19, డిసెంబర్ 2011, సోమవారం

సమస్యాపూరణం - 565 (భామను పెండ్లాడి యొకఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
భామను పెండ్లాడి యొకఁడు బలిపశువయ్యెన్.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

46 కామెంట్‌లు:

  1. కామిని యయ్యెను కాముడు
    ప్రేమల తో మెయిలు బెట్ట ప్రీతిగ నెట్ లో
    కాముగ పడ వల నెట్లో
    భామను పెండ్లాడి యొకఁడు బలిపశువయ్యెన్.

    కాముగ = calm గ

    రిప్లయితొలగించండి
  2. స్త్రీ మోహమందు నారదు
    డే మహిని గృహస్థుడయ్యె మర్యాద చెడెన్
    లేముల పాలయ్యె నటుల
    భామను పెండ్లాడి యొకదు బలి పశువయ్యెన్

    రిప్లయితొలగించండి
  3. ఏమని చెప్పుదు కలియుగ
    భామలలో సచ్చరిత్ర వనితలవేటన్,
    కామాంధతతో భోగము
    భామను పెండ్లాడి యొకడు బలిపశువయ్యెన్.

    రిప్లయితొలగించండి
  4. వెంకట రాజారావు . లక్కాకులసోమవారం, డిసెంబర్ 19, 2011 9:01:00 AM

    కామాది షట్క విముఖత
    లోమిన మునియయ్యు విధికి నోడి పతితుడై
    తామసమున సురవేశ్యా
    భామిని పెండ్లాడి యొకడు బలి పశువయ్యెన్

    రిప్లయితొలగించండి
  5. నా తొలి పూరణలో యతి పడ లేదు. సవరించిన పద్యము ఇలాగ వ్రాసేను:

    స్త్రీమోహమందు నారదు
    డే మహిని గృహస్థుడయ్యె నిక్కట్లు వడెన్
    ఛీ! మర్యాద చెడె నటుల
    భామను పెండ్లాడి యొకడు బలి పశువయ్యెన్

    రిప్లయితొలగించండి
  6. మిత్రులరా!
    నిన్నటి నా పూరణకు (సమస్య: తేనె బొట్టుతో నంబుధి తియ్యనయ్యె) కొంచెము వివరణ వ్రాస్తున్నాను:
    పార్వతీ పరమేశ్వరులు అక్షర స్వరూపులు (నాశనములేని స్వరూపము) మరియు అక్షరములే స్వరూపముగా గలవారు. అక్షరములు నాదమునకు సంకేతములు ఎలాగూ వారు నాద స్వరూపులే. అంతే కాదు వేదశ్శివః శివోవేదః అని ఆర్యోక్తి. శివుడు వేదస్వరూపుడు అని భావము. వేదము ప్రపంచములోనున్న సకల వాఙ్మయమునకు సారము. అట్టి వేదములో శివ ఆరాధనకు సంబంధించిన నమక చమకములు ఉన్న భాగము సారము. అందులో 8వ అనువాకము (నమస్సోమాయచ ... అని మొదలిడు అనువాకము) సారము. అందునున్న నమశ్శివాయ అను మంత్రము సారము -- అన్నిటా శివ మంత్రము మిక్కిలి సారము. శివ శబ్దము విశ్వ మంగళకరమైనది. అది లేని విశ్వమును ఊహించలేము. అశివమైన దక్ష యజ్ఞము గురించి తెలుసు కదా. అంతేకాదు శివుడు జ్ఞాన వైరాగ్య నిధానము. లోకములకు ఆది గురువు. మరికొంచెము రేపు వ్రాస్తాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. వ్యామోహమునే భ్రమపడి
    ప్రేమని పెద్దలు వచింప పెడజెవి బెట్టెన్
    కాముడు తనకున్ పొసగని
    భామను పెండ్లాడి యొకఁడు బలిపశువయ్యెన్.

    రిప్లయితొలగించండి
  8. బలి పశువయ్యెన్
    -----------------
    ఆమరణ దీక్ష బూనిన
    సోముడు మఱి నీరసించి సొమ్మ గిలంగన్
    మామయ కోరిక మేరకు
    భామను పెండ్లాడి యొకడ బలి పశువయ్యెన్ .

    రిప్లయితొలగించండి
  9. ఓటుకు నోట్లిచ్చు వారె యుత్తమ నేతల్ .
    ---------------
    మాటల మోసము చేయుదు
    రోటుకు నోట్లిచ్చు వారె , యుత్తమ నేతల్
    గాటమగు నాదరంబున
    ఓటుకు తగు ఫలము నిత్తు రౌత్సా హితులై .

    రిప్లయితొలగించండి
  10. ఓం స్వామియే శరణమయ్యప్ప
    గురువు గారికి శత కోటి ధన్యవాదములు.
    మీ వ్యక్తిగతవిషయమును ప్రస్తావించినందులకు
    గురువుగారు నన్ను క్షమించాలి.
    -----------
    ప్రేమకు విరామమెట్టగ
    భామను పెండ్లాడి యొకఁడు, బలిపశువయ్యెన్.
    కోమలి కోరె విడాకుల
    నే మామ గృహమున పాదమెట్టక మునుపే|

    రిప్లయితొలగించండి
  11. వరప్రసాదుగారూ, మన్నించాలి.
    విరామమెట్టగ, పాదమెట్టక అనేవి సరైన ప్రయోగాలు కావండీ.
    విరామమెట్టగ బదులు విరామ మీయగ అంటే బాగుంటుంది.
    కానీ పాదమెట్టక బదులు కాలుపెట్టగ అంటే సాదువుగా ఉన్నా యతి కుదరదు.
    కాబట్టి, యీ సందర్భంలో 'పాదమేనియు నిడకన్' అనో మరో రకంగానో మార్చాలి.

    రిప్లయితొలగించండి
  12. గోలివారు " కాముగ = calm గ " అని యిబ్బంది పడకుండా హాయిగా 'గోముగ' అంటే సరిపోతుందని అనుకుంటాను.

    అలాగే సంపత్కుమారులవారు "సచ్చరిత్ర వనితలవేటన్", "భోగము భామను" అన్న మాటలు వాడారు. వనితా శబ్ధం సంస్కృతమేకాని వనితలు తెలుగుమాట. అందుచేత వనితలవేట తెలుగుసమాసం. దీనికి ముందు 'సచ్చరిత్ర' అనేది చేర్చటం కొంచెం విచార్యం. అంతకంటే "యోగ్యులైన వనితల వేటన్" అంటే సరిపోతుందేమో!

    "భొగము భామలు" కాక భోగపుభామలు అని ఉండాలి. చిన్న మార్పే.

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్నగారు 'ప్రేమని' అన్న చోట యడాగమం వల్ల ప్రేమయని అనే అవుతుందనుకుంటాను. అలాగే వారు 'కాముకుడు' అనటానికి బదులుగా 'కాముడు' అన్నారు. కాని కాముడు అంటే మన్మధుడు. కాబట్టి పద్యం కొంచెం మార్చాలి.

    రిప్లయితొలగించండి
  14. సుబ్బారావుగారి ఆమరణ దీక్ష ... పద్యం గౌణార్థంతో మంచి చమత్కారం కలిగి బాగుంది.

    రిప్లయితొలగించండి
  15. గురువు గారికి మరియు కవి పండితులకు( శ్యామలరావు గారికి పండిత నేమానిగారికి , గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, జిలేబిగారికి, గన్నవరపు నరసింహ మూర్తి గారికి,సుబ్బారావుగారికి, లక్కాకుల వెంకట రాజారావుగారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, మందాకిని రాజేశ్వరి గారికి వర ప్రసాదు నమస్కారములు, మీరందిచు సూచనలను తప్పక పాటించేదను , సదా మీ సహాయమును కోరుతూ

    మీ శిశ్యుడు

    వరప్రసాదు

    రిప్లయితొలగించండి
  16. ఆమిషముఁ గోరి వనమునఁ
    గోమలి రూపమ్ముఁ దాల్చి కులుకుచు "నిన్నే
    ప్రేమించితి" నను రాక్షస
    భామను పెండ్లాడి యొకఁడు బలిపశు వయ్యెన్.

    రిప్లయితొలగించండి
  17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చమత్కారభరితంగా ఉంది. అభినందనలు.
    ‘వల నెట్లో’ ... ? వల - నెట్ రెండూ ఒకటే కదా!
    *
    పండిత నేమాని వారూ,
    ‘నారద సంసారం’ కథను ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    శ్యామల రావు గారి వ్యాఖ్యను గమనించండి.

    రిప్లయితొలగించండి
  18. కామాక్షి కపట ప్రేమను
    ఏ మాత్రము తెలుసు కొనక నేమరు పాటున్ !
    నీమము లెఱుగని మిటారి
    భామను పెండ్లాడి యొకఁడు బలి పశువయ్యెన్ !

    రిప్లయితొలగించండి
  19. --------

    ఏమని జెప్పుదు నిప్పుడు ?

    భామను పెండ్లాడి యొకడు పరవశ మయ్యెన్

    మమతల లక్షణ మయ్యది

    మమతాను రాగ ఫలములె పరవశ మగుటౌ.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ సుబ్బారావు గరూ!
    మీరు ప్రాస నియమమును చూచుట లేదు. తొలి పాదములో తొలి అక్షరము దీర్ఘము కదా. అన్ని పాదములలో తొలి అక్షరము దీర్ఘము ఉండాలి కదా. సరిజేసుకోండి మీ పద్యమును.

    రిప్లయితొలగించండి
  21. పై పద్యము సవరణ

    ----------

    ఏమని జెప్పుదు నిప్పుడు

    భామను పెండ్లాడి యొకడు పరవశ మయ్యెన్

    మమతల లక్షణ మయ్యది

    మమతయు ననురాగ ఫలము పరవశ మగుటౌ.

    రిప్లయితొలగించండి
  22. నేమాని వారికి నమస్కారములు .

    రెండవ పద్యము కూడ ప్రాస కు ముందు దీర్ఘా క్షరమును

    గమనించ నందులకు క్షంతవ్యుడను .సరి చేయుదును.

    రిప్లయితొలగించండి
  23. @రాజేశ్వరి నేదునూరి గారూ మీ పూరణ బాగుంది.

    "కామాక్షి కపట ప్రేమను
    ఏ మాత్రము తెలుసు కొనక నేమరు పాటున్ !

    ఏమిటి ఇట్లా హిట్లు పెట్టేస్తున్నారు ?

    రిప్లయితొలగించండి
  24. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    అక్షర శివపార్వతులను
    సాక్షాత్కారమ్ము సేసి శబ్దప్రాశ
    స్త్యక్షేత్రావిష్కరణము
    సాక్షర మొనరించితివి యశశ్శ్రీ శోభిల్లన్.
    *
    మిస్సన్న గారూ,
    ‘పొసగని భామను పెండ్లాడి’ అని పూరించడం బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    ‘పేమని’ని ‘ప్రేమగ’ అందాం. కాముడు అనేది అనేది మన్మథుడు అని కాక ఆ వ్యక్తి పేరుగా తీసుకుంటే సరి!
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మీ ‘ఓట్లకు నోట్లిచ్చు ...’ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    అయితే చివరి పాదంలో యతి తప్పింది. దానిని ‘ఓటుకు దగు ఫలము నిత్తు రుత్సాహమునన్’ అంటే సరి!
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. నిజంగానే మా తొందరపాటు వల్ల మా అబ్బాయి బలిపశువే అయ్యాడు. ధన్యవాదాలు.
    ‘ఎట్టక’ పదప్రయోగం వ్యాకరణ విరుద్ధం. నా సవరణతో మీ పద్యం ....
    ప్రేమకు విరామ మివ్వక
    భామను పెండ్లాడి యొకఁడు, బలిపశువయ్యెన్.
    కోమలి కోరె విడాకుల
    నే మామ గృహమున పాదమే పెట్టకనే!
    *
    శ్యామల రావు గారూ,
    ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ రెండవ పూరణలో ప్రాస సవరించే ప్రయత్నం చేయండి.

    రిప్లయితొలగించండి
  25. కోమలమౌ గానమువిని
    ఆమేపాడినదనుకొని నావేశములో
    నేమీ పలుకగ లేనీ
    భామను పెండ్లాడి యొకడు బలి పశువయ్యెన్!!!


    (లోగడ బహుశ శ్రీ s .v .కృష్ణా రెడ్డి తీసిన సినిమాలో నటి శ్రీ లక్ష్మి ద్విపాత్రాభినయం చేస్తూ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారితో కలిసి నవ్వులు పూయించిన సన్నివేశం తలచుకొని పూరించాను )

    రిప్లయితొలగించండి
  26. @మంద పీతాంబర్ గారూ పూరణ బాగుంది.
    "కోమలమౌ గానమువిని
    ఆమే పాడినదనుకొని నావేశములో

    రిప్లయితొలగించండి
  27. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!
    మీరు వ్రాసిన ప్రశంసా పద్యములో చివర గణములు సరిపోలేదు. మామూలుగా నేను చెప్ప కూడదు గానీ -- ఇలా సరిచేస్తే బాగుంటుంది కదా!

    "సాక్షర మొనరించితివి యశశ్రీమంతా!"

    రిప్లయితొలగించండి
  28. శ్రీపతిశాస్త్రిసోమవారం, డిసెంబర్ 19, 2011 9:47:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    ఏమాటకు నామాటగ
    నేమాత్రము లెక్కలేక నెదిరించుచు తా
    నామగనిని పీడింపగ
    భామను పెండ్లాడి యొకఁడు బలిపశువయ్యెన్

    రిప్లయితొలగించండి
  29. Goli Sastry.

    శ్యామలరావు గారూ ! ధన్యవాదములు.కామిని వలలోన ఎట్లో కాముగా పడ్డాడని నా భావం.
    శంకరార్యా! ధన్యవాదములు. అది( వలన్+ఎట్లో ) అనండీ...

    రిప్లయితొలగించండి
  30. శ్యామలీయం గారికి మరియు గురువుగారికి ధన్యవాదములు.

    శ్యామలీయం గారూ,

    తప్పును సరిచేసినందుకు ప్రత్యేకధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  31. శ్రీ శం కరయ్య గారికి నమస్కారములు .మీ సవరణ
    బాగున్నది .సవరించుదును.శ్రీ నేమాని వారి సూచనలను
    శిరసా వహింతును.

    రిప్లయితొలగించండి
  32. @శ్రీపతిశాస్త్రి గారు పూరణ బాగుంది.

    ఏమాటకు నామాటగ
    నేమాత్రము లెక్కలేక నెదిరించుచు తా

    ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
    పోచిరాజు సుబ్బారావు గారూ మీరు సూచించిన సమస్యకి హిట్ల మీద హిట్లు వస్తున్నాయి. హిట్లన్నీ ఆడవాళ్ళ మీదే ఏమిటో మరి.

    రిప్లయితొలగించండి
  33. రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘కపటప్రేమను’ అన్నప్పుడు ‘ట’గురువై గణదోషం సంభవిస్తుంది. ‘కామిని కపటప్రేమను’ అందాం. మూడవ పాదం మూడవ గణం ‘మిటారి’ అని జగణం వేశారు. అదీ దోషమే. ‘మిటారి’ అంటే కులుకులాడి అని అర్థం. అక్కడ ‘కులుకుల/ భామను...’ అంటే సరి!
    *
    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  34. మంద పీతాంబర్ గారూ,
    ఆ హాస్యసన్నివేశాన్ని గుర్తు చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    అయతే ‘ఆమే, ఏమీ, లేనీ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. నా సవరణతో మీ పద్యం ....
    కోమలమౌ గానమువిని
    ఆ(మెయె) పాడిన దనుకొని నావేశముతో
    నే(మియు) పలుకగ (నేరని)
    భామను పెండ్లాడి యొకడు బలి పశువయ్యెన్!!!
    *
    పండిత నేమాని వారూ,
    నేను గణదోషాన్ని గమనించనే లేదు. సవరించినందుకు ధన్యవాదాలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గోలి వారూ,
    మీ అభిప్రాయం అవగత మయింది. ధన్యవాదాలు. ‘వలను + ఎట్లో’ అని విడదేస్తే అర్థవంతంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  35. శ్రీమంతుండగుట విదే
    శీమద్యము, మాంసములనుస్నేహితులడుగన్
    బ్రేమగ విందున కూర్చగ
    భామను పెండ్లాడి యొకడు; బలి పశువయ్యెన్!!!

    రిప్లయితొలగించండి
  36. గురువుగారికి, రాజారావుగారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  37. శంకరయ్య గారూ

    పీతాంబార్ గారి పద్య పాదం
    ఆమేపాడినదనుకొని నావేశములో బదులు

    భామేపాడినదనుకొని నావేశములో అంటే సరిపోతున్దంటారా?

    రిప్లయితొలగించండి
  38. సవరణ పద్యము
    -------
    ఏమని జెప్పుదు నిప్పుడు ?
    భామను పెండ్లాడి యొకడు బలి పశు వయ్యెన్
    కామపు లక్షణ మయ్యది
    కామమునకు లొంగ కుండ కట్టడి యొప్పున్

    రిప్లయితొలగించండి
  39. " మిటారి " అనగా " విలాసిని " అని మంచి పదం దొరికిం దను కున్నాను గానీ జగణం అన్న సంగతి మర్చి పోయాను . ఇక " కపట ప్రేమను " దోషం తెలియ లేదు. " ఏమాత్రము " అన్న పదం తప్పవు తుం దేమో అనుకున్నాను. సరే .ఒకరోజు సరిగా ఉంటే మర్నాడు తమ్ముడికి పని తప్పదు కదా ? మీ సహనానికి ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  40. 60ల తొలిభాగంలో విడుదలయిన బందిపోటు సినిమాలో ఒకపాట ఉంది (రామరావు,రేలంగి, రాజనాల, ఇ.వి.సరోజలపై తీసారు) "ఆటంటె తెలియని ఓ వయారి - మద్దెల ఓడందువే మిటారి" అని దాని పల్లవి.

    రిప్లయితొలగించండి
  41. రాజేశ్వరిగారూ, కపటప్రేమ అనే సమాసంలో కపట, ప్రేమ అనే రెండూ సంస్కృతపదాలు కాబట్టి సమాసం చెల్లుతున్నది. సమాసం అంటే ఏకపదం అయింది కాబట్టి శకటరేఫం కాస్తా ఊరుకోక ముందున్న అక్షరం 'ట' ను గురువుగా చేస్తున్నది. పదాలమధ్య సమాసం యేర్పడక విడిగానే ఉండిపోయే చోట యిలా ముందున్న అక్షరాన్ని ద్వత్వాక్షరాలూ, ద్వంద్వాక్షరాలూ గురువును చేయలేవు. అంతే సంగతి.

    రిప్లయితొలగించండి
  42. శ్రీ శ్యామలరావు గారూ & శ్రీ శంకరయ్య గారూ!
    సంస్కృత సమాసములలో కూడా కొన్ని చోట్ల వెసులుబాట్లు ఉన్నాయి. మా గురువు గారు చెప్పేవారు - ఉత్తర పదము ప్ర, హ్ర మొదలగు సంయుక్త అక్షరములతో ప్రారంభమయినప్పటికి పూర్వ పదముపై దాని ప్రభావము ఉండదు; పూర్వ అక్షరమును బహుళముగా ఉపయోగించుకొనవచ్చును -- లఘువుగానైనా లేక గురువుగానైనా.అందుచేత అటువంటి సందర్భములలో ఈ వెసులుబాటును గుర్తు ఉంచుకొనవలెను. ప్ర హ్ర ఆదయః అనే వారు -- అంటే ప్ర హ్ర మొదలగునవి -- ఆ రెండు మాత్రమే కావు. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పేవారు -- నాకు గుర్తులేవు.

    రిప్లయితొలగించండి
  43. నమస్కారములు
    " మిటారి , కపట ప్రేమల " ను గురించి మంచి వివరణ ఇచ్చినందుకు ,శ్రీ పండిత నేమాని వారికి ,శ్రీ శ్యామలీయం గారికి కృతజ్ఞతలు .

    రిప్లయితొలగించండి
  44. మా బండి మళ్ళీ లేటు.
    గురువుగారూ సవరణకు ధన్యవాదాలు.
    శ్యామలీయం గారూ మీ సూచనకు ధన్యవాదాలు.
    కాముడు అనే పదాన్ని గురువుగారు చెప్పినట్లుగా ఒక వ్యక్తి పేరుగా వాడేను.

    రిప్లయితొలగించండి
  45. ఓ మనుమోహన సింహము
    తా మౌనము స్వీకరించి
    తబ్బిబ్బౌచున్
    నోముగ ప్రధాన పదవీ
    భామను పెండ్లాడి యొకఁడు బలిపశువయ్యెన్

    రిప్లయితొలగించండి
  46. కోమల మనమున తనకున్
    ప్రేమను నొసగిన వరముల ప్రీతిని గొనుచున్
    రాముని కానల కంపిన
    భామను పెండ్లాడి యొకఁడు బలిపశువయ్యెన్

    రిప్లయితొలగించండి