9, డిసెంబర్ 2011, శుక్రవారం

సమస్యాపూరణం - 554 (హరుని పూజ సేయ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
హరుని పూజ సేయ హాని కలుగు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

44 కామెంట్‌లు:

 1. హరిని మదిని రోసి హరు మాత్రమే దల్చి
  ఘోర మరణ మంది నారసురులు
  భవుని హృదయ మందు భావమ్ము నెరుగక
  హరుని పూజ సేయ హాని కలుగు.

  రిప్లయితొలగించండి
 2. శ్రీగురుభ్యోనమ:

  స్వార్థ బుద్ధి కలిగి సంపద నార్జింప
  సాదు వనుచు నుడివి సంచరించి
  పరుల కీడు గోరి పాపపు కోర్కెతో
  హరుని పూజ సేయ హాని కలుగు

  రిప్లయితొలగించండి
 3. దేవుడనని మాయ లేవేవొ ప్రకటించి
  చేరువారి సొమ్ము లారగించి
  స్వర్గ మాశ బెట్టి వంచించు పశ్యతో
  హరుని పూజ సేయ హాని కలుగు.

  రిప్లయితొలగించండి
 4. తనను తాను బొగడు ఘన దురహంకారి
  మంది మాట వినని మాటకారి
  జనుల కెవ్విధమున పనికి రాని గుణ వి
  హరుని పూజ సేయ హాని కలుగు

  రిప్లయితొలగించండి
 5. 2.
  లోకహితము గోరి లోకేశు నర్చింప
  శుభము గలుగు గాక చెడు తలంచి
  యెట్టి వరములైన నిచ్చు నీశ్వరుడని
  హరుని పూజ సేయ హాని కలుగు.

  రిప్లయితొలగించండి
 6. హరుని పూజ సేయ హాని కలుగు నంచు
  భీతినొందు వారు వెర్రి వారు
  సద్గురుండు విభుడు సదయుడంచు గొలువ
  జయము, శుభములొదవు సత్వరమ్ము

  రిప్లయితొలగించండి
 7. ఎల్లవేళలందునీశ్వరునేగొల్చి
  ముక్తికొఱకు తాము శక్తిమీర
  తపము చేయు జనుల దండించు హరభక్త
  హరుని పూజ సేయ హాని కలుగు.

  హరభక్త హరుడు = శివభక్తులను సంహరించువాడు,

  రిప్లయితొలగించండి
 8. 3.
  హరుని పూజ సేయ హాని కలుగు టేమి
  జన్మబంధవితతి సమయు గాక
  చిలువ పురుగు గజము వెంచును వేశ్యయు
  హరుని యందె లీన మైరి గాదె

  రిప్లయితొలగించండి
 9. అందరికీ నమస్కారం !
  ఆర్యా !
  ఆది శంకరులు , పూర్వం భారతదేశములో పెరిగిపోయిన నిషిద్ధ తంత్రోపాసనలను నిలువరించిన విషయం ఙ్ఞప్తికి వచ్చి నేను చేసిన ప్రయత్నమిది ...


  చిత్తశుధ్ధిలేక సిద్ధులే గమ్యమై
  తత్త్వమెరుగ లేక తాంత్రికులుగ
  మంత్ర సిద్ధి కొరకు మహిన ధర్మము వీడి
  హరుని పూజ సేయ హాని కలుగు

  రిప్లయితొలగించండి
 10. హరి హరులు ఒకటే అనే భావనలో శాస్త్రిగారు చాలా చక్కగా చెప్పారు

  రిప్లయితొలగించండి
 11. అయ్యా! కళ్యాణ్ గారూ!

  మీ ప్రయత్నము బాగుంది. 3వ పాదములో "మహి ధర్మమును వీడి" అనండి. బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 12. అయ్యా! హనుమఛ్ఛాస్త్రి గారూ!
  హరుని భావ మెరిగి గాని లేక ఎరుగక గాని ఎలాగ పూజ చేసినా దుష్ఫలితముండదు. అతడు భోళా శంకరుడు. భక్తి ఉంటే చాలు - అతడు భక్త సులభుడు కదా. ఒకమారు ఆలోచించండి.

  రిప్లయితొలగించండి
 13. తప్పకుండా పండితవర్యా ! ఇప్పుడే ఆ పాదం మార్చాలని ఆలోచిస్తున్నాను , మీ సూచన చూసాను , మీ సూచనతో పద్యం సరైన అర్ధంతో నడుస్తుంది .... కృతఙ్ఞతలండి .

  రిప్లయితొలగించండి
 14. అయ్యా! శ్యామలరావు గారూ అభినందనలు.

  శ్యామలరావు మహోదయ!
  ధీమణి! మీ పూరణముల తీరు పసందౌ
  ఏ మా భావము, కూరుపు,
  నేమా శైలియును కవుల కివి దర్పణముల్

  రిప్లయితొలగించండి
 15. ఇప్పటి వరకు వచ్చిన పూరణలు బాగున్నవి.

  శ్రీ శ్రీపతి శాస్త్రి గారు స్వార్థ బుద్ధి, పర పీడకులు అయిన కుహనా సాధువుల తీరు చెప్పేరు. బాగున్నది.

  శ్రీ రాజారావు గారు దురభిమానులు, దాంభికులు అయిన మాటకారులను ఎత్తి చూపేరు. బాగు బాగు.

  శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు హర భక్త హరులకు దుర్గతి తప్పదన్నారు. బాగున్నది.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు, శ్రీ శ్యామల రావు గారి, శ్రీ కళ్యాణ్ గారు కూడ చక్కగా పూరించేరు.
  అందరికి అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. అయ్యా, నా పూరణ-3 లో 'వెంచును' అన్న అక్షరదోషాన్ని 'చెంచును' అని సరిజేసుకొని చదువ వలసినది.
  నేమాని వారూ, ధన్యోస్మి.

  రిప్లయితొలగించండి
 17. నేమాని వారూ

  నన్ను నపండితుడ నకవి
  నన్నన్నా పెద్దవార లమితదయాళులుల్
  మన్నించి పొగడినారిది
  పన్నుగ నా పూర్వపుణ్యపరిపాకమనన్

  నాకు కొమ్ములు రాకుండా ఆశీర్వదించ గోరుతాను. అనేక వందనములు.

  రిప్లయితొలగించండి
 18. అయ్యా శ్యామలరావు గారూ! శుభాశీస్సులు.

  కొమ్ములు లేవు, రావు, కవికుంజర సత్తమ శ్యామలాఖ్య ప
  ద్యమ్ములు దమ్ముతో నలరి యబ్బుర మొప్పుగ గూర్చు చుండు, నా
  యమ్మల గన్న యమ్మ కరుణామృత వీక్షణతోడ బ్రోచు ని
  త్యమ్మును నిన్ను వాగ్వన విహారివియై విలసిల్లుమా సుధీ!

  రిప్లయితొలగించండి
 19. స్వార్ధ భావనంబు సరగున రానీక
  దైవ భక్తి కలిగి దయగ నుండు
  తరము తరము లకును ధనమును నాశించి
  హరుని పూజ సేయ హాని కలుగు .

  రిప్లయితొలగించండి
 20. దొరలే దొంగలుగ మారి దోచిరి ధనముల్
  ---------------------
  కరువులును గాట కంబులు
  పెరుగంగా మనన లేక దొరలును సహితం
  దొరలుగ నుండుట కీడని
  దొరలే దొంగలుగ మారి దోచిరి ధనముల్

  రిప్లయితొలగించండి
 21. ఆపదలు నశించు , ఐశ్వర్యమబ్బును
  హరుని పూజ సేయ - హాని కలుగు
  నీశ్వరుని మహత్తు నెరుగక నిందింప
  దక్ష యజ్ఞమదియె సాక్షి మనకు.

  రిప్లయితొలగించండి
 22. నా పూరణ .....

  ప్రహ్లాదుడు రాక్షసబాలురతో హిరణ్యకశిప, హిరణ్యాక్ష పూజలు వద్దని, విష్ణుపూజ హితకరమైనదని చెప్పడం ....

  తప్పు సేయవలదు దానవబాలకు
  లార! విష్ణుపూజ లాభకరము;
  రండు, వినుడిదే హిరణ్యకశిపు, వేద
  హరుని పూజ సేయ హాని కలుగు.

  రిప్లయితొలగించండి
 23. *గోలివారి, శ్రీపతిశాస్త్రిగారి పద్యాలు బాగున్నాయి.
  *రాజారావుగారు 'గుణ విహరుని పూజ' అన్నారు. గుణవిహరుడు అన్నదాని అర్ధం సుగమంగా లేదు.
  *కళ్యాణ్ గారు 'మహిత ధర్మము' బదులు 'మహిన ధర్మము' అన్నట్లున్నారు. పద్యం బాగుంది.
  *సుబ్బారావుగారు తమపూరణలో 'ధనమును నాశించి' అన్నారు. 'ధనము నాశించి' అనేదే సాధువు. కొంచెం మార్చాలి. వేరే సమస్యపూరణలో 'మన లేక' బదులు 'మనన లేక' అన్నారకుంటాను. మనన అంటే అన్వయంకాదు. 'దొరలును సహితం' బదులు 'దొరలుసహితమున్ ' అనటం ప్రశస్తం.
  *రాం మోహన్ శర్మ మంచి పద్యం అందించారు.
  *శంకరయ్యగారు హిరణ్యకశిపుని వేదహరుడన్నారు. కాని వేదహరుడు సోమకాసురుడుకదా? హిరణ్యకశిపుడు హరివిరోధియనే కాని వేదవిరోధి యని అనవచ్చా యని శంక. కాని భేషుగ్గా అనవచ్చు. వేదవిహితకర్మాచరణాన్ని విరోధించిన కారణంగా. మంచి పద్యం.

  రిప్లయితొలగించండి
 24. శ్యామలీయం గారికి నమస్కారములు .మీ సవరణలు
  బాగున్నాయి .మార్పు చేయుదును

  రిప్లయితొలగించండి
 25. మనసు నిండు గాను మలిన భావము నింపి
  కొంగ జపము చేసి భంగ పడుచు
  జనుల మోస గించి మునులుగా నటియించి
  హరుని పూజ సేయ హాని కలుగు

  రిప్లయితొలగించండి
 26. మిత్రులారా!
  ధనమునున్ + ఆశించి = ధనమునునాశించి అనుట సరియైనదే. వ్యాకరణ విరుద్ధము కాదు, కాని ఇట్టి ప్రయోగములు అరుదు, సుకరముగా నుండవు.
  ధనుమునాశించి అనుట చాల హాయిగా నుంటుంది.

  రిప్లయితొలగించండి
 27. శ్రీమతి రాజేశ్వరిగారి కొంగ జపము అనే భావము చాల మంది కుహనా గురువుల పద్ధతికి దర్పణము పట్టుచున్నది. బాగున్నది.

  రిప్లయితొలగించండి
 28. శ్రీ శంకరయ్య గారి పూరణలో హిరణ్యాక్ష, హిరణ్య కశిపుల నిద్దరినీ ప్రస్తావించేరు. వేదహరుడు అనే శబ్దము హిరణ్యాక్షునికి సరిపోతుంది. శ్రీ శ్యామలరావు గారు ఈ విషయమును గమనించినట్లు లేదు.

  రిప్లయితొలగించండి
 29. నేమానివారన్నది నిజమే. కాని యీ పద్యం contextలో 'తరము తరములకును ధనమును నాశించి ' అన్నచోట నాకు 'ధనమునాశించి యన్నదే కవి యుద్దేశ్యంలా కనిపించింది. అందుచేత, 'ధనమునున్' అన్న మాట సరిగా లేదని యభిప్రాయపడ్డాను. నేనే బోల్తాపడ్డాను సాధుత్వం విషయంలో.

  రిప్లయితొలగించండి
 30. శ్రీ శంకరయ్య గారి పద్యము గురించి శ్రీ శ్యామలరావు గారి సూచన సరి అయినదే -- నే నే పొరబడ్డాను.

  రిప్లయితొలగించండి
 31. గురువులు , పూజ్యులు ,శ్రీ పండిత నేమాని వారికి ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 32. శ్రీ నేమాని వారికి, శ్యామల రావు గారికి,రాజశేఖర శర్మ గారికి ధన్యవాదములు.
  శివుని హృదయం లో విష్ణువు ఉంటాడనీ.విష్ణువును ద్వేషించిన వారిని శివుడు క్షమించడనీ .. ఆ భావాన్నితెలుసుకోకుండా విష్ణు ద్వేషంతో హరుని పూజించిన హాని (ఎన్నో పురాణ కథల ప్రకారం) కలుగునని నా భావం.

  రిప్లయితొలగించండి
 33. నేమాని వారూ,
  ‘శ్యామలీయం’ గారూ,
  నన్ను మన్నించాలి. అసలే జ్వరపీడితుణ్ణి! ఏదో విధంగా సమస్య పూరించాలనే తొందరలో హిరణ్యాక్షుణ్ణి భూమిని చాపలా చుట్టినవానిగానే కాక వేదాలను దొంగిలించినవానిగా భావించాను. ‘సోమకుని వధించి శ్రుతుల నలువ కిచ్చె ...’ అన్నది గుర్తుకు రాలేదు. మన్నించాలి. మీ సమర్థన సాంత్వన నిచ్చినా అపరాధభావం వెన్నాడుతున్నది. మీకు నా ధన్యవాదాలు. నా సవరించిన పూరణ ....

  ప్రహ్లాదుడు రాక్షసబాలురతో హిరణ్యకశిప, హిరణ్యాక్ష పూజలు వద్దని, విష్ణుపూజ హితకరమైనదని చెప్పడం ....

  తప్పు సేయవలదు దానవబాలకు
  లార! విష్ణుపూజ లాభకరము;
  రండు, వినుడిదే హిరణ్యకశిపు, ధరా
  హరుని పూజ సేయ హాని కలుగు.

  హిరణ్యాక్షుణ్ణి ‘ధరాహరుని’ చేసాను. సరిపోయిందనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 34. చక్కని పూరణలు పంపిన కవిమిత్రులు
  గోలి హనుమచ్ఛాస్త్రి గారు,
  శ్రీపతి శాస్త్రి గారు,
  ‘శ్యామలీయం’ గారు,
  లక్కాకుల వెంకట రాజారావు గారు,
  పండిత నేమాని వారు,
  సంపత్ కుమార్ శాస్త్రి గారు,
  కళ్యాణ్ చక్రి గారు,
  సుబ్బారావు గారు,
  రాం మోహన్ శర్మ గారు,
  రాజేశ్వరి అక్కయ్య గారు,
  అందరికి అభినందనలు. జ్వరం కారణంగా మీమీ పూరణలను విడివిడిగా పరామర్శించలేక పోతున్నాను. ఆ లోటును శ్యామలీయం గారు, పండిత నేమాని వారు తీరుస్తున్నారు. వారికి ధన్యవాదాలు.
  *
  రాజశేఖర శర్మ గారూ,
  ధన్యవాదాలు.
  *
  రాం మోహన్ శర్మ గారూ,
  స్వాగతం.

  రిప్లయితొలగించండి
 35. శంకరయ్య గారికి నమస్కారములు . మీకు జ్వరము తగ్గి
  త్వరగా కోలుకోవాలని ఆ శంకరున్ని ప్రార్ధిస్తున్నాను

  రిప్లయితొలగించండి
 36. శంకరార్యా ! ధన్యవాదములు. మీరు త్వరగా కలతలు నలతల నుండి కోలుకోవాలని సాయి దేవుని కోరుకొను చున్నాను.

  రిప్లయితొలగించండి
 37. గురువుగారూ.., నేను ప్రహ్లాదుడినే ఆశ్రయిస్తున్నాను...


  చిన్నవాడ! వినుము, శ్రీహరి నామజ
  పమ్ము విడుము, తండ్రి పగతుడౌట
  నోర్వ లేడు వినిన, నోకుమారా!ముర
  హరుని పూజ సేయ హాని కలుగు.

  రిప్లయితొలగించండి
 38. తమ్ముడూ ! త్వరగా జ్వరం తగ్గి , హాయిగా ఉండాలని కోరుతూ , భగ వంతుని ప్రార్ధిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 39. 1.అడ్డు నాపు లేక అహరహమ్ముల యందు
  ఐహిక సుఖములనె యాశ తోడ
  'చిత్త శుద్ధి లేని శివపూజ లేలరా '
  హరుని పూజ సేయ హాని కలుగు.
  ---------------
  2.ధరలోని ఖనిజ సంపద
  మరి దేవాలయములందు మడులున్ మాన్యాల్
  పరులకు చెందిన భూముల్
  దొరలే దొంగలుగ మారి దోచిరి ధనముల్ .
  ------------

  రిప్లయితొలగించండి
 40. ఊకదంపుడు గారూ,
  మీరూ ప్రహ్లాదుణ్ణే ఆశ్రయించినా నా పూరణ కన్నా సుబోధకంగా సుందరంగా ఉంది. అభినందనలు.
  *
  ‘కమనీయం’ గారూ,
  చక్కని పద్యాలు చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి