొదటి పూరణలో ‘తాన్ + కూరిమి = తాఁ గూరిమి’ కావాలి. అలా అయితే ప్రాస తప్పుతుంది. ద్రుతప్రకృతికము మీది పరుషం సరళంగా మారిన తర్వాతే ద్రుతానికి బిందుసంశ్లేషలలో ఏదో ఒకటి రావాలి. మీరు పరుషాన్ని సరళంగా చేయకుండానే ద్రుతాన్ని అర్ధబిందువుగా మార్చారు. అందుకే పెట్టకూడని చోటు అన్నాను. ‘తా కూరిమి’ అన్నా సరిపోతుంది.
    అరసున్నాల గురించిన సమగ్రమైన పాఠం ఈ రెండు మూడు రోజుల్లో పెడతాను.
    *
    శ్యామలరావు గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మందాకిని గారికి సందేహనివృత్తి చేయ ప్రయత్నించినందుకు ధన్యవాదాలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    ముద్దు ముద్దు మాటలతో ముచ్చటగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    నారద ఉవాచ అన్నట్టుగా మీ పూరణ కడు సుందరంగా ఉంది. అభినందనలు.
    ఇంతకీ నారదుని ప్రశ్నించిం దెవరో? మీరేనా?

    రిప్లయితొలగించండి
  31. మందాకిని గారూ, తాఁ కూరిమి నటుకులఁ
    శ్రీకృష్ణున

    ఇందులో తా తర్వాత అరసున్న కూరిమి అని సరళాదేశ సంధి చేయకుండా పెట్టారు.అలా రాదు. అక్కడ అరసున్న తర్వాత గూరిమి అంటే ఫరవా లేదు.
    అటుకుల తర్వాత అరసున్న రాకూడదు. ఎందుకంటే తర్వాత శ్రీకృష్ణున లో శ్రీ పరుషము కాదు,సరళా దేశ సంధి లేదు. ద్రుతప్రకృతికములకు సరళ స్థిరములు పరమగునపుడు ద్రుతమునకు బిందువు రాదు. లోపము గాని సంశ్లేషము గాని వస్తాయి

    ఉ ; వచ్చెను + గోవులు = వచ్చె గోవులు,
    వచ్చెన్గోవులు
    వచ్చెను గోవులు. ఒప్పు.

    వచ్చెఁ గోవులు,వచ్చెం గోవులు అని వ్రాస్తే తప్పు.

    రిప్లయితొలగించండి
  32. గురువు గారు కూడా వివరించారు. దుకాణములో వస్తువులు కొన్న తర్వాతే కదా డబ్బులిస్తాము. అలాగే సరళాదేశ సంధి చేసాకే ద్రుతమును బిందువుగా మార్చ గలుగుతారు. ఇది నా బండ గుర్తు.

    రిప్లయితొలగించండి
  33. మందాకిని గారూ,
    సరళాదేశ సంధికి వివశుడనయి ప్రాస పట్టించుకోకుండా మీ పద్యాలు సవరించినందులకు క్షమించండి

    రిప్లయితొలగించండి
  34. గురువు గారు, ధన్యవాదాలండి. తాన్ వచ్చినపుడు న్+గూ ప్రాస మారిపోతుంది అనే విషయం ఇపుడు అర్థమైంది. అనేక ధన్యవాదాలు.
    మూర్తిగారు, మీరు చక్కగా వివరించారు.అయితే అటుకుల అని వదిలేసినా అటుకులను అనే అర్థం వస్తుందంటారా? లేక ను వచ్చేట్టుగా పదం మార్చుకోవాలంటారా?

    రిప్లయితొలగించండి
  35. మందాకిని గారూ
    అటుకుల అంటే ఒప్పే. అటుకులను అనే అర్ధము. వచ్చె గోవులు వలె . ఇక్కడ ద్రుతమునకు లోపము వచ్చింది. సత్వముగా ( ఉన్నదున్నట్లు ) వదిలేస్తే వచ్చెను గోవులు కూడా ఒప్పే.

    ఇక్కడ మరొకటి కూడా గుర్తు పెట్టుకొండి. తాను, నేను పదముల దృతమునకు సంశ్లేష రాదు.

    తాను + చేసె = తాఁ జేసె ,తాను జేసె ఒప్పులు.

    గురువు గారు పాఠము చెబుతా నన్నారు, అయినా మరోసారి చెప్పుకొంటే గుర్తు ఉంటుందనీ, వ్యాఖ్య పెట్టాను.

    రిప్లయితొలగించండి
  36. గురువుగారూ ధన్యవాదాలు. పూరణ నారదుడు, లక్ష్మి మధ్య జరిగింది.
    నారదుడు ' సిరి! ' అని లక్ష్మిని సంబోధించాడు.

    రిప్లయితొలగించండి
  37. ఆకలికి తాళ జాలక
    వ్యాకుల చిత్తమున గాలి వారలు హరికిన్
    చీకటి ధనమకుట మొసగె:
    "శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుఁడు నెమ్మిన్"

    రిప్లయితొలగించండి
  38. చీకాకగు మకుటమ్మును
    నాకలిగొని గాలి రెడ్డి యంకితమొసగెన్
    కాకా! ఇదియెట్లన్నన్:
    "శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుఁడు నెమ్మిన్"

    రిప్లయితొలగించండి