12, ఆగస్టు 2014, మంగళవారం

సమస్యా పూరణం – 1499 (రమ్మును త్యాగయ్య గొని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ములఁ గూర్చెన్.
ఈ సమస్యను సేకరించి పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు.

40 కామెంట్‌లు:

  1. ఇమ్మని జ్ఞానము బ్రోవగ
    రమ్మని భారతిని గోరి రాగము తోడన్
    కమ్మని గాత్రపు సంస్కా
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ములఁ గూర్చెన్

    రిప్లయితొలగించండి
  2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    ఉదయం లేవగానే సంస్కారయుక్తమైన మీ పూరణ ఆనందాన్ని కలిగించింది. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. సొమ్ముల గూర్చి తలంచక
    నిమ్ముగ దైవమ్మును భజియించుచును సదా
    కమ్మగ పాడెడు మధుర స్వ
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    రిప్లయితొలగించండి
  4. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కాని ‘మధుర స్వ’ అన్నప్పుడు ‘ర’ గురువై గణదోషం. సవరించండి. ‘తీపి స్వ/రమ్మును’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  5. కమ్మని కోకిల రవములు
    జుమ్మను మలయానిలముల జోలలు వింటూ
    కొమ్మల తుమ్మెద ఝంకా
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    రిప్లయితొలగించండి
  6. గురుదేవులు శంకరయ్య గారు ,కవి వర్యులందరికి నమస్సులు.
    నేమాని వారు స్వర్గస్తులయ్యారని తెలిసి చింతిస్తున్నాము.
    వారి ఆత్మకు శాంతి కలుగాలని భగవంతున్ని వేడుకొంటు,
    ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  7. కమ్మని సంగీతము తన
    కిమ్మని కడు భక్తి జూపి కీర్తన లందు
    న్నిమ్మహిని తెలుగు నుడి కా
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ములఁ గూర్చెన్

    రిప్లయితొలగించండి
  8. క్రమ్మిన నాదధ్యాన త
    పమ్మిడె నారదమహర్షి వరముల సాకా
    రమ్ముది, స్వరవారిధి సా
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ములఁ గూర్చెన్.

    త్యాగయ్యకు నారదముని అనుగ్రహించిన "స్వరార్ణవ" మను గ్రంథ సారమే స్వరసంయోజనకు ఆధారమైనదికదా !

    రిప్లయితొలగించండి
  9. ఇమ్మహి నేమీ వలదనె
    నమ్మహిమాన్విత రఘుకుల నాథుని నమ్మెన్
    కమ్మని నామపు ఘన సా
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    రిప్లయితొలగించండి
  10. ఇమ్మగు త్యాగయ్య పదము
    బొమ్మలమై విందుముగద పొందగు స్వరము
    న్నమ్మ సరస్వతి యభయ వ
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    రిప్లయితొలగించండి
  11. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    అమ్మౌని నారదు౦డిడె
    కమ్మగ శ్రీరామచంద్రు గానముకై గ్ర౦
    థమ్మును “స్వరార్ణవము”వ
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    రిప్లయితొలగించండి
  12. సొమ్ములు చాల సుఖమ్మొకొ?
    నిమ్మహి రాముని పదముల నించుక దలతున్
    కమ్మగ నని వేదపు సారమ్మును
    త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    రిప్లయితొలగించండి
  13. నెమ్మనమున శ్రీరాముని
    నమ్ముచు సంగీత కృతులు నయముగ వ్రాసెన్ కమ్మని రాగ సుధా సా
    రమ్మును త్యాగయగొని స్వరమ్ములు గూర్చెన్

    రిప్లయితొలగించండి
  14. సొమ్ములు నిధులను వలదని
    కమ్మని రాముని పదముల నమ్ముచు నెదలో
    నిమ్ముగ రామ కధా సా
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    రిప్లయితొలగించండి
  15. మల్లెల వారి పూరణలు

    ఇమ్మహి భోగమ్ముల విడి
    కమ్మని రాముని పదములె కాంతిని కనగా
    నిమ్మని, యాతని కథ, సా
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    కమ్మని పదముల కీర్తన
    లిమ్ముగ రచియించె తాను, నీశ్వర పదసౌ
    ఖ్యమ్మును, భక్తిని గొను, ధీ
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    ఇమ్మహి రాముని కొలువే
    యిమ్మను, రాజులకు మించి. ఎపుడును రామున్
    కమ్మని కీర్తన లిడు, సా
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    ఇమ్మగు శాంతమె సౌఖ్యము
    కమ్మని గీతమె తనకిడు గౌరవ మనుచున్
    ఇమ్మహి తారకమను, రుచి
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    రిప్లయితొలగించండి
  16. ఇమ్మహి రాముని తనదై
    వమ్ముగ సతతంబు గొలిచి బ్రతుకంతా నా
    మమ్మునజని భక్తి విచా
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    ౯౬కోట్ల రామనామజపాన్వితుడై రామదర్శన భాగ్యమును పొందిన రాగారాజుగా త్యాగరాజు.

    రిప్లయితొలగించండి
  17. సొమ్ముల సిరి గృహ భూ భా-
    గమ్ముల వర్జించి రామ గానమె పరత-
    త్త్వమ్మని నిజమెరిగి మధుక
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    త్యాగయ్య, మధుకర వృత్తితో ఉదరంభరణజేసిన వైరాగ్యచక్రవర్తి, వాగ్గేయకార్యసంప్రదాయప్రవర్త

    రిప్లయితొలగించండి
  18. ఇమ్మహిఁ ప్రణవ సునాద ర
    సమ్మే నరరూపుదాల్చి జానకి వరుడై
    గ్రమ్మన తానదియైన శ-
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    ప్రణవనాదరసమే రాముడైపుట్టినాడని నమ్మిన త్యాగరాజు తానే నాదశరీరుడుగదా ! (తానదియైన - అద్వైతభావనచో అది తానే ఐనవాడు)

    రిప్లయితొలగించండి
  19. బొమ్మనబెండ్లము గానర
    సమ్మై స్వర రాగ లయపు సామాకారం
    బిమ్మహి నరుడైన ! శరీ
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    రిప్లయితొలగించండి
  20. సమ్మదమొంది దపామరి
    సమ్మగరిస గమక మొదవ సప్తస్వరముల్
    ఇమ్మహి జేరినయాకా
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    రిప్లయితొలగించండి
  21. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    యం.ఆర్.చంద్రమౌళి గారూ,
    త్యాగయ్య పేరు చూడగానే మీలో కవితావేశం పెల్లుబికినట్లున్నది. సంతోషం!
    మీ ఆరు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఏమీ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ఏమియు అంటే సరి!
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ రెండవ పూరణ కూడా బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    గానమునకై అనవలసినది గానముకై అన్నారు. అక్కడ ‘శ్రీరాముఁ బాడఁగలుగుటకై గ్రం...’ అందామా?
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సుఖమ్మొకొ / యిమ్ముగ’ అనండి.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
    బహుకాల దర్శనం...
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది. ‘కమ్మని శ్రీరాముని పదకమలము నెదలో’ అనండి.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. ఇమ్ముగ రామక ధాసా
    రమ్మును త్యాగయ్య గొని స్వరముల గూర్చెన్
    గమ్మని పదముల తోడను
    రమ్మా మఱి నీవు కూడ రాగము వినగన్

    రిప్లయితొలగించండి
  23. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ రాలేదు..!
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. రమ్మన గాయన విద్య ప
    రమ్మిది జీవితమునకని రసగురు శొంఠీ
    సమ్మోదితునం గీకా
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    ఇహపరాలూ గానవిద్యేనని తలచి తనగురువైన శొంఠి వేంకటరమణయ్యగారి అంగీకారంతోనే త్యాగరాజు స్వరార్చనచేశాడా !

    రిప్లయితొలగించండి
  25. యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    ఆరు వ్రాశారు. మరొక్కటి వ్రాస్తే స్వరసంఖ్య అవుతుంది కదా అనుకున్నాను. నా కోరిక తీర్చారు.
    మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
    కాని ‘శొంఠీ’ అని దీర్ఘాంతం చేయడం సబబు కాదనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  26. శ్రీ శంకరయ్యగారు,

    మీప్రోత్సాహ స్పందనలకు నా వందనములు. ఏడవస్వరాన్నిఆధార శ్రుతినిలోనే నిబద్ధంచేయకపోతె మీ కోరిక అసంపూర్ణమౌతుందిగా!

    రమ్మన గాయన కళఁ ప్రౌ
    ఢమ్మొసగగ శొంఠివెంకటార్యుడు ప్రీతిన్
    సమ్మోదితునం గీకా
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    ప్రౌఢమును ఒసగగ = సంగీత లక్షణాల పైచదువులు

    రిప్లయితొలగించండి

  27. పూజ్యులు గురుదేవులు శంకయ్య గారికి వందనములు
    మీసూచనతో సవరించిన పద్యము
    అమ్మౌని నారదు౦డిడె
    కమ్మగ శ్రీరాము బాడ గలుగుటకై గ్ర౦
    థమ్మును “స్వరార్ణవము”వ
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    రిప్లయితొలగించండి
  28. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్ర బృందమునకు నమస్కారములు.

    శంకరయ్యగారు, మన్నించాలి. నేను చేసిన పూరణమును పంపునపుడు మా ఇంటియందు కరెంట్ లేకపోవుట, నా సెల్‍ఫోన్‍లో చార్జింగ్ కూడా ముగియుటచే అసంపూర్ణముగా ఆపవలసివచ్చినది. ఇప్పుడు కరెంట్ వచ్చుటచే పూరణము నిచ్చట నిచ్చుచున్నాను. ఆలస్యమునకు క్షంతవ్యుడను.

    ఇఁక నా పూరణము:

    నెమ్మనమందున నమ్మిన
    తమ్మికనుల వేల్పు సమ్మతమ్మునఁ, దనకున్
    సొమ్మగు నా తారక మం
    త్రమ్మును, త్యాగయ్య గొని, స్వరమ్ములఁ గూర్చెన్!

    రిప్లయితొలగించండి
  29. యం.ఆర్.చంద్రమౌళి గారూ,
    సవరించిన మీ ఏడవ పూరన నా అంగీకారాన్ని పొందింది. సంతోషం!
    *
    గుండు మధుసూదన్ గారూ,
    నేనుకూడా ఏదో అవాంతరం వచ్చిందని ఊహించాను.
    మీ పూరణ బాగున్నది.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. శ్రీ శంకరయ్య గురువర్యులకు పాదాభివందనం.
    మీ సూచనతో సరి చేసుకున్న పద్యము:
    సొమ్ముని నిధులను వలదని
    కమ్మని శ్రీ రాముని పద కమలము లెదలో
    నమ్ముచు రామ కధా సా
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్

    రిప్లయితొలగించండి
  31. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  32. సొమ్ములు సుఖమ్మె? రాముని
    కమ్మని సన్నిథి సుఖమ్మె! కలిలో నైనన్
    నమ్ముచు రామ సుధా సా
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ములఁ గూర్చెన్

    రిప్లయితొలగించండి
  33. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  34. కమ్మని రాగము తాళము
    ఘుమ్మను నాదముల తోడ కోమలమయమౌ
    నిమ్మగు పదముల సంభా
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ములఁ గూర్చెన్

    రిప్లయితొలగించండి
  35. రమ్మును బీరును కాదుర!
    నమ్ముము నా మాటనయ్య! నయగారమ్మౌ
    కమ్మని కావేరిది నీ
    రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ములఁ గూర్చెన్

    రిప్లయితొలగించండి