26, డిసెంబర్ 2011, సోమవారం

సాయి నవరత్నాలు

సాయి భక్తి విలాస మంజరి

1
ప్రవిమలాత్ముల మానసాబ్జము వాసమై యలరారు నిన్
సవినయమ్ముగ నేఁ దలంతును సాధుబృంద సుసేవితా!
శ్రవణపేయము నీ కథాసుధ సారసద్గుణ భూష! నీ
స్తవ మొనర్తు సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!   

2
సాయి సద్గురు! సాయి సద్గురు! సాయి సద్గురు! సాయి! నాన్
గేయమంజరి మంజులమ్ముగ కీర్తనమ్మొనరించుచో
శ్రేయమాదృతి కూర్చుచుందువు శిష్ట కోటికి నిత్యమున్
సాయమౌచు సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!
       

3
స్మరణ మాదృతి భవ్య నామ ప్రశస్త తత్త్వ విశిష్టతల్
నిరతమున్ బొనరింప చిత్తము నిర్మలత్వము నొందుచున్
దురితముల్ తొలగున్ భవార్తియు దూరమౌ నని చేయుదున్
స్మరణమేను సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!
    

4
పాదసేవ నొనర్చు భాగ్యమె భాగ్యమెల్లర కబ్బునే?
ఆదిదేవు కృపావిశేష మహాఫలంబుగ కాక, నీ
పాదసేవనచే భయమ్ములు వాయు, చేకురు మోక్షమున్
సాదరాన సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!
     .

5
ధ్యాన ముఖ్య సమర్చనా నియమాళితో షిరిడీశ్వరా!
మానసాబ్జము సాదరాన సమర్పిత మ్మొనరింపగా
దీనులయ్యును వేగ గాంతురు దివ్యతేజము సత్కృపన్
జ్ఞానసిద్ధి సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!
   

6
పాదయుగ్మము బట్టి భక్తులు వందనమ్ము లొనర్చుచున్
ఆది శక్తివి, ఆది దేవుడ వచ్యుతుండ వటంచు నిన్
మోదమందుచు గొల్వ వారికి పూర్ణ యోగము కూర్పవే?
సాదరాన సమర్థ సద్గురు  సాయినాథ మహప్రభూ!
     

7
ద్వారకామయి పాద దాస్యము, దాస దాస్య పరంపరన్
భూరి మోదమునొందు దాసుల భూతి వెల్గగ వారిపై
భారమంతయు నీవె గొందువు భక్త కోటి కొసంగి చిత్
సారమెల్ల సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!
     

8
శిష్ట రక్షక! దుష్టశిక్షక! చేరి సఖ్యముతోడ నిన్
హృష్ట చిత్తముతో భజించిన నెల్ల సిద్ధులు చేకురున్
పుష్టి, తుష్టియు నీవె సమ్మతి భుక్తి ముక్తి ప్రదాతవున్
స్రష్ట వీవె సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!
  

9
నాదు దేహము నాదు గేహము నాదు సంపదలంచు నే
వేదనల్ పడనేల ఆత్మ నివేద నంబొనరించుచో
ఆదిదేవుడ వీవె కూర్చెద వక్షయమ్ముగ యోగముల్
సాదరాన సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!
    

ఫలశ్రుతి
 సాయి భక్తి విలాస మంజరి సత్ఫలమ్ములొసంగుచున్
హాయిగొల్పును ఆలకించిన ఆలపించిన నెమ్మదిన్
జ్ఞేయమౌచును ధ్యేయమౌచును నేయమౌచును మోక్షమున్
సాయి కూర్చు సమర్థ సద్గురు  సాయినాథ మహాప్రభూ!

రచన
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

3 కామెంట్‌లు:

  1. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!
    ఈ సాయి భక్తి విలాస మంజరి నేను 1990 దగ్గరలో వ్రాసినవి. అప్పటిలో ఒక సాయి భక్తుడు అడిగితే వ్రాసేను. తరువాత దీనిని ఒక రచయిత నాకు తెలియజేస్తూ తన పుస్తకములో చిన్న చిన్న మార్పులతో వేసుకొనెను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. గురువులు పండితులు ,పూజ్యులు శ్రీ నామాని సోదరునకు నమస్కారములు.
    " చంద్ర శేఖర , చంద్ర శేఖర , చంద్ర శేఖర ,పాహిమాం
    చంద్ర శేఖర , చంద్ర శేఖర , చంద్ర శేఖర , రక్షమాం " [ బహుశాచంద్ర శేఖరాష్టకం ] అనుకుంటాను ఇలాగే ఉంటుంది. అదే విధంగా పాడుకోవ డానికి అనుగుణంగా " సాయినాధ మహాప్రభో " అనే మకుటంతో చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. ఈ పద్యాలు చదవ గలగడమే అదృష్టముగా పరిగణిస్తాను.అన్నయ్య గారికి శిరసాభివందనములు.

    రిప్లయితొలగించండి