5, ఆగస్టు 2014, మంగళవారం

పద్యరచన - 642

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(అది గన్నవరపు నరసింహ మూర్తి గారు అమెరికాలో తమ పెరట్లో పెంచుకున్న మొక్క)

20 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    దేవాంతకుడు (ఎన్.టి.ఆర్) సినిమాలో పాట :

    ___________________________

    గో-గో-గో-గో--- గోం-గూ-----రా
    జై- జై -జై -జై ---జై-యాం-----ధ్రా

    గో-గో-గో-గో--- గో-ంగూ-----రా
    జై- జై -జై -జై ---జై-యాం-----ధ్రా

    గోం-గూ-----రా జై-యాం-----ధ్రా
    గోం-గూ-----రా జై-యాం-----ధ్రా

    కో--రుకో----- కో--రుకో----- మనసా---రా
    నీ---మనసా---రా

    కమ్మ కమ్మని వెల్లుల్లి పాయలూ
    పరమ ఘాటైన యెర్ర మిరపకాయలూ
    పిసరంత యింగువ---పేరిన నెయ్యీ
    కలిపి కొట్టు-కలిపి కొట్టు-కావేటి రంగా

    గో-గో-గో-గో--- గోం-గూ-----రా
    జై- జై -జై -జై ---జై-యాం-----ధ్రా

    గో-గో-గో-గో--- గో-ంగూ-----రా
    జై- జై -జై -జై ---జై-యాం-----ధ్రా

    గోం-గూ-----రా జై-యాం-----ధ్రా
    గోం-గూ-----రా జై-యాం-----ధ్రా

    కో--రుకో----- కో--రుకో----- మనసా---రా
    నీ---మనసా---రా

    ___________________________

    రిప్లయితొలగించండి
  2. ఆంధ్రుల-అభిమాన శాకము-గోంగూర :

    01)
    ______________________________

    కూరలన్నిట గోంగూర - గొప్పదగుట
    ఆంధ్రశాకమ్ము గామారె - నవని యందు !
    అట్టిదానిని మరువక - ననవరతము
    ఆరగించుడు తప్పక - నాంధ్రులార !
    ______________________________

    రిప్లయితొలగించండి
  3. ఎచట నున్నగాని హితమైన గోంగూర
    చెంతనున్న యెడల చింత యేల ?
    మృదుల లేహ్య మొసగ మృడుడైన దిగివచ్చు
    పుడమి జనుల సుధయె పుంటికూర !

    మృడుడు = శివుడు ; పుంటికూర = గోంగూర

    రిప్లయితొలగించండి
  4. వసంత కిశోర్ గారూ,
    నాకెంతో ఇష్టమైన పాటను గుర్తు చేశారు. ఆ పాట పాడుతూ ఇంద్రసభలో ఎన్టీవోడు వేసిన స్టెప్పులు జ్ఞాపకం ఉన్నాయి. ధన్యవాదాలు. ఈ పాట ఎక్కడ దొరుకుతుందో ఆ లంకె ఇవ్వండి.
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘తప్పక’ కళ. కనుక ‘తప్పక యాంధ్రులార’ అనాలి.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    అమెరికాలో మీ పెరట్లో మీరు పెంచుకున్న ఆ మొక్క మీ ఆంధ్రాభిమానాన్ని తెలియజేస్తున్నది.
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. అమరపురినుండి వచ్చిన యాకుకూర
    ఆంధ్రమాతగ గొనియాడు రవనియందు
    పప్పు పచ్చడి యేదైన గొప్ప రుచియు
    పుల్ల గోంగూర! నీరుచి బొగడతరమె!

    రిప్లయితొలగించండి
  6. ఆకుకూరలందు నాంద్ర గోంగూరకు
    సాటి కాదు యెట్టి శాక మైన
    పంచ భక్షములను పళ్ళెమం దుంచిన
    కోరి గుడుతురుగద గోగుకూర

    రిప్లయితొలగించండి
  7. శంకరార్యా ! ధన్యవాదములు !
    మీరడిగిన లింకు యిదిగో :

    https://www.youtube.com/watch?v=Yz7N8ZhmCKU

    ఆ సినిమా 11 భాగాలుగా ఉంది !
    ఇది పదో భాగం !
    మిగిలిన భాగాలు మీకు కుడి వైపున అందుబాటులో ఉంటవి !

    రిప్లయితొలగించండి
  8. మూర్తీజీ ! బావున్నారా ! మరీ నల్లపూసై పోయారు !

    రిప్లయితొలగించండి
  9. పుల్లని గోగుకూర మనభూమిని పండుచునాంధ్రప్రాంతమం
    దెల్లరి యింటిలో రుచులనింపుగనింపుచుఁ దెల్గువారికిన్
    దల్లిగ నాంధ్రమాతయని దక్కిన కూరల మీఱుఁ బేరుతో
    నెల్లలులేని యాదరము హెచ్చినప్రేమయు బొందెనిచ్చటన్

    రిప్లయితొలగించండి
  10. అమెరికాలో ఆంధ్ర మాతను పెంచి పోషించుచున్న గన్నవరపు వారి తెలుగు రుచుల అభిమానానికి అభినందనలు. అయ్యా ! మీరు, "మన తెలుగు " వారు ఈమధ్య క్లాసుకు సరిగా రావట్లేదు....


    పప్పు నుల్లిగడ్డల నూరిన పచ్చడియును
    పులుసుకూరకు బాగుండు పుంటి కూర
    నూనె గోంగూర తలచగా నోరునూరు
    తెలుగు భోజన మిదిలేక తేలిపోవు.

    రిప్లయితొలగించండి
  11. శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘కొనియాడ నవనియందు’ అనండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    ధన్యవాదాలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ ఉత్పలమాల సాఫీగా నడిచింది. బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. మా ఊళ్ళో గత ఉగాది సంబరాలలో జరిగిన కవి సమ్మేళనములో నేను గోంగూర మీద చదివిన పద్యాలు. సమయం వచ్చింది కదా అని ఇక్కడ పునరుక్తి..

    (ఈ క్రింది పద్యాలలోని కొన్ని భావనలకు ప్రేరణ ఇంతకు పూర్వము కవి మిత్రులతో, ముఖ్యంగా లంక గిరిధర్ మరియు సనత్ శ్రీపతి లతో, జరిగిన ఒక సాహితీ చర్చ. అందులకు వారికి నేను పత్రికాముఖముగా నా కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను)


    కం//
    ఉత్తమమిది పచ్చళ్ళన
    పెత్తల్లిది రుచులయందు ప్లేట్లకు ప్లేట్లన్
    చిత్తమలరంగ ఇదితిని
    మత్తుగనిదరోవు సుఖము మహిలో గలదే!

    సీ//
    శాక పాకములందు శాకాంబరీ దేవి
    దీవెనల్ పొందిన తెలుగు కూర
    పంచశరుని యొక్క పంచాస్త్రములఁ బోలు
    పంచాగ్రములుగల పచ్చ కూర
    'దేవాంతకుడు' యందు, ధీటుగా N.T.R
    గొప్పగా పొగిడిన గోగు కూర
    ఆకుకూరలెపుడు ఆరోగ్యమున్ బెంచు
    యనుచు వైద్యుడొసగు ఆకుకూర
    ఆ.వె//
    పప్పు కూరయందు పచ్చళ్ళయందున
    పులుపు నొసగు నిదియె పుంటి కూర
    ఆంధ్రులనగ మనము అదృష్టవంతులం
    యనుచు చాటి చెప్పు ఆకు కూర.

    ఆ.వె//
    గోగు కూరదెచ్చి బాగుగా మగ్గించి
    గరిట పోపు వేసి కమ్మగాను
    రోట రుబ్బి దాని నీటుల్లిపాయతో
    తినిన అమృతమునది తినిన యట్లె!

    కం//
    గరుడుడు కష్టములొందుట,
    హరిపడతిగ వేషమేసి ఆడుట, కాకో
    దరములు దర్భలు నాకుట,
    తిరముగ గోంగూర రుచిని తెలియక సుమ్మీ!!

    వ.
    మత్స్యావతారనంతరము మునులందరు క్రొత్త ప్రదేశములో సరియైన తిండి కుదరక, ముఖ్యంగా నంజుడు లేక, విష్ణువునిలా ప్రార్ధించారు:

    కం//
    చప్పటి దుంపలు తినుచును
    తిప్పలు పడుచుంటిమయ్య దేవా దయతో
    గొప్పగు మార్గం బొక్కటి
    చెప్పుము మా నాల్క లొక్క చింతలు తీర్పన్

    వ.
    అప్పుడు విష్ణువు, "సృష్ట్యారంభములో ఆవకాయ ఇచ్చానుగదా" అనెను. అప్పుడు మునులు స్వామికి మ్రొక్కి:

    ఆ.వె//
    ఆవకాయఁ పెట్ట ఐదు రోజులుఁ బట్టు
    వేసవందుఁ తప్ప వీలుఁ గాదు
    ఎల్లవేళలందు ఇంపుగా దొరికెడి
    పచ్చడొసగు మయ్య పరమ పురుష!

    అప్పుడు విష్ణువు గోంగూర విత్తనాలు సృష్టించి, మునులకిచ్చి, ఇట్లనెను:

    కం//
    ఎక్కడ పడితే అక్కడ
    మిక్కుటముగ దొరకు మీకు, మేలును గూర్చున్
    చక్కనిదౌ శాకము మీ
    ఇక్కట్టులు తీర్చునట్టిదీ గోంగూరే!

    కం//
    గోంగూర వంటి పచ్చడి
    గంగానది వంటి జలముఁ గలిగిన యేఱున్
    చెంగావి వంటి రంగుయు
    మంగాపతి వంటిదైవమవనిన గలవే!!

    కం//
    శతకముఁ జదవని వాడును
    కుతుకముతో గోగు కూర కుడవని వాడున్
    గతితప్పక సినిమాలను
    అతిగా తాఁ జూడనోడు ఆంధ్రుడు కాడోయ్!

    రిప్లయితొలగించండి
  13. పుష్యం గారూ,
    సందర్భశుద్ధితో మీరీ పద్యాలను పంపి ఆనందాన్ని కలిగించారు. పద్యలు సరదాగా ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. దివిజ సురవరుల రసనల్
    చవి జూడనెంచ సాగి స్వర్గపు దిశగా
    భువినుండి పెరిగెనా? యను
    భవమున గోంగూర మరువ భవుని దరమ్మా?


    రిప్లయితొలగించండి
  15. పచ్చని యాకుల తోడను
    మెచ్చిన యా రుచికి తోడు మేనికి శుభమౌ
    నెచ్చట జూచిన దొరికెడు
    పచ్చడి గోంగూర తినుచు పడయుడు శుభముల్

    రిప్లయితొలగించండి
  16. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. గురువుగారికి నమస్సులు. మా గోంగూర చిత్రమును పద్య శీర్షికలో నిలిపినందులకు కృతజ్ఞతలు. చక్కని రుచికరమైన పద్యాలనందించి విందు చేకూర్చిన మిత్రబృందమునకు ధన్యవాదములు. వసంత కిశోర్ జీ , హనుమచ్ఛాస్త్రి గారూ నేను బాగానే ఉన్నాను. చదువుకొనడానికి తెచ్చుకున్న పుస్తకాలలా ఉన్నాయి. మరి సాయంకాలము తోటపని కూడా చేస్తున్నానుగా !తీరిక తక్కువయింది. మీ కవితలను చదివి ఆనందిస్తూనే ఉన్నాను.వారానికో పూరణ నైనా చెయ్యడానికి ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  18. శంకరయ్య మాస్తారుగారికి నమస్సుమ్మాంజలులు .
    గోంగూర రుచి ఇప్పుడు పూర్తిగా రుచిచూడడమైనది . డా.నరసింహ మార్తి గారు శివుడిని , కైలాసాన్ని భువికి తేగా ,పుష్యం గారు వైకుంఠాన్ని మిగిలిన వాళ్ళనీ గోంగూరతో లాక్కొచ్చేసారు .చాలా సంతోషం .
    భవదీయుడు , డా.కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

    రిప్లయితొలగించండి
  19. శంకరయ్య మాస్తారుగారికి నమస్సుమ్మాంజలులు .
    గోంగూర రుచి ఇప్పుడు పూర్తిగా రుచిచూడడమైనది . డా.నరసింహ మార్తి గారు శివుడిని , కైలాసాన్ని భువికి తేగా ,పుష్యం గారు వైకుంఠాన్ని మిగిలిన వాళ్ళనీ గోంగూరతో లాక్కొచ్చేసారు .చాలా సంతోషం .
    భవదీయుడు , డా.కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

    రిప్లయితొలగించండి
  20. చెట్టు,గోంగూర యచ్చటచిల్వతోడ
    చూడ ముచ్చటవేసెనుజూడగానె
    మంచి యేపుగ పెరిగెనుమైత్రి!చూడు
    భోజ్యవస్తువు ప్రతి యొక్కభోక్తకుమరి

    రిప్లయితొలగించండి