10, డిసెంబర్ 2011, శనివారం

సమస్యాపూరణం - 555 (తామసగుణపూర్ణుఁ డంద్రు)

కవిమిత్రులారా,
ఈరోజు దత్తజయంతి. 
 గురుమూర్తి దత్తాత్రేయుని కరుణాకటాక్షం వల్ల 
మీ కందరికీ సర్వశుభాలు కలుగాలని 
ఆకాంక్షిస్తున్నాను. 
 ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
తామసగుణపూర్ణుఁ డంద్రు దత్తాత్రేయున్.

45 కామెంట్‌లు:

 1. స్వామి గుణరహితుడే, శ్రితు
  లేమని భావింప నట్టులే కన్ పట్టున్
  తామసగుణ పూర్ణ మతులు
  తామస గుణ పూర్ణుడంద్రు దత్తాత్రేయున్

  రిప్లయితొలగించండి
 2. తిమిరాంధ కారమా యిది
  ముమ్మూర్తుల నేక రూపు ముక్కంటినినే,
  తామస గుణ రాహిత్యుని
  తామస గుణ పూ ర్ణు డండ్రు దత్తాత్రేయున్ ?
  --------
  క్షంతవ్యుడను .

  రిప్లయితొలగించండి
 3. శ్రీ దత్తశ్స్హరణం మమ.

  ఈ మూడు మూర్తు లొకటై
  ఆమహదనసూయ సాధ్వి నమ్మను జేసెన్
  క్షేమముకై పూజలు చే
  తామ, సగుణపూర్ణుఁ డంద్రు దత్తాత్రేయున్.

  రిప్లయితొలగించండి
 4. వెంకట రాజారావు . లక్కాకులశనివారం, డిసెంబర్ 10, 2011 8:56:00 AM

  కామాది షట్క చర నరు
  తామస గుణ పూర్ణు డంద్రు ,దత్తా త్రేయున్
  నీమమ్మున పూజించిన
  తామసములు వీడి జన్మ ధన్యత దాల్చున్

  రిప్లయితొలగించండి
 5. వెంకట రాజారావు . లక్కాకులశనివారం, డిసెంబర్ 10, 2011 9:50:00 AM

  ఈ మాడ్కి సమస్యల నిడ
  కోమల మగు డెంద మెంత క్రుంగునొ సఖుడా !
  ధీ మంతుడ !శ్రీ శంకర !
  రాముడు మీ కండ నిలిచి రక్షణ నొసగున్

  రిప్లయితొలగించండి
 6. మాస్టారూ, శ్రీ రాజారావుగారి తో ఏకీభావిస్తాను. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మీద సమస్య చూచాక కించిత్తు బాధ కలిగిన మాట వాస్తవమే. పూరణకి భావనాబలం చేకూరటంలేదు. వినయపూర్వక అభ్యర్థన, సమస్యను కూర్చేటప్పుడు బలవంతంగా విపరీత విరుద్ధభావం కలిగించే పదాలు దొర్లటం అప్పుడప్పుడూ జరుగుతుంది. కానీ అలా జరుగుతున్నదని గమనిస్తే మొత్తం మీద భావం ఎబ్బెట్టుగా లేకుండా చూడటం కూడా అవసరం కదా! ఈ మధ్యనే అలాటిది జరిగి శ్యామలీయంగారి సలహా మీద "జగములేలు జగదంబ..." ను "తీయనైన పండు..." కి మార్చటం జరిగింది. తేలికపరిచే రకంగా మార్చటం మీ లాంటి పండితులకి చాలా తేలికైన పని. దత్తజయంతి లాంటి ప్రత్యేక సందర్భాలలో విరుపు లేకుండా కూడా వర్ణనో, సాధారాణ పూరణ పాదమో, దత్తపదో ఇవ్వవచ్చనుకొంటాను. ఆపై జనవాక్యం శిరోధార్యం. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 7. ఆ ముమ్మూర్తులరూపుం
  డీమహిమాన్వితుడుగురువులింద్రాదులకున్,
  కామాంతకకుండలినీ
  తామస గుణపూర్ణుడంద్రు దత్తాత్రేయున్.

  కామాంతకకుండలినీ తామస = కామమును అంతము చేసే సర్పాకృత కుండలినీ గుణపూర్ణుడు
  తామసము = సర్పము,

  గురువులకు నమస్సులు.

  సమాసము వ్రాయవలెనన్న కోరిక. తప్పులను సరిచేయమని ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 8. ఏమయ్యా నీ వెంతటి
  సామాన్యుడ వైన గాని శఠుడవె యైనన్
  స్వామి కటాక్షించునయా
  తామస! గుణపూర్ణుఁ డంద్రు దత్తాత్రేయున్.

  రిప్లయితొలగించండి
 9. నా పూరణ ....

  నీమము విడిచిన దుష్టుని
  తామసగుణపూర్ణుఁ డంద్రు; దత్తాత్రేయున్
  ధీమంతులు భక్తిఁ గొలిచి
  క్షేమమ్మును గాంతు రనుట శిష్టవచనమే!

  రిప్లయితొలగించండి
 10. శ్రీగురుభ్యోనమ:

  ఏమనవచ్చును క్రోధిని
  తామసగుణపూర్ణు డంద్రు, దత్తాత్రేయు
  న్నామ ధ్యానము శ్రేష్ఠము
  తామసమున్ తొల్గజేయు తత్వము గూర్చున్

  క్రోధి = క్రోధము కలవాడు

  రిప్లయితొలగించండి
 11. రాజారావు గారికి, చంద్రశేఖర్ గారికి, కవిమిత్రులకు మనవి ....
  ఇచ్చేదే సమస్య. సమస్య ‘సమస్య’గానే ఉండాలి.
  పృచ్ఛకుడు అడిగిన ' సమస్య ' యొక్క భావం చాలా అసంగతంగా, అసంబద్ధంగా, అసందర్భంగా, ఒక్కొక్కసారి అశ్లీలంగా కూడా వుంటుంది. కవి తన ప్రతిభతో దానిని సభ్యతాయుతంగా, అసంభవాన్ని సంభవంగా నిరూపిస్తూ పూరించాలి.
  మన దేవుళ్ళపైన అసంగతమైన సమస్యలు ఇప్పటికి ఎన్నో అవధానాలలో పృచ్ఛకులు అడిగారు. కవులు తమ నైపుణ్యంతో వాటిని పూరించి మెప్పించారు.
  నేను చూచిన ఒక అవధానంలో పృచ్ఛకుడు ఇచ్చిన సమస్య ...
  ‘రాముని వంచించి సీత రావణు వలచెన్’
  "సీతవంటి లోకోత్తర పతివ్రతను గురించి ఇలా చెప్పడం భావ్యమా? సంస్కారమా?" అని ఆ సభలో ఎవరూ ప్రశ్నించలేదు. కవికూడా యుక్తియుక్తంగా సమస్యను పూరించి అందరి మెప్పు పొందాడు. కొన్ని కొన్ని సమస్యాపాదాలను చూడగానే మనస్సు నొచ్చుకొనవచ్చు. మరికొన్ని సమస్యలను వినగానే అసభ్యంగా ఉండి రోత కలిగించవచ్చు.
  సమస్యలోని అసంగతాన్ని తొలగించడమే కదా కవుల పని. స్వస్తి!

  రిప్లయితొలగించండి
 12. మిత్రులరా!
  కవయః నిరంకుశః అని ఆంటారు. పండిత వాక్యము రిత్త వోవునే? అని ఆర్యోక్తి. వాగ్దేవీ దత్తమైన దుర్లభమైన కళ కవిత్వము - పూర్వ జన్మ సంస్కారము లేనిదే గాని కవిత్వము అలవడదు. తెలుగు సంస్కృతములలో పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఐనను పద్య విద్యలో ఒక పాదమును కూడ వ్రాయలేరు అనుట మనము చూచుచున్నదే. వాక్కు మిక్కిలి పవిత్రమైనది. అగ్నిర్వై వాగ్భూత్వా ముఖం ప్రావిశత్ అని ఉపనిషద్వాక్యము. వాక్కు అగ్ని యొక్క ఒక రూపము. వాక్కు మానవునకు మాత్రమే దేవుడిచ్చిన మహా ప్రసాదము. అట్టి ప్రసాదమును మనము ఎలా వినియోగించుకొనవలెనో ఒక్క మారు ఆలోచించండి. ఈ విషయములను గుర్తుంచుకొని మన వాక్కులను మనము తగు శ్రద్ధతో వాడుట శ్రేయస్కరము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 13. అయ్యా సుబ్బారావు గరూ!
  మీ పద్యములో భావము బాగున్నది. మీరు ప్రాస నియమమును బాగుగా అధ్యయనము చేయవలసి ఉన్నది. ఆఖరి పాదములో "తామస గుణ పూర్ణుడు" అని ఉన్నది కదా. 2వ అక్షరము 'మా ప్రాస అక్షరము. దీని ముందు "తా" అనే దీర్ఘాక్షరము ఉన్నది. అందుచేత 4 పాదములలోను దీర్ఘాక్షరమునే ప్రాసకు ముందు వాడవలెను. అందుచేత మీ 1, 2 పాదములలో ప్రాస సరిపోవుట లేదు. బాగుగా నియమములను తెలిసికొని పాదములను సరిజేసికొనండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 14. శ్రీపతిశాస్త్రిశనివారం, డిసెంబర్ 10, 2011 2:02:00 PM

  శ్రీ హనుమచ్చాస్త్రిగారికి అభినందనలు మరియు ధన్యవాదములు. మీ భావనతోనె (కొన్నిపదాలు కూడా అటునిటుగా) లేఖినిలో వ్రాసి, కరెంట్ పోవడంతో పోస్టు చేయలేకపోయినాను. తరువాత చూడగా నా భావమునకు సరిపోయె విధంగా మీ పూరణ ఉన్నది. అందువల్ల ప్రయత్నించగా స్వామి కృప వలన పై పూరణ చేయగలిగితిని. నా తొలి పూరణను సవరించి క్రింది విధంగా వ్రాస్తున్నాను.

  శ్రీగురుభ్యోనమ:

  నా మనమున ధ్యానించెద
  నా ముమ్మూర్తుల స్వరూపు నత్రి కుమారున్
  ధీమణి గురుసేవలు చే
  తామ, సగుణపూర్ణుఁ డంద్రు దత్తాత్రేయున్

  రిప్లయితొలగించండి
 15. గురువు గారూ,

  శంకరాభరణం బ్లాగు దినదినప్రవర్ధమానమై, ఉజ్జ్వలంగా వెలుగొందుతూంది. సమయాభావం వల్ల ఆసక్తి ఉన్నా, పాల్గొనలేకపోతున్నాను. కవివర్యులందరికీ శుభాకాంక్షలు.

  "నీమము" అన్నారు. నీమము సాధువా? నేమము సాధువా (నియమము యొక్క తద్భవము) అని తెలుసుకోగోరుతున్నాను.

  రిప్లయితొలగించండి
 16. అయ్యా! రవి గారూ!
  శబ్ద రత్నాకరములో "నీమము" అనే పదమును ఈయలేదు. 'నేమము" అనేదే సాధువు.

  రిప్లయితొలగించండి
 17. మిత్రులారా!
  పద్య ప్రాశస్త్యమును గూర్చి మున్ను నేను చెప్పిన పద్యమును తిలకించండి:
  పద్యమ్ము పద్మసంభవ భామినీ విలా
  సాద్భుత రచనా మహత్త్వ ఫలము
  పద్యమ్ము కవిరాజ వాక్సుధా వాహినీ
  వీచీ విలోల కవిత్వ మయము
  పద్యమ్ము సముచిత పద గుంఫనోపేత
  రస విశేష పటుత్వ రాజితమ్ము
  పద్యమ్ము శబ్దార్థ వైచిత్ర్య విన్యాస
  బాహుళ్య రుచిర సంపల్లలితము
  సాహితీ నందనోద్యాన జనిత పారి
  జాత సుమధుర సౌరభ సార కలిత
  పద్యము మనోహరాకార వైభవమ్ము
  భవ్య సౌవర్ణ భావ సౌభాగ్యవతికి

  రిప్లయితొలగించండి
 18. మిత్రులారా!
  బమ్మెర పోతన గారు మహత్త్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్ కోరేరు "అమ్మల గన్న యమ్మ" అనే తన ప్రార్థనలో. ఇవి క్రమముగా ఓం, ఐం, హ్రీం, శ్రీం అనే బీజాక్షరాలకి సంబంధించినవి. ఈ నాలుగు భావములను (మహత్త్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్) పైన నేను చెప్పిన పద్యములో చేర్చేను. మీరు గమనించారో లేదో. అంటే మన కవిత్వము ఎంతో పవిత్రముగా ఉండాలని నా భావన. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 19. శ్రీ నేమాని వారికి నమస్కారములు .మీరు సూచించి నటులగానే
  ప్రాస లను సరి చేయుదును.

  రిప్లయితొలగించండి
 20. శ్యామలీయంగారూ, మీరు కూడా కూడదంటూనే అందరి దారీ తొక్కారు, "తామస!" అని పదం విరిచి సంభోధనా ప్రథమా విభక్తి చేశారు. బాగు, బాగు. అలా ఏదో దారి వెతుక్కోనిదే, సమస్యలోని అసంబద్ధను తొలగించటం ఒక్కొక్కసారి వీలుకాదు. అలాంటి ప్రయత్నంలోనే ఒక్కొక్కసారి పూరణ పాదాన్ని చివరి పాదంగా కాకుండా మధ్యలో ఇరికించాల్సివస్తుంది.

  రిప్లయితొలగించండి
 21. శ్రీ నేమాని మహాశయా! పద్యప్రాశస్త్యం మీది మీ పద్యం అద్భుతం. బీజాక్షరాలు పొదిగి వుండటం గమనించాను. నాలుగైదు సార్లు చదువుకొన్నాను. కంఠస్థపద్యం లాగా మెరిసిపోతోంది. నమోవాక్కాలు.

  రిప్లయితొలగించండి
 22. తామస గుణ వంతుల కిల
  తామసమే గోచరించు సములు ల లోనన్
  తామసము లేక పోయిన
  తామస గుణ పూ ర్ణు డండ్రు దత్తాత్రేయున్

  రిప్లయితొలగించండి
 23. రామనామమెపుడు రక్షింపు నయ్యరొ
  యాపదలను తొలచు, పాపచయము
  నాశమొనరజేయు, నరులకు మోక్షము
  నొసగునన్న పలుక నొప్పి యగునె?

  హరియు హరుడు నొకటి యనుసత్య మెరుగక
  హరుని పూజ సేయ హాని కలుగు
  నన్న వాని హరియు నాదరమును జూప
  జాలడోయి! కనగ సత్యమిదియె.

  గురువు గారు,
  మీ సౌకర్యం కోసం పాత పూరణలను ఇక్కడే వ్రాశాను.
  ఈ పూరణకోసం ప్రయత్నిస్తాను.

  రిప్లయితొలగించండి
 24. శంకరార్యా ! మీరు త్వరగా కోలుకోవాలని కోరిక !
  నాకు కూడా ఈ మధ్య ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటోంది !
  దేనిమీదా ఏకాగ్రత కుదరడం లేదు !
  అందుచే మిత్ర దర్శనానికి అప్పుడప్పుడూ దూరమౌతున్నా !

  రిప్లయితొలగించండి
 25. మిత్రులారా! ఈనాటి సమస్య గురించి అభిప్రాయ భేదాలు వచ్చేయి.శ్రీ రాజారావు గారు శ్రీ చంద్రశేఖర్ గారు కొంత ఇబ్బందికి గురి అయి సూచనలు చేసేరు. వాటిని శ్రీ శంకరయ్య గారు మరొక మారు పరిశీలించ గలరు. ఇంక ఈనాటి పూరణలు చూస్తే:
  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు - చేతామ (చేయుదుమా అని కాబోలును మీ భావము) ఈ పదము ఇబ్బంది గానే ఉన్నది.
  శ్రీ రాజారావు గారు శ్రీ శంకరయ్య గారు - నీమము అని వాడేరు. శబ్దరత్నాకరము ప్రకారము నేమము అని వాడుటే సాధువు.
  శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు: గురువులింద్రాదులకున్ అని వాడేరు. ఏకవచనము "గురువు" అని వాడుట బాగుంటుంది. సమాసములను వాడాలి అంటే నన్నయ్య గారి పద్యములను నిత్యము చదువుకోవలెను.
  శ్రీ శ్యామలరావు గారు మంచి విరుపుతో బాగుగా పూరించేరు.
  శ్రీ శ్రీపతి శాస్త్రి గారి 2వ పూరణ మెరుగుగా నున్నది. చేతామ అనే ప్రయోగము సరిగా లేదు.
  శ్రీ రవి గారు: మీ అవకాశమును బట్టి అప్పుడప్పుడైనా కొంత సమయమును మన కొరకై వెచ్చించండి.
  శ్రీ సుబ్బా రావుగారు 2వ ప్రయత్నములో ప్రాసను సరిచేసేరు. 2వ పాదములో ఏదో పొరపాటు దొరలినది. ప్రయత్నము బాగున్నది.
  శ్రీమతి మందాకిని గారు: మీరు నిన్న మొన్నటి సమస్యలకు చేసిన పూరణలు బాగుగనే ఉన్నవి.

  శుభమస్తు సుహృద్వరులకు
  నభినందన లాదరమున నందించెద నో
  యిభవరసములారా! ధీ
  విభవాధికులార! సత్కవీశ్వరులారా!

  మిత్రులారా! ఈనాటి సమస్య గురించి అభిప్రాయ భేదాలు వచ్చేయి.శ్రీ రాజారావు గారు శ్రీ చంద్రశేఖర్ గారు కొంత ఇబ్బందికి గురి అయి సూచనలు చేసేరు. వాటిని శ్రీ శంకరయ్య గారు మరొక మారు పరిశీలించ గలరు. ఇంక ఈనాటి పూరణలు చూస్తే:
  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు - చేతామ (చేయుదుమా అని కాబోలును మీ భావము) ఈ పదము ఇబ్బంది గానే ఉన్నది.
  శ్రీ రాజారావు గారు శ్రీ శంకరయ్య గారు - నీమము అని వాడేరు. శబ్దరత్నాకరము ప్రకారము నేమము అని వాడుటే సాధువు.
  శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు: గురువులింద్రాదులకున్ అని వాడేరు. ఏకవచనము "గురువు" అని వాడుట బాగుంటుంది. సమాసములను వాడాలి అంటే నన్నయ్య గారి పద్యములను నిత్యము చదువుకోవలెను.
  శ్రీ శ్యామలరావు గారు మంచి విరుపుతో బాగుగా పూరించేరు.
  శ్రీ శ్రీపతి శాస్త్రి గారి 2వ పూరణ మెరుగుగా నున్నది. చేతామ అనే ప్రయోగము సరిగా లేదు.
  శ్రీ రవి గారు: మీ అవకాశమును బట్టి అప్పుడప్పుడైనా కొంత సమయమును మన కొరకై వెచ్చించండి.
  శ్రీ సుబ్బా రావుగారు 2వ ప్రయత్నములో ప్రాసను సరిచేసేరు. 2వ పాదములో ఏదో పొరపాటు దొరలినది. ప్రయత్నము బాగున్నది.
  శ్రీమతి మందాకిని గారు: మీరు నిన్న మొన్నటి సమస్యలకు చేసిన పూరణలు బాగుగనే ఉన్నవి.

  శుభమస్తు సుహృద్వరులకు
  నభినందన లాదరమున నందించెద నో
  యిభవరసములారా! ధీ
  విభవాధికులార! సత్కవీశ్వరులారా!

  రిప్లయితొలగించండి
 26. ఆ మూర్తి త్రయ దీప్తిన్
  ధీమంతుడు ప్రజ్వలించె త్రిగుణాత్మకమై
  పామరు లితరము లెఱుగక
  తామస గుణ పూర్ణు డంద్రు దత్తాత్రయునిన్

  రిప్లయితొలగించండి
 27. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈ నాటి సమస్య కొందరి మనస్సును నొప్పించినందుకు మన్నించండి. నేమాని వారు చెప్పినట్లు పద్యమే కాదు మాట కూడా పవిత్రంగా ఉండాలి. అదే శుభకరం. ఇకనుండి అటువంటి సమస్యలు ఇవ్వకుండా జాగ్రత్త పడతాను.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  మీ ‘పద్యప్రాశస్త్యం’ అద్భుతంగా ఉంది. పద్యం చచ్చిందనేవారికి చక్కని సమాధానం. మీ రనుమతిస్తే రేపు దీనిని ప్రత్యేక పోస్ట్ గా ప్రకటిస్తాను.
  మిత్రుల పూరణ గుణదోషాలను పరిశీలించినందుకు ధన్యవాదాలు.
  నా పూరణలో ‘నీమము’ శబ్దప్రయోగం తప్పే. సవరిస్తాను.

  రిప్లయితొలగించండి
 28. చంద్రశేఖరుగారూ, నేను కూడా కూడదంటూనే అందరి దారీ తొక్కాను, "తామస!" అని పదం విరిచి సంభోధనా ప్రథమా విభక్తి చేశాను. బాగు, బాగు అన్నారు. సంభోధనా ప్రథమా విభక్తి కావాలనే చేసాను. కాని విరామచిహ్నం అనవసరం. నేను పద్యంలో యేవిధమైన విరామచిహ్నాలూ వాడటానికి యిష్టపడనన్నది తెలిసినదే. కాని, ఇక్కడ విరామచిహ్నం పెట్టకపోతే, యెవరైనా తికమకపడతారేమోనన్న భ్రమతోనే అలా చేసాననుకుంటాను. నే నలా చేయకుండా ఉండవలసినది. అందరూ విజ్ఞులే కాబట్టి యెవరూ ఇబ్బంది పడరు. ఈ సంగతి నాకెందుకి విస్మృతికి వచ్చిందో నాకే ఆశ్చర్యంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 29. శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు మరియు రవ్వా శ్రీహరిగారి నిఘంటువులు నయమము నకు నీమము అనే రూపాన్ని చూపుతున్నాయి.

  రిప్లయితొలగించండి
 30. అయ్యా శ్రీ శంకరయ్య గారూ!
  పద్య విద్య అనే శీర్షికతో నేను ఆ పద్యమును 1996లో రచించేను. ఇంతకు ముందే ఒక మారు ఆంధ్రామృతములో ప్రచురించేరు అనుకొంటున్నాను. సమముగా గుర్తు లేదు. అయినా శ్రీ చింతా వారికెట్టి అభ్యంతరము ఉండదు. మీరు ప్రచురించండి.

  రిప్లయితొలగించండి
 31. అన్నగారు శ్రీ పండిత నేమాని వారి పద్యప్రాశస్త్యము గురించి పద్యము అత్యద్భుతముగా ఉంది. ఈ దినము కంఠతా పెడుతా.

  రిప్లయితొలగించండి
 32. సుబ్బారావు గారూ,
  మీ ప్రయత్నం ప్రోత్సహింపదగింది. అభినందనలు.
  మీ పూరణలో ప్రాస విషయమై పండిత నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా! మీ పద్యానికి నా సవరణ ...
  తామిస్రమ్మున నుండిరొ?
  ఆ మువ్వురుమూర్తు లొక్కటైన ఘనుండే!
  తామస గుణపూర్ణమతులు
  తామస గుణ పూ ర్ణు డండ్రు దత్తాత్రేయున్.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘చేతాము’ శబ్దం గురించి నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా!
  *
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  మనమిద్దరం ‘నీమము’ శబ్దాన్నితప్పుగా ప్రయోగించాము.
  నన్ను హెచ్చరించిన పద్యం బాగుంది. ఇకనుండి అటువంటి సమస్యలను ఇవ్వకుండా జాగ్రత్త పడతాను.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘గురువు లింద్రాదులకున్’ ను ‘గురువె యింద్రాదులకున్’ అని సవరిద్దాం.
  మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉంది.
  *
  శ్యామల రావు గారూ,
  చక్కని విరుపుతో ఉత్తమమైన పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మీరూ ‘చేతామ’ శబ్దప్రయోగం చేసారు.
  *
  రవి గారూ,
  ధన్యవాదాలు.
  ‘నీమము’ శబ్దాన్ని ‘నియమము’ శబ్దానికి వికృతిగానే భావించి ప్రయోగించాను. పండితుల సూచనతో అది దోషమని గ్రహించాను. శబ్దార్థచంద్రికలోను, సూర్యారాయాంధ్ర నిఘంటువులోను ‘నీమము’ శబ్దప్రస్తావన లేదు. అయితే శ్రీహరి నిఘంటువులో ఉంది.
  *
  మందాకిని గారూ,
  మంచి పని చేసారు. పాత పూరణలలో ఇస్తే నా దృష్టికి రాకపోవచ్చు.
  ఇప్పటి మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  నా ఆరోగ్యం కుదుటపడింది. మీకు స్వాస్థ్యం చేకూరాలని, పూర్వం లాగే ఉత్సాహంతో పద్యరచన చేయాలని కోరుకుంటున్నాను.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 33. శంకరయ్య గారికి నమస్కారములు.నా పద్య
  సవరణకు కృతజ్ఞుడను.

  రిప్లయితొలగించండి
 34. నామము దలచిన వెంటనె
  క్షేమము చేకూర్చు జనుల శ్రేయస్కరమౌ !
  పామరులు తెలిసి తెలియక
  తామస గుణ పూర్ణు డంద్రు దత్తాత్రేయున్ !

  రిప్లయితొలగించండి
 35. గురువుగారూ సమస్య పాదం పై మీరు ముందు వెలిబుచ్చిన అభిప్రాయం సమంజసం గానే కనుపిస్తోంది. ఇంతకుముందు శంకరా భరణం లోనే ఇటువంటి సమస్యలు చాలా కనుపిస్తాయి. మరి అప్పుడు ఎవరూ నొచ్చుకొన్నట్లు కన్పించడం లేదు. చెడు భావాన్ని మంచి భావంగా మలచేటప్పుడు మరి దోషం ఎందుకుంటుంది. ఇలా వర్జించుకుంటూ పోతే ఆసక్తినీ, ఉత్సాహాన్నీ రేపే సమస్యలు తగ్గి పోతాయేమో.

  నేమాని పండితార్యుని సూచన అవశ్యం పాటించ దగ్గది. మన మిత్రుల్లో ఎవరూ వాక్కును దుర్వినియోగం చేస్తున్న దాఖలాలు లేవు. అందుచేత సమస్య లేదు. పై సమస్యలో శ్రీ దత్తాత్రేయుని తామసునిగా నిరూపించే ప్రయత్నం చేస్తే తప్పక దోషం అవుతుందని నేనను కొంటున్నాను.

  ఏతావాతా మన మనసులో మలిన భావం లేనప్పుడు, నలుపును తెలుపునుగా చేసే ప్రయత్నం చేసేటప్పుడూ వాక్కులకు దోషం అంటదని నా అభిప్రాయం.

  నేనేదో పెద్దవానిగా ఇది చెప్పలేదు. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 36. రాజేశ్వరి అక్కయ్యా,
  చక్కని పూరణ. అభినందనలు.
  ‘క్షేమము చేకూర్చు జనుల శ్రేయస్కరమౌ’ అన్నప్పుడు అర్థపునరుక్తి అవుతున్నది. దానిని ‘క్షేమము చేకూర్చు జనుల చింతలు బాపున్’ అంటే ఎలా ఉంటుంది?
  *
  మిస్సన్న గారూ,
  ధన్యవాదాలు. మీ సూచన ఆలోచించదగిందే.

  రిప్లయితొలగించండి
 37. ఏమాత్రము వాక్కులలో
  తామసము సహింప బోని తత్త్వజ్ఞు లకున్
  నేమము తప్పిన దాయెను
  ' తామస గుణ పూర్ణు డంద్రు దత్తాత్రేయున్ '.

  రిప్లయితొలగించండి
 38. మిస్సన్న గారూ,

  నేమాని, శ్యామలీయము
  లే మనిరో, చర్చచేసి రెట్టులొ దానిన్
  ధీమంతుఁడ! మిస్సన్నా!
  నేమంబునఁ బద్యమందు నిల్పితి వన్నా!

  రిప్లయితొలగించండి
 39. గురువుగారూ ధన్యవాదాలు. శుభ రాత్రండీ.

  రిప్లయితొలగించండి
 40. మాస్టారూ, పున: పరిశీలనకు ధన్యవాదాలు. నా వ్యాఖ్యలో దోషారోపణ లేదని మనవి. వినయం మంచిదే, "అతివినయం ధూర్తలక్షణం" అన్నట్లు మంచి అయినా, చెడైనా అతి "సర్వత్రా వర్జయేత్" అన్న శ్రీ రామాయణా౦తర్గత వాక్యం శిరోధార్యం. అవధాన విద్యలో పద్య రచనలో కూడా కాలానుగుణ్యంగా కొన్ని మార్పులు వస్తున్నాయి, "వంధ్య" "విధవ" మరి ఆ కోవకు చెందినపదాలు (ఇక్కడవ్రాయలేను) పాత (1912 నుండి 1960 వరకు) అవధానాలలో చాలా తేలికగా వాడేవారు అవధానులు. గత 30 ఏళ్ళలో అవి వాడటం నేను చూడలేదు.
  అలాగే మన బ్లాగులోనే అదివరకు లేని మార్పులు చేరాయి, మనుషులు చేరారు. నా మటుకు నేను శ్రీ నేమాని, శ్రీ శంకరయ్య, మరియు శ్రీ చింతా మహాశయుల సలహాల ద్వారా పదును పెట్టుకోగలిగానని అనుకొంటున్నాను. నిత్యవిద్యార్థులం, అదివరలో నేర్చుకోనివి, అభ్యంతర౦ పెట్టనివి ఇప్పుడు చాలా నేర్చుకొంటున్నాము, ఇంకా చాలా నేర్చుకోవాలి. కలిసి పురోగమిద్దాము. సంతోషం. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 41. నా వ్యాఖ్య "The Other చెప్పారు" గా పోస్టు అయింది. ఎందుకో తెలియదు. గమనించగలరు.- మన తెలుగు చంద్రశేఖర్.

  రిప్లయితొలగించండి
 42. పామరులను తన చర్యల
  నేమరు పాటొందజేసి స్వామి నటింపన్
  కామాసక్తుని వోలెను
  తామస గుణ పూర్ణు డంద్రు దత్తాత్రేయున్.
  ------------

  రిప్లయితొలగించండి
 43. పామరులను తన చర్యల
  నేమరు పాటొందజేయ ,నేమములేకే
  కామాసక్తత నటనన్
  తామస గుణ పూర్ణు డంద్రు దత్తాత్రేయున్.
  -----------

  రిప్లయితొలగించండి