27, డిసెంబర్ 2011, మంగళవారం

ఛందస్సు - (రేఫ సంయుక్త పూర్వాక్షర గురులఘు విచారం)

       రేఫ సంయుక్త పూర్వాక్షర గురులఘు విచారం
          ఈమధ్య కొందరు కవిమిత్రుల పూరణలలో వారు రేఫసంయుక్త పూర్వాక్షరాన్ని లఘువుగా పరిగణిస్తే (ఉదా. ‘సత్యవ్రతుడు’లో ‘త్య’) నేను పూర్వాక్షరం గురువు అవుతుందని, అక్కడ గణదోషం ఏర్పడిందని వ్యాఖ్యానించాను. శ్రీ చింతా వారు, శ్రీ పండిత నేమాని వారు వివరించినా నా సందేహం తీరలేదు. ఛందోగ్రంథాల పరిశీలనానంతరం నా అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను. ఈ విషయంలో అటువంటి ప్రయోగాలు చేసి, నా వ్యాఖ్యల వల్ల మనస్సు నొచ్చుకున్న మిత్రులు మన్నించాలి.
          ‘పింగళచ్ఛందము’లో గురు లఘువుల లక్షణం.
దీర్ఘం సంయోగపరతం
తథా ప్లుతం వ్యంజనాంత మూష్మాంతమ్
సానుస్వరం చ గురు
క్వచి దవసానేऽపి లఘ్వంతమ్
          ఈ లక్షణాన్ని అనుసరించి దీర్ఘాలు (ఆఈఊౠఏఐఓఔ అనే అచ్చులు, ఈ అచ్చులతో కూడిన హల్లులు), సంయోగపూర్వాలు (ద్విత్వసంయుక్తాక్షరాలకు ముందున్నవి), ప్లుతాలు (మూడు మాత్రలు కల సంబోధనాశ్చర్యాది పదాంతాక్షరాలు), వ్యంజనాంతాలు (ధిక్, సత్ మొదలైనవి), ఊష్మాంతాలు (విసర్గతో కూడినవి), అనుస్వార యుక్తాలు (సున్నాతో కూడిన అక్షరాలు) గురువులు.

          హ్రస్వాలు, గురుభిన్నాలైన ఇతరాక్షరాలు లఘువులు. గురుభిన్నాలై లఘువులు కాని అక్షరాలేవో చూద్దాం.
          సంయోగపరత్వం గురువుకు ఒక లక్షణం కదా! అనగా సంయుక్తాక్షరాలకు ముందుండే అక్షరాలు గురువులు. కాని కావ్యాలలో అందుకు వ్యతిరేకమైన లక్ష్యాలు కనబడుతున్నాయి. అందువల్ల కేదారభట్టు
‘పాదాదా విహవర్ణస్య, సంయోగః క్రమసంజ్ఞితః
పరస్థితేన తేనస్యాత్, లఘుతాపి గురోః క్వచిత్’
          అని లక్షణాన్ని చెప్పాడు. దీనిని బట్టి ‘క్వాచిత్కముగా’ ఉత్తరపాదాది సంయుక్తం పరమైనపుడు పూర్వపాదాంత వర్ణం గురువు కాకపోవచ్చు. అనగా ఏదైనా పాదం సంయుక్తాక్షరంతో మొదలైతే దాని ముందున్న పాదం చివరి అక్షరం గురువు కాకపోవచ్చు.
          రేఫసంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం పాక్షికంగా లఘుత్వాన్ని పొందడం (ఒక్కొక్కసారి గురువు, ఒక్కొక్కసారి లఘువు కావడం) గమనించి పింగళాచార్యుడు ‘ప్రహేవా’ అనే వికల్పసూత్రాన్ని చెప్పాడు. (వృత్తరత్నాకరం, 1-10)
          ఈ విధంగా రేఫసంయుక్తాక్షరానికి ముందున్నవి లఘువులుగానే ఉండడాన్ని గుర్తించిన జయకీర్తి అందుకు ఉచ్చారణశైథిల్యమే కారణమని భావించి ‘సంయోగః పరోऽపి జాతు వర్ణః’ (ఛందోనుశాసనము - ౧.౧౦) అని ప్రకటించాడు.
          
          లఘువులు రెండు విధాలు. 1. సహజ లఘువులు, 2. గురువు కావలసి ఉండి ఉచ్చారణ శైథిల్యం చేత గురుత్వాన్ని పొందక లఘువుగానే ఉండేవి.
          ఈ శిథిలోచ్చారణం చేత పాదాది సంయుక్తాక్షరానికి ముందున్న (పూర్వపాదాంత) అక్షరాలు, రేఫసంయుక్తాక్షరానికి ముందున్నవి వైకల్పికంగా లఘువు లవుతున్నవి.
          ‘సంయుక్తే సంస్కృతాద్యే స్యాత్ సర్వ మంధ్రపదం లఘు ...’ అనే చింతామణి సూత్రం వల్ల ‘సంయుక్తాక్షరంతో ప్రారంభమయ్యే సంస్కృతపదానికి ముందున్న తెలుగుపదం చివరి అక్షరం గురువు కాదు. (ఉదా. నీకు స్తుతి - ఇక్కడ సంయుక్తాక్షరంతో ప్రారంభమైన సంస్కృతపదం ‘స్తుతి’ ముందున్న తెలుగుపదం (నీకు) చివర ఉన్న లఘువు - ‘కు’ గురువు కాదు)
          
          సంయుక్తాక్షరంతో ప్రారంభమయ్యే తెలుగుపదానికి ముందున్న పదం చివరి అక్షరం కూడా గురువు కాదు (ఉదా. చక్కని వ్రాత - ఇక్కడ ‘వ్రా’కు ముందున్న ‘ని’ లఘువుగానే ఉంటుంది)
          సంస్కృతంలో ఏ పరిస్థితిలో నైనా సంయుక్తాక్షరానికి ముందున్న లఘువు గురువు అవుతుంది. తెలుగులో మాత్రం ఏకపదంలో, సిద్ధసాంస్కృతిక సమాసంలో మాత్రమే సంయుక్తాక్షరానికి ముందున్న లఘువులు గురువు లవుతాయి.
          
          సంస్కృతంలో రేఫసంయుక్తాక్షరం పరమైన లఘువు వైకల్పికంగా గురువు అవుతున్నది.
సంస్కృతపదంబు లొగి సమాసములు గూర్చు
నపుడు క్రారను గూడిన యక్కరంబు
లూఁదియుండు నొక్కొక్కచో నూఁదకుండుఁ
దెలుఁగు కృతులందు .... (కూచిమంచి తిమ్మకవి)
          సిద్ధసాంస్కృతిక సమాసంలో రేఫసంయుక్తవర్ణానికి ముందున్న వర్ణం ఒక్కొక్కసారి ఊదబడుతుందని, ఒక్కొక్కసారి ఊదబడదని తాత్పర్యం. ఇక్కడ రకార ఉచ్చారణలోని శైథిల్యం చేత రేఫసంయుక్తంలోని ప్రథమవ్యంజనం పూర్వస్వరంచేత ఆకర్షింపబడదని గ్రహించాలి.
          
          ‘ఋఌ వర్ణంబులు రల తుల్యంబులు’ అనడంచేత ఋ,రల ఉచ్చారణలో అభేదానికి అవకాశం కల్గుతున్నది. ‘ప్ర’ అనే సంయుక్తాక్షరంలో ‘ప్ + ర్ + అ’ అని వర్ణక్రమం వల్ల ఇది వ్యంజనద్వయం (రెండుహల్లులు) కల్గి, ఉపధావర్ణం (చివరివర్ణానికి ముందున్న వర్ణం)గా రేఫను కలిగి ఉంది. రకార పూర్వ వ్యంజనమైన పకారం పూర్వస్వరంచేత ఆకర్షింపబడి ఆ పూర్వాక్షరానికి గురుత్వాన్ని ఆపాదించాలి. కాని రకారం ఋకారతుల్యత్వంచేత స్వర (అచ్చు) ధర్మన్ని కలిగి ఉండి దానిపైనున్న అకారస్వరంతో లీనమౌతున్నది. దీని వల్ల రేఫ వ్యంజనత్వాన్ని కోల్పోవడం చేత ‘ప’కారం ఏకవ్యంజనాక్షరత్వాన్ని పొంది పూర్వస్వరం చేత ఆకర్షింపబడదు. అందువల్ల పూర్వ లఘ్వక్షరం ఊదబడక గురువు కాదు.
          ‘సాకేతప్రభువు’ అన్నప్పుడు ‘ప్ర’కు ముందున్న ‘త’వర్ణం గురువు కావచ్చు లేదా లఘువు కావచ్చు.
 
ఉదా ....
కం. ................. అమ్ముని
ప్రవరు పృథూత్సంగతలముపై వడిఁ బడియెన్ (భార. సభాపర్వం. 1-143)
(`మునిప్రవర’లోని ‘ని’ గురువు కాదు)
ఉ. కావున గామక్రోధములఁ గ్రాగుచు నాశ్రితకోటి గాచుచున్ (భార. శాంతిపర్వం. 4.81)
(‘కామక్రోధముల’లో ‘క్రో’ పూర్వాక్షరం గురువు కాలేదు)
సీ. సంధ్యాదివందనశ్రద్ధ యుజ్జన సేయు
          గీతవాక్యవినోదక్రియలఁ దగులు (కాశీఖండము. 4.81)
(ఇక్కడ ‘క్రి’ ముందున్న ‘ద’ గురువులు కాలేదు)
 
చివరగా ...
          ‘అద్రుచు, విద్రుచు, ఎద్రుచు, పద్రుచు మొదలైన తెలుగు పదాలలో ‘ద్రు’లోని అల్పరేఫోచ్చారణ వల్ల దాని ముందున్న అక్షరాలు గురువులు కాకుండా అవి సర్వలఘు గణా లవుతున్నాయి.
          ‘అదురుచు - అద్రుచు’ - ‘చుక్పరక రువర్ణంబునకు ముందఱి దువర్ణము నుత్వంబునకు లోపంబు విభాష నగు, నగుచో తత్పూర్వంబు గురువు గాదు (బాలవ్యకరణం. ప్రకీర్ణ. 20).
          
          ఈ పాఠంపై సందేహాలు, అభ్యంతరాలు, సూచనలు ఉంటే తెలియజేయ వలసిందిగా మనవి.

5 కామెంట్‌లు:

  1. మాస్టారు గారూ ! సోదాహరణ వివరణతో సందేహములు తీర్చినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. గురువు గారూ ఎంతో శ్రమ తీసుకొని మాకు పాఠాలు నేర్పుతున్న మీకు, పెద్ద లందఱకూ కృతజ్ఞతాభివందనములు. సరదాగా పద్యాలు వ్రాసే మాకు తప్పులు చూపిస్తే సంతోషమే గాని, మనస్సు నొచ్చుకోవడమంటూ ఉండదు.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!

    మీ లోని సందేహము నివారణ అయినందులకు సంతోషము.

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు. నిజానికి ఇది నాకు నేను చెప్పుకున్న పాఠం. నా అల్పజ్ఞతను అంగీకరిస్తూ తెలుసుకున్న జ్ఞానాన్ని మిత్రులతో పంచుకోవాలనుకున్నాను.

    రిప్లయితొలగించండి
  5. గురువులకు , నమస్కారములు.
    శ్రమ కోర్చి పద్యాలను సవరణ చేయడమే గాక ఇంతటి వ్యాకరణము నేర్పుతున్నందుకు , తెలుగు క్లాసులో విద్యార్ధులం కాదు కదా ? అన్న భ్రాంతి. ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి