18, ఆగస్టు 2014, సోమవారం

పద్యరచన - 651

కవిమిత్రులారా,
శ్రీకృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు!

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

  1. 1.
    అష్టమ గర్భ మునందున దేవకీ
    వసుదేవుల సుతుడై వసుధఁ వెలసి
    గోకులమందున గోప కిశోరమై
    నంద యశోదల నాశ్రయించి
    పూతన హతమార్చి పొలమార్చి కాళిందు
    గోవర్ధనమునెత్తి గోటిపైన
    బలరాము తోగూడి మధురానగరికేగి
    మామయౌకంసుని మదమడంచి

    వెన్న దొంగిలించ యశోద విసుగు చెంది
    ఱోటకట్ట శాపస్థుల బ్రోచినట్టి
    కృష్ణుడెల్ల వేళలయందు గృపనుజూడ
    యవని యంతయు శాంతితో నలరుగాక!
    2.
    ఎన్నెన్ని యిండ్ల జొరబడి
    వెన్నను కాజేసి నావొ వింటిని కృష్ణా!
    తిన్నంత వెన్న నీకున్
    కన్నయ్యా మన గృహమున కరువయ్యిందా ?

    రిప్లయితొలగించండి
  2. కృష్ణనుని ఫోటో పట్టుటకు
    ఫిల్మీ ఫ్రైడే డాటు కాము !
    మనంబున జగద్గురుని గన
    'అస్లీ' అముల్ డాట్ కాము !!


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. గురువులు శంకరయ్య గారికి, కవి వర్యులకు నమస్సలు.!.
    .
    అంబుజోధర ! కేశవ !యచ్చుతుండ !
    కైటభారి ! యిందీవర ! కమల నయన !
    దైత్యనిదనుడ ! దైత్యారి ! దానవారి !
    పాప హరణము జేసెడి పద్మగర్భ !
    .
    ముక్తి సందాయక ! హరి ! సద్భక్త వరద !
    పూతనను హతమార్చిన ముక్తిధాత !
    కోరి రక్షించితివి కద ! గోకులమును
    లీల జూపించి గావుము బాలకృష్ణ !
    .
    .___________జయసారథి.

    రిప్లయితొలగించండి
  4. అష్టమ యామిని దేవకి
    యష్టమ గర్భమున బుట్టి యా కంసుని పా
    పిష్టుని చంపిన హరి మా
    కష్టములను దీర్చి మమ్ము గావుము కృష్ణా !

    రిప్లయితొలగించండి
  5. వెన్నైన నీకు నొకటే
    మన్నైనను భేదమేది మా బాలకుడా !
    వెన్నంటి నిలచి భక్తుల
    మన్ననలను పొందునట్టి మా పాలకుడా !

    రిప్లయితొలగించండి
  6. అష్టమి యామిని దేవకి
    యష్టమ గర్భమున బుట్టి యా కంసుని పా
    పిష్టుని చంపిన హరి మా
    కష్టములను దీర్చి మమ్ము గావుము కృష్ణా !

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్య గురువు గారికి, మరియు సుకవి మిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు....

    కృష్ణాష్టమి పర్వదినమున
    కృష్ణుని సద్భక్తి తోడ గొలిచిన వేడ్కన్
    కృష్ణునికి నివేదవలిడి
    కృష్ణా ! మము గావుమనిన కోర్కెలు దీరున్

    అష్టమ శుభలగ్నంబున
    నష్టమ గర్భమున బుట్టి నచ్యుత కృష్ణున్
    నిష్టగ బూజించునెడల
    కష్టంబులు దీర్చు గాదె కంబుధరుండే!

    తలచిన నిరతము వెన్నుని
    నిలుచును గద సిరులు యశము నిజముగ నిలలో
    తులసీదళములు గైకొని
    పులకించుచు వరములనిడు పురుషోత్తముడే!

    కన్నుల కనబడవైతివి
    చెన్నుగమరి చిన్నికృష్ణ చింతలు దీర్చన్
    వెన్నను దాచితి నీకై
    కన్నా! నను గావుమయ్య కౌస్తుభధారీ!

    దండమయా మురళీధర
    దండమయా నందబాల తాండవ కృష్ణా!
    దండమయా వనజోదర
    దండమయా చిన్నికృష్ణ దండము నీకున్! !


    రిప్లయితొలగించండి
  8. మల్లెల వారి పూరణలు

    నల్లని వాడవు, పింఛము
    నల్లన తలపై ధరించు, నల్లరి వాడౌ
    పిల్లడ! సందిట తాయెతు
    లల్లన మువ్వలను దాల్చు, రమ్యుడ కృష్ణా

    రిప్లయితొలగించండి

  9. అష్టమి రోహిణి పొద్దున
    న ష్టమ గర్భుడు గ పుట్టె నాకన్నడిలన్
    న్ని ష్టముగ పూ జ చేసిన
    కష్టము లిక మనకు తొల గు కన్నని దయచేన్ .

    రిప్లయితొలగించండి
  10. నెమలీకలలో దాగిన
    యమలిన శృంగార పురుష హరి గోవిందా!
    మము పాలించగ రారా!
    ప్రమిదై నిను జేర గొలుతు పాహి ముకుందా!

    రిప్లయితొలగించండి
  11. చిన్ని కృష్ణయ్య కనుచుండె చెన్నుగాను
    గొల్ల యిండ్లలో పాల్వెన్న కొల్ల గొట్టి
    యత్త కోడళ్ళతోడ తానాట లాడ
    వెన్న దొంగ చిలిపి పను లెన్న తరమె

    రిప్లయితొలగించండి
  12. రాతిరి దాటి యా యమున, రంగుగ గోకులమందు రక్కసుల్
    పూతన వత్సు నా బకుని భూతపు గాలిని బండి నెద్దులన్
    లేత వయస్సులో దునిమి, లీలగ తాండవమాడి పాముపై,
    మాత యశోద రోట నిను మాలి దయన్ ముడివేయ యక్షులన్
    ప్రీతిని గాచి, మన్ను దిని, విశ్వము నోటను జూపి, భవ్యమౌ
    రీతిని పాలు వెన్నలను లెక్కకు మిక్కిలి దోచి, గోపికా
    చేతములన్ హరించి, యొక చేతను కొండను దాల్చి, కుబ్జయౌ
    నాతిని సుందరాంగముల నారినిగా దయజూచి, దేవకీ
    భ్రాతను డాయ భద్రగజ భంజనమున్ పొనరించి, మల్లులన్
    చేతుల మోది, కంసవిభు జెచ్చెర జంపిన బాలకృష్ణ! నా
    పాతకములన్ హరింప గదె పాదములంటి నుతింతు భక్తితో.

    రిప్లయితొలగించండి
  13. పిల్లన గ్రోవిని కైగొని
    మెల్లన రాగముల మధుర మృదురవములలో
    పల్లెను స్వాంతన పఱచుచు
    నల్లరి చేష్టలలరించు యాదవ కృష్ణా!

    రిప్లయితొలగించండి
  14. పద్యములన్నీ బాగున్నాయి

    నా దృష్టికొచ్చిన చిన్న విషయం, శైలజగారి తొలిపద్యంలో రెండవపాదంలో యతి కాస్త గతి తప్పినట్లుగా అనిపించింది. క కు వట్రసుడి తోడయి కృ అనే అక్షరంలో ఉ కారం కనిపించినా అది ఇ కారముగా చదవాలి అని అనుకుంటా అందుకే కృష్ణుడు అని వ్రాసినా పలికేటప్పుడు క్రిష్ణుడుగా పలుకుతాం. ఆ లెక్కన చూస్తే కృ అనే అక్షరం కి,కీ,కె,కే గి,గీ, గె,గే లతో జతకడుతుంది కానీ కు, కూ, గు,గూ, కొ, కో, గొ, గో లతో యతి మైత్రిలో ఉండదేమో మరి. ఒకవేళ నేను పొరబడ్డట్లైన పెద్దలు వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  15. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    మీ వ్యాఖ్యలు అప్పుడప్పుడు నాకు ప్రహేళికలే!
    *
    జయసారథి గారూ,
    మీ పద్యలు బాగున్నవి. అభినందనలు.
    కొన్ని లోపాలు.. అచ్యుతుండ- అచ్చుతుండ అన్నారు. ఇందీవర నేత్ర, ఇందీవర నయన అనవలసింది. నా సవరణలతో మీ పద్యాలు....

    అంబుజోధర ! కేశవ ! యచ్యుత ! హరి !
    కైటభారి ! శేషశయన ! కమల నయన !
    (దైత్యనిధనుడ ! దైత్యారి ! దానవారి ! ..... ఇక్కడి మూడు పదాలకూ అర్థం ఒకటే)
    దైత్యనిధన! పీతాంబరధర! ముకుంద!
    పాప హరణము జేసెడి పద్మనాభ !
    .
    ముక్తి సంధాయక ! హరి ! సద్భక్త వరద !
    పూతనను హతమార్చిన ముక్తిదాత !
    కోరి రక్షించితివి కద ! గోకులమును
    లీల జూపించి గావుము బాలకృష్ణ !
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ ఐదు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యం మొదటి పాదంలో గణదోషం. ‘కృష్ణాష్టమి పర్వదినము / కృష్ణాష్టమి శుభదినమున’ అనండి.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ ఉత్పలమాలిక అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. కామేశ్వర శర్మ గారూ,
    ధన్యవాదాలు. శైలజ గారి పద్యంలోని యతిదోషాన్ని నేను గమనించలేదు. మన్నించండి.
    ‘కృష్ణుని సద్భక్తితోడ కీర్తించినచో...’ అందాం.

    రిప్లయితొలగించండి
  17. ఆదిభట్లవారి సందేహం సహేతుకమే. శైలజ గారు సరిదిద్దుకోవాలి.

    రిప్లయితొలగించండి
  18. కారాగృహమ్మునందున
    కారు నలుపురేయి కారుకాలపు జడిలో
    కారు మొగిలు వన్నియతో
    కారణ భూతుడుదయించె ఘృణి'తెలుపు'టకున్

    రిప్లయితొలగించండి
  19. సుమలత గారూ,, చివరిపాదంలో యతి గమనించవలసి ఉంది.

    రిప్లయితొలగించండి
  20. కారాగృహమ్మునందున
    కారు నలుపురేయి కారుకాలపు జడిలో
    కారు మొగిలు వన్నియతో
    కారణ భూతుడుదయించె కాంతిని దెల్పన్

    ధన్యవాదములండీ కామేశ్వర శర్మ గారు. ఇప్పుడు సరిపోయిందనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  21. మాజేటి సుమలత గారూ,
    సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. ధన్యవాదములు మాస్టర్ గారు, కామేశ్వర శర్మ గారు.

    రిప్లయితొలగించండి