25, డిసెంబర్ 2011, ఆదివారం

సమస్యాపూరణం - 572 (అమవసనాఁటి రాత్రి)

వారాంతపు సమస్యాపూరణం

కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది
అమవసనాఁటి రాత్రి యొక
యంగన చూపెను చంద్రికాద్యుతుల్.

15 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    అమావాస్య యైనా పౌర్ణమి యైనా తల్లి యొడిలో
    పిల్లలకెప్పుడూ చంద్రకాంతే గదా !

    01)
    __________________________________________

    అమలిన ప్రేమజూపి తన - యక్కున జేర్చుచు నాదరించుగా !
    కొమరుడు తప్పు జేయ మరి - కోప్పడ కుండగ యొప్పు జెప్పుగా !
    మమతల పంచి యిచ్చుచును - మానస మందున మంచి కోరుగా !
    అమవసనాఁటి రాత్రి యొక - యంగన చూపెను చంద్రికాద్యుతుల్!
    __________________________________________

    రిప్లయితొలగించండి
  2. ప్రియురాలియొక్క నవ్వులే వెన్నెలతో సమానమనే అర్థములో..........

    విమలమనస్సరోజములపేక్ష సుధామకరందమొప్పుచున్,
    సుమదళకన్నుదోయి, వరసుందరరూపము తోడవెల్గి, సం
    భ్రమమునొనర్చురీతికడురమ్యత పూచెనునవ్వువెన్నెలల్
    అమవసనాటిరాత్రియొక యంగన చూపెను చంద్రికాద్యుతుల్.

    మనస్సును పద్మముతో, అమృతతుల్యమైన ఆపేక్షను పద్మములోని మకరందముతో, కన్నులను పద్మరేకులతో, పోలికగలిగి శ్రేష్టమైన రూపముతో ఆనందము కలిగించే ఆ వనితయొక్క నవ్వులే వెన్నెలతో సమానము కదా.

    ( గురువుగారికి మరియు పెద్దలకు,
    ప్రయోగాలు చేస్తున్నాను. తప్పులను సరిదిద్దవలసినదిగా ప్రార్థన )

    రిప్లయితొలగించండి
  3. కుమార్జీ ! మీ ప్రియురాలి నవ్వుల వెన్నెల తళ తళ లాడుతోంది !

    అమావాస్య యైనా పౌర్ణమి యైనా తల్లి యొడిలో
    పిల్లలకెప్పుడూ చంద్రకాంతే గదా !

    01అ)
    __________________________________________

    అమలిన ప్రేమజూపి తన - యక్కున జేర్చుచు నాదరించుచున్ !
    కొమరుడు తప్పు జేయ మరి - కోప్పడ కుండగ యొప్పు జెప్పుచున్ !
    మమతల పంచి యిచ్చుచును - మానస మందున మంచి గోరుచున్ !
    అమవసనాఁటి రాత్రి యొక - యంగన చూపెను చంద్రికాద్యుతుల్!
    __________________________________________

    రిప్లయితొలగించండి
  4. వెంకట రాజారావు . లక్కాకులఆదివారం, డిసెంబర్ 25, 2011 11:40:00 AM

    సుమశరు డేచ బ్రేయసి వసుంధర చేరెను మోహనాంగు నా
    గమ పరి రక్షకున్ హరిని కౌస్తుభ రత్న శుభోజ్జ్వలాంగు సం
    భ్రమ మతి మేన వెన్నెలల భ్రాంతులు నిండగ కాంక్షితాక్షులన్
    'అమవస నాటి రాత్రి యొక యంగన చూచెను చంద్ర కాంతులన్'

    రిప్లయితొలగించండి
  5. (దీపావళి పండుగ నాడు ఒక వనిత వర్ణ చిత్రమును గీసి భర్తకు చూపిన సందర్భం)

    విమల సువర్ణ చిత్రమును వేడ్కను దివ్వెల పర్వమందునన్
    సుమ సుకుమార హస్తముల సోయగ మొప్పగ గీసి చూపెగా
    హిమగిరి శోభలన్ పతికి హేమపు కాంతుల నిండు చంద్రునా
    అమవసనాఁటి రాత్రి యొక యంగన చూపెను చంద్రికాద్యుతుల్..

    రిప్లయితొలగించండి
  6. శాస్త్రీజీ ! మీ వర్ణ చిత్రం లోని వెన్నెల మిల మిల లాడుతోంది !

    రిప్లయితొలగించండి
  7. వసంత కిశోర్ గారూ,
    మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ‘కోప్పడ’ శబ్దం సాధువు కాదు. అక్కడ ‘కోపము జూపక’ అంటే సరి!
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ప్రయోగాలు చేస్తేనే కదా ప్రావీణ్యం సిద్ధించేది. సంతోషం!
    మీ పూరణ సుందరంగా ఉంది. అభినందనలు.
    ‘సుమదళ కనుదోయి’ దుష్టసమాసం. ‘సుమదళ నేత్రయుగ్మ వర ...’ అంటే సరి!
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ప్రబంధరీతిని తలపించే పద్యం చెప్పారు. నిజంగా మీ పూరణ వెన్నెలనే కురిపించింది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వాహ్! అద్భుతమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. భ్రమసితి తాను వచ్చునని, బాసలు చేసెను వత్తునంచుఁ దా
    నమవసనాటి రాత్రి యొక యంగన; చూపెను చంద్రికాద్యుతుల్
    సమతల సైకతావరణ సాగరతీరము నేఁడు; వచ్చె పూ
    ర్ణిమ కద! యింక నా కిటు పరీక్షను పెట్టఁగ న్యాయ మౌనొకో?

    రిప్లయితొలగించండి
  9. శంకరార్యా ! అద్భుతం !
    సమతల సైకతావరణ సాగర తీరం ! నిండు పూర్ణిమ !
    పండు వెన్నెల !
    అబ్బో ! అమృత జలంలో జలకా లాడి నట్టుంది !

    రిప్లయితొలగించండి
  10. మాస్టారూ, ఈ వారాంతపు సమస్య ఆలోచించిన కొద్దీ యేదో లోకాల్లోకి తీసుకెళుతోంది. అంగన ఏయే కాంతులు చూపించిందో తెలియదు కానీ, అమావాస్యనాడుకూడా ఏయే కాంతులు చంద్రభాసుర సహాయం లేకుండా చూడగలమో అనే ఊహ మధురముగా యున్నది. కాబట్టి ఏదో పూరణ చేసి నా ఊహా ప్రపంచంలోంచి బయటికి రాలేను:-)

    రిప్లయితొలగించండి
  11. శంకరార్యా ! అద్భుత మైన పూరణ చేశారు.
    నిజమే బాస చేసి బీచ్ కి రాకుండా పదిహేను రోజుల పాటు అక్కడ బస చేయించి
    పరీక్ష పెట్టిన అంగనకు అది న్యాయమేనా ?

    రిప్లయితొలగించండి
  12. వెంకట రాజారావు . లక్కాకులసోమవారం, డిసెంబర్ 26, 2011 4:07:00 PM

    సరదాగా .....

    రమణి సుశీల యోర్తు మిము రమ్మని సైకత చంద్రికా తటీ
    విమల ప్రదేశ సీమలకు విందుకు బిల్చుట లూహ జేసి యా
    భ్రమల మునుంగ శంకర ! శుభంబగునే ? యటు లూహ దేల్చి మీ
    కమవస నాటి రాత్రి యొక యంగన చూపెను చంద్రికా ద్యుతుల్

    రిప్లయితొలగించండి
  13. కుములుచు నుండ సోనియమ కుందుచు నుండ ప్రియంక వద్రయున్
    తములము నమ్లి నవ్వుచును తండ్రుల తాతల తాపుతన్నుచున్
    కమలము పట్టి రాహులుకు కన్నును గొట్టి అమేథి లోనహా!
    అమవసనాఁటి రాత్రి యొక
    యంగన చూపెను చంద్రికాద్యుతుల్

    రిప్లయితొలగించండి