2, జూన్ 2012, శనివారం

విశేష వృత్తము - 20

వసంత తిలకము -
ఇది 14వ ఛందమైన ‘శక్వరి’లో 2936వ వృత్తము.
“శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్” అనే స్తోత్రము మీకు సుపరిచితమే.  అది వసంత తిలక వృత్తమే.


లక్షణము -
గణములు - త భ జ జ గగ.
యతిస్థానము -  8వ అక్షరముగా నొకచో మరియు 11వ అక్షరముగా వేరొకచో చెప్పబడెను. 
ప్రాస నియమము గలదు.

              
ఉదా: (11వ అక్షరము యతిగా)
శ్రీవిశ్వరూప! ప్రమథార్చిత! చిన్నిధానా!
దేవాధిదేవ! వసుధాధిప! దీనబంధూ!
నీవే శరణ్యమని బూనితి నీ పదంబుల్
నా విన్నపమ్ము వినుమా నరనాథ నాథా!


గమనిక - 
ఇదే గణములతో 9వ అక్షరమువద్ద యతితో మదనరేఖ అనే వృత్తమును చెప్పబడినది. స్వస్తి!

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

12 కామెంట్‌లు:

  1. శ్రీ సరస్వతూఇ నమః :
    మిత్రులారా!
    పైని ఉదహరింపబడిన పద్యములో 9వ స్థానములో కూడ యతి వేయబడినది. అందుచేత ఆ పద్యమును మదనరేఖగా కూడా చెప్పవచ్చును. ఆ విధముగా అది ఉభయగతి (వసంతతిలకము మరియు మదనరేఖ) పద్యముగా తెలియనగును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. శ్రీరామచంద్ర! సుగుణాకర! చిద్విలాసా!
    కారుణ్యమూర్తి! భవతారక! కంజనేత్రా!
    వీరాధివీర! భువనావన! వేదవేద్యా!
    ఘోరాఘనాశక! సుఖంబులు గూర్చుమయ్యా!

    నీనామ సంస్మరణ జేతును నిర్మలాత్మన్
    దానాదులున్ స్తవములెప్పుడు ధర్మబుద్ధిన్
    మానంగబోను సుఖదాయక! మంగళాంగా!
    రా, నన్ను గావుమినవంశజ! రాఘవేంద్రా!

    రిప్లయితొలగించండి
  3. ఆకాశ దేశమున నిండినవయ్యె చుక్కల్
    ప్రాకారమంతటను నిండె విభావరుల్ నీ
    సాకార రూపమును గాన నసాధ్యమౌనే,
    లోకమ్ము నేలెడి మహాశివ! కాలకంఠా!

    రిప్లయితొలగించండి
  4. అమ్మా లక్ష్మీ దేవి గారూ!

    మీ పద్యము 4వ పాదములో యతిని మరచిపోయేరు. సవరించండి.

    రిప్లయితొలగించండి
  5. సత్యనారాయణ మూర్తి గారూ,
    చక్కని ధారతో ఉత్తమంగా ఉన్నాయి మీ పద్యాలు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    నేమాని వారన్నట్టు యతి సవరించండి..

    రిప్లయితొలగించండి
  6. మన్నించండి.

    ఆకాశ దేశమున నిండినవయ్యె చుక్కల్
    ప్రాకారమంతటను నిండె విభావరుల్ నీ
    సాకార రూపమును గాన నసాధ్యమౌనే,
    లోకమ్ము నేలెడి మహాశివ! లోకనాథా!

    రిప్లయితొలగించండి
  7. శ్రీ మాత! చిన్మయి! సురార్చిత సేవితాంఘ్రీ!
    కామారినారి! గిరిజా పర! కామ్య దాత్రీ!
    శ్రీమానినీ! సరసిజాసన! చిద్విలాసీ!
    శ్రీ మాధవీ! హరిణి! సన్నుతి చేతునమ్మా!

    రిప్లయితొలగించండి
  8. మిస్సన్న గారూ,
    మీ పద్యం చక్కని ధారతో బాగున్నది.
    ‘సురార్చిత సేవితాంఘ్రీ’ అన్నప్పుడు అర్చిత, సేవిత ఏదో ఒకటి ఉంటే బాగుండేది. అక్కడ ‘సురాధిప సేవితాంఘ్రీ’ లేదా ‘సురాసుర సేవితాంఘ్రీ’ అంటే బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  9. గురువుగారూ అవును. సురాధిప అని మనసులోని మాట.
    కానీ అర్థ పునరుక్తి బయటికి వచ్చింది. సరిదిద్దినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  10. వసంత తిలకము -
    ఇది 14వ ఛందమైన ‘శక్వరి’లో 2936వ వృత్తము.
    “శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్” అనే స్తోత్రము మీకు సుపరిచితమే. అది వసంత తిలక వృత్తమే.

    లక్షణము -
    గణములు - త భ జ జ గగ.
    యతిస్థానము - 8వ అక్షరముగా నొకచో మరియు 11వ అక్షరముగా వేరొకచో చెప్పబడెను.
    ప్రాస నియమము గలదు.
    అని అన్నారుకదా. పదకొండవ అక్షరము యతి అని ఏ గ్రంథములో ఉన్నదో నాకు ప్రామాణికత కావాలండి.
    ఎందుకంటారా.....
    నేను వ్రాస్తున్న వసంత తిలకములకు పదకొండవ అక్షరమే యతిగా పరుగిడి వస్తోంది. ఐతే నాకు ప్రామాణికత చూపడానికి కావాలండి.
    దయచేసి తెలుపగలరా?
    నమస్తే.
    మీ
    రామకృష్ణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రస్తుతం నేను తిరుపతిలో ఆముదాల మురళి గారి శతావధానంలో పృచ్ఛకుడిగా ఉన్నాను. 14 న తిరిగి వస్తాను. రాగానే మీకు సమాధానం ఇస్తాను.

      తొలగించండి
  11. చింతా వారూ,
    నమస్సులు.
    పైన విశేషవృత్తాన్ని పరిచయం చేసినవారు స్వర్గీయ పండిత రామజోగి సన్యాసి రావు గారు. వారు ఏ గ్రంథం ఆధారంగా 11వ అక్షరం యతి అన్నారో తెలియదు. నా దగ్గర ఉన్న ఛందోగ్రంథాలను పరిశీలించాను. అన్నింటా 8వ అక్షరమే యతిస్థానమని చెప్పబడింది.

    రిప్లయితొలగించండి