15, డిసెంబర్ 2011, గురువారం

ముద్రాలంకారం

                           ముద్రాలంకారం
పద్యం పేరును ఆ పద్యంలో ప్రస్తావిస్తే దానిని ముద్రాలంకారము అంటారు. సామాన్యంగా ఛందోగ్రంథాలలో వృత్తలక్షణాలకు ఉదాహరణగా ఇచ్చిన పద్యాలలో ఈ ముద్రాలంకారం కనబడుతుంది.

పండిత నేమాని వారి ఈ క్రింది పద్యాలలో ముద్రాలంకారమును చూడవచ్చును:

మనమారన్ గొలుతున్ మహాగణపతీ! మత్తేభ రాజాననా!
ఘన విఘ్నాపహ! సర్వ యోగఫలదా! గౌరీసుతా! సత్కవి
త్వనిధానా! గురువర్య! మాన్యవిభవా! తత్త్వప్రకాశమ్ము నా
మనమందిమ్ముగ నింపి ప్రోవుము ననున్ మాంగళ్యదా! సర్వదా!


మౌనివర్య! జనమాన్య చరిత్రా!
జ్ఞానసారనిధి! స్వాగతమయ్యా
మాననీయ గుణ! మంగళదాతా!
పూని నీ పదము మ్రొక్కెద స్వామీ!


దేవదేవుడు వచ్చు శీఘ్రమె దివ్యతేజము తోడ భూ
దేవి చాల సుఖించు పూర్తిగ దీరిపోవును కష్టముల్
దేవతల్ తమ పూర్వ వైభవ దీప్తి గాంచెదరంచు సద్
భావ మొప్పగ మత్తకోకిల పాడె నామని రాకతో.


ఈ వృత్తాలు (1) మత్తేభము, (2) స్వాగతము  (3) మత్తకోకిల --  ఆయా పేరులు ఆయా వృత్తాలలో వచ్చేయి కదా.
 
ఈ విధంగా మరికొన్ని వృత్తాలలో కూడా ముద్రాలంకారాన్ని పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు తమ అధ్యాత్మ రామాయణములో ప్రయోగించారు.. 


                           (పండిత నేమాని వారికి ధన్యవాదాలతో)

16 కామెంట్‌లు:

 1. మాస్టరు గారూ! 'ముద్రాలంకారం' ద్వారా క్రొత్త వృత్తం "స్వాగత" గురించి తెలుసుకున్నాను.దాని గణములు గల,గ,న,భ,గగ మేనా? తెలుపగలరు.

  రిప్లయితొలగించండి
 2. ప్రజ లమాయకుల్ గొర్రెల వంటి వారు
  నాయకులు మాయ తోడేళ్ళు చేయుచుండి
  ప్రజలనూరించు బాసలన్ బళిర! సభల
  కారు కూతల గూయ సంస్కర్త యగును

  రిప్లయితొలగించండి
 3. స్వాగత వృత్తమునకు గణములు: ర న భ గగ

  రిప్లయితొలగించండి
 4. శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములు.
  ముద్రాలంకారం ద్వారా "స్వాగత" గురించి తెలుసుకున్నాము.దాని గణములు ర న భ గగ ;
  మరి యతి ఇతర నియమములు తెలుపగలరు.

  మీ శిశ్యుడు
  వరప్రసాదు

  రిప్లయితొలగించండి
 5. అయ్యా! స్వాగథ వృత్తము పైన ఇచ్చేము కదా. చూడండి. ప్రాస నియమము ఉన్నది. యతి 8వ అక్షరము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. తాడిగడప శ్యామలరావుగురువారం, డిసెంబర్ 15, 2011 11:01:00 AM

  వృత్తము: స్వాగతము. గణములు: ర న భ గగ. యతి: భగణాద్యక్షరము
  వృత్తము కాబట్టి (1) ప్రాస నియమం ఉంది (2) ప్రాసయతి పనికి రాదు.

  వృత్తములందు గణవిభజన చేసేటప్పుడు పాదాది నుండి 3 అక్షరముల గణములుగా లెక్కించవలెను. చివరి గణము యేకాక్షరమైతే 'గ'. రెడక్షరాలగణమైతే 'లగ' లేదా 'గగ'. 'లగ' ను 'వ' అని కూడా పిలుస్తారు.

  వృత్తం ప్రధమాక్షరం గురువు అయే పక్షంలో, యతిస్థానం సాధారణంగా గణం మొదటి అక్షరంగా ఉంటుంది. అయితే, కొన్ని వృత్తాలలో ప్రధమ గురువును రెండు లఘువులుగా విడదీసి వేరే వృత్తంగా పరిగణిస్తాము (ఉత్పల చంపక మాలలవలె). అటువంటప్పుడు యతి స్థానం మూలవృత్తం ఆధారంగానే యధాస్థానంలో ఉండటం వలన సాధ్యవృత్తంలో యతిస్థానం గణం రెండవ అక్షరంగా ఉంటుంది. నాది యెంత వరకు లాక్షణికమైన పరిశీలన అయినది శంకరయ్యగారో, నేమాని వారో చెప్పాలి. నా దగ్గర ఛందోగ్రంధాలేవీ లేవు.

  రిప్లయితొలగించండి
 7. శ్రీ శ్యామలరావు గారికి, శ్రీ పండిత నేమాని గారికి ధన్యవాదములు.
  మన్నించాలి యతి ౭ వ అక్షరము అని పించుచున్నది. గురువు గారు మరొక్కమారు సందేహము తీర్చగలరు

  రిప్లయితొలగించండి
 8. నిజమే! స్వాగత వృత్తానికి యతిస్థానం 7. పండిత నేమాని వారిది టైపాటు. ఎందుకంటే వారి లక్ష్యంలో ఏడవ అక్షరానికే యతిమైత్రి కూర్చబడింది.

  రిప్లయితొలగించండి
 9. యతి స్థానము:
  శ్రీ శ్యామలరావు గారి మాటలను నేను వివరించున్నాను. వృత్తములలో యతిని వృత్త ప్రథమాక్షరమునకు యతి స్థానములో అక్షరమునకు మైత్రితో వేస్తారు. యతిని (వడి - లేక విరామము) అని కూడా పిలుస్తారు. అంటే అక్కడ పద్యమును చదివేటప్పుడు గుక్క తిప్పుకొనుటకు అవకాశము ఇచ్చినట్లు. తెలుగులో యతి స్థానములో అక్షరమైత్రి చూస్తారు. సంస్కృత శ్లోకములలో యతి స్థానములో ఆ పదము అంతము కావలెను. తెలుగు జాతులకు, ఉపజాతులకు -- (కందము, తేటగీతి, శీసము, ద్విపద, మొ.గు వాటికి) అక్షరములను బట్టి కాకుండా గణములను బట్టి యతిస్థానమును నిర్ణయిస్తారు. ఉదా: కందములో 2వ 4వ పదములలో తొలి అక్షరమునకు అదే పాదములోని 4వ గణము తొలి అక్షరమునకు యతి వెయ్యాలి. ప్రాసనియమము వృత్తములలో ఉంటుంది. ప్రాస నియమము లేని పద్యములలో ప్రాస యతిని (యతికి బదులుగా) వాడుతారు. అట్టి పద్యములలో యతి స్థానములో ప్రాసయతిని కూడా వేయవచ్చును.

  రిప్లయితొలగించండి
 10. తాడిగడప శ్యామలరావుగురువారం, డిసెంబర్ 15, 2011 4:32:00 PM

  మరి కొంచెం వివరణ:

  కందం జాతి పద్యం. తేటగీతి, ఆటవెలది, సీసము, ద్విపదలు ఉపజాతి పద్యాలు.
  జాతి పద్యం కాబట్టి కందంలో ప్రాస యతి చెల్లదు. ఉపజాతి పద్యాలలో ప్రాసయతి చెల్లుతుంది.
  ద్విపద ఉపజాతి అయనా ప్రాసనియమం ఐఛ్ఛికం. ప్రాసపాటించని ద్విపదను మంజరీ ద్విపద అంటారు. యేరకం ద్విపద అయినా ప్రాసయతి చెల్లుతుందనుకుంటాను.

  సంస్కృత భాషలో వృత్తాలలో పాదం చివర ప్రస్తుతపదం పూర్తి అవాలి. ఒక పదాన్ని ఒకపాదం చివరలో కొంత, తరువాయి పాదం మొదటిలో కొంత ఉంచి వ్రాయరాదు.
  అలాగే, సంస్కృత భాషలో వృత్తాలలో యతిస్థానం దగ్గర కూడా పదం విరగాలి. అంటే యతి స్థానం దగ్గర క్రొత్త పదం మొదలవాలి.
  సంస్కృత శ్లోకాలకు యతిమైత్రి నియమం లేదు. అలాగే వాటికి ప్రాస నియమం కూడా లేదు.

  రిప్లయితొలగించండి
 11. ముద్రాలంకార వ్యాజంతో యతి ప్రాసల గురించిన చర్చ జ్ఞానదాయకంగా కొనసాగుతున్నది. చాలా సంతోషం!
  అందరికీ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 12. మరికొన్ని విషయాలు:
  (1) కందము సంస్కృతములోని ఆర్యా వృత్తమునకు అనుకరణము. ఒక విధమైన ఆర్యా వృత్తములో మన కంద పద్యము వలె ఉండును గాని 2, 4 పాదములలో చివరి గణములో ఒక గురువు మాత్రమే ఉంటుంది.
  (2) ద్విపద, మంజరీ ద్విపదలలో ప్రాస యతిని వాడరు.
  (3) ఉత్సాహ వృత్తము, వృత్తమే ఐనా అందులో పాదమునకు 7 సూర్య గణములు + 1 గురువు ఉంటాయి. 3 అక్షరముల గణములతో సంబంధములేని వృత్తము ఇది.
  (4) లయగ్రాహి, లయవిభాతి మరియు అశ్వధాటీ వృత్తములలో ప్రాసలు, ప్రాసయతులు కూడా ఉంటాయి.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 13. తాడిగడప శ్యామలరావుగురువారం, డిసెంబర్ 15, 2011 8:00:00 PM

  చర్చను పొడిగస్తున్నందుకు మిత్రులు నన్ను క్షమించాలి, ముఖ్యంగా నేమానివారు.
  నా మిడిమిడి జ్ఞానం యేమిటంటే వృత్తాలు పాదానికి 1-26 ఆక్షరాలు కలిగ ఉంటాయని, 26కంటే పాదాక్షర సంఖ్య గల వృత్తాలు ఉధ్ధురమాలా వృత్తాలని పిలువబడుతాయనీ.
  నియతాక్షరసంఖ్యా నియమంగలిగి ఉండటంచేత వీటికి త్ర్యక్షరగణాలు , అంత్యంలో ఒకటి రెండక్షరాలు వస్తాయి కాబట్టి, 'గ', 'లగ' ( & 'గగ') గణాలు నిర్దేశించారని అనుకుంటున్నాను.
  ఇంద్ర,సూర్య గణాలతో ఉపజాతి పద్యాలు యేర్పడతాయని నా అవగాహన. ఉపజాతుల్లోనే ప్రాసయతి చెల్లుబాటని నా ఉద్దేశం.
  జాతి పద్యాలు యతి, ప్రాసలతో సహా మరికొన్న ప్రత్యేక నియమాలు (+గణాలు. ఉదా: కందంలో 'గగ') కలిగి ఉంటాయని అభిప్రాయ పడుతూ వచ్చాను.
  అందుచేత, సూర్య గణాలతో యేర్పడే ఉత్సాహం వృత్తమంటే ఆశ్చర్యం కలిగింది.
  అశ్వధాటిలో ప్రతి పాదమునకు మూడు త-భ-ల గణములు, చివర ఒక గురువు ఉండును. (ఉదా:వందారు లోక వర సందాయినీ విమల కుందావదాత రదనా )
  నియతాక్షరసంఖ్యచేత వృత్తగౌరవము కలిగినా యితది ప్రధానముగా మాత్రాఛందజాతి పద్యము. అనగా ఐదు పంచ మాత్రలు, ఒక గురువు. అందుచేత దీనిలో అనుప్రాసలు ముఖ్యభూమిక గలిగి ఉన్నాయి.
  జెజ్జాల కృష్ణ మోహన రావు గారైతే దీని ఒక జాతిగా generalise చేస్తున్నారు.
  ఇంకా నేను ఛందస్సును బాగా అధ్యయనం చేయవలసి ఉన్నది. చాలా తెలుసుకోవలసిన విషయాలున్నాయని తెలిసి చాలా సంతోషంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 14. పూజ్యులైన , గురువులకు ,పండితులకు , , అందరికి , నమస్కారములు.
  ఇన్ని రకముల చందస్సులను తెలుసుకో గలుగు తున్నందుకు చాలా ఆనందం గా ఉంది . అందరికీ ధన్య వాదములు

  రిప్లయితొలగించండి