14, ఆగస్టు 2014, గురువారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 53

రావిపాటి లక్ష్మీనారాయణ
రామాయణము-
చం.    మనమున హారియై (తివిరి, మంజులరూపముఁ దీర్చి, నూర్వ)నూ
    ననయపరాఘరా(శి రతినాథనిపీడితచిత్త జాణ) శూ
    ర్పణఖయుఁ దాటకా(విజయు పైఁ బడె; నాతఁడు వెళ్లు వేడఁ) ద
    మ్ముని ననెఁ దమ్ముఁడున్ (వలదు పొమ్మని పల్కెను భామ నంత)టన్. (౬౮)

భారతము-
గీ.     తివిరి, మంజులరూపముఁ దీర్చి, నూర్వ
    శి రతినాథనిపీడితచిత్త జాణ
    విజయుపైఁ బడె; నాతఁడు వెళ్లు వేడ
    వలదు పొమ్మని పల్కెను భామ నంత. (౬౮)

టీక- (రా) సు = శ్రేష్ఠమగు; ఉరు = అతి; అనూన = అధికమగు; నయ = నీతికి; పర = ఇతరమగు; అఘ = పాపముయొక్క; రాశి = గుంపయినది (అనగా నీతిబాహ్యురాలగు పాపిష్ఠి); (భా) సు, ఊర్వశి; తాటకావిజయుఁడు = (రా) రాముఁడు; శూర్ప + నఖ - శూర్పణఖ యగును గనుక నణ లకు ప్రాసము చెల్లినది.

2 కామెంట్‌లు:

  1. గురువర్యా! గత అయిదు సంవత్సరాలుగా కొనసాగుతూ ఎంతోమందికి పద్యభిక్ష పెట్టిన మన బ్లాగు ఇక ఉండదంటే మనసుకు ఏంటో కష్టంగా ఉంది. కోరి కోరి విషం మా చేతులో పెట్టినట్టు ఉంది. మీరొక్క సారి పునరాలోచించి నిర్ణయం తీసుకొంటే మంచిది. పద్యం రాసే వాళ్ళే కరువైపోతున్న ఈ రోజుల్లో మీలాంటి వారు పూనుకోకుంటే పద్యానికి దిక్కు లేకుండా పోయేది. సమస్య ఇవ్వడం ఎంత కష్టమో దాన్ని పూరించడం కూడా అంతే కష్టం. మీరిచ్ఛే సమస్యలు మా స్వంత సమస్యలను మరిపించి, మమ్ములనెంతగానో మురిపించి, మా మెదడుకు పనిపెట్టించి, మా పనిపట్టించి చీకట్లో దివ్వెలాగా ఉపకరించింది. అటువంటి బ్లాగు కనుమరుగవడం మంచిది కాదు. కాబట్టి సమయోచిత నిర్ణయం తీసుకోగలరు. నాకంటే పెద్దవారు, పద్యాలపై ఆసక్తి ఉన్నవారు, పద్యపుంగవులు అనిపించుకొన్నవారు చూపిన దారిలో మీరు ఆలోచిస్తే బాగుంటుంది. శ్రీ నేమాని వారి సహకారం లేదని మీరు విషాద యోగం అవలంబిస్తే మా బోటి వాళ్లకు దారేది? ఎందరికో సమస్యలిఛ్చి, సమస్యలను సరిచూసుకుని, సరిచేసుకొని, సమస్యా పరిష్కారం చేసిన మీరు ఈ సమస్యను సక్రమంగానే పరిష్కరించగలరని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  2. రఘుకుమార్ గారూ,
    మీ అభిమానానికి ధన్యవాదాలు. ఇప్పట్లో అటువంటి ప్రమాదం లేదని హామీ ఇస్తున్నాను.

    రిప్లయితొలగించండి