1, డిసెంబర్ 2011, గురువారం

సమస్యా పూరణం - 545 (దండనలే కద శుభ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
          దండనలే కద శుభప్రదము లెల్లఱకున్.

32 కామెంట్‌లు:

  1. మెండుగ నవినీతిని తిని
    దండిగ ధనరాసులన్ని దాచిన వారిన్
    ఖండన జేయుచు నిచ్చెడి
    దండనలే కద శుభప్రదము లెల్లఱకున్.

    రిప్లయితొలగించండి
  2. బండలను దొలిచి సొగసుగ
    నిండుగ యులితోడ మలచి నేతల ప్రతిమల్ !
    మెండుగ నందము నీయగ
    దండనలే కద శుభ ప్రదము లెల్లఱకున్ !

    నేత = రాజు, ప్రభువు , విష్ణువు

    రిప్లయితొలగించండి
  3. దండి మనంబున శిష్యుల
    నిండుగ దీవించి చదువు నేర్పు నుపాధ్యా
    యుండొసగు కల్మష రహిత
    దండనలే కద శుభ ప్రదము లెల్లరకున్

    రిప్లయితొలగించండి
  4. నిండుగ తరగతి పిల్లలఁ
    మెండుగ తీర్చెడి గురువులు మేల్గోరుచునా
    దుండగు బడి పిల్లలకిడు
    దండనలే కద శుభప్రదము లెల్లఱకున్.

    రిప్లయితొలగించండి
  5. ఖండిత భాగమ్మొక్కటి
    నిండుగ పూరించు నపుడు; నిపుణత తోడన్
    పండిత వర్యుల సవరణ,
    దండనలే కద శుభప్రదము లెల్లఱకున్.

    దండక వనమున రాముడు
    భండన భీముడుగ మారె పాపుల జంపన్
    చెండాడి యొసగు శిక్షలు,
    దండనలే కద శుభప్రదము లెల్లఱకున్.

    రిప్లయితొలగించండి
  6. దండము రఘురామునకును
    దండము సీతాపతికిని, దనుజులకా కో
    దండము నెక్కిడి యొసగిన
    దండనలే కద శుభప్రదము లెల్లఱకున్.

    రిప్లయితొలగించండి
  7. గండములన్ని హరించుచు
    మెండుగపాలనముజేయు మిథిలాప్రభుకో
    దండప్రతాపబాహూ
    ద్దండనలేకద శుభప్రదములెల్లరకున్.

    కోదండప్రతాపము చూపించే ఉద్దండమైన బాహువులే కదా శుభప్రదములు అనే అర్థములో వ్రాసినాను. సమాసము సరియైనదో లేదో తెలుపవలసినదిగా గురువులకు వినతి.

    రిప్లయితొలగించండి
  8. దండము హనుమా, గావుము
    గండము తప్పించుమనగ కరుణను జూపున్.
    వెండి దురాత్ముల కొసగును
    దండనలే కద; శుభప్రదము లెల్లఱకున్.

    వెండి = మఱియు, పిమ్మట
    హనుమంతుడు దండమని వేడిన కరుణ జూపును, మఱియు దురాత్ముల దండనలొసగును కదా, మరి ఎల్లవారలకును శుభప్రదమైనవాటిని యొసగును.

    రిప్లయితొలగించండి
  9. ఉండగరాని విధంబున
    నుండి జనవిరోధు లగుచు నుండెడి వారిం
    జెండుచు దైవం బిచ్చెడు
    దండనలే కద శుభప్రదము లెల్లఱకున్.

    రిప్లయితొలగించండి
  10. దండించ జనని జాతను
    మెండుగ తానుండ భవిత మేలై యుండన్ !
    ఖండన జేయుచు తెలిపిన
    దండనలే కద శుభ ప్రదము లెల్లరకున్ !

    రిప్లయితొలగించండి
  11. గోలిహనుమచ్చాస్త్రి గారి సమస్యకు నా పూరణం.

    'మెల్లగ పల్కుల నేర్చెను
    పిల్లలు నేర్పింప నొక్క బీబీ యింటన్
    పిల్లి యొకటీ దూరె నటకు
    అల్లా కాపాడుమనుచు హరి వేడుకొనెన్
    ---------------

    హరి =నానార్థములు - చిలుక

    రిప్లయితొలగించండి
  12. మెండుగ ధనము గడించు న
    ఖండ దురాలోచనైక ఘనుల మదంబున్
    చెండాడి వారి కిచ్చెడు
    దండనలే కద శుభప్రదము లెల్లరకున్.

    రిప్లయితొలగించండి
  13. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________

    మెండుగ నల్లరి జేయుచు
    దండుగ కలిగించు నట్టి - తనయుల కొఱకై
    గుండెల ప్రేమము నిండియు
    దండనలే కద శుభప్ర - దము లెల్లరకున్ !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  14. ఆనాటి హస్తినాపుర ప్రజలకు :

    02)
    _____________________________________

    కుండలు నాకిన ధూర్తులు,
    దుండగులగు కౌరవులను - త్రుంచుట కొఱకై
    భండనమున పాండుసుతుల
    దండనలే కద శుభప్ర - దము లెల్లరకున్ !
    _____________________________________
    కుండలునాకు = నైచ్యమునకు పాల్పడు
    ధూర్తుఁడు = మోసకాఁడు
    దుండగుడు = దుర్మార్గుఁడు
    త్రుంచు = చంపు
    భండనము = యుద్ధము

    రిప్లయితొలగించండి
  15. కౌరవులకు దండన మరియు
    ఆనాటి హస్తినాపుర ప్రజలకు శుభప్రదము :
    03)
    _____________________________________

    జెండాపై కపిరాజును
    నిండుగ నెల్లప్పుడుండు - నిషుధియు తోడై
    గాండీవము చేత నరుని
    దండనలే కద శుభప్ర - దము లెల్లరకున్ !
    _____________________________________
    నిండుగ నెల్లప్పుడుండు = అక్షయము
    ఇషుధి = తూణీరము = అమ్ములపొది

    రిప్లయితొలగించండి
  16. ఆనాటి జనులందరికీ :

    04)
    _____________________________________

    ముండములు నేల రాలెను
    పండితుడగు రావణునకు - పరసతి ప్రియమై
    భండనమున రామునిచే !
    దండనలే కద శుభప్ర - దము లెల్లరకున్ !
    _____________________________________
    ముండము = దేహములేని తల

    రిప్లయితొలగించండి
  17. కౌగిలింతలతో(కౌగిలింతలలో) దండిస్తామంటే వద్దనేవారెవరు?

    05)
    _____________________________________

    పండుగ గాదే ప్రియులకు
    మెండుగ ప్రేమించునట్టి - మెలతుక గ్రుచ్చన్ !
    పండిన ప్రియసతి యొసగెడు
    దండనలే కద శుభప్ర - దము లెల్లరకున్ !
    _____________________________________
    గ్రుచ్చు = కౌగిలించు
    పండు = శయనించు/(mature)

    రిప్లయితొలగించండి
  18. కళింగ యుద్ధంలో రక్తపుటేరులు పారించిన చండాశోకుణ్ణి
    ఆ యుద్ధంలో కొడుకును కోల్పోయిన ఒక గుడ్డవ్వ ఖండిత వాక్కులు
    మార్చి మనీషిని జేస్తాయి :
    (కావున అన్యాయాన్ని అందరూ ఖండించాలి)

    06)
    _____________________________________

    చండాశోకుని; హింసకు
    మండిన ముదుసలి పలికిన - మాటలు మార్చెన్ !
    ఖండిత వాక్కులు జేసెడు
    దండనలే కద శుభప్ర - దము లెల్లరకున్ !
    _____________________________________
    ఖండిత వాక్కులు = విమర్శలు
    మనీషి = ప్రాజ్ఞుడు, బుద్ధిమంతుడు

    రిప్లయితొలగించండి
  19. రుక్మిణీ కల్యాణం ఆనాటి ద్వారకావాసులకు :

    07)
    _____________________________________

    కుండిన రాజకుమారిని
    మండితుడై చేకొనెనుగ - మాధవు డంతన్
    దండించి దుష్టు లెల్లర !
    దండనలే కద శుభప్ర - దము లెల్లరకున్ !
    _____________________________________
    మండితుడు = అలంకరింప బడినవాడు

    రిప్లయితొలగించండి
  20. కవిమిత్రులకు వందనాలు.
    చాలాకాలంగా నాకు మనశ్శాంతి లేకుండా చేసిన సమస్య పరిష్కార మయింది. ఇక ద్విగుణీకృత ఉత్సాహంతో బ్లాగును నిర్వహిస్తాను. కొంతకాలంగా కేవలం సమస్య ఇవ్వడం, కొత్త పోస్టులు పెట్టడం మినహా మిత్రుల పూరణపై స్పందించడం కాని, సందేహాలకు సమాధానాలు ఇవ్వడం కాని చేయలేక పోయాను. ఆలోటును ఎప్పటికప్పుడు పండిత నేమాని వారు, శ్యామలీయం గారూ తదితర మిత్రులు తీరుస్తూ వస్తున్నారు.
    అందరికీ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘అవినీతిని తిని’ కంటే ‘అవినీతి సలిపి’ అంటే బాగుంటుందేమో?
    *
    రాజేశ్వరక్కయ్యా,
    పద్యం బాగుంది. అభినందనలు.
    ‘నిండుగన్ + ఉలితోడ= నిండుగ నులితోడ’ అక్కడ యడాగమం రాదు.
    ‘దండనలు’ శబ్దానికి మీరు ఏ అర్థాన్ని ప్రతిపాదించినట్టు? అన్వయం లోపిస్తున్నదేమో?
    *
    రాజారావు గారూ,
    మీకూ, నాకూ ఉన్న వృత్తిపరమైన అనుభవంతో చక్కని పూరణ చేసారు. అభినందనలు.
    *
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    మాస్టారి బెత్తం దెబ్బలు తిన్న అనుభవమా? బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    ‘దుండగు బడిపిల్లల కిడు’ కంటే ‘దుండగులగు పిల్లల కిడు’ అంటే బాగుంటుందని ఒక బెత్తం దెబ్బ!
    *
    మందాకిని గారూ,
    స్వీయానుభవంతో మొదటి పూరణ, ఐతిహాసికమైన రెండవ, మూడవ పూరణలు చాలా బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మంచి భావన. చక్కని పద్యం. బాగుంది. అభినందనలు.
    అయితే ‘ఉద్దండము’ శబ్దం ఉంది కాని ‘ఉద్దండనము’ అనే శబ్దం లేదు.
    *
    మందాకిని గారూ,
    హనుమానుని గురించిన మీ నాల్గవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    శ్యామలరావు గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    ‘జనని జాతను’ అన్నచోట ‘జనని కూఁతును’ అంటే బాగుంటుందేమో?
    *
    ‘కమనీయం’ గారూ,
    అది శంకరాభరణంలో 1-9-2010 నాడు ఇచ్చిన సమస్యే. (సమస్యాపూరణ - 83).
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    తోట భరత్ గారూ,
    స్వాగతం! చక్కని పూరణతో బ్లాగులో అడుగుపెట్టారు. సంతోషం! అభినందనలు.
    *
    వసంత్ కిశోర్ గారూ,
    మీ ఏడు పూరణలూ సప్తవర్ణాలతో, సప్తస్వరాల వలె అలరిస్తూ ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. గురువుగారు,
    ధన్యవాదాలు.భగవంతుని ఆశీస్సులవలన మీరు సంతోషంగా తిరిగి రావటం సభ్యులందరికీ ముదావహం.
    మీరన్నట్లు పండితులవారు, శ్యామలీయం గారు ఎప్పటికప్పుడు మా పూరణలను పరిశీలించి మమ్మల్ని ప్రోత్సహించారు. వారికి అందరి తరఫున ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. శంకరార్యా ! ధన్యవాదములు !
    మీ సమస్య పరిష్కారమైనందుల కానందముగానున్నది !

    రిప్లయితొలగించండి
  25. దండిగ చేసిన పాపము
    పండిన యప్పుడు విధించు పరమాత్ముండా
    దుండగులను శిక్షింపన్
    దండనలే కద శుభప్రదము లెల్లరకున్ .
    ------------

    రిప్లయితొలగించండి
  26. కొండొక చాకలి దెబ్బలు
    మెండుగ మలినముల దీసి మెరిపెడి రీతిన్
    దండిగ జీవిత మిచ్చెడి
    దండనలే కద శుభప్రదము లెల్లఱకున్

    రిప్లయితొలగించండి
  27. బండిని రాగనె బంధులు
    దండుగ మాలిన వ్యయములు దండిగ కూడన్
    పండుగ పూటను దారల
    దండనలే కద శుభప్రదము లెల్లఱకున్

    రిప్లయితొలగించండి