గణన యంత్రము ఏదో క్రిమి సోకి సమ్మె చేసింది . మా చిన్నవాడు తీరిక చూసుకొని చేసిన చికిత్స ఫలితము నిచ్చింది. ఒక వారము దినములు గణన యంత్రము లేకుండా గడిపాను. మిత్రుల పూరణలు అలరారుతున్నాయి.
ఈ చేతువా అనే మాటగురింవి. చేయుదే అనుట సాధురూపం. కాని యిటువంటి ప్రయోగాలు అక్కడక్కడ కనబడుతూనే ఉంటాయి. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారే తమ పుష్ప విలాపంలో 'విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పిమా ప్రాణము తీతువా యనుచు బావురు మన్నవి' అని వ్రాసారు. ఈ తీతువా అనేది కూడా అసాధువే కద. ఈ మధ్యకాలంలో ఒక సారి ప్రసక్తికి వచ్చినట్లు లక్షణబధ్ధత నిర్దేశించే కావ్యాది కృతులలో తప్ప యితర సందర్భాలలో చేతువా, తీతువా వంటి పదాలను పరిమితంగా అంగీకరించవచ్చునేమో.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ రెండు పూరణలూ మనోహరంగా ఉన్నాయి. అభినందనలు. * మిస్సన్న గారూ, ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు. ‘చేతువా’ ప్రయోగం గురించి నా చివరి వ్యాఖ్యను చూడండి. * సుబ్బారావు గారూ, మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. ‘ప్రాణములన్ దీయువాడు ... ’పూరణ కూడా బాగుంది. ‘ప్రాణాధారౌ’ అన్నదాన్ని ‘ప్రాణేశుండౌ’ అందాం. * పండిత నేమాని వారూ, ఉత్తమమైన పూరణ. అభినందనలు. * లక్కాకుల వెంకట రాజారావు గారూ, మీ పూరణ చక్కగా ఉంది . అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, నిన్ననే మీ గురించి చంద్రశేఖర్ గారిని అడిగాను. మీ గణనయంత్రం స్వస్థత పొందినందుకు సంతోషం. మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు. కానీ ‘ధర్మత్రాత, లోకత్రాత’ అంటే ర్మ, క లు గురువవులౌతాయనుకుంటాను. కొన్ని ప్రత్యేక సందర్భాలలో రేఫసంయుక్తం పూర్వాక్షరాన్ని గురువు చేయదని చింతా వారూ, నేమాని వారూ సెలవిచ్చారు. ఈ విషయమై ఒక సమగ్రపాఠం పెట్టాలి. విషయసంగ్రహణ చేస్తున్నాను. * చంద్రశేఖర్ గారూ, మీ వ్యాజస్తుతి బాగుంది. అభినందనలు. * మిస్సన్నగారూ, ‘చేతువా’ శబ్ద చర్చలో నేను శ్యామలరావు గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. దోషాలైనా కొన్ని ప్రయోగాలు జనసామాన్యంలో ప్రచారమై సాధువులనే అనిపిస్తాయి. ఒక అవధానంలో మేడసాని మోహన్ గారు ‘ఆశువు’ అంశంపై చెప్పిన పద్యం .... పిండోత్పత్తి విధిన్‌విషాద గతులన్‌పెంపారగా చేతువా? చండాఖండల లోకమండల లసత్‌సౌందర్య క్రీడా కృతిన్ ఖండింపన్‌తగనయ్య నేనిపుడు నీ కారుణ్య సంపత్తి బ్ర హ్మాండవ్యాప్తము నన్ను కావుము విషాదాంభోధి దాటించుమా ! మల్లాది వారి కలంనుండి వచ్చిన ‘గిరిజాకళ్యాణం’లో పార్వతి "ఈశుని దాసుని చేతువా?" అంటుంది.
రేఫసంయుక్తాక్షరమునకు ముందున్న లఘువు గురువగునా? నా యొద్ద ఛందః పదకోశము అను పొత్తము కలదు - తెలుగు అకాడెమి వారి ప్రచురణ. అందులోని ఈ వివరణను గమనించండి:
సిద్ధ సమాసములందును, భిన్న పద స్థితి యందును రేఫ సంయుక్తము పరమైనచో పూర్వపదాంత లఘువు పాక్షికముగా గురుత్వమందును. ఉదా: శతతాళఘ్న హ్రదము. హ్ర పరము కాగా ఘ్న గురుత్వమందలేదు. ఈ రేఫకు సంబంధించిన యంశము సంస్కృతాంధ్రములకు, మిగిలినవి ఒక్క తెలుగుకు మాత్రము సంబంధించినవి,
తెలుగు వ్యాకరణకారులు చిన్నయసూరీ, బహుజనపల్లివారూ ప్రాధమికంగా కవిత్రయమూ, తరువాత ప్రబంధాలూ ఆధారంగా భాషను ప్రామాణీకరించారు. పోతనగారిని లాక్షణికులు పరిగణనలోనికి తీసుకోలేదు. అయితే ఇదంతా జరిగి ఉన్న వ్యాకరణాలేవో యేర్పడికూడా శతాబ్దికాలం దాటింది. భాషాప్రయోగంలో సహజంగా కొన్ని మార్పులు వచ్చాయి. అసహజంగా మరిన్ని యెక్కువ మార్పులు వచ్చాయి. వ్యాకరణం శిలాశాసనంలా మారిపోతే విస్తృతామోదం పొందిన పదాలూ, పదరూపాలూ కూడా అసాధువులుగానే మిగలిపోతాయి. ఇది గందరగోళానికి దారితీస్తుందనేది హ్రస్వదృష్టితో చెప్పేమాట వ్యాకరణతిరస్కృతికి దారితీస్తుందనేది దూరదృష్టితో చెప్పేమాట. కాబట్టి వ్యాకరణాన్నిగూడా అడపాదడపా సంస్కరించుకుంటూ పోవలసిన అవసరం ఉంది.
పండితవరేణ్యులకు నమస్సులు - నా పూరణలో మొదట "స్వామి ద్రోహము" అనే పదం నాలుగవ పాదం మొదటలో వేద్దామనుకొన్నాను. కానీ అందులో "మి" గురువుత్వం పొందుతుందేమోనని "స్వజనవంచన" గా మార్చాను. ఈ చర్చ అనంతరం ఇంకా నా సందేహం తీరలేదు. "స్వామిద్రోహం" లో "మి" గురువా లఘువా?
మన తెలుగు వారికి నమస్కారములు . -------- "స్వామి ద్రోహము" అని సమాస పూర్వకముగా ప్రయోగించినచో "మి" గురువు అగును . అట్లు కాక స్వామి!ద్రోహము జేసితిన్ ....... అని ప్రయోగించిన "మి " లఘు వే అని నా అభి ప్రాయము .
మిత్రులారా! రేఫ సంయుక్తమైన ఆద్యక్షరములు గలిగిన పదములు పరమైనచో (ప్ర హ్ర మొదలగునవి) అట్టి సమాసములలో (తెలుగులోను, సంస్కృతములోను కూడా) పూర్వ పదము యొక్క చివరి అక్షరము పై దాని ప్రభావము పార్షికముగా మాత్రమే యుండును. రచయిత వీలును బట్టి లఘువు గానయినా లేక గురువుగానైనా వాడుకొనవచ్చును. ఇందు ఎటువంటి సందేహమును అక్కరలేదు. స్వామి + ద్రోహము అను సమాసములో మి ను గురువుగా కాని లఘువుగా కాని వాడుకొన వచ్చును.
రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పూరణ. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, ‘తనయ వరుడు’ అన్నప్పుడు ‘కొడుకులలో శ్రేష్ఠుడు’ అనే అర్థాన్ని గ్రహించాలి. ఇక మీ నాలుగు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
ప్రీతి నెలుకలనే తిని పీడ లేక
రిప్లయితొలగించండిరైతు బాన్ధవి గానిల్చి రక్ష జేయు
మేత జనులకు మిగులుచు మేలు గాను
త్రాతనే పాముగా నెంచి తరుమఁ దగునె?
హరున కాభరణము మరి హరికి పక్క
రిప్లయితొలగించండిచేరి చూడగ శివునికి చిన్ని కొడుకు
పుట్టలో పాలు పోయంగ పుణ్య మిచ్చు
త్రాతనే పాముగా నెంచి తరుమఁ దగునె?
పెద్ద లిట్లని పల్కిరి పేర్మి సభను
రిప్లయితొలగించండిసంధి గూర్చెడు మాధవు బంధితునిగ
చేతువా సుయోధన నీకు చేటు కలుగు
త్రాతనే పాముగా నెంచి తరుమఁ దగునె?
ఆదుకొమ్మని ప్రార్ధించి హరుని మదిని
రిప్లయితొలగించండిసాయ మందిన పిమ్మట సరగు ద్రోల
పాడి యగునయ్య ! మనకది పట్టి జూడ
త్రాతనే పాముగా నెంచి తరుమ దగునె ?
ప్రాణము లం దీ యు వాడు పరమాత్ముం డౌ.
రిప్లయితొలగించండి-----------
ప్రాణములు బోయువాడును
ప్రాణములను నిలుపువాడు, ప్రా ణా ధారౌ
ప్రాణుల కిల దైవంబును
ప్రాణములం దీయువాడు పరమాత్ముండౌ.
అయ్యా మిస్సన్న గారూ!
రిప్లయితొలగించండిమీ పూరణలో చేతువా అని వాడేరు - చేయుదే అనుట సాధు ప్రయోగము.
ఉపనిషత్తుల సారమ్ము యోగ శాస్త్ర
రిప్లయితొలగించండివరమునగు భగవద్గీత వలదటంచు
నక్కటా నిషేధించిన దొక్క జాతి
త్రాతనే పాముగా నెంచి తరుమ దగునె?
తనయుడే లోకముగ వాని తరుణి బిడ్డ
రిప్లయితొలగించండిలను దరికి దీసి యింటిల్ల పనులు జేసి
తల్లి తనరారు - రుజను ,వార్ధక్య మందు
త్రాతనే పాముగా నెంచి తరుమ దగునె ?
నిండు సభలోన కృష్ణయ్య నిబ్బరముగ
రిప్లయితొలగించండిపాండు పుత్రుల కిమ్మనె పాలు సగము
దుష్ట బుధ్ధితొ బంధించ దొడరె నతని
త్రాతనే పాముగా నెంచి తరుమ దగునె ?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ గురుభ్యో నమః
రిప్లయితొలగించండిఅరణ్య వాసములో నున్న పాండవులను పొగిడి నందులకు విదురునిపై ధృతరాష్ట్రుడు అలిగి వారి దగ్గరికే పొమ్మంటాడు.
వెఱపు లోపించి పొగడునె విదురు డెపుడు
పాండు సుతులను నా యింటఁ బాడిఁ దప్పి
అనుచు భూపతి యడవికిఁ బనిచె, ధర్మ
త్రాతనే పాముగా నెంచి దరుమ తగునె ?
గణన యంత్రము ఏదో క్రిమి సోకి సమ్మె చేసింది . మా చిన్నవాడు తీరిక చూసుకొని చేసిన చికిత్స ఫలితము నిచ్చింది. ఒక వారము దినములు గణన యంత్రము లేకుండా గడిపాను. మిత్రుల పూరణలు అలరారుతున్నాయి.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివ్యాజస్తుత్యలంకారముతో:
రిప్లయితొలగించండిరాజకీయము లందున రక్తిగట్ట
త్రాతనే పాముగా నెంచి తరుమఁ దగునె
యనుచు నీతులు పాటించు టనువు గాదు
స్వజన వంచన నీకగు సద్గుణంబు
గురువునకు పంగనామము గుట్టు గాను
పెట్టు పైపైకి యెదిగెద వెట్టులైన!
రాముని అడవులకు పంపిన కైకేయితో భరతుడు :
రిప్లయితొలగించండిమందహాసము వెదజల్లు మహిత గుణుని
తండ్రి మాటను దల దాల్చు తనయ వరుని
సుజన హితుని మునిగణ సుశ్లోక లోక
త్రాతనే పాముగా నెంచి దరుమ దగునె ?
ఈ చేతువా అనే మాటగురింవి. చేయుదే అనుట సాధురూపం. కాని యిటువంటి ప్రయోగాలు అక్కడక్కడ కనబడుతూనే ఉంటాయి. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారే తమ పుష్ప విలాపంలో 'విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పిమా ప్రాణము తీతువా యనుచు బావురు మన్నవి' అని వ్రాసారు. ఈ తీతువా అనేది కూడా అసాధువే కద. ఈ మధ్యకాలంలో ఒక సారి ప్రసక్తికి వచ్చినట్లు లక్షణబధ్ధత నిర్దేశించే కావ్యాది కృతులలో తప్ప యితర సందర్భాలలో చేతువా, తీతువా వంటి పదాలను పరిమితంగా అంగీకరించవచ్చునేమో.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.
‘చేతువా’ ప్రయోగం గురించి నా చివరి వ్యాఖ్యను చూడండి.
*
సుబ్బారావు గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
‘ప్రాణములన్ దీయువాడు ... ’పూరణ కూడా బాగుంది.
‘ప్రాణాధారౌ’ అన్నదాన్ని ‘ప్రాణేశుండౌ’ అందాం.
*
పండిత నేమాని వారూ,
ఉత్తమమైన పూరణ. అభినందనలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
మీ పూరణ చక్కగా ఉంది . అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
నిన్ననే మీ గురించి చంద్రశేఖర్ గారిని అడిగాను. మీ గణనయంత్రం స్వస్థత పొందినందుకు సంతోషం.
మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
కానీ ‘ధర్మత్రాత, లోకత్రాత’ అంటే ర్మ, క లు గురువవులౌతాయనుకుంటాను. కొన్ని ప్రత్యేక సందర్భాలలో రేఫసంయుక్తం పూర్వాక్షరాన్ని గురువు చేయదని చింతా వారూ, నేమాని వారూ సెలవిచ్చారు. ఈ విషయమై ఒక సమగ్రపాఠం పెట్టాలి. విషయసంగ్రహణ చేస్తున్నాను.
*
చంద్రశేఖర్ గారూ,
మీ వ్యాజస్తుతి బాగుంది. అభినందనలు.
*
మిస్సన్నగారూ,
‘చేతువా’ శబ్ద చర్చలో నేను శ్యామలరావు గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. దోషాలైనా కొన్ని ప్రయోగాలు జనసామాన్యంలో ప్రచారమై సాధువులనే అనిపిస్తాయి.
ఒక అవధానంలో మేడసాని మోహన్ గారు ‘ఆశువు’ అంశంపై చెప్పిన పద్యం ....
పిండోత్పత్తి విధిన్‌విషాద గతులన్‌పెంపారగా చేతువా?
చండాఖండల లోకమండల లసత్‌సౌందర్య క్రీడా కృతిన్
ఖండింపన్‌తగనయ్య నేనిపుడు నీ కారుణ్య సంపత్తి బ్ర
హ్మాండవ్యాప్తము నన్ను కావుము విషాదాంభోధి దాటించుమా !
మల్లాది వారి కలంనుండి వచ్చిన ‘గిరిజాకళ్యాణం’లో పార్వతి "ఈశుని దాసుని చేతువా?" అంటుంది.
లీలావతిని చంపఁబూనిన యింద్రునితో నారదుండు పల్కు మాటలు:-
రిప్లయితొలగించండికమలనాభుని భక్తుడే గర్భమందు
శాత్రవుఁడు కాదితడు ఘన సద్గుణుండు
పంపు నావెంట నీమెను, చంప వలదు
త్రాతనే పాముగా నెంచి తరుమఁ దగునె?
గురువు గారూ ధన్యవాదములు. పాదము విఱుపు వలన చూసుకోలేదు. మీ పాఠము తర్వాత పద్యాలను సవరిస్తాను.
రిప్లయితొలగించండికందుల వరప్రసాద్ గారి పూరణ .....
రిప్లయితొలగించండి"త్రాతనే పాముగా నెంచి తరుమఁ దగునె?"
యన్న చిలిపి కృష్ణునకును "నన్ను వీడి
గోపికలతోడ చిందులు గోపబాలు
న కుచిత మగున యీరేయి నల్లనయ్య!"
నేమాని పండితార్యా మీ సూచనను గమనించాను. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిగురువుగారూ ధన్యవాదాలు.
శ్యామలీయం గారూ ధన్యవాదాలు.
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
వెండి కొండను దిరిగెడు వేల్పు తోడ
రిప్లయితొలగించండిభవుని గళమున నిలచిన భాగ్య మనుచు
తక్ష శిలనేలు రాజును దయను వీడి
త్రాతనే పాముగా నెంచి తరుమ దగునె ?
రేఫసంయుక్తాక్షరమునకు ముందున్న లఘువు గురువగునా?
రిప్లయితొలగించండినా యొద్ద ఛందః పదకోశము అను పొత్తము కలదు - తెలుగు అకాడెమి వారి ప్రచురణ. అందులోని ఈ వివరణను గమనించండి:
సిద్ధ సమాసములందును, భిన్న పద స్థితి యందును రేఫ సంయుక్తము పరమైనచో పూర్వపదాంత లఘువు పాక్షికముగా గురుత్వమందును. ఉదా: శతతాళఘ్న హ్రదము. హ్ర పరము కాగా ఘ్న గురుత్వమందలేదు. ఈ రేఫకు సంబంధించిన యంశము సంస్కృతాంధ్రములకు, మిగిలినవి ఒక్క తెలుగుకు మాత్రము సంబంధించినవి,
తెలుగు వ్యాకరణకారులు చిన్నయసూరీ, బహుజనపల్లివారూ ప్రాధమికంగా కవిత్రయమూ, తరువాత ప్రబంధాలూ ఆధారంగా భాషను ప్రామాణీకరించారు. పోతనగారిని లాక్షణికులు పరిగణనలోనికి తీసుకోలేదు. అయితే ఇదంతా జరిగి ఉన్న వ్యాకరణాలేవో యేర్పడికూడా శతాబ్దికాలం దాటింది. భాషాప్రయోగంలో సహజంగా కొన్ని మార్పులు వచ్చాయి. అసహజంగా మరిన్ని యెక్కువ మార్పులు వచ్చాయి. వ్యాకరణం శిలాశాసనంలా మారిపోతే విస్తృతామోదం పొందిన పదాలూ, పదరూపాలూ కూడా అసాధువులుగానే మిగలిపోతాయి. ఇది గందరగోళానికి దారితీస్తుందనేది హ్రస్వదృష్టితో చెప్పేమాట వ్యాకరణతిరస్కృతికి దారితీస్తుందనేది దూరదృష్టితో చెప్పేమాట. కాబట్టి వ్యాకరణాన్నిగూడా అడపాదడపా సంస్కరించుకుంటూ పోవలసిన అవసరం ఉంది.
రిప్లయితొలగించండిపండితవరేణ్యులకు నమస్సులు - నా పూరణలో మొదట "స్వామి ద్రోహము" అనే పదం నాలుగవ పాదం మొదటలో వేద్దామనుకొన్నాను. కానీ అందులో "మి" గురువుత్వం పొందుతుందేమోనని "స్వజనవంచన" గా మార్చాను. ఈ చర్చ అనంతరం ఇంకా నా సందేహం తీరలేదు. "స్వామిద్రోహం" లో "మి" గురువా లఘువా?
రిప్లయితొలగించండిమన తెలుగు వారికి నమస్కారములు .
రిప్లయితొలగించండి--------
"స్వామి ద్రోహము" అని సమాస పూర్వకముగా
ప్రయోగించినచో "మి" గురువు అగును .
అట్లు కాక స్వామి!ద్రోహము జేసితిన్ .......
అని ప్రయోగించిన "మి " లఘు వే అని నా అభి ప్రాయము .
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
మూర్తీజీ ! చాలా కాలానికి మిత్రులను కరుణించారు !
మీ పూరణ లేని వెలితి రోజూ కనబడుతూనే ఉంది !
"తండ్రి మాటను దల దాల్చు తనయ వరుని" లో
"తనయ వరుడు" అంటే ఏమిటో అర్థం కావడం లేదు!
మిత్రులారా!
రిప్లయితొలగించండిరేఫ సంయుక్తమైన ఆద్యక్షరములు గలిగిన పదములు పరమైనచో (ప్ర హ్ర మొదలగునవి) అట్టి సమాసములలో (తెలుగులోను, సంస్కృతములోను కూడా) పూర్వ పదము యొక్క చివరి అక్షరము పై దాని ప్రభావము పార్షికముగా మాత్రమే యుండును. రచయిత వీలును బట్టి లఘువు గానయినా లేక గురువుగానైనా వాడుకొనవచ్చును. ఇందు ఎటువంటి సందేహమును అక్కరలేదు.
స్వామి + ద్రోహము అను సమాసములో మి ను గురువుగా కాని లఘువుగా కాని వాడుకొన వచ్చును.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_________________________________
తిండి గింజల మ్రింగును- దీర్ఘ దేహి
దీర్ఘదేహుల మ్రింగును - దీర్ఘరసన
తిండి గింజలు మిగులును - దీని వలన !
త్రాతనే పాముగా నెంచి - తరుమఁ దగునె?
_________________________________
02)
రిప్లయితొలగించండి_________________________________
తల్లి ప్రాణము ఫణముగా - తనయు గనును
తనదు ప్రేమను పంచిచ్చి - తనయు సాకు
తల్లి యన్నను యిలయందు - దైవ సమము !
త్రాతనే పాముగా నెంచి - తరుమఁ దగునె?
_________________________________
03)
రిప్లయితొలగించండి_________________________________
తండ్రి వలననె ధరణిని - తనయు జన్మ !
తప్పు దారుల బడకుండ - తనయు గాచు
తండ్రియే గద ధరణిపై - దైవ మనిన !
త్రాతనే పాముగా నెంచి - తరుమఁ దగునె?
_________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి04)
రిప్లయితొలగించండి_________________________________
తల్లి దండ్రుల పూజించు - తప్ప కుండ !
తల్లి దండ్రులు లేకున్న - తనయు డెందు ?
తల్లి దండ్రుల మిన్నగు - దైవ మెచట ?
త్రాతనే పాముగా నెంచి - తరుమఁ దగునె?
_________________________________
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
‘తనయ వరుడు’ అన్నప్పుడు ‘కొడుకులలో శ్రేష్ఠుడు’ అనే అర్థాన్ని గ్రహించాలి.
ఇక మీ నాలుగు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
కిశోర్ జీ కృతజ్ఞతలు. గురువు గారు మీ సందేహము తీర్చారుగా !
రిప్లయితొలగించండిశ్రీ పండిత నేమాని అన్నయ్యగారు అనేక దినాలుగా బుఱ్రలో కొలుకుతున్న సందేహాన్ని నివృత్తి చేసారు. వారికి మరోసారి నమస్సులు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండివీరుడు --- వీరవరుడు
తనయుడు --- తనయ వరుడు
అనే అనుకున్నాను గాని
తనయ = కూతురు అనే అర్థముంది గదా !
అందుచేత నన్ను నేను సమాధాన పరచుకోలేకపోయాను !