17, మే 2012, గురువారం

సమస్యాపూరణం - 707 (శని పట్టినవారల కగు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

శని పట్టినవారల కగు సకలశుభమ్ముల్.

ఈ సమస్యను సూచించిన
పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.

17 కామెంట్‌లు:

  1. వనజాప్త కుమారుండును
    వినుతించిన వారికి గడు ప్రేముడి తోడన్
    ఘనతర బహుయోగదుడగు
    శని పట్టిన వారలకగు సకల శుభమ్ముల్

    రిప్లయితొలగించండి
  2. ఘనమగు విష్ణుచరిత్రం
    బనునిత్యము చదువుచుండ యంచిత భక్తిన్
    విను భాగవతము యిదె ద
    ర్శని పట్టినవారలకగు సకల శుభంబుల్.

    రిప్లయితొలగించండి
  3. ఘనమౌ రుద్రప్రశ్నము
    మనమును సుస్థిరముజేసి మరువనివారై
    యనయము పఠియించినచో
    శనిపట్టినవారలకగు సకలశుభంబుల్.

    రిప్లయితొలగించండి
  4. శనిదశలోనున్నానని
    పనులన్నియుప్రక్కనెట్ట
    భావ్యమె?ధరణిన్
    ఘనతరసాధనజేసిన
    శనిపట్టినవారికగునుసకలశుభమ్ముల్

    రిప్లయితొలగించండి
  5. శంకరాభరణానికి వచ్చి వారం రోజులైనట్టుందండీ,గణభంగములు మొదలయ్యాయి. సరి జేస్తూ:

    ఘన, నైచ్యమ్ములనెంచక
    ననవరతము ప్రాణికోటులందరినందున్
    గనునొని పరమాత్మునిస్ప
    ర్శని పట్టినవారలకగు సకల శుభంబుల్.

    "స్పర్శని" ప్రయోగార్హమే ననుకుంటున్నానండీ.

    రిప్లయితొలగించండి
  6. ఇనుని కుమారుఁడగు నతఁడు
    మనలకు శత్రువనుకొనిన మంచిది కాదా
    శని విడుచెడు సమయమునను
    శని పట్టినవారల కగు సకలశుభమ్ముల్.

    రిప్లయితొలగించండి
  7. ఇనసుతుదింటను జేరిన
    నొనగూర్చును బలునిడుములునొకటినగూడన్
    తనపదకొండిoట గురువు,
    శని పట్టినవారల కగు సకలశుభమ్ముల్!!!

    రిప్లయితొలగించండి
  8. దినకరుని తనయు డాతడు
    కినుక బూనిన జనులకు కీడులె గల్గున్ !
    కనుగొని గ్రహ శాంతి జేయగ
    శని పట్టిన వారల కగు సకల శుభమ్ముల్ !

    రిప్లయితొలగించండి
  9. కనివిని యెరుగని రీతిగ
    మనుజుల బాధించ గలడు మహిమల చేతన్ !
    ఘనముగ శాంతిని జరిపిన
    శని పట్టిన వారల కగు సకల శుభమ్ముల్ !

    రిప్లయితొలగించండి
  10. @రాజేశ్వరి నేదునూరి గారూ మీ పూరణ బాగుంది.
    "కనివిని యెరుగని రీతిగ
    మనుజుల బాధించ గలడు మహిమల చేతన్ !"

    రిప్లయితొలగించండి
  11. కనరాని యాశ క్రమ్ముగ
    కనలేము నిజానిజములు కల్లకపటముల్
    మనసే సాక్షిగ మని నా
    (ఆ)శ--ని పట్టినవారల కగు సకలశుభమ్ముల్.

    రిప్లయితొలగించండి
  12. పండిత నేమాని వారూ,
    అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మనోహరమైన పూరణ మీది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    ‘ప్రక్కనెట్టి’ని ‘ప్రక్కఁ బెట్టి’ అందాం.
    *
    ఊకదంపుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘అందరినందున్’ ను ‘అందరిలోనన్’ అందాం.
    ‘ప్పర్శని’.... నాకూ కొత్తే..!
    *
    లక్ష్మీదేవి గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    కాకుంటే 2,3 పాదాలలో గణదోషం. ‘కినుక బూనిన’ను ‘కినుక వహించిన’ అనీ, ‘గ్రహశాంతి జేయగ’ను ‘గ్రహశాంతి నిడగ’ అని మార్చితే సరి!
    మీ రెండవ పద్యం మొదటి దానికి మీ సవరణ రూపమా? నేను ముందు చూడలేదు. బాగుంది.
    *
    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.
    *
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    ప్రశంసార్హమైన ప్రయత్నం చేసారు. బాగుంది. అభినందనలు.
    కాని ‘ఆశను’ అనవలసి ఉంటుంది కదా!

    రిప్లయితొలగించండి
  13. వినుమీశ నిన్ను వదలను
    కను కరుణను దాటవేయి కష్టములనుచున్
    వినుతించ వాడె జూచును
    శని పట్టిన, వారల కగు సకలశుభమ్ముల్.

    రిప్లయితొలగించండి
  14. మనమున ధైర్యము సహనము
    జనులకునా యేలినాటి శని కలిగించున్
    శని యనుకూలించగనే
    శని పట్టినవారల కగు సకలశుభమ్ముల్

    రిప్లయితొలగించండి
  15. వినుడీ కిటుకును శుంఠల్!
    శని పూజలు జేయు శాస్త్రి చక్కటి తనయన్
    కనుగొని పెండిలి యాడగ
    శని పట్టినవారల కగు సకలశుభమ్ముల్

    రిప్లయితొలగించండి