25, డిసెంబర్ 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 158

క్రమస్థ సర్వవ్యంజనం
క్రింది శ్లోకంలో అన్ని హల్లులూ వరుసక్రమంలో ఉన్నాయి.

కః ఖగౌఘాఙచిచ్ఛౌజా
ఝూఞ్ జ్ఞోటౌఠీడడంఢణాః
|
తథోదధీన్ పఫర్బాభీ
ర్మయోऽరిల్వాశిషాం సహః
||

ఈ శ్లోకం ప్రతిపదార్థాలు ఎంత ప్రయత్నించినా దొరకలేదు. తాత్పర్యం మాత్రం దొరికింది.

తాత్పర్యం 
విహంగప్రేమికుడు, సంపూర్ణజ్ఞాని, పరబలాపహర్త, శత్రుసంహారకుడు, ఉత్తముడు, సుస్థిరుడు, నిర్భయుడు, సముద్రాలను నీటితో నింపినవాడు, మాయా స్వరూపుడు (అయిన పరబ్రహ్మ) దయ సర్వపాపాలను హరిస్తుంది.
(శ్లోకం శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ నుండి. తాత్పర్యం ‘గూగులమ్మ’ ఇంగ్లీషులో చెప్పినదానికి నా తెలుగు అనువాదం)

7 కామెంట్‌లు:

 1. హల్లులు వరుసగ నున్నవి
  చెల్లెను తాత్పర్య మందు చెప్పగ నార్యా !
  ఎల్లలు లేవిక మన కవు
  లెల్లరకును వ్రాయ లేని దీ ధర గలదే?

  రిప్లయితొలగించండి
 2. పూజ్య గురువులు , పండితులు , సోదరులు , శ్రీ పండిత నేమాని వారి " హల్లుల తాత్పర్యం , శ్రీ హనుమ శాస్త్రి గారి పద్యం .చాలా బాగున్నాయి. ఇలా చదువు తుంటే మన భాష మీద మరింత మక్కువ పెరుగు తోంది. ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  రాజేశ్వరి అక్కయ్యా,
  ............ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 4. హల్లుల వరుసలు సూచితి
  నెల్లర కవి యోగ్య మగును బిల్లలు కూడా
  మెల్లగ నేర్చుట సులభము
  అల్లదె భావంబు కూ డ హర్షించ దగున్ .

  రిప్లయితొలగించండి
 5. సుబ్బారావు గారూ,
  ధన్యవాదాలు.
  *
  మన దేశభాష లందున
  ఘనులగు కవులైనవారు కడు చోద్యముగా
  వినిపించిరి చిత్రకవిత
  లను వారల పాండితీవిలాసము చెలఁగన్.

  రిప్లయితొలగించండి
 6. అయ్యా! ఆది నుండియు భావ బంధురమై అలంకార శోభితమైన కవిత్వమునకు నున్న ఆదరణ ఇతర కవిత్వములకు (గర్భ కవిత్వము, బంధ కవిత్వము, చిత్ర కవిత్వము, మొ.వి.) లేదు. అవి గారడీల వంటివి. ఒక మారు వినోదించుటకే ఇవి ఉపయోగపడును. శ్రమ జాస్తి - విలువ నాస్తి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 7. పండిత నేమాని వారూ,
  ధన్యవాదాలు.
  నిజమే, ఇవి గారడీల వంటివే. కాని ఆ కొద్దిసేపు వినోదాన్ని మనకు పంచడానికి గారడీవాళ్ళు ఎంత కాలం, ఎంత శ్రమపడి అభ్యాసం చేసి ఉంటారు? అలాగే అటువంటి పద్యాలను వ్రాయడానికి భాషపై వారు ఎంతటి అధికారాన్ని, ప్రావీణ్యాన్ని సాధించి ఉంటారో? ఇటువంటి చమత్కారాలకు అవకాశం కేవల మన దేశభాషల్లోనే ఉండడం మనకు గర్వకారణం కాదా?

  రిప్లయితొలగించండి