29, ఆగస్టు 2014, శుక్రవారం

న్యస్తాక్షరి -2

అంశం- వినాయక స్తుతి.
ఛందస్సు- ఆటవెలది.
మొదటిపాదం 1వ అక్షరం ‘వి’, రెండవ పాదం 3వ అక్షరం ‘నా’, మూడవ పాదం 10వ అక్షరం ‘య’, నాలుగవ పాదం 12వ అక్షరం ‘క’.

27 కామెంట్‌లు:

  1. విశ్వ మంత నేడు వినిపించు నీపేరు
    నీదు నామ జపము నేదు నఘము
    తల్లి భార్గవి ప్రియ తనయ వినాయక
    చరణములను విడువ చండిక సుత

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    విఘ్ననాయకా-వినాయకా
    కష్టాలు తీరేలా - కనకమిడుమయ్యా :

    01)
    __________________________________

    "వి"ఘ్నహారి ! సుముఖ !- విఘ్నేశ ! హేరంభ !
    విఘ్న"నా"యక ! మన - విని విని నను
    వేగ బ్రోవుమయ్య ! - వెనక"య్య "! హరిహయ !
    కరివదన ! గణపతి ! - కన"క" మిడుమ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  3. మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు !


    రిప్లయితొలగించండి
  4. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !!

    కంది వారు,

    జి, లే, బి న్యస్తాక్షరి గా జిలేబి వర్ణన చేయ వీలగునా !!

    జేకే
    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. విశ్వ మాత గన్న విశ్వేశు ప్రియ పుత్ర
    నిన్ను నాదు మదిని నిలుపుకుంటి
    తపముఁ జలుపు చుంటి దయను కోరి, నియతి
    ననవరతముఁ దలతు నంబికసుత

    రిప్లయితొలగించండి
  6. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘చండికాసుత, అంబికాసుత’ అని సమాసం చేయాలి కదా!
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘య్య’ అని ద్విత్వాక్షరాన్ని ప్రయోగించరాదు కదా! అక్కడ ‘య’ మాత్రమే ఉండాలి.
    *
    జిలేబీ గారూ,
    తప్పకుండా ఇవ్వవచ్చు. అయితే నాలుగు పాదాలకు నాలుగక్షరాలు ఇవ్వాలి కనుక ‘జి-లే-బీ-లు’ అని ఇవ్వవలసి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  7. ఆ. వె. వినయ సంపదొసగు విద్యల మహరాజు
    విఘ్న నాయకుండు వేద మూర్తి,
    నమ్మకంబు గలిగి నారాయణ పదము
    సిద్ది బొంది నాడు సిరులు జిలుక
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి

  8. 'వి'ఘ్న రాజ నిన్ను వినుతింతు గణపయ్య
    భక్తి 'నా'దు బుద్ధి బాగ పెరుగ
    శూర్పకర్ణ మాకు చూడరా 'య'పనింద
    కల్గనట్లు నీదు కరుణ చిలు'క'

    రిప్లయితొలగించండి
  9. పూజ్య గురువుగారికి, కవిమిత్రులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు...

    విశ్వ నాధ సుతుడ విఘ్నేశ జేజేలు
    విఘ్న నాయకునకు వేల నతులు
    విద్య లొసగు మయ్య విజయమ్ము లీయుచు
    శుభము గలుగ నెపుడు శూర్ప కర్ణ

    రిప్లయితొలగించండి
  10. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి నమస్సులు. తమరి సూచనననుసరించి నాలుగవ పాదాన్ని మార్చి రెండవ పద్యమును మళ్ళీ పంపుచున్నాను.
    విశ్వ మాత గన్న విశ్వేశు ప్రియ పుత్ర
    నిన్ను నాదు మదిని నిలుపుకుంటి
    తపముఁ జలుపు చుంటి దయను కోరి, నియతి
    సుఖమునిడుము సతము శుభకరుండ

    రిప్లయితొలగించండి
  11. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సూచన ననుసరించి మొదటి పద్యము నాలుగవ పాదాన్ని ఈక్రిందివిదంగా మార్చాను.

    ప్రణతు లిడుదు సతము బ్రతుక తృప్తి
    లేక
    యెదను కొలిచెదనయ యెలుక వాహ్య

    రిప్లయితొలగించండి
  12. గురుదేవులకు బ్లాగు కవి మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

    విజయ మంద మేము వేడుకగా నీ పూజ
    విఘ్న నాయకుడని విన్నపముగ
    భక్తి తోడఁ జేయ వరదాయకా మేము
    వరము లొసగ నడుగ పలుక రార!

    రిప్లయితొలగించండి
  13. విశ్వనాధ తనయవిఘ్నేశ్వరా దేవ
    వందనాలు నీకు వక్రతుండ
    దయను జూపుమేకదంతాయ మామీద
    ధరణిఁ శాంతి వెల్లివిరియు గాక !

    రిప్లయితొలగించండి
  14. మల్లెల వారి పూరణలు

    విపుల భక్తి తోడ వేడెడి మమ్మిల
    విఘ్న నాయకుండ! వేగ కావు
    నాకు ముక్తి నిమ్ము జ్ఞాన నాయక నీవు
    కుడుము లాది నిడచు కొలుతు కరము

    విఘ్నములవి కలుగు వేనవేలు నిలను
    అవ్వి నాకు కల్గ కడ్డగించి
    నాగ ముఖుడ యిల వినాయకుండని మేము
    కుడుము లవియు నిత్తు కొనుమ కరుణ

    రిప్లయితొలగించండి
  15. పూజ్యులు గుఉదేవులు శంకరయ్య గారికి వందనములు విభవమొప్పనిన్ను విధిగ బూజింతును
    విఘ్ననాయకుండ విజయ మొసగు
    సర్వకార్య సిద్ధి సాధించి యశమిమ్ము
    ఫలిత మొండ భరత ప్రజల కలలు

    రిప్లయితొలగించండి
  16. విన్నపాలు వినవొ వేడెద నియ్యెడ
    విఘ్ననాయకా వివేక మిచ్చి
    పూజ చేసి నీకు పొంగెడి యద్భుత
    వరము నిడవె యిడుదు గరిక భక్తి.

    రిప్లయితొలగించండి
  17. విశ్వవిభుడ వంద్య విమల వినాయక
    నాక నాద మోద నాదబిందు
    అభయ మీయవయ్య సదయ హృదయ వ్యాస
    భారత లిపికార భాగ్యజనక

    రిప్లయితొలగించండి
  18. గణనాథుండయి దుష్టశిక్షణమహాకార్యంబులన్ సల్పి స
    ద్గుణవిభ్రాజిత మూర్తిమంతుఁడయి నైర్గుణ్యప్రతీకాత్మవై
    ప్రణవాదిస్వరమంత్రశక్తియుతుఁడై భాసింతువెల్లపుడున్ !!
    ప్రణతుల్ జేతు వినాయకప్రభునకున్ భక్తిప్రపత్తిన్ సదా.

    విఘ్నములను బాపి విజయంబుచేకూర్చి
    దేవనాయకులకు తేజమొసఁగె
    బ్రోవతమరె కాదె యోవినాయక జేతు
    వంద వందనములఁ భక్తి విడక.

    రిప్లయితొలగించండి
  19. 'వి'ద్య నేర్చు వేళ వియ్యమందెడివేళ
    యుద్ధ 'నా'దపు మొన యుబ్బు వేళ
    సర్వ కార్యములకు సరి 'య'త్నములు జేయ
    కాదె పని గణపతి కరుణ 'క'లుగ!!

    రిప్లయితొలగించండి
  20. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!

    విధు రుచి నిభ గాత్ర! విష్ణు! ద్విమాత్రుక!
    ప్రార్థనాద్య మంత్ర! పర్శుపాణి!
    విశ్వనేత! ఢుంఠి! విఘ్ననాయక! శూర్ప
    కర్ణ! తే నమోsస్తు ఖనక రథిక!

    రిప్లయితొలగించండి
  21. కొరుప్రోలు రాధాకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వినయసంపద నిడు’ అనండి. సంపద + ఒసగు అన్నప్పుడు సంధి లేదు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘విజయమ్ము లిచ్చుచు/ విజయమ్ము లొసగుచు’ అనండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ సవరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వేడుకగా’ అన్నచోట గణదోషం. ‘వేడ్కగా/ వేడుక నీపూజ’ అనండి.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఏకదంతాయ’ సంస్కృత ప్రత్యయాన్ని ప్రయోగించారు. దానికి అన్వయం లేదు. సవరించండి.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘వేనవేలుగ నిల/ నవ్వి...’ అనండి.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. పూరణకంటె మాకు బోనస్‍గా అందించిన మత్తేభం మరింత బాగుంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. విఘ్న వారణమున విఖ్యాతిగన్నట్టి
    విఘ్న నాధునకును విమల భక్తి
    మోదకముల నిడగ మోలేక దిరిగి
    భక్త జనుల కొసగు ముక్తి వాఁ*(ప్రవాహము)*

    రిప్లయితొలగించండి
  23. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    విజయ మంద మేము వేడ్కగా నీ పూజ
    విఘ్న నాయకుడని విన్నపముగ
    భక్తి తోడఁ జేయ వరదాయకా మేము
    వరము లొసగనడుగ పలుక రార!

    రిప్లయితొలగించండి
  24. ఆ. వె . వినయ సంపదనిడు విద్యల మహరాజు
    విఘ్న నాయకుండు వేద మూర్తి,
    నమ్మకంబు గలిగి నారాయణ పదము
    సిద్దిబొంది నాడు సిరులు జిలుక
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు
    మీ సూచన కు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  25. ధన్యవాదములు మాష్టారు ! సవరించిన పద్యం :-
    విశ్వనాధ తనయవిఘ్నేశ్వరా దేవ
    వందనాలు నీకు వక్రతుండ
    కాయుమోయి మము వినాయక నీదయన్
    ధరణిఁ శాంతి వెల్లివిరియు గాక !

    రిప్లయితొలగించండి
  26. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. శ్రీగురుభ్యోనమ:

    విజయ గీతికలను వీనులవిందుగా
    విఘ్ననాయకునకు వినతి జేతు
    స్తుతుల నుతుల గొలచి తోయములర్పింతు
    ముదము కలిగి నిడుదు మోదుకములు

    రిప్లయితొలగించండి