1, ఆగస్టు 2014, శుక్రవారం

సమస్యా పూరణం – 1491 (అరటిపండు మూల్యము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
అరటిపండు మూల్య మాఱుకోట్లు.

13 కామెంట్‌లు:

  1. ఒక లోభి, తను చచ్చాక ధనము పరులకెవ్వరికి దక్కరాదని ఆస్తినంతా విక్రయించి, ప్లాటినమ్ కొని, ఆ లోహముతొ ఒక్క అరటిపండుజేయించి, దానితోపాటు సముద్రంలో మునిగి చచ్చెనట !

    పరమలొభియైన బహుధనవంతుని
    చావులోనె ధనము జారిపోయె !!
    ప్లాటినము ఫలముతొ వార్ధిలొ మునిగెను
    అరటిపండు మూల్య మాఱుకోట్లు.

    రిప్లయితొలగించండి
  2. కొండవీటి రాజు కొడుకాడుకున్నట్టి
    పసిడి బొమ్మలన్ని పలికె వేల
    మందు గుఱ్ఱమేన్గు, హంస, మామిడిపండు
    నరటిపండు మూల్య మాఱుకోట్లు.

    రిప్లయితొలగించండి
  3. అరటిపండు మూల్య మాఱుకోట్లుగ జెప్ప
    కొనెడు వాడు లేక కొంత క్రుళ్ల
    మిగులు భాగమునకు మిలియన్లు వెచ్చించ
    నాక మేగుదురన నరక మొచ్చె

    రిప్లయితొలగించండి
  4. యం.ఆర్.చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఫలముతొ, వార్ధిలొ’ అని ప్రత్యయాలను హ్రస్వంగా ప్రయోగించారు. ‘ప్లాటినంపు ఫలముఁ బట్టి వార్థిని మున్గె’ అందాం.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఒచ్చె’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. అక్కడ ‘నరక మొదవె’ అందాం.

    రిప్లయితొలగించండి
  5. మాన్యుడొకరు దిగె విమానాశ్రయంబున
    దొరికె నతని వద్ద చిత్రపరటి పండు
    పండు లోన మెరిసె వజ్రాల మెరుపులు
    యరటి పండు మూల్య మాఱు కోట్లు

    రిప్లయితొలగించండి
  6. మల్లెల వారి పూరణలు

    శ్రావణంబునందు చక్కనౌ పూజలో
    తమల పాకునందు తగను నిడెడు
    అరటి పండ్ల గొనియు, అమ్మయే సిరులిచ్చు
    అరటి పండు మూల్యమారు కోట్లు

    గౌరి దేవి గొల్చి కాంతలే యిచ్చేటి
    వాయినంబు రెండు పండ్లు నవియె
    మూడు ముళ్ళ నిలుపు ముత్తైదుసేసలన్
    అరటి పండు మూల్యమారు కోట్లు

    వరము లక్ష్మి పూజ బాగైన పండ్లలో
    అరటి ముఖ్యమవియునంది లక్ష్మి
    కోటి సిరుల నిచ్చు కొల్చేటి వారికి
    అరటి పండు మూల్యమారు కోట్లు

    ఆరుగాల మందు నందేటి పండ్లవే
    అరటి పండు తినగ నందు శక్తి
    ముక్తి గూర్చు పూజ ముదముగా నిడినంత
    అరటి పండు మూల్యమారు కోట్లు

    మూడు కోట్ల తెలుగు ముత్తైదులందరు
    అనువు గాను నిడరె అరటి పండ్లు
    రెండు, వాయినంబు లింపౌను వానిచే
    అరటి పండు మూల్యమారు కోట్లు

    అరటి పండ్ల వొకటె యనువుగా దొరుకని
    పూజలందు వాని పొలుపు వాడ
    అరటి పండ్ల ధరలు నాకస మంటేను
    అరటి పండు మూల్యమారు కోట్లు

    అరటి మూలమదియె ననువుగా పాకును
    అరటి డొప్పలందు నలరు దివ్వె
    అరటి యాకు లందు అన్నంబు తిననింపు
    అరటి పండు మూల్యమారు కోట్లు

    రిప్లయితొలగించండి
  7. తీవ్రవాది యొకడు తినరంభ ఫలమిచ్చి
    పాప నెత్తు కొనియు పరుగు తీసె
    నారుకోట్ల నిస్తె నమ్మాయి మీదనె
    నరటిపండు మూల్య మాఱుకోట్లు.

    రిప్లయితొలగించండి
  8. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    పూరణ: అరటిసిరులగొనుడు ఆకు మరకతమ్ము
    పాద మగ్నిభమ్ము బోదె పీత
    పూవు లోహితమ్ము పూసలు పొదిగిన
    అరటి పండు మూల్య మారు కోట్లు

    రిప్లయితొలగించండి
  9. ధనము విలువ తగ్గి ధరలు పెరుగుచున్న
    సగటి మనిషి మనువు సాగు నెట్లు?
    అరటిపండు మూల్య మారు కోట్లుండిన
    పట్టెడన్నమైన భాగ్య మగునె?

    రిప్లయితొలగించండి
  10. అరటి పండు లోన నరుదైన వజ్రములు
    దాచి పంపె నొకడు తనయులకును
    దొరికి పోయె నదియె దొరవారి సముఖాన
    నరటి పండు మూల్య మారు కోట్లు

    రిప్లయితొలగించండి
  11. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం.. చిత్రపు + అరటి = చిత్రపుటరటి అవుతుంది. ఆ పాదాన్ని ‘దొరికె నతనివద్ద నరటిపండు’ అంటే సరి. అలాగే ‘మెరుపులు + అరటి’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘వజ్రాల ధగధగ/ లరటిపండు...’ అనండి.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఏడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘ఇచ్చేటి, ముత్తైదు(వ), కొల్చేటి, అందేటి, అంటేను వ్యావహారిక, గ్రామ్య పదాలను ప్రయోగించారు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఇస్తె’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    1,3 పాదాలలో గణదోషం. ‘వజ్రముల్, దొరవారి యెదుట’ అంటే సరి.

    రిప్లయితొలగించండి
  12. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    మరియొక పూరణ:తే.గీ.శ్రావణమ్ములన లక్ష్మి పూజలు సలుపుచు
    అప్పనగను తాంబూల మరటి పండు
    మూల్య మారు కోట్లు తెనుగు ముత్తయిదువు
    లిడగ నరువది కోట్లుగా లెక్కదేలు

    రిప్లయితొలగించండి
  13. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :

    మాన్యు డొకరు దిగె విమానాశ్రయంబున
    దొరికె నతని వద్ద నరటి పండు
    పండు లోన మెరిసె వజ్రాల ధగధగ
    లరటి పండు మూల్య మారు కోట్లు!

    రిప్లయితొలగించండి