8, ఆగస్టు 2014, శుక్రవారం

శ్రద్ధాంజలి!

శ్రద్ధాంజలి!

సుకవి, యధ్యాత్మ రామాయణ కృతికర్త,
మాన్యగురుదేవుఁడైన నేమాని రామ
జోగి సన్యాసి రావుకు శోకతప్త
మైన హృదయ మర్పించు శ్రద్ధాంజలి యిది! .... (కంది శంకరయ్య)

నేమాని పండితార్యులు
భూమిని విడి వాడిపోని పూవై సీతా
రాముల పదముల వ్రాలగ
నేమో దివికేగి నారు యీ దిన మయ్యో ! .... (మిస్సన్న)
 
ఆమని ఛందోవనమున
రాముని సద్భక్తివెలయ రసకవి పదవిన్
 సామ నిగమముల జేరిన
 నేమాని వినీతగుణము నీకాశముగా ... (యం.ఆర్. చంద్రమౌళి)

 పండిత నేమానీ వా
 రుండును మన మనసులందు నున్నతులై యీ
 గుండెలు బరువెక్కెను మన
 కండగ సలహాలనిచ్చు కవివరు గొరతన్ .... (చంద్రమౌళి సూర్యనారాయణ)

 నే మాని యొరుల కిచ్చుట
 యేమాకున్నట్టి చిత్తవృత్తిగ తెలిపే
 నేమాని రామజోగికి
 నేమిత్తును దాచుకొందు హృదయమునందున్!! .... ("అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ)

 సీ.
 శంకరాభరణ సత్సాహితీ కవిగణ
    స్ఖాలిత్య సవరణఁ జేసినావు;
 స్వయముగా నెన్నియో సత్పూరణమ్ములఁ
    జేసి, కీర్తినిఁ బ్రతిష్ఠించినావు;
 తపసివై యష్టావధానమ్ములనుఁ జేసి,
    తెలుఁగు కవుల లోటుఁ దీర్చినావు;
 రమణమై యధ్యాత్మ రామాయణమ్మునుఁ
    దెలుఁగు భాషనుఁ దీర్చిదిద్దినావు;
 తే.గీ.
 ఇట్టి వైశిష్ట్య గురుమూర్తి వీవు మమ్ము
 నేఁడు విడనాడి, కైవల్య నిధినిఁ గోరి,
 స్వర్గమేగిన నేమాని పండితార్య!
 మృడుఁడు మీ యాత్మకిల శాంతి నిడునుఁ గాత! .... (గుండు మధుసూదన్)


అన్న ! నేమాని రామన్న ! మొన్న నీవు
దైవసన్నిధి దెలిసితో భావ మందు ,
మాకు నాశీస్సు లొసగవే మమత పొసగ !
కరుణ పంచగ సాటియే యొరులు నీకు ?  ... (గన్నవరపు నరసింహ మూర్తి)


నేమాని వారి రోగ
మ్మేమానియె రాగలరని మేమనుకొనగా 
రామా ! నీ సన్నిధికే
ప్రేమారగ రచన జేయ పిలచితివా ! హా ! .... (గోలి హనుమచ్ఛాస్త్రి)


“మీరల కివె దీవెన” లని
కోరక దయఁ గురిసినపుడు గురుదేవులకున్
ప్రారబ్ధకర్మశేషము
తీరినదని నేరని కృశధిషణుఁడ నైతిన్.

“ఇది నేయార్థము”, “నేఁ డీ
యది ఛందోభంగము”, “ఇది యద్భుతగతి కా
స్పద” మంచును శిష్యుల కొ
ప్పిదముల నేర్పు గురుదేవ! వీడితె మమ్మున్.

“నిండు మనంబు నవ్యనవనీతసమానము; పల్కు దారుణా
ఖండలశస్త్రతుల్యము జగన్నుతవిప్రుల” కంచు నన్నయా
ర్యుండు వచించెఁ గొంత విదితోత్తరమైన భవత్స్వభావమున్;
మెండుగ నోచినార మది మీ వచనావళి మించుఁ గాంచగన్.

పనిచిరి కరుణామృతమును
వినిచిరి కవితామృతమును విబుధుల కొఱకై
మనిచిరి సీతారామ క
థను శరణాగతుల మార్గదర్శన మొప్పన్.

భవ మింక లేని పదమున
భవు సన్నిధి పెన్నిధి మెయి పరమం బగు మీ
కవితావైభవ మలరుచు
నవిరతమును నోముఁ గాత మాచార్య! మమున్.  (
ఏల్చూరి మురళీధరరావు)

లేవులేవాయెయికమాకు లేవునీవు
యెచటికేగితినీవార్య!యిచటనుండి
రమ్ము మాకొఱ కొకసారి రామజోగి!
శంకరాభరణ గురువ!శర్మ!మీరు. ... (పోచిరాజు సుబ్బారావు)

 ఏమరు పాటును సైతము
మోమాటము లేక దిద్ది మోదము గూర్చే
నేమాని పండితార్యుల
రామైక్యము నోట మాట రానీయదదే! ... (గుండా వేంకట సహదేవుడు)


అష్టావధానమ్ములతిమనోహరముగ
....... వెలయించినట్టి ప్రావీణ్యయుతులు
పద్యవిద్యావైభవమునెల్ల జగతిన
....... వ్యాపింపజేసిన ప్రథితకవులు
నధ్యాత్మరామాయణాది కావ్యంబుల
....... సృజియించినట్టి సంస్థితుఁడవీవు
భావికవులకెల్ల ప్రామాణికమ్ముగా
....... భావింపదగిన విభ్రాజితుండు

శంకరాభరణమ్మున సంశయములఁ
దొలఁగజేయుచు జ్ఞానమ్ము కలుఁగజేసె !!
పండితోత్తమనేమాని వర్య మీదు
యాత్మ శాంతిని పొందగానభిలషింతు. ... (సంపత్ కుమార్ శాస్త్రి) 



పండిత నేమానీ తమ
రండగ నుండగ కవితల నానందముగా
దండిగ వ్రాసితి మిచ్చన్
చండిక పతి చేరినావ సత్కవి చంద్రా! ... (అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి)


గురు పండిత నేమానీ!
యరిగితవా యింతలోనె యమరాలయమున్
మరవము మా గుండెలలో
నిరతము నీవుందు వయ్య నిర్మల హృదయా !

పద్యములను సవరించుచు
హృద్యముగను వ్రాయునటుల హిత సూచనలన్
ఆద్యాంతము చేసిన మా
సద్యోత కవీంద్ర జేతు సన్నుతి మదిలో .... (గండూరి లక్ష్మినారాయణ)


తప్పు లొచ్చిన యొప్పని తత్వవేత్త
తెలుగు కవులను వెలిగించు దివ్య జ్యోతి
శంక రాభరణమ్మున శంఖజమ్ము
రామ సన్నిధి చేరెనా! రామజోగి!
వంద నమ్మిదె నేమాని పండి తార్య! ... (శైలజ)
 

29 కామెంట్‌లు:

  1. అన్న ! నేమాని రామన్న ! మొన్న నీవు
    దైవసన్నిధి దెలిసితో భావ మందు ,
    మాకు నాశీస్సు లొసగవే మమత పొసగ !
    కరుణ పంచగ సాటియే యొరులు నీకు ?

    రిప్లయితొలగించండి
  2. పూజ్యనీయులు, గురువర్యులు , కవివతంస ,శ్రీమదాధ్యాత్మ రామాయణ కృతికర్త , పుణ్యపురుషులు నైన అన్నయ్యగారు శ్రీ పండిత రామజోగి సన్యాసి రావు గారు శివైక్యము చెందిన వార్త విని చాలా విచారించాము. గొప్ప కవియే కాక పెక్కు మంది కవులకు గురుస్థానమును వహించి వారిని తీర్చి దిద్దిన ఘనులు వారు. రామాయణముతో పాటు గొప్ప కావ్యములను రచియించి జన్మసార్ధకమును చేసుకున్న ఉత్తమ పురుషులు ఆయన. వారి లోటు తీర్చలేనిది. అద్వైత సిధ్ధాంతమును నమ్మిన, ఆధ్యాత్మిక జ్ఞానసంపన్నులైన వారు భగవదైక్యమును పొంది ముక్తి గాంచారు. వారిని కోల్పోయి దురదృష్టుల మైన మన యందఱికీ ఆ భగవంతుడు మనోస్థైర్యము నొసగ వలెనని ప్రార్ధిస్తున్నాము.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ నేమాని గురువర్యుల ఆత్మకు శాంతి కలుగు గాక. వారు ఆకస్మికముగా స్వర్గస్థులైన విషయము ఎంతో కలచి వేసినది

    నేమాని వారి రోగ
    మ్మేమానియె రాగలరని మేమనుకొనగా
    రామా ! నీ సన్నిధికే
    ప్రేమారగ రచన జేయ పిలచితివా ! హా !

    రిప్లయితొలగించండి
  4. మాస్టరుగారూ ! నమస్కారములు...నేను నిన్న వ్రాసిన పద్యములో రెండవపాదములోని యతి దోషమును ఈరోజు సరిజేసినాను..దయజేసి శ్రద్ధాంజలి పద్యములో సరిజేయగలరు..ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  5. RS Rao Nemani
    5 ఆగ (2 రోజుల క్రితం)

    కి నాకు, kesanapalli, Shankaraiah, duvvuri, Elchuri

    Dear All,

    Subhaaseessulu.


    N.R. Sanyasi Rao

    రిప్లయితొలగించండి
  6. అయ్యో !ఎంత దుర్వార్త !
    నేమాని వారి యాత్మకు శాంతి కలుగు గాక !

    రిప్లయితొలగించండి
  7. శ్రీ నేమాని గురువుగారు స్వర్గస్తులయ్యారన్న వార్త చాలా భాధను కల్గించింది. అతి చేరువలో ఉండగా దర్శనభాగ్యానికి నోచుకోలేకలోయానని తలుచుకుంటే దుఖమాగడం లేదు .ఎన్నో సార్లు నేను వ్రాసిన పద్యాలను సరిదిద్ది మెళకువలను భోధించి ఆశీర్వదించారు.....వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తు..అశ్రునయనాలతో....

    తప్పు లొచ్చిన యొప్పని తత్వవేత్త
    తెలుగు కవులను వెలిగించు దివ్య జ్యోతి
    శంక రాభరణమ్మున శంఖజమ్ము
    రామ సన్నిధి చేరెనా! రామజోగి!
    వంద నమ్మిదె నేమాని పండి తార్య!

    రిప్లయితొలగించండి
  8. శ్రీ పండిత నేమాని గురువరులు పరమపదించారను వార్త మమ్ము దిభ్రాంతి నొనర్చినది
    ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని కోరుకుంటున్నాను

    గురు పండిత నేమానీ!
    యరిగితవా యింతలోనె యమరాలయమున్
    మరవము మా గుండెలలో
    నిరతము నీవుందు వయ్య నిర్మల హృదయా !

    పద్యములను సవరించుచు
    హృద్యముగను వ్రాయునటుల హిత సూచనలన్
    ఆద్యాంతము చేసిన మా
    సద్యోత కవీంద్ర జేతు సన్నుతి మదిలో .

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమానీ తమ
    రండగ నుండగ కవితల నానందముగా
    దండిగ వ్రాసితి మిచ్చన్
    చండిక పతి చేరినావ సత్కవి చంద్రా!

    రిప్లయితొలగించండి
  10. శ్రీ నేమాని గురువర్యులు స్వర్గస్థులైన విషయము నన్ను ఎంతో కలచివేసింది. మన బ్లాగుకు దిక్షూచి లాగా ఉంటూ ఎంతో అమూల్యమైన సలహాలను యిస్తూ సందేహనివృత్తి చేసేవారు. అటువంటి పండితోత్తములను కోల్పోవుట నిజముగా మన దురదృష్టము. వారియొక్క ఆత్మకు శాంతి చేకూరాలని భగవతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

    అష్టావధానమ్ములతిమనోహరముగ
    ....... వెలయించినట్టి ప్రావీణ్యయుతులు
    పద్యవిద్యావైభవమునెల్ల జగతిన
    ....... వ్యాపింపజేసిన ప్రథితకవులు
    నధ్యాత్మరామాయణాది కావ్యంబుల
    ....... సృజియించినట్టి సంస్థితుఁడవీవు
    భావికవులకెల్ల ప్రామాణికమ్ముగా
    ....... భావింపదగిన విభ్రాజితుండు

    శంకరాభరణమ్మున సంశయములఁ
    దొలఁగజేయుచు జ్ఞానమ్ము కలుఁగజేసె !!
    పండితోత్తమనేమాని వర్య మీదు
    యాత్మ శాంతిని పొందగానభిలషింతు.

    రిప్లయితొలగించండి
  11. వాక్కులు దైవదత్తమైన వరము. వాక్కుతో మంచి మాటలనే పలుకుతూ ఉండాలి. అని తరచూ అనునయంగా చెప్పుచుండిన నేమాని పండితార్యులు కీర్తిశేషు లవడం చాలా బాధను కలిగిస్తోంది. వారు సుమారు నలభై రోజులు ఇక్కడ సెయింట్ జోసెఫ్ ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకొన్నారు. కానీ వారి అనారోగ్యం కుదుటబడ లేదు. వారు ఆసుపత్రిలో ఉండగా నేను 3 సార్లు మాత్రమే చూచి రాగలిగేను.మొదటి రెండు సార్లు బాధ పడుతున్నా కానీ ముఖం తేటగా ఉండేది. ఉల్లాసంగా పలకరించారు. వారి ముఖపుస్తకం లో నేనేదో పద్యం పెడితే పద్యం చాలా బాగుంది అన్నారు.

    మూడవ సారి మాత్రం వారి ముఖం కళావిహీనంగా కనిపించింది. బాగా నీరసించి పోయారు. నేను, నా భార్య ఆసుపత్రికి వెళ్ళేటప్పటికి వారి రెండవ అబ్బాయి నాన్నగారికి ఆయాసంగా ఉంది వచ్చి చూడండని డాక్టరు గారితో చెపుతున్నారు. మేం వెళ్లి వారికి నమస్కరించాము. వారి శ్రీమతి గారు మిస్సన్నగారు వచ్చారని చెప్పగానే కళ్ళు తెరచి చూచారు. నమస్కారం చేస్తే స్పందించారు.

    అంతలోనే డాక్టరు రావడం ఆక్సిజన్ పెట్టడం, వారిని icu లోనికి తీసుకు వెళ్ళడం జరిగింది. icu లోనికి వెళ్ళేటప్పుడు వారు కళ్ళు మూసుకొని పడుకొన్నారు స్ట్రెచర్ మీద. బహుశా అదే వీరికీ వారికీ కూడా చివరి చూపని అనుకొంటున్నాను. అప్పుడు వారి శ్రీమతిగారు, వారి అబ్బాయి మాత్రమే దగ్గర ఉన్నారు. కొద్ది సేపటికి వారి సోదరి గారు వచ్చారు. వారి పెద్ద అబ్బాయి లండన్ నుంచి వారి ఆరోగ్యాన్ని గురించి ప్రాధేయ పడుతూ దేవునికి వ్రాసి పంపిన పద్యం చూపించారు అమ్మగారు. అది చదివిన మాకు కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. కొంచెం సేపు ఉండి మేము సెలవు తీసుకొన్నాము.

    అదే నేమాని వారి చివరి చూపవుతుందని మాత్రం మేం ఊహించలేదు. తెల్లవారాక ఈ దుర్వార్త.

    నిత్యం శ్రీ మాత్రేనమః అని స్మరిస్తూ ఉండే వారి సతీమణి హృదయ వేదన ఎవరూ తీర్చలేనిది. దేవుడు ఎవరి మాటా వినకుండా రామజోగి వారిని తన వద్దకు తీసుకొని వెళ్ళేడు.

    వారు రామునిలో ఐక్యం చెందేరనడంలో సందేహం లేదు.

    రిప్లయితొలగించండి
  12. యేమరు పాటును సైతము
    మోమాటము లేక దిద్ది మోదము గూర్చే
    నేమాని పండితార్యుల
    రామైక్యము నోట మాట రానీయదదే!


    రిప్లయితొలగించండి
  13. గురుదేవులు శ్రీ నేమాని వారు పరమపదించటం సాహితీ లోకానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలుగాలని శ్రీరామ పరమాత్మ ను ప్రార్థిస్తాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

    రిప్లయితొలగించండి
  14. స్పందించి సంతాప సందేశాలను, పద్యాలను పంపిన కవిమిత్రులకు ధన్యవాదాలు.
    నేమాని వారి మృతికి సంతాపసూచకంగా ‘శంకరాభరణం’లో మూడు రోజులు సమస్యాపూరణలు, పద్యరచన శీర్షికలు ఉండవు. కేవలం నిర్వచన భారత గర్భ రామాయణం ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  15. 11-8-2014 (సోమవారం) నుండి సమస్యాపూరణ, పద్యరచన శీర్షికలు ఉంటాయని గమనించవలదిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు, గురుతుల్యులు శ్రీ నేమాని వారి అస్తమయ వార్త వారి అభిమానులకి, శిష్యుప్రశిష్యులకీ నిజంగా ఒక అశనిపాతమే. శంకరాభరణ బ్లాగుకే శోభతెచ్చిన మూర్తి, ముఖ్యంగా శ్రీ శంకరయ్య మాష్టారికి ఒక కొండంత అండ. వారులేని లోటు తీరనిది. వారి ఆత్మకు శాంతిచేకూరాలని, వారి బంధువులకు ఆ రాముడు మనః స్తైర్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  17. పండిత శ్రీ నేమాని వారు శ్రీ రామ దివ్య సన్నిధికి చేరుకొన్నారని తెలిసినది. వారి పాఠం చాలా గట్టి పాఠం. పద్య రచనలోని దోషాలను సరి చేసి, అంతకంటే యెన్నో ముఖ్యమైన విషయాలు మనకు బోధ పరిచిన సద్గురువులు వారు. ఆ రకంగా మన బ్లాగుకూ, ఔత్సాహికులకూ పెద్ద దిక్కుగా నిలచారు. వారికి పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మ లోక ప్రాప్తి కలగాలని మా ప్రార్ధన. - చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  18. లేవులేవాయెయికమాకు లేవునీవు
    యెచటికేగితినీవార్య!యిచటనుండి
    రమ్ము మాకొఱ కొకసారి రామజోగి!
    శంకరాభరణ గురువ!శర్మ!మీరు

    రిప్లయితొలగించండి
  19. @ _/౹\_ @

    మాన్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారు తెలియజేసిన విషాదకరవార్త మూలాన శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గురుదేవులు పరమపదాన్ని చేరుకొన్న విషయం తెలిసి దిగ్భ్రాంతి కలిగింది. Hearty blessings అన్న లేఖాశీర్షికతో వారు శుభాశీస్సులను అందజేయటంలోని అంతరార్థాన్ని గ్రహింపలేక, అదే వారితో చివరిసారిగా ప్రసంగిస్తున్నానని ఊహింపలేని మందమతినైనాను. చెమ్మగిల్లిన కన్నులతో, బమ్మెరవోయిన పలుకులతో ఆ దయామయులకు మనస్సులో నివాళిని సమర్పించికొన్నాను.

    “మీరల కివె దీవెన” లని
    కోరక దయఁ గురిసినపుడు గురుదేవులకున్
    ప్రారబ్ధకర్మశేషము
    తీరినదని నేరని కృశధిషణుఁడ నైతిన్.

    “ఇది నేయార్థము”, “నేఁ డీ
    యది ఛందోభంగము”, “ఇది యద్భుతగతి కా
    స్పద” మంచును శిష్యుల కొ
    ప్పిదముల నేర్పు గురుదేవ! వీడితె మమ్మున్.

    “నిండు మనంబు నవ్యనవనీతసమానము; పల్కు దారుణా
    ఖండలశస్త్రతుల్యము జగన్నుతవిప్రుల” కంచు నన్నయా
    ర్యుండు వచించెఁ గొంత విదితోత్తరమైన భవత్స్వభావమున్;
    మెండుగ నోచినార మది మీ వచనావళి మించుఁ గాంచగన్.

    పనిచిరి కరుణామృతమును
    వినిచిరి కవితామృతమును విబుధుల కొఱకై
    మనిచిరి సీతారామ క
    థను శరణాగతుల మార్గదర్శన మొప్పన్.

    భవ మింక లేని పదమున
    భవు సన్నిధి పెన్నిధి మెయి పరమం బగు మీ
    కవితావైభవ మలరుచు
    నవిరతమును నోముఁ గాత మాచార్య! మమున్.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  20. మోమాటము లేకుండగ
    ప్రేమగ తప్పొప్పుదెలిపి ప్రియ కవితతికిన్
    నేమాని వారు బ్లాగున
    నేమాని కదల ననుచును నిజముగ నిలిచెన్.

    రిప్లయితొలగించండి
  21. అయ్యో! ఇంతలోనె ఇది ఎలా జరిగిందని చాల ఆశ్చర్యము కలిగింది. చాలా మనస్తాపము కలిగినది. కొద్ది కాలములోనె వారి అమూల్య సూచనలను పొందగలిగాను.

    తెలుగు సాహితీ తోటలో నేర్పు గాను
    పద్య కుసుమాల పూయించి మాలలల్లి
    మానిని మగని శంకరు, పాల నేత్రు
    పాద పద్మముల కర్పింప బడసె దివికి

    రిప్లయితొలగించండి
  22. పండిత నేమాని వారికి ఉన్నతగతులు ప్రాప్తించవలెనని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  23. పూజ్యనీయులు, గురువర్యులు శ్రీ పండిత నేమాని వారిని చూచుటకు వైజాగ్ వెళ్ళవలెనని అనుకుంటిని కానీ వెళ్ళ లేక పోతినండి. ఇంత ఆకస్మికముగా స్వర్గస్థులైన విషయము ఎంతో కలచి వేసినది. ఆంద్రకు వచ్చి వారిని జూడలేక పోతినండి. నాతో ఇంగ్లాండ్ నుండి మరియు అమెరికా నుండి మాట్లాడినారు. ఆసుపత్రికి వెళ్ళు దినము ముందు నాతొ మాట్లాడినారు. బాగా నొప్పిగా నున్నది. ప్రారబ్ద కర్మల ఫలితము తప్పించుట ఎవ్వరి తరమూ గాదు, రేపు డాక్టర్లు ఏమి చెప్పుదురో చూడాలి యన్నది ఆఖరి మాట. . తరువాత వారి కుమారులతో మాట్లడి నాను.
    వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపమును తెలియ జేయు చుంటిని.వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తు...
    మీ
    శిష్య పరమాణువు
    వరప్రసాదు

    రిప్లయితొలగించండి
  24. శ్రీ పండిత రామజోగి సన్యాసి రావు గారు శివైక్యము చెందిన వార్త ఇప్పుడే చూశాను చాలా బాధ కలిగించింది. వారిని న్యుజేర్సి లో కలుద్దామనుకున్నా కానీ వీలు కలుగలేదు. శంకరాభారణంలో భాగంగా ఉన్న మనందరికీ వారు ముఖ్యులు. వారు లేని లోటును తీర్చటం చాలా కష్టం. వారి ఆత్మకు శాంతి చేకూరు గాక.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ పండిత నేమాని గారు స్వర్గస్థులైనారను విషయము నేడు బ్లాగుద్వారా తెలిసికొని చాలా కలత చెందాను . మనసు వికలమై పోయింది . పండితుడు ,కవి మరియు విశిష్టమైన వ్యక్తిత్వము గలిగిన సహృదయుడైన శ్రీ నేమాని గారు ఇక లేరు సత్యం జీర్ణించు కోలేక పోతున్నాను శంకరాభరణం బ్లాగులో అప్పుడప్పుడు పాలుపంచుకొంటున్న నాకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చి తప్పొప్పులను సవరించినన్ను ప్రోత్సహించారు .వారి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను

    రిప్లయితొలగించండి
  26. శ్రీగురుభ్యొనమ:

    భారతి కంఠహారమున భస్కరతేజము ప్రజ్వలింపగా
    కారణమేమిటో యనుచు కాంచగ,కన్ గొని విస్మయంబునన్
    భారములాయె నాకనులు భాష్పపుధారలుగారుచుండగా !
    మా రవితేజపండితుడు మమ్ముల వీడెను ముక్తినొందుచున్

    రామాయణ కృతికర్తా
    ప్రేమగ మము తీర్చిదిద్దు పెద్దన సముడౌ
    నేమాని పండితోత్తమ
    స్వామీ, శ్రద్ధాంజలిదియె పావనమూర్తీ !

    గురువర్యులు శ్రీ పండితనేమాని కవీవీశ్వరుడు పరమపదినించినారను విషయమును బ్లాగు మిత్రులు శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి ద్వారా తెలిసినది. మిగుల దు:ఖకరమైన విషయము. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారు జయప్రదముగా నిర్వహించుచున్న భువనవిజయము వంటి శంకరాభరణము నందు మహాకవి పెద్దన వలె మనకు యెన్నో అమూల్యమైన సూచనలను, భాషా సంపత్తిని,కవితామృతమును అందించిన గౌరవనీయులు శ్రీ పండిత నేమాని గురువర్యుల ఆత్మకు శాంతి కల్గి ఆ సరస్వతి సన్నిధానమున సేవలనందింతురని ప్రార్థించుచున్నాను.

    రిప్లయితొలగించండి
  27. శ్రీగురుభ్యోనమ:

    గురువుగారికి నమస్కారములు. శ్రీపండిత నేమాని గురువర్యులకు శ్రద్ధాంజలిగా నేను వ్రాసిన పద్యములలోని దోషములను క్రిందివిధముగా సవరించుచున్నాను.
    1. శ్రీగురుభ్యొనమ: X = శ్రీగురుభ్యోనమ: ,/
    2. 1వ పద్యము 1వ పాదములో భస్కరతేజము X = భాస్కరతేజము ,/

    3. 2వ పద్యము 3వ పాదము "నేమాని పండితోత్తమ" X
    "నేమాని పండితార్యా" ,/

    పైవిధముగా సవరించి చదువుకొనవలసినదిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి