5, ఆగస్టు 2014, మంగళవారం

సమస్యా పూరణం – 1495 (పెండ్ల మయ్యెను పార్వతి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
పెండ్ల మయ్యెను పార్వతి విష్ణువునకు.
(ఒకానొక అవధానంలో గరికిపాటివారు పూరించిన సమస్య)

21 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    పెంటపాడులో పార్వతి విష్ణుమూర్తుల వివాహం జరిగిన శుభవేళ :

    01)
    ______________________________

    పెంటపాడను నూరిలో - బెద్ద యొకడు
    పెండ్లి జేయగ కొమరిత - ప్రేమ గొనిన
    విష్ణుమూర్తికి నామెకు - బ్రేమ తోడ
    పెండ్ల మయ్యెను పార్వతి - విష్ణువునకు !
    ______________________________

    రిప్లయితొలగించండి
  2. కుమార సంభవము :

    02)
    ______________________________

    దక్ష యఙ్ఞము సమయుటన్ - దక్ష పుత్రి
    తారకాసురు నిర్జింప - బోరు నందు
    వరము బొందుట, నేరికిన్ - దరము గాదు
    సూను డొక్కడు గావలెన్ - శూలి యందు !

    సురస కొమరిత యై యుంట - ధరణమునకు
    సురలు మునులును వేడిరి - పరువతమును !
    యువను మెచ్చగ నగమంత - శివుని కపుడు
    పెండ్ల మయ్యెను పార్వతి ! - విష్ణువునకు
    భాగినేయుడు జన్మించు - భాగ్య మొదవె
    తారకాసురు దట్టించు - దారి గలిగె !
    ______________________________
    ధరణము = పర్వతపతి
    పరువతము = పర్వతము
    యువ =వరుడు
    అగము = పర్వతము
    భాగినేయుడు = మేనల్లుడు
    దట్టించు = నిర్జించు

    రిప్లయితొలగించండి
  3. మూడు కన్నుల వానికి పూజ సలిపి
    పెండ్ల మయ్యెను పార్వతి, విష్ణువునకు
    భార్య యయ్యెను శ్రీలక్ష్మి, వాణి తాను
    పత్ని యయ్యెను బ్రహ్మకు భక్తితోడ

    రిప్లయితొలగించండి

  4. వడ్డె విష్ణు కాలేజిలొ వలపు వలల
    పడెను పానుగంటివారి పార్వతిగని
    విద్య నైవేద్య మైనదన్నారుగాని
    పెండ్ల మయ్యెను పార్వతి విష్ణువునకు

    రిప్లయితొలగించండి
  5. వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో యతి తప్పింది. ‘విద్య నైవేద్య మయె నని పెద్ద లనిరి’ అందామా?

    రిప్లయితొలగించండి
  6. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    ప్రేమ యన్నది యాత్మనివేదన మని
    సగము దేహమై యలరుచు శంకరునకు
    పె0డ్లమయ్యెను పార్వతి. విష్ణువునకు
    సకల దేవతలకు సంతసమ్ము కలిగె

    రిప్లయితొలగించండి
  7. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. గురుదేవులు శ్రీమాన్ పండిత నేమాని వారి ఆరోగ్య పరిస్థితి అలాగే ఉన్నదని, ఇంకా ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నదని రాంభట్ల వారు తెలియజేశారు.
    నేమాని వారు త్వరగా కోలుకోవాలని భగవంతునికి విన్నపం.

    రిప్లయితొలగించండి
  9. భక్తి నభిషేకమును గోరు పరమ శివుని
    పెండ్ల మయ్యెను పార్వతి; విష్ణువునకు
    వారనిధి పుత్రికయ్యెను భార్య గాను
    పద్మ సంభవునకు పత్నివాణిగాగ

    రిప్లయితొలగించండి
  10. దక్షిణామూర్తిని గొలిిచి, తపముజేసి
    పెండ్లమయ్యను పార్వతి,విష్ణువునకు
    సహచరయ్యె నారాయణి,చదువులమ్మ
    బ్రహ్మదేవుని భార్యగా వాసి కెక్కె

    రిప్లయితొలగించండి
  11. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    వారినిధి టైపాటు వల్ల వారనిధి అయింది.
    పుత్రిక + అయె అన్నప్పుడు సంధి లేదు. పుత్రిక యయె అనండి.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    సహచరి + అయె అన్నప్పుడు సంధి లేదు. సహచరి యయె అనండి.

    రిప్లయితొలగించండి
  12. మల్లెల వారి పూరణలు

    దేవ తాళియు తామెంతొ దివ్యమనగ
    అద్రి రాజును తామెచ్చ, నభవునకును
    పెండ్ల మయ్యెను పార్వతి,-విష్ణువునకు
    సోదరౌచును జనులకు శుభములిడగ

    తారకాసురు వధియింప తరుణమయ్యె
    ఎట్టకేలకు తపియింపనింతి, శివుని
    పెండ్ల మయ్యెను పార్వతి, విష్ణువునకు
    సకల దేవతలకునయ్యె సంబరంబు

    గౌరిదేవన మంగళకారి, శంభు
    పెండ్ల మయ్యెను పార్వతి, విష్ణువునకు
    లక్ష్మి సంపదలిడుచును. శ్రావణాన
    పడతులెల్లరు కొలువగా భవ్యమగును

    స్థాణువైనట్టి శివునికి చలన మిడగ
    అద్రి తనయయె తపమున నతని కొలువ
    పెండ్ల మయ్యెను పార్వతి,-విష్ణువునకు
    సంతుకూలెను. శివునికి సంతు కలుగ

    రిప్లయితొలగించండి
  13. శివుని పూజించిన ఫలము చేత వారి
    పెండ్ల మయ్యెను పార్వతి, విష్ణువునకు
    తాను సోదరి గావున ధాత్రి యందు
    విష్ణు సహోదరియనుచు పేరు బడిసె.

    ఈశుని సగభాగమవగ ఈశ్వరునకు
    పెండ్ల మయ్యెను పార్వతి, విష్ణువునకు
    భగిని నారాయణి యనుచు వఱలె గౌరి
    భైరవి భవాని భగవతి భద్రకాళి.

    రిప్లయితొలగించండి
  14. ఘోర తపమొనర్చె శివుని గూర్చి గౌరి
    పట్టు దలతోడ వరియించి ఫాల నేత్రు
    పెండ్ల మయ్యెను పార్వతి విష్ణువునకు
    నిష్ట సఖుడైన యప్పరమేశ్వరునకు

    రిప్లయితొలగించండి
  15. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా నాల్గవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘సోదరి + ఔచు’ అన్నప్పుడు సంధి లేదు. ‘సోదరి యగుచు’ అనండి.
    ‘దేవి + అన’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘దేవియె’ అనండి.
    *
    ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘సహోదరి’ అన్నచోట గణభంగం. ‘విష్ణుసోదరి యనుచును...’ అనండి.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. జన్మ జన్మల విడలేని సతిగ శివుని
    పెండ్లమయ్యెను పార్వతి, విష్ణువునకు
    లక్ష్మి సైతము పత్నిగ రామ, కృష్ణు
    లంటి యవతార ములఁగూడి వెంట నడిచె
    జన్మ లేవైన బంధము జతగ జేసె

    రిప్లయితొలగించండి
  17. శివుని సగభాగ మైనిల్చిభవుని పొంది
    పెండ్ల మయ్యెను పార్వతి; విష్ణువునకు
    హృదయమందున నిల్చియు మధురరీతి
    భార్య యయ్యెను లక్ష్మి, సౌభాగ్యదాయి

    రిప్లయితొలగించండి
  18. ప్రేమ నొప్పక వలదన పెద్ద వారు
    కులము మారినగాని వ్యాకులములేక
    సంతకమ్ముల పెండ్లికి సమ్మతించి
    పెండ్లమయ్యెను పార్వతి విష్ణువునకు

    రిప్లయితొలగించండి
  19. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వంటి’కి ‘అంటి’ అని గ్రామ్యాన్ని వాడారు. ‘రామ కృష్ణు/ లనెడి యవతారముల గూడి యనుసరించె’ అందామా?
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ఒకే వాక్యంలో శివుని, భవుని అని పునరుక్తి ఉన్నది. ‘శివుని సగభాగమై నిల్వ చేరి యతని / పెండ్ల మయ్యెను...’ అంటే బాగుంటుందేమో?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. శివుని కొఱకునై తపమును జేసి మరిని
    పెండ్ల మయ్యెను బార్వతి, విష్ణు వునకు
    తనర శ్రీ లక్ష్మి మఱియు సంతాన లక్ష్మి
    యనగ నిరువురు భార్యలు నండ్రు జనులు

    రిప్లయితొలగించండి