1, ఆగస్టు 2014, శుక్రవారం

పద్యరచన - 638

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

శ్రవణకుమారుడు మరలా
భువిలోనే పుట్టినాడు పుణ్యాత్ముడురా !
స్తవనీయుడె మరి వా
స్తవమేనాయనును నేటి వసుధను ప్రజలే !

కంది శంకరయ్య చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘మరలా’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘కుమారుండు మరల’ అందాం. అలాగే ‘యనును నేటి వసుధను ప్రజయే’ లేదా ‘యంద్రు నేటి వసుధను ప్రజలే’ అనండి.

sailaja చెప్పారు...

అభినవ శ్రవణకుమారుడు
శుభముగ జన్మించెగనుడు సుందర భువిలో
నభిరూపుడు మెచ్చునతని
కభివాదము జేయరారె నాహా! యనుచున్!

కంది శంకరయ్య చెప్పారు...

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

A.Satyanarayana Reddy చెప్పారు...

పండు ముసలి వారు దండుగని తలచి
ఇంటి నుండి సుతులు గెంటు చుండ
ముసలి తల్లి దండ్రి మోసుకొని పోవుచు
తనదు ప్రేమ జూపె తనయు డొకడు

panuganti చెప్పారు...

జన్మనిచ్చి పెంచి జాగృత పరిచిన
తల్లిదండ్రిసేవ దలిచెనతడు
ధర్మమెరిగి మసలె ధన్యుడతడిలలొ
కావడినను మోసి కీర్తిపొందె.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

నడకలు నేర్పిన జనకుల
కడపటి జీవిత గమనపు కలతలు బాపన్
పుడమిన నీ యభినవ శ్రవ
ణుడు కావడిఁ జేర్చె మిగుల నుతియించరయా!

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
‘పానుగంటి’ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఇలలొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాసారు. నాలుగవ పాదంలో యతి తప్పింది.
ఆ రెండు పాదాలకు నా సవరణ...
ధర్మమెరిగి మసలె ధన్యు డిల నతండు
కావడినను మోసి ఘనత నందె.
*
సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

panuganti చెప్పారు...

కంది శంకరయ్య గారికి ధన్యవాదాలు. ఈమధ్య రాయడం క్రమం తప్పింది. తప్పులు లేకుండా రాస్తాను.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

మంచితనమ్మనునది యిం
కొంచెమ్మిక్కాలమందు కూడను గలదే
యంచని అచ్చెరువొందకు
మంచని పల్కునిది చిత్తమందున నిలుచున్.

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

పలు క్షేత్రంబులు తల్లి దండ్రులకు సంప్రాప్తించ పుణ్యార్థముల్
'అల దీక్షా పరుడైన శ్రీ శ్రవణుడో' యన్నట్లుగా ద్రిప్పుచున్
కలి కాలంబున మోయుచుండెను గదా స్కంధాటిలో నేడు వీ డిల నాదర్శవరేన్యు డాయెను గదా యీ భూమి పుత్రాలికిన్.



కంది శంకరయ్య చెప్పారు...

లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

మాస్టరుగారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు.
సవరణతో...

శ్రవణకుమారుండు మరల
భువిలోనే పుట్టినాడు పుణ్యాత్ముడురా !
స్తవనీయుడె మరి వా
స్తవమేనాయంద్రు నేటి వసుధను ప్రజలే !

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

అవనిని గలరీ నాటికి
శ్రవణుని బోలిన తనయులు చక్కగ సేవిం
చు విడువక తల్లిదండ్రుల
భువిపై దైవంబులనుచు మోయుచుతిరుగున్